Reading Time: 3 mins

టక్ జగదీష్ మూవీ రివ్యూ

జాయింట్ ఫ్యామిలీ ఫిష్:  ‘టక్ జగదీష్’ మూవీ రివ్యూ

Rating: 2.5/5

కొన్ని కాంబినేషన్స్ సినిమాపై ఆసక్తి కలగచేస్తాయి. అలాంటివాటిల్లో నిన్ను కోరి కాంబినేషన్ ఒకటి. నాని, శివ నిర్వాణ కాంబోలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్. ఎమోషన్స్ ని తెరపై పండించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే ఆ తర్వాత శివనిర్వా ణ చేసిన మజిలి చిత్రం కూడా ఎమోషన్స్ కు పెద్ద పీట వేసింది. దాంతో టక్ జగదీష్ కూడా ఎమోషన్స్ తోనే నడుస్తుందని ఆశిస్తాం. అయితే నాని ని ఈ సారి ఎలా చూపెడతాడు అనే ఆసక్తి ఉంది.  ఈ రెంటిని ఈ సినిమా ఎలా బాలెన్స్ చేసింది..యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో ఎలా ఇమిడాయి. అసలు టక్ జగదీష్ అంటే ఎవరు …అతని కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ

ఆ ఊరు పేరు భూదేవి పురం. అక్కడ ఎప్పుడూ భూ తగాదాలే. ఆ ఊర్లో ఓ భూస్వామి ఆదిశేషు నాయుడు (నాజర్) ఫ్యామిలీ. ఆయనకు ఇద్దరు కొడుకులు జగదీష్, బోసు (నాని, జగపతి బాబు). అదే ఊరిలో దుర్మార్గుడైన వీరేంద్ర నాయుడు (డానియల్ బాలాజీ)కు ఎంత ఆస్తి ఉన్నా జనాల భూమి మీదే కన్ను. ఈ గొడవలు గోలలలో ఆదిశేషు నాయుడు పరమ పదిస్దాడు. దాంతో ఆయన పెద్ద కొడుకు  బోసు ఇంటి పెద్ద అవుతాడు. అతనిలోనూ కొన్ని దుర్మార్గ లక్షణాలు ఉండటంతో విలన్ బాలాజీ మాటలు విని, తోడబుట్టిన  అందరినీ వాళ్లందరినీ బయటకు తోసేసి, ఆస్తి మొత్తం స్వంతం చేసుకుంటాడు. ఆ టైమ్ లో మన టక్ జగదీష్ ఊళ్లో ఉండడు. ఆ తర్వాత కొద్ది రోజులుకి తమ్ముడు జగదీష్ ఎమ్మార్వోగా అదే ఊరు వస్తాడు. ఎమ్మార్వో అతని కోరిక…భూతగాదాలు లేని భూదేవిపురం ను చూడాలన్న తన తండ్రి ఆశయం నెరవేర్చడంట. ముందు ఆ ఆశయం  కోసం పని చేయడం ప్రారంభిస్తాడు. ఇది విలన్ వీరేంద్రకు నచ్చదు కదా. కౌంటర్ లు ఇవ్వటం మొదలెడతాడు. అన్న బోసుకు అతనికే సపోర్ట్.  అప్పుడు ఏం జరిగింది అన్నది, అలాగే ఈ కథలో వీఆర్వో గుమ్మడి వరలక్ష్మి (రీతూ వర్మ) ఏం చేస్తుంది..అనే విషయం కూడా తెలుసుకోవాలనిపిస్తే  సినిమా చూడండి.


స్క్రీన్ ప్లే ఎనాలసిస్ …
 
నాని సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. ఇదీ మెజారిటీ ఆడియన్స్ లో ఉన్న అభిప్రాయం. అయితే ఈ సినిమాలో మీరు అలాంటివేమీ ఎక్సపెక్ట్ చేయద్దంటూ మొదటనుంచి ప్రోమోలు, ట్రైలర్స్ తో మేకర్స్ చెప్తూనే వచ్చారు. కాబట్టి అలాంటి ఎలిమెంట్స్ ఏమీ సినిమాలో ఆశించరాదు అనేది కోర్ కండీషన్. కానీ ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఉద్దేశించింది కాబట్టి ఖచ్చితంగా వాళ్లు ఎంతో కొంత అలాంటి ఫన్ తో కూడిన నానిని అక్కడక్కడా అయినా కావాలనుకుంటారు. కానీ డైరక్టర్ తను అనుకున్న మాటకు కట్టుబడ్డాడు. అది కాస్త నిరాశపరిచే అంశమే. అలాగే మరీ శోభన్ బాబు, కృష్ణ కాలం నాటి సినిమాలను గుర్తు చేస్తూ కథనం సాగటమే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరో ..ఉమ్మడిగా తన కుటుంబం కలిసి ఉండాలనుకోవటం తప్పు లేదు కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్దితులు వేరు. అప్పుడప్పుడు కలుస్తూ వేరుగా ఉందామనుకునే థీమ్ నడుస్తోంది బయిట. అలాగే సవతి అన్నదమ్ములు, వాళ్ల మధ్య గొడవలు ఇవీ చాలా కాలం తెలుగు తెరపై చూస్తున్నవే. ఇక ఊళ్లో భూతగాదాలు ఇవీ ఆ జమానాలోవే. మరి ఈ కథలో కొత్తదనం ఏమిటీ అంటే అలాంటి టిపికల్ పాత్రలో నాని కనిపించటం. తన రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా, కొత్తగా ట్రై చేయటం. కాకపోతే ఆ ట్రై చేసేదేదో కొత్త కథలో చేయచ్చు కదా అనిపిస్తుంది. అలాగే అలా వెళ్లి ఇలా ఎమ్మార్వో గా రావటం కాస్త సినిమాటెక్ లిబర్టి గా అనిపిస్తుంది. విలన్ కూడా ఎనభైల్లోనే ఆగిపోయాడు. ఈ కథ ఆ కాలంలో అంటే ఎనభైల్లో జరుగుతోంది అని ఓ ముక్క వేసేసి నేరేషన్ నడిపితే కాస్త సమస్య తగ్గేదేమో. దానికి తోడు హీరోకు రకరకాల టాస్క్ లు, సమస్యలు ఇచ్చేసాడు డైరక్టర్. ఉన్న స్క్రీన్ టైమ్ లో వాటిన్నటిని వరసపెట్టి పరిష్కరించుకుంటూ పోవాలి. మరో ప్రక్క దుర్మార్గుడైన జగపతిబాబులో హఠాత్తుగా మార్పు రావటం. మేనకోడలకు రక్షణ కోసం హీరో పాటు పడే సీన్స్ వంటివి కూడా ఇంకాస్త బాగా చేసి ఉండాలనిపిస్తుంది. అయితే  భావోద్వేగాలతో సినిమా మొత్తాన్ని నడిపించడం అంటే సాధారణ విషయం కాదు. ఆ విషయంలో శివ నిర్వాణ తన టాలెంట్ ని చూపించాడనే చెప్పాలి. క్యారక్టర్ రాసుకున్నంత గొప్పగా సినిమా కథ మొత్తం రాసుకోలేదు.


నచ్చినవి

నాని ఫెరఫార్మెన్స్
ఫ్యామిలీ సీన్స్
 

బాగోలేనివి

 స్క్రీన్ ప్లే
 బోర్ కొట్టే సెకండ్ హాఫ్
 ఎంటర్టైన్మెంట్  లేకపోవడం
క్లైమాక్స్

టెక్నికల్ గా …

తమన్ నుంచి రెగ్యులర్ గా వచ్చే మాస్ పాటలేమీ లేవు. ఓ మెలోడి బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా వర్కవుట్ కాలేదు. యాక్షన్ కు సరపడ స్కోర్ పడలేదు.సినిమాటోగ్రఫీ బాగుంది కానీ అద్బుతమైతే కాదు. ఎడిటింగ్ సెకండాఫ్ మరింత షార్ప్ గా చేసి స్లోగా ఉండే నేరేషన్ ని స్పీడు చేయచ్చు అనిపించింది. డైలాగులు బాగున్నాయి. మిగతా డిపార్టమెంట్స్ అన్ని ఫెరఫెక్ట్. డబ్బు బాగా ఖర్చుపెట్టారని  అర్దమవుతోంది.

డైరక్టర్ విషయానికి వస్తే…నిన్ను కోరి, మజిలీ సినిమాలు అందించిన దర్శకుడు శివనిర్వాణ  కథని ఎంచుకోవటంలో  పొరబడ్డారు కానీ దర్శకత్వ లోపాలు ఎక్కడా లేకుండా తీసారు. ఆర్టిస్ట్ ల నుంచి తనకు కావాల్సిన నటన రాబట్టుకోవడం, సీన్లను కలర్ ఫుల్ గా డిజైన్ చేయటం వరకూ సక్సెస్ అయ్యారు.
 
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ విషయానికి  వస్తే… నాని కొత్తగా ట్రై చేసాడు. కానీ ఆ జోష్ అయితే లేదు. నానిని మినహాయిస్తే మిగతా వాళ్లకు పెద్దగా పనిలేదు. ఐశ్వర్యా రాజేష్ ఉన్నంతలో మంచి ఫెరఫార్మ్ చేసింది. రీతూ వర్మ జస్ట్ కే. బోస్ బాబుగా జగపతిబాబుని ఊహించలేం. ఆయన విలన్ గా ఎస్టాబ్లిష్ అయ్యిపోయారు. మళ్లీ వెనక్కి లోకల్ విలేజ్ విలన్ గా అంటే కష్టం అనిపించింది.  తిరుమల నాయుడుగా తిరువీర్ ,ఇంటి అల్లుళ్లు గా రావు ర‌మేష్‌, న‌రేష్ బాగా చేసారు.   విలన్ గా డేనియల్ బాలాజీ జస్ట్ ఓకె .మరో ఆప్షన్ తీసుకోవాల్సింది.


చూడచ్చా
 చినబాబు, శివరామరాజు సినిమాలను గుర్తు చేసే ఈ సినిమా.అవి నచ్చిన వారికి బాగా నచ్చుతుంది.

తెర ముందు..వెనక

నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్‌, జగపతిబాబు, డానియల్‌ బాలాజీ, నరేశ్‌, రావు రమేశ్, ప్రవీణ్‌ తదితరులు;
సంగీతం: తమన్‌, గోపీ సుందర్‌(నేపథ్య సంగీతం);
సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మూరెళ్ల;
ఎడిటింగ్‌: ప్రవీణ్ పూడి;
బ్యానర్‌: షైన్‌ స్క్రీన్‌ ప్రొడక్షన్స్‌;
నిర్మాత: సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది;
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ;
విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
రన్ టైమ్: 2 గంటల 23 నిముషాలు
విడుదల తేదీ: సెప్టెంబర్ 10, 2021