దర్శకుడు హసిత్ గోలి ఇంటర్వ్యూ
శ్రీవిష్ణులోని కామెడీ కోణాన్ని పూర్తిస్థాయిలో చూపించే చిత్రం ‘రాజ రాజ చోర’: దర్శకుడు హసిత్ గోలి
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్. హిసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న సినిమా విడుదలవుతుంది.
ఈ సందర్భంగా దర్శకుడు హసిత్ గోలి ఇంటర్వ్యూ విశేషాలు..
నాన్నగోలి హనుమత్ శాస్త్రి. హౌసింగ్ కార్పొరేట్‌లో ఆయన సివిల్ ఇంజనీర్. ఆయనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఆయన ఓ బ్లాగ్ మెయిన్‌టెయిన్ చేస్తూ అందులో పద్యాలు, సాహిత్యంకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తుంటారు. ఆయన క్రమశిక్షణ నాకు రాలేదు. కానీ సాహిత్యంపై అభిరుచి అయితే పెరిగింది.
చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. నేను, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చిన్నప్పట్నుంచి స్నేహితులం. ఇద్దరం కలిసే సినిమాలు చూసేవాళ్లం. నేను, వివేక్ కలిసి షార్ట్ ఫిలింస్ చేశాం. ఇద్దరం ఐడియాస్ పంచుకుంటూ వర్క్ చేసేవాళ్లం.
మేం చేసిన షార్ట్ ఫిలింస్‌కు మంచి అప్రిషియేషన్స్ రావడంతో ముందు వివేక్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే సమయంలో నేను జాబ్ చేస్తుండేవాడిని. రాజ్ కందుకూరిగారి బ్యానర్‌లో మెంటల్ మదిలో సినిమా చేసే అవకాశం వచ్చింది. చేసే ప్రయత్నమేదో ఇప్పుడే చేయాలనిపించి నేను కూడా ఎంట్రీ ఇచ్చాను.
మంచి జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే సమయంలో ఇంట్లో వాళ్లు కంగారు పడ్డారు. ముఖ్యంగా అమ్మ బాగా కంగారు పడింది. అయితే నాన్నగారు బాగా సపోర్ట్ చేశారు. మెంటల్ మదిలో సినిమా చూసిన తర్వాత వీళ్లేదో ఆకర్షణకు లోనై వెళ్లలేదు. ఏదో క్లారిటీతోనే వెళ్లారు అని ఇంట్లో వాళ్లకి అనిపించింది. శ్రీవిష్ణుగారు పరిచయం అయ్యారు. ఆయన ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారనే దానిపై, మేం ఆలోచిస్తున్న కథలపై క్లారిటీ ఉండటంతో మాకు ఒక ఊతం దొరికిందని ధైర్యం ఉండింది.
మెంటల్ మదిలో తర్వాత నేను ఓ కథను శ్రీవిష్ణుగారికి చెప్పాను. ఆయనకు కూడా బాగా నచ్చింది. అయితే ఓ కథను రాయడం కంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అనుభవం అవసరం అనిపించింది. అందుకని నేనే కాస్త ఆగాను. అదే సమయంలో బ్రోచెవారెవరురా సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ సినిమాకు కూడా దర్శకత్వ శాఖలో పనిచేశాను. అంతా ఓకే అనుకుని అంతకు ముందు శ్రీవిష్ణుకి చెప్పిన కథతో సినిమా చేద్దామని అనుకున్నాం. అయితే, ఇంకా బెటర్ లైన్ ఐడియాలోకి రావడంతో ఈ సినిమాను స్టార్ట్ చేశాం.
పాజిటివ్ క్యారెక్టర్ కంటే గ్రేషేడ్స్ ఉన్న పాత్రల్లో కాస్త డ్రామా ఎక్కువగా ఉంటుందనేది నా అభిప్రాయం. దాన్ని హిలేరియస్ జోనర్ చూపించాలని అనుకున్నాను. నాకు బేసిగ్గా, శ్రీవిష్ణుగారి కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం. దాన్ని పూర్తి స్థాయిలో ఎవరూ చూపించలేదు.ఈ సినిమాలో దాన్ని చూపించబోతున్నామని అనుకుంటున్నా. ఓ దొంగ ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు అనే కోణాన్ని కామెడీ కోణంలో చూపించే ప్రయత్నం చేశాను.
కామెడీ డ్రామా జోనర్ మూవీ ఇది. కథ లేకపోతే కామెడీతో సినిమారన్ అవుతుందని అనుకోను. డైరెక్టర్‌గా నేను డ్రామాను ఇష్టపడతాను.
సినిమాలో కామెడీని జనరేట్ చేసే విషయాల్లో కిరీటం కూడా ఓ రోల్‌ను ప్లే చేస్తుంది. అదేంటో సినిమా చూడాల్సిందే.
సినిమాలో ప్రతి పాత్ర అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ముఖ్యంగా శ్రీవిష్ణు పాత్ర, గంగవ్వ పాత్ర అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు కొంటె దొంగ.
ముందు ఎం.ఎల్.కుమార్ చౌదరిగారు, కీర్తిగారికి కథ చెప్పాం. నచ్చింది. తర్వాత విశ్వప్రసాద్, అభిషేక్‌గారు కూడా యాడ్ అయ్యారు.
కోవిడ్ ఫస్ట్ వేవ్, లాక్‌డౌన్ సమయానికి సినిమా పూర్తి కాలేదు. తర్వాత సెకండ్ వేవ్ వచ్చే సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరుకున్నాం. అప్పుడు ఓటీటీ అవకాశాలు వచ్చాయి. అయితే నిర్మాతలు సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్స్‌లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, మరో స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాను. దాన్ని ముందు పూర్తి చేస్తాను.