Reading Time: 5 mins

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ 

‘యానిమల్’ క్యారెక్టర్ బేస్డ్ మూవీ. ఎమోషనల్ హై వుండే తండ్రి కొడుకుల కథ తప్పకుండా అందరినీ అలరిస్తుంది: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యానిమల్’ ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది.

 

‘యానిమల్’లో ర‌ణ్‌బీర్ క‌పూర్ కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.

 

ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

సందీప్ గారు.. ముందుగా మీకు కంగ్రాట్స్.. తెలుగు నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ బిగ్గెస్ట్ స్టార్స్ తో యానిమల్ లాంటి భారీ చిత్రాలు చేసినందుకు.

-థ్యాంక్ యూ సో మచ్ అండీ

 

మీ తొలి చిత్రం అర్జున్ రెడ్డిలో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమకథ కనిపించింది. యానిమల్ ట్రైలర్ చూస్తే ఇది తండ్రికొడుకుల ప్రేమకథ అనిపిస్తుంది.

-అవునండీ. ఒక విధంగా దీన్ని తండ్రి కొడుకుల ప్రేమకథగా అనుకోవచ్చు. ప్రైమరీ స్టొరీ అదే. ఒక వ్యక్తి కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడనేది కథ యొక్క సారాంశం.

 

అర్జున్ రెడ్డి పాత్రలో చాలా కోపం వుంటుంది. యానిమల్ లో రణ్‌బీర్ పాత్రలో కూడా ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. పాత్రలు పరంగా అర్జున్ రెడ్డికి యానిమల్ కి సిమిలారిటీస్ ఉన్నాయా ?

-ఇద్దరూ చాలా నిజాయితీ వున్న వ్యక్తులు(నవ్వుతూ). అదొక్కటే కామన్ ఫ్యాక్టర్. అర్జున్ రెడ్డి కోపం వస్తే కంట్రోల్ చేయలేని పాత్ర. యానిమల్ పాత్రకు మాత్రం సామాన్యంగా అందరి వ్యక్తులకు వుండే కోపమే వుంటుంది. అర్జున్ రెడ్డి, యానిమల్.. ఈ రెండూ కూడా క్యారెక్టర్ బేస్డ్ సినిమాలే. అదొక సిమిలారిటీగా చెప్పొచ్చు. ఇది తప్పించి కథ, పాత్ర కంప్లీట్ డిఫరెంట్ గా వుంటుంది.

 

మీ చిత్రాలలో హీరో పాత్రని తీవ్రమైన ఎమోషన్, ఇంటెన్స్ తో డిజైన్ చేయడానికి కారణం ?

అర్జున్ రెడ్డి విషయానికి వస్తే.. ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా వుండే పాత్ర అది. అలాంటిది  ప్రేమ దూరమైనపుడు సహజంగానే ఇంటెన్స్ ఎమోషన్ వుంటుంది. యానిమల్ లో తండ్రి కోసం ఏదైనా చేయగలిగే ఓ కొడుకు పాత్రని రాసుకున్నపుడు, అతని ఎమోషనల్ కోషేంట్ సహజంగానే హై వుంటుంది. ఎమోషనల్ గా హై వున్న వాళ్ళే అలా చేయగలుగుతారు. అంతే గానీ కావాలని చేసింది కాదు.

 

ట్రైలర్ చూస్తే ఎమోషన్ చాలా కనిపిస్తోంది. అయితే ఆ ఎమోషన్ ని వైలెన్స్ డామినేట్ చేస్తుందా ? ఇందులో ఎమోషన్, వైలెన్స్ ఏది ఎక్కువ వుంటుంది ?

-ఎమోషన్, వైలెన్స్ అన్నీ సరిగ్గా బ్యాలెన్స్ చేశాననే అనుకుంటున్నాను(నవ్వుతూ) చూసి మీరు చెప్పాలి.

 

‘నా తర్వాత సినిమాలో వైలెన్స్ ఎలా వుంటుందో చూపిస్తా’ అని మీరు ఓ సందర్భంలో చెప్పడం చాలా వైరల్ అయ్యింది కదా ?

-దాని గురించి మీకు చెప్పాలి(నవ్వుతూ). అర్జున్ రెడ్డి మన తెలుగులో  యునానిమస్ గా అందరికీ నచ్చింది. దాదాపు అందరు విమర్శకులు కూడా ప్రశంసించారు. అదే సినిమా హిందీలో చేసినప్పుడు అందరికీ నచ్చింది. కానీ అక్కడ కొంతమంది విమర్శకులు అందులో వైలెన్స్ ఎక్కువ వుందని అన్నారు. మన సెన్సిబిలిటీస్ కి వాళ్ళకి తేడా ఉందని అనుకున్నా. ఆ సమయంలో ఒక ఇంటర్వ్యూ లో ‘మీ నెక్స్ట్ సినిమాకి ఇంత వైలెన్స్ వుండకూడదు’ అని అనడంతో.. మామూలు కాలేజీలో జరిగే ప్రేమకథే వాళ్లకి వైలెన్స్ అనిపించిందికదా.. తండ్రి కోసం ఏదైనా చేసే కొడుకు పాత్ర ఇంకెంత వైలెన్స్ గా అనిపిస్తుందనే ఉద్దేశంతో.. ‘నా నెక్స్ట్ సినిమాలో వైలెన్స్ అంటే ఏమిటో చూపిస్తా’’ అన్నాను. అది చాలా వైరల్ అయిపొయింది.( నవ్వుతూ)

 

అర్జున్ రెడ్డిలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత వుంటుంది. మరి యానిమల్ లో ర‌ష్మిక పాత్రకు కథలో ఎలాంటి ప్రాముఖ్యత వుంటుంది ?

-ర‌ష్మిక గారిది చాలా ముఖ్యమైన పాత్ర. సినిమా ఆద్యంతం వుంటుంది. రెగ్యులర్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా వుంటుంది. హీరోని పేరెంట్స్ కంటే ఎక్కువ అర్ధం చేసుకున్న పాత్ర. ఇందులో హీరో తర్వాత సమాన ప్రాధన్యత వున్నది ర‌ష్మిక, అనిల్ కపూర్ పాత్రలకే. ఇందులో మంచి ప్రేమకథ కూడా వుంటుంది.

 

యానిమల్ రన్ టైం దాదాపు మూడు గంటల ఇరవై నిముషాలు వుంది కదా..అది ప్రతికూలమయ్యే అవకాశం ఉందా ?

-లేదండీ. అర్జున్ రెడ్డి మూడు గంటల ఆరు నిమిషాల సినిమా. అది ఒక అమ్మాయి అబ్బాయి కథే. యానిమల్ లో ఒక కుటుంబం, ప్రత్యర్ధులు ఇలా లేయర్స్ వున్నాయి. అర్జున్ రెడ్డి కంటే పదిహేను నిముషాలకే ఎక్కువ. ఇంకొ పది నిముషాలు హాయిగా ఏసీలో కూర్చుని సినిమాని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది.

 

రణ్‌బీర్ కపూర్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ తో పని చేయడం ఎలా అనిపించిది ?

రణ్‌బీర్ కపూర్ చాలా గొప్ప వ్యక్తిత్వం వున్న మనిషి. ఒక పెద్ద స్టార్, ఇన్ని సినిమాల అనుభవం వుందనే భావన ఆయన ఎప్పుడూ చూపించలేదు. ఆయనకి కథ చెప్పాను. నచ్చింది. తర్వాత కథ గురించి సినిమా గురించి మాట్లాడుకోవడమే కానీ మరో చర్చ వుండేది కాదు. విజయ్ తో నా మొదటి సినిమా అర్జున్ రెడ్డికి పని చేసినప్పుడు ఎలా ఉండేదో..రణ్‌బీర్ తో పని చేసినప్పుడు కూడా అలానే అనిపించింది. ఇక రణ్‌బీర్ కపూర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోనే తను అత్యుత్తమ నటుడు.

 

ఈ సినిమాకి ‘యానిమల్’ అనే పేరు పెట్టడానికి కారణం ?

మనకి చదువు, తెలివితేటలు వచ్చి హ్యూమన్ బీయింగ్ అని పేరుపెట్టుకున్నాం. అయితే మాన్  ఈజ్ ఏ సోషల్ యానిమల్. మనకి ఐక్యూ వుండి, కమ్యునికేషన్ పెరిగి,  ఫుడ్ చెయిన్ లో మొదటిగా ఉంటూ వస్త్రాలు ధరించాం. కానీ అవి లేకపోతే యానిమల్ కదా అనేది నా పర్శనల్ ఫీలింగ్. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ చదువుకునప్పుటి నుంచి అలానే అనిపించేది. అయితే నేను అలోచించినది ఏమిటంటే.. యానిమల్ కు ఐక్యు వుండదు. తన ప్రవృత్తి (instinct) తో ప్రవర్తిస్తుంటుంది. ఇందులో హీరో పాత్ర కూడా ఇన్స్టింక్ట్ గా బిహేవ్ చేస్తుంది. అలాంటి పాత్రకు సంభదించిన కథకు ‘యానిమల్’ అనే టైటిల్ బాగుటుందని ఈ పేరు పెట్టడం జరిగింది.

 

ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ పాత్రలు ఎలా వుంటాయి ?

యానిమల్ కథలో అనిల్ కపూర్ గారిది కీలక పాత్ర. అతని వలనే అతని గురించే డ్రైవ్ అవుతుంది.  బాబీ డియోల్ విలన్ గా కనిపిస్తారు. ఆ పాత్రల గురించి ఎక్కువ రివిల్ చేయకూడదు. తెరపై చూడాల్సిందే.

 

యానిమల్ లో రివెంజ్ కోణం చాలా బలంగా ఉన్నట్లు అనిపిస్తోంది ?

అవును. రివెంజ్ ని కంటిన్యూ చేయడం మామూలు ఎనర్జీ కాదు. ప్రేమ కంటే రివెంజ్ లో ఎక్కువ ఎనర్జీ వుందని అనిపించింది. రివెంజ్ సాధించాడా ? లేదా అనే మాట కంటే ఆ ప్రయాణం పట్టుకోవడం చాలా కష్టమైన విషయం. మీరు గమనిస్తే వార్ చిత్రాలలో కూడా బలమైన రివెంజ్ వుంటుంది. యానిమల్ రాస్తున్నప్పుడు కూడా ప్రేమ కంటే రివెంజ్ పెద్ద ఎమోషన్ అనిపించింది.

 

యానిమల్ పాటలు డిఫరెంట్ కంపోజర్స్ తో చేశారు కదా ఆ అనుభవం ఎలా అనిపించింది. హర్ష వర్షన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం గురించి ?

-నా సినిమాలో సౌండ్, మ్యూజిక్ కి చాలా ప్రాధన్యత ఇస్తాను. ముంబైలో సోలో కంపోజర్ తో వెళ్ళడం కష్టమైపోయింది. అయితే కబీర్ సింగ్ సినిమా అయ్యేసరికి నాకు కొంచెం అది అలవాటైయింది. డిఫరెంట్ కంపోజర్స్ తో వెళితే అందరికీ కథ నేరేట్ చేయాలి. దాని కోసం ప్రత్యేకంగా శ్రమ తీసుకోవాలి. మ్యూజిక్ అంతా ఒక ఆల్బమ్ గా బ్యాలెన్స్ చేయడం కోసం కూడా ఎఫర్ట్ పెట్టాలి. దానిపై ఒక అవగాహన వుంది కాబట్టి నాకు అది వర్క్ అవుట్ అవుతుంది.  హర్ష వర్షన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం చేశారు. మాకు మంచి సింక్ కుదిరింది. చాలా అద్భుతంగా చేశాడు.

 

‘యానిమల్’కు మీ అన్నయ్య గారు కూడా ఒక నిర్మాత. దీని గురించి ?

నన్ను క్రియేటివ్ పరంగా క్రిటిసైజ్ చేసేది మొదటి నుంచి మా అన్నయ్యే. అర్జున్ రెడ్డిని అన్నయ్యే నిర్మించారు.  మనం ప్రొడక్షన్ లో వుంటే క్రియేటివ్ గా కూడా కంట్రోల్ వుంటుంది. భూషణ్ గారితో కబీర్ సింగ్ కి కలిసి పని చేశాను. ఆయన కూడా క్రియేటివ్ గా చాలా ఫ్రీడమ్ ఇస్తారు.

 

యానిమల్ చిత్రానికి ఎడిటర్ గా కూడా చేయానికి కారణం ?

నేను ఎడిటింగ్ చేస్తా. ఎడిటింగ్ చాలా ఇష్టం. నిజానికి అది చాలా కష్టమైన పని. అయితే నా సినిమా నా కంటే ఎక్కువగా ఎవరికీ అర్ధం కాదనేది నా భావన. అయితే ఇంకా బెటర్ గా చేసే వాళ్ళు వుంటే ఖచ్చితంగా ఇచ్చేస్తా. అలా అయితే నాకు చాలా సమయం కూడా కలిసొస్తుంది.(నవ్వుతూ)

 

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లాంటి రెండు పెద్ద విజయాల తర్వాత వస్తున్న యానిమల్ పై చాలా అంచనాలు వున్నాయి కదా.. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?

-నిజంగా నేను అలాంటి ఒత్తిడి తీసుకొను. ఇన్స్టింక్ట్ గా ఆలోచించడం. మంచి అవుట్ పుట్ ఇవ్వడంపైనే ద్రుష్టి ఉంటుంది కానీ మిగతా విషయాలపై ఒత్తిడి తీసుకొను.

 

యానిమల్  లిరిక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ గురించి ?

– లిరిక్స్ అనంత శ్రీరాం సింగిల్ కార్డ్ రాశారు. లిరిక్స్ తెలుగు నేటివిటీకి తగట్టుగా వున్నాయని మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. పాటలు, రిలిక్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.యాక్షన్ సుప్రీం సుందర్ గారు చేశారు. ఆయన చాలా సాఫ్ట్ పర్సన్. యాక్షన్ మాత్రం వైల్డ్ గా చేశారు.

 

హీరో పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది ఎవరు  ?

-ఇందులో హీరో పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది వాసు గారు. చాలా అద్భుతంగా చెప్పారు. ఎమోషన్ ని చక్కగా క్యారీ చేశారు. రష్మిక తెలుగు, కన్నడ, హిందీలో స్వయంగా డబ్బింగ్ చెప్పింది.

 

అన్ స్టాపబుల్ షో లో బాలయ్య గారిని కలవడం ఎలా అనిపించింది ?

అన్ స్టాపబుల్ షో చూసి షాక్ అయ్యాను. ఈ ప్రోగ్రాం ఎవరు డిజైన్ చేశారో కానీ వాళ్లకు హ్యాట్సప్. ఎందుకంటే బాలయ్యబాబు గారు అంటే సీరియస్ గా వుంటారనే ఇమేజ్ వుంది. కానీ ఆ షో చూసిన తర్వాత ఆయన ఇంత సరదాగా వున్నారనిపించింది. బాలకృష్ణ గారు చెప్పిన మొఘల్-ఈ-ఆజం డైలాగులకు రణ్‌బీర్ కపూర్ మతిపోయింది. అది రణ్‌బీర్ కపూర్ ముత్తాత సినిమా. అందులో డైలాగులు రణ్‌బీర్ కి కూడా గుర్తు లేవు. బాలకృష్ణ గారు చెప్పిన డైలాగులు విని నేను ఆలోచనలో పడిపోయాను. అసలు అంత మెమరీ ఎలా వుంటుందని షాక్ అయ్యాను. మామూలు డైలాగులు కావు అవి. బాలకృష్ణ గారి ఫ్యాన్ అయిపోయా. తెలుగులో కాదు నార్త్ లో కూడా ఇప్పుడా డైలాగులు ఎవరికీ గుర్తుఉండవు. కొత్తగా  ఆడిషన్స్ కి వెళ్ళే నటులు కూడా ఆ డైలాగులు చెప్పరు. ఎందుకంటే అవి చాలా కష్టమైనవి.

 

మీరు చేయబోయే నెక్స్ట్ సినిమా ప్రభాస్ గారిదేనా ?

అవునండీ, జూన్ నుండి ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది, ఈ గ్యాప్ లో ట్రీట్ మెంట్ డైలాగ్స్ పై వర్క్ చేయాలి.

 

ప్రభాస్, అల్లు అర్జున్ గారి తర్వాత ఇంకెవరికైనా కథలు చెప్పారా ?

మహేష్ బాబుగారికి ఓ కథ చెప్పాను. అది ఆయనకి  నచ్చింది. అయితే వేరే కమిట్మెంట్స్ వలన ముందుకు వెళ్ళలేదు. మహేష్ బాబు, రామ్ చరణ్ గారు.. ఇలా అందరితోనూ సినిమాలు చేయాలని వుంటుంది.