Reading Time: 2 mins

తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎన్నికలు

తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్ గెలుపు

ఆదివారం జరిగిన తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎలక్షన్స్ లో అధ్యక్షుడు గా వల్లభనేని అనిల్ కుమార్ గెలుపొందారు. ఫిలిం ఫెడరేషన్ లో మొత్తం 72 ఓట్లు ఉండగా..వీటిలో 66 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో వల్లభనేని అనిల్ కు 42, కొమర వెంకటేష్ కు 24 ఓట్లు వచ్చాయి. 18 ఓట్ల ఆధిక్యంతో వల్లభనేని అనిల్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. కోశాధికారిగా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. 66 ఓట్లలో ఆయనకు 42 ఓట్లు వచ్చాయి. పీఎస్ ఎన్ దొర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ…దర్శకరత్న దాసరి గారు ఫిలి ఫెడరేషన్ ఏ ఆశయాలతో కొనసాగించారో, అవే ఆశయాలతో మేము సినీ కార్మిక వర్గాన్ని సంక్షేమ బాటలో తీసుకెళ్తాం. సినీ కార్మిక ఐక్యత కోసమే మేమంతా పోరాటం చేసి గెలిచాం. కరోనా వల్ల చిత్ర పరిశ్రమలో కార్మికుల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వారిని ఆదుకోవడంపై మొట్టమొదటగా దృష్టి పెడతాం. చిరంజీవి గారు, భరద్వాజ, సి కళ్యాణ్  లాంటి పెద్దలు, ఛాంబర్, నిర్మాతల మండలి సహకారంతో ఈ కష్టకాలంలో కార్మికులను బతికించుకుంటాం. కార్మికుల వేతనాలు విషయంలో చర్చలు సాగిస్తాం. కార్మికులు ఐక్యతగా ఉండే పరిశ్రమ బాగుంటుంది. మా గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అన్నారు.

కాదంబరి కిరణ్ మాట్లాడుతూ..ఇవాళ కార్మికులు వాళ్ల కోసం పనిచేసే, వాళ్ల కోసం ఆలోచించే టీమ్ ను ఎన్నుకున్నారు. దేశవ్యాప్తంగా సినీ కార్మిక సంఘాలకు పేరు తెచ్చిన రాజేశ్వర్ రెడ్డి, పీఎస్ఎన్ దొర లాంటి వారు ఇవాళ ఫెడరేషన్ ఎన్నికల్లో గెలవడం శుభపరిణామం. వాళ్ల అనుభవం కార్మిక సంక్షేమానికి ఉపయోగపడుతుంది. సోదరుడు వల్లభనేని అనిల్ కు శుభాకాంక్షలు. ప్రభుత్వ పెద్దలు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ వంటి వారి ఆశీస్సులు ఇవాళ గెల్చిన వారికి  ఉన్నాయి. చిత్ర పరిశ్రమ పెద్దలతో కలిసి కార్మికుల బాగు కోసం కృషి చేస్తాం. అన్నారు.

ప్రధాన కార్యదర్శి పీఎస్ఎన్ దొర మాట్లాడుతూ…కార్మికులను కలుపుకుపోయి వారి బాగు కోసం పనిచేస్తాం. మాకు రెండు తెలుగు రాష్ట్రాల కార్మికులు ఒకటే. తెలుగు సినిమా ఇది. కార్మికులందరికీ మంచి వేతనాలు ఇప్పిచేందుకు కృషి చేయబోతున్నాం. మా ముందున్న తొలి లక్ష్యం అదే. ఒక జట్టుగా కలిసి కార్మికులు ఉంటే ఏదైనా సాధించగలం. అన్నారు.

కోశాధికారి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…సినీ కార్మికులు ఇవాళ గొప్ప తీర్పు ఇచ్చారు. ఈ విజయం కార్మికులదే. ప్రతి కార్మికుడికి మంచి జరిగేలా ప్రయత్నిస్తాం. కొన్నేళ్లుగా కార్మికులతోనే కలిసి ఉన్నాం. ఇకపైనా ఉంటాం. అన్నారు.

తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్, కోశాధికారిగా రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పీఎస్ఎన్ దొర రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.