నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు
తెలుగు ఇండస్ట్రీకి దేశ విదేశాల్లో పేరు తెచ్చిన ది గ్రేట్ లెజెండ్ ఎన్.టి.రామారావుగారు తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన పేరు బతికే ఉంటుంది : రామ్ చరణ్
ఇప్పుడు విదేశాల్లో తెలుగువాడి సినిమా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. సౌత్ ఇండియన్ సినిమా బావుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆరోజుల్లోనే ఎన్టీఆర్‌గారు మన పవర్ ఏంటో రుజువు చేశారు. వాటిని ఎప్పటికీ మరచిపోకూడదు గుర్తు చేసుకుంటూనే ఉండాలి అని అన్నారు హీరో రామ్ చరణ్.
స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు హైదరాబాద్ కూకట్ పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ శత జయంతి వేడుకలకు హాజరైన హీరో రామ్ చరణ్ స్వర్గీయ ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. చిన్నప్పుడు ఎన్టీఆర్‌ను కలిసిన సందర్భం గురించి ఆయన మాట్లాడుతూ
ఎక్కడ మొదలు పెట్టాలో తెలియటం లేదు. ఏ స్థాయి గురించి మాట్లాడినా ఆ స్థాయిలన్నింటినీ మించిన పెద్ద పేరు. పెద్ద వ్యక్తి నందమూరి తారక రామారావుగారు. ఒక రాముడి గురించో, కృష్ణుడి గురించో మాట్లాడటం కంటే కూడా మనం వారి గురించి మనసుల్లో ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి వాటిని ఎక్కువగా ఎక్స్‌పీరియెన్స్ చేయాలే తప్ప మాట్లాడకూడదు. వాళ్లు సాధించిన విజయాలను, వారు వేసిన మార్గాలను గుర్తుకు చేసుకుంటూ, ఆ మార్గాల్లో నడుస్తుంటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. నాతో సహా ప్రతిరోజూ సినిమా సెట్‌కి వెళ్లే ప్రతి ఆర్టిస్ట్ ఆయన పేరుని గుర్తుకు తెచ్చుకోకుండా ఉండరు. అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి? అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి? అని మన పక్క రాష్ట్రాలతో పాటు దేశంలోనూ, విదేశాల్లో చాటి చెప్పిన వ్యక్తి. గుర్తింపు తెచ్చిన వ్యక్తి ది గ్రేట్ లెజెండ్ ఎన్.టి.రామారావుగారు. అలాంటి వ్యక్తి నడిచిన ఇండస్ట్రీ ఇది. అలాంటి వ్యక్తి పని చేసిన ఇండస్ట్రీలో మేం అందరం పని చేస్తున్నామంటే అంత కంటే గర్వం ఇంకేముంది.
నేను ఎన్టీఆర్‌గారిని ఒకే ఒకసారి మాత్రమే కలిశాను. నేను, పురంధరరేశ్వరిగారి అబ్బాయి రితేష్ కలిసి స్కేటింగ్ క్లాసులకు వెళ్లే వాళ్లం. పొద్దునే ఐదున్నర, ఆరు గంటలకంతా క్లాసులు అయిపోయేవి. ఓరోజు మా తాతయ్యగారి ఇంటికి వెళదామా? అని రితేష్ అన్నాడు. అప్పుడాయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు పెద్ద సెక్యూరిటీ ఉంటుంది. అక్కడకు వెళ్లగలమా? లేదా? అని చెప్పే శక్తి కూడా నాకు లేదు. నేను సరేనని చెప్పాను. ఇద్దరం స్కేటింగ్ చేసుకుంటూ పురంధరేశ్వరిగారి ఇంటి నుంచి వెళ్లాం. కిందకు వెళితే రామారావుగారి ఇల్లు ఉంది. అప్పుడు ఉదయం ఆరున్నర గంటలు అవుతుంది.
ఎన్టీఆర్‌గారిని కలిసి వెళ్లిపోదామని అనుకున్నా. అయితే ఆయన అప్పటికే నిద్రలేచి రెడీ అయిపోయి టిఫన్‌కి కూర్చున్నారు. అందరికీ తెలిసినట్లే పెద్ద చికెన్ పెట్టుకుని ఆ వయసులోనూ హెల్దీగా తింటున్నారు. నేను వెళ్లగానే నన్ను కూడా కూర్చో పెట్టి నాకు కూడా టిఫన్ పెట్టారు. అది నాకు కలిగిన అదృష్టం. ఆయనతో కలిసి టిఫన్ తిన్న ఆ క్షణాలను జీవితాంతం నేను మరచిపోలేను. అంత మంచి అవకాశాన్ని నాకు కలిపించిన పురంధరేశ్వరిగారికి థాంక్స్. తెలుగు ఇండస్ట్రీ బ్రతికున్నంత వరకు ఆయన పేరు బతికే ఉంటుంది.
రాబోయే తరాలకు కూడా ఆయన గుర్తుండిపోయేలా చేసే ఇలాంటి ఫంక్షన్స్ చాలా చాలా ముఖ్యం. ఈ ఫంక్షన్‌ను ఇంత గొప్పగా నిర్వహించిన చంద్రబాబు నాయుడుగారికి, ఈ ఫంక్షన్‌కి నన్ను ఆహ్వానించిన బాలయ్యబాబుగారికి థాంక్స్. ఆయన మా ఫంక్షన్స్‌కు ఎప్పుడూ వస్తుంటారు. ఆయనకు మరోసారి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ఫంక్షన్‌కి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. నందమూరి అభిమానులందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. జై ఎన్టీఆర్ అన్నారు.