Reading Time: 2 mins
దాసరి 3వ వర్ధంతి సంస్మరణ
 
దాసరిది  మరణం కాదు.. అర్ధాంతర అంతర్ధానం
 
దాసరి 3వ వర్ధంతి సంస్మరణ ప్రత్యేక వ్యాసం
 
ఈరోజు మే 30…. 2017 మే 30 వ తేదీన శతాధిక చిత్ర దర్శక శిఖరం  దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు అర్ధాంతరంగా అంతర్థానమైపోయిన రోజు.  సాధారణంగా తనువు చాలించిన వారిని మరణించారు అని, చనిపోయారు అని, పరమపదించారు అని అంటారు… కానీ దాసరి  నిష్క్రమణను అలా అన బుద్ధి కావడం లేదు… ఎందుకంటే ఆయన మరణాన్ని ఊహా మాత్రంగా కూడా
ఎవరూ ఊహించలేదు… ఆయన అంత త్వరగా ఈ లోకం విడిచి వెళ్తారని కలలో కూడా అనుకోలేదు.
అంతా కలలాగే జరిగిపోయింది… అందుకే అనూహ్యమైన, ఊహాతీతమైన ఆయన నిష్క్రమణ ఆకస్మిక అంతర్ధానంగా అనిపిస్తుంది తప్ప సాధారణ మరణంగా అనిపించటంలేదు. దానికి కారణం ఒక్కటే… ఆయన  నాలుగు దశాబ్దాల పాటు చిత్రపరిశ్రమతోనూ, ప్రజా జీవితంతోనూ  శక్తివంతమైన
అనుబంధాన్ని కొనసాగించడమే అందుకు కారణం .
 
 నిజానికి దాసరి కంటే ముందు ఎందరెందరో లబ్ధప్రతిష్టులైన దర్శకులు ఉన్నప్పటికీ దాసరి ప్రవేశం తెలుగు చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా దర్శకత్వ శాఖలో పెను సంచలనాలు సృష్టించింది. సినిమా అనే 24 ఫ్రేముల ఇంద్రజాలంలో అసలు సిసలు మెజీషియన్ దర్శకుడే అన్న నిజాన్ని జనసామాన్యం దృష్టికి తీసుకువెళ్లిన మొట్టమొదటి దర్శకుడుగా  అవతరించారు దాసరి.
 
అయితే దాసరి నారాయణ రావు కేవలం దర్శకత్వం వరకే పరిమితమై ఉంటే ఆయన కూడా అందరిలో ఒకడిగా మిగిలిపోయేవారేమో. కానీ దాసరి బహుముఖ ప్రజ్ఞా విశేషాల ప్రదర్శనకు యావత్ చిత్రపరిశ్రమ జేజేలు పలికింది.. ఒకవైపు దర్శకుడుగా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా అగ్రతారలు అందరితో అద్భుత విజయాలు సాధిస్తూ మరోవైపు తన అసాధారణ నాయకత్వ లక్షణాలతో, వాగ్ధాటితో 
చిత్ర పరిశ్రమను  నడిపించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. చిత్రసీమ రథం అయితే తను సారథిగా నడిపించారు… చిత్రసీమ సమస్యల పరిష్కారంలో  వారధిగా నిలబడ్డారు. 
 
  మహానటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి పెద్దలతో పాటు తరువాత తరానికి చెందిన శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి సీనియర్స్ కూడా దాసరి నాయకత్వ సమర్థతను అంగీకరించారు… ఆమోదించారు.
 
చిత్ర పరిశ్రమలో ఎన్నో సందర్భాలలో ఎన్నెన్నో అపరిష్కృత సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించిన  ” ట్రబుల్ షూటర్  “గా దాసరికి వచ్చిన గుర్తింపు ఆయనను ఒక శక్తివంతమైన నాయకుడిగా నిలబెట్టింది…
 
151 చిత్రాల శిఖరాగ్ర దర్శకుడు అనే 8th వండర్ గానే కాకుండా శతాధిక సమస్యల పరిష్కార కర్తగా  కూడా పరిశ్రమ, ప్రజలు ఆయనను విశ్వసించారు. అందుకే ఆయన నిష్క్రమణ తర్వాత ఈ రోజున చిత్ర పరిశ్రమలో ఏ చిన్న సమస్య వచ్చినా, వివాదం ఏర్పడినా  “ఇలాంటప్పుడు  గురువుగారు ఉంటేనా..? అనని వారు లేరు.
 
ఇలా ప్రతి సందర్భంలోనూ దాసరి నామం, దాసరి రూపం, దాసరి సమర్థత, దాసరి ఘనత స్ఫురణకు  రావడం వల్లనే ఆయన నిష్క్రమణను మరణంగా తీసుకోలేకపోతుంది చిత్ర పరిశ్రమ. 
 
ఆయన హఠాత్తుగా మాయమైపోయారు…. మళ్లీ వస్తారు.. అనే ఒక  బాంధవ్య భావన అందరిలోనూ ఉంది. ఇన్నేళ్లుగా, ఇంత మందితో ఇంత గాఢంగా పెనవేసుకుపోయిన మనిషి ఇంత హఠాత్తుగా ఎలా చనిపోతారు..? లేదు… ఆయన చనిపోలేదు… ఎక్కడికో ఏదో పనిమీద వెళ్లి ఉంటారు… మరలా తిరిగి వస్తారు.. అన్న ఆశ ఏ మూలనో సజీవంగా ఉంది కాబట్టే ఆయనది మరణం కాదు..       
“అర్ధాంతర అంతర్ధానం” అనిపిస్తుంది.
 
చనిపోయిన వాళ్ళు రారేమో గానీ మాయమైపోయిన వాళ్ళు మళ్లీ వస్తారు. ఇలా అనుకోవటం కేవలం భ్రమే అయితే ఈ భ్రమ ఇలాగే ఉండిపోతే బాగుంటుంది.. 
 
ఈ భ్రమ.. 
 ఈ కల.. 
 ఈ ఆశ 
 ఇలాగే ఉండిపోవాలి…
శతాధిక చిత్రాల ఆ కీర్తి శిఖరం..
దశాధిక రంగాల ఆ ప్రతిభా కిరణం..
బహుముఖ ప్రజ్ఞల ఆ మేధో సౌధం..
ఎదురన్నదేలేని  ఆ ఏక వ్యక్తి సైన్యం..
తిరిగి రావటం నిజం కాని కల  అని  తెలుసు… 
 కానీ ఈ కల  ఎంత బాగుందో… 
 ఈ కల చెదిరి పోకూడదు..
అందుకే  మేము నిద్ర లేవం.. 
 నిద్ర లేస్తే మా కల చెదిరిపోతుంది..
 మా  కల నిజమవుతుంది అంటేనే  లేస్తాం …  కానీ మా  కలకు అప్పుడే
మూడేళ్లు  నిండిపోయాయి..
 ఇంకెన్నేళ్ళు ఈ భ్రమతో , ఈ ఆశతో మమ్మల్ని మేము నిద్ర పుచ్చుకోవాలో…!?  అని ఘోషిస్తుంది
అసంఖ్యాక దాసరి అభిమాన, శిష్య, ప్రశిష్య కోటి. 
 
May his soul be rest in peace అనే సంతాప సందేశాలు వారి కంట పడకుండా మౌనంగా ఆ దివంగత దిగ్దర్శకుడి కి అంజలి ఘటిద్దాం.