Reading Time: 3 mins

ది కేరళ స్టోరీ మూవీ రివ్యూ

అదాశర్మ ‘ది కేరళ స్టోరీ’(తెలుగు) రివ్యూ

Emotional Engagement Emoji

రకరకాల వివాదాలతో  ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతున్న ఈ చిత్రం రీసెంట్ గా తెలుగు వెర్షన్ రిలీజైంది.  కేరళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తీశామని చెప్పబడుతున్న  సినిమా ది కేరళ స్టోరీ లో ఏముంది. ? ఈ సినిమాలో అదా శర్మ హిందువు. అక్కడ ఆమె ఇస్లాం మతంలోకి మారడానికి సిద్ధంగా ఉన్న మరో ఇద్దరు అమ్మాయిలను కలుసుకుంటుంది. ఇదంతా ట్రైలర్ లో డైరెక్టర్ ఎప్పుడో చూపించాడు. అయితే అదాశర్మ ఇస్లాంలోకి ఎందుకు మారుతుంది? ఎవరు ఆమెను ఇస్లాంలోకి తీసుకెళ్తారు? ఎందుకు తీసుకెళ్తారు?  సినిమా ఎలా ఉంది? ఎవరు ఎలా నటించారు ఇప్పుడు తెలుసుకుందాం.

స్టోరీ లైన్ :

లవ్-జిహాద్, అత్యాచారం, లైంగిక బానిసత్వం, బోధనల వల్ల ముగ్గురు మహిళలు ఎదుర్కొన్న దయనీయ పరిస్థితులను ఈ సినిమాలో చూపిస్తూ కథ సాగుతుంది. కాసర్‌గోడ్‌లోని ఓ నర్సింగ్ కాలేజ్ లో  అదా శర్మ  హిందువైన షాలిని ఉన్నికృష్ణన్ (అదా శర్మ) చదువుకుంటూంటుంది. ఆమెతో పాటు గీతాంజలి(సిద్ధి ఇద్నానీ), నిమా (యోగితా భిహాని) స్టూడెంట్స్. అసీఫా(సోనియా బలానీ)  రూమ్ షేర్ చేసుకుంటారు. మరో ప్రక్క ఐసిస్ లో అండర్ కవర్ గా చేస్తున్న అసీఫా  (సోనియా బలానీ) .. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ఇస్లాంలోకి మార్చే మిషన్ లో బిజిగా ఉంటుంది. ఈ స్లీపర్ సెల్ లోకల్ ముస్లిం లీడర్ ఆదేశాల ప్రకారం, ఇతర మతాల అమ్మాయిలకి మాయ మాటలు చెప్పి మతంలోకి మార్చి, ముస్లిం యువకులతో ప్రేమలోకి దింపితే, ఆ ముస్లిం యువకులు పెళ్ళిళ్ళు చేసుకుని సిరియా తీసికెళ్ళి పోయి పవిత్ర యుద్ధంలో పాల్గొనేలా చేస్తూంటుంది.

అసీఫా దృష్టి ఈ ముగ్గురుపై పడుతుంది. అంతే  తన ప్లాన్ లో భాగంగా ఇద్దరబ్బాయిలని రంగంలోకి దించి షాలినీ, గీతాంజలిని లవ్ జిహాద్ ఉచ్చులోకి పడేలా చేస్తుంది. అందుకు అనువైన వాతావరణం, పార్టీలు, బ్రెయిన్ వాష్ వంటివి చేస్తుంది. మతపరమైన చర్చలు తెలివిగా జరిపి అల్లా ఒక్కడే దేవుడుని నూరిపోసి, వాళ్లు కన్వర్ట్ అయ్యే పరిస్దితులు తెస్తుంది.  వాళ్లు ఐసిస్ లో చేరేందుకు మార్గం ఏర్పడుతుంది. అయితే ఇవేమీ ఆ ముగ్గురుకి తెలియవు. అమాయకంగా ఎట్రాక్ట్ అయ్యి ముందుకు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైంది? తెలియాలంటే ‘ద కేరళ స్టోరీ’ మూవీ చూడాల్సిందే.

ఎలా ఉంది :

2020 లో నెట్ ఫ్లిక్స్ సిరీస్ ‘కాలిఫేట్’ లో కూడా ఇలాగే స్వీడెన్ కి చెందిన ముగ్గురమ్మాయిల కథ. మోసపోయి సిరియా ‘పవిత్ర యుద్ధం’ లో ఇరుక్కునే కథ గా ఉంటుంది. నెట్ ప ్లిక్స్ లో వచ్చిన ఆ సీరిస్ ని బేస్ చేసుకుని తీసినట్లున్నారు. యూఎన్ డిటెన్షన్ సెంటర్ లో గాయపడిన అదాశర్మ సన్నివేశంతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. విచారణ సమయంలో ఆమె శిక్షణ పొంది ఐసిస్ ఉగ్రవాదిగా ఎలా మారింది అనే విషయాలను గుర్తు చేసుకుంటుంది. ఫాతీమా బా గా మారిన షాలిని అఫ్ఘనిస్థాన్‌లో ఎదురైన చేదు అనుభవాలను  గుర్తు చేసుకోవటంతో కథ ముందుకు వెళ్తుంది. హిందూ మతపరమైన ఆరాధన, నాస్తికత్వం, కమ్యునిజం, ఇస్లాం, షరియా చట్టాలు బోధించే ప్రక్రియల్ని చూపిస్తూ కథ నడపటం మామూలు విషయం కాదు. ఆ విషయమై బాగా కసరత్తు చేసారని అర్దమవుతుంది. బాలెన్స్ తప్పితే బోర్లాపడుతుంది.  కానీ ఈ విషయంలో మూవీ టీమ్ సక్సెస్ అయింది!  అలాగే స్క్రీన్ ప్లే ని నాన్ లీనియర్ పద్దతిలో నడిపారు. ఇలాంటి విషయాలు బోర్ కొట్టేస్తాయనే స్పీడుగా పరుగెట్టించారు. సినిమాని ఫ్లాష్ బ్యాక్, ప్రస్తుత సన్నివేశాల మధ్య బ్యాలెన్స్ చేస్తూ డిజైన్ చేసారు.  అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది.  చెప్పిన విషయాలు పదే పదే చెప్తున్నట్లు ఉంటాయి. ఇక లవ్ జీహాద్ పక్రియ కాస్తంత సుదీర్గంగానే తీసారు. హీరోయిన్ ని ట్రాప్ చేసేసీన్స్ కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది.  ఒక సీన్ లో – షాలిని గర్భవతి అని తెలుస్తుంది. మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెబుతాడు ప్రియుడు. మతం మార్చుకోవడానికి ఆమె సిద్ధమవుతుంది. పెళ్లికి సిద్ధపడుతున్న సమయంలో ప్రియుడు పరారైపోతాడు. అప్పుడు ఓ మత పెద్ద.. నువ్వు మరో ఇస్లాం యువకుడిని పెళ్లి చేసుకొని సిరియా వెళ్ళిపోతే ‘మా దేవుడు నీ తప్పులన్నీ మాఫీ చేస్తాడు’ అని చెప్తాడు. ఇలాంటివి చూసేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తాయి. అలాంటి సిట్యువేషన్ లో ఆమె ఎలా ఒప్పుకుంటుంది అనిపిస్తుంది. సినిమాకు కీలకమైన మలుపుని తీసుకొచ్చే ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త పడాల్సింది.

టెక్నికల్ గా :

వాస్తవిక సినిమాలు తీయటంలో తనకంటూ ఓ ముద్ర , పేరు తెచ్చుకున్న బెంగాలీ దర్శకుడు సుదీప్తో సేన్. కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా క్లిక్ అవ్వని దర్శకుడు వెలుగులోకి రావడానికి కేరళ స్టోరీ తీయాలనుకోవడం కెరీర్ వైజ్ గా ఎలాంటి మంచి నిర్ణయమో భవిష్యత్ లో తెలియాల్సిన విషయం. సినిమా టెక్ గా కొన్ని సీన్స్ ఉన్నా, ఎక్కవ శాతం వాస్తవికతను ఉట్టిపడేలా చిత్రాన్ని  మలిచారు. సంజయ్ శర్మ ఎడిటింగ్ బాగుంది. బ్యాక్‎గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్, కలర్ బ్యాలెన్స్  కూడా ఫెరఫెక్ట్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆ కథకు సరపడేలా ఉన్నాయి.  కేరళ దృశ్యాలు గానీ, సిరియా దృశ్యాలు గానీ పూర్ గా వున్నాయి.

నటీనటుల్లో :

షాలినిగా ఫాతీమాగా రెండు వేరియేషన్స్ ఉన్న అమ్మాయి పాత్రలో అదా శర్మ   బాగా నటించింది.  అదా శర్మ పూరీ జగన్నాథ్ నితిన్ తో తీసిన ‘హార్ట్ ఎటాక్’ తో తెలుగులో పరిచయమైంది. ,కొన్ని తెలుగు,తమిళ సినిమాలు చేసినా క్లిక్ అవ్వలేదు. ఈమె నట జీవితానికి ‘కేరళ స్టోరీ’ ఓ మలుపు అవుతుందేమో చూడాలి.   యోగితా, సోనియా, సిద్ధి సైతం చక్కటి పర్ ఫార్మెన్స్ కనబరిచారు.

చూడచ్చా :

హింస మోతాదు కాస్త ఎక్కువగానే ఉంది. అందుకు  ప్రిపేర్ అయి థియేటర్ కి వెళ్తే బెటర్. లేకపోతే ఇబ్బంది కలుగుతుంది.

నటీనటులు :

అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలానీ, సిద్ది ఇద్నానీ, దేవదర్శిని, విజయ్ కృష్ణ, ప్రణయ్ పచౌరీ, ప్రణవ్ మిశ్రా తదితరులు

సాంకేతికవర్గం :

దర్శకత్వం: సుదిప్టో సేన్
బ్యానర్: సన్‌షైన్ పిక్చర్స్
రచన: సూర్యపాల్ సింగ్
నిర్మాత: విపుల్ అమృత్ లాల్ షా
ఎడిటింగ్: సంజయ్ శర్మ
Run Time: 2h 18m
మ్యూజిక్: విరేష్ శ్రీవాల్స, బిషఖ్ జ్యోతి
తెలుగు రిలీజ్ డేట్: 13-05-2023