Reading Time: 3 mins
నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌ ఇంట‌ర్వ్యూ
 
`ఎంత మంచివాడ‌వురా` చిత్రంలో నేను చేసిన క్యారెక్ట‌ర్ నా నిజ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది – నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌
 
`అత‌నొక్క‌డే` నుండి `118` వ‌ర‌కు వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ల్యాణ్‌రామ్‌. ఈయ‌న హీరోగా న‌టించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత మంచివాడ‌వురా`. ఆడియో రంగంలో అగ్రగామి అయిన  ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ఇంట‌ర్వ్యూ.
 
 
టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏంటి?
 
– `న‌మ్మిన బంటు` సినిమా పాట నుండి ఈ టైటిల్‌ను తీసుకున్నాం. క‌థ‌ను బ‌ట్టే టైటిల్‌ను పెట్టాం. పాజిటివ్‌నెస్‌ను మంచిత‌నం అంటాం. హీరో త‌ను చుట్టూ జ‌రిగే ప‌రిస్థితుల‌ను చెడుగా తీసుకోడు. హీరో జీవితంలో జ‌రిగే ఓ సందర్భంలో పాజిటివ్‌నెస్‌ను చూసుకున్న హీరో.. అలాగే పెరుగుతాడు. జీవితంలో ఇత‌రుల‌కు ఇవ్వ‌డం అనే పాయింట్‌ను ఈ సినిమాలో చూపించాం. అలాంటి పాజిటివ్ టైటిల్ కావాల‌నుకున్న‌ప్పుడు డైరెక్ట‌ర్‌గారు `ఆల్ ఈజ్ వెల్‌` అనే టైటిల్‌ను అనుకున్నారు. అయితే స‌తీశ్‌గారి సినిమాలు టైటిల్ నుండే తెలుగుద‌నంతో ఉంటాయి. కాబ‌ట్టి మంచి తెలుగు టైటిల్‌ను మీ నుండి ఆశిస్తున్నాన‌ని చెప్పగానే.. `ఎంత మంచివాడ‌వురా` అనే టైటిల్‌ను పెట్టారు. మ‌నుషులంతా మంచోళ్లే.. ప్ర‌తి ఒక్క‌రూ వారి సైడ్ నుండి మంచివాళ్లే. కాక‌పోతే కొంద‌రు చేసే ప‌నుల వ‌ల్ల మ‌నం హ‌ర్ట్ అవుతాం. వారిని బ్యాడ్ అంటాం. మ‌నుషులంద‌రూ మంచోళ్లే.. అయితే వారు చేసే త‌ప్పును మ‌నం వాళ్ల‌కి చెప్పాలనేదే మా సినిమా కాన్సెప్ట్‌. 
 
 
సినిమా క‌థాంశం ఏమో మంచిత‌నంతో ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి సినిమాలో నెగిటివ్ ట‌చ్ ఎలా చూపిస్తారు?
 
– శ‌త‌మానం భ‌వ‌తి అనేది ఓ ఇంట్లోని ఇద్ద‌రు పెద్ద వ్య‌క్తుల‌కు సంబంధించిన క‌థ అయితే.. శ్రీనివాస క‌ల్యాణం సినిమా పెళ్లికి సంబంధించింది. కానీ ఎంత మంచివాడ‌వురా వేర్వేరు మ‌న‌స్తత్వాలు, ఆలోచ‌న‌లు ఉన్న వ్య‌క్తుల జీవితాల్లోకి హీరో ఎలా ఎంట్రీ ఇచ్చి మార్చాడు? అనేదే సినిమా. క‌చ్చితంగా ఓ వ్య‌క్తిలో నెగిటివిటీ ఉంటుంది. దాన్ని హీరో ఎలా క‌ట్ చేశాడ‌నేదే సినిమా. 
 
 
 
ఈ సినిమా త‌ర్వాత మీకు ఎలాంటి ఇమేజ్‌ను కోరుకుంటున్నారు?
 
– నేనెప్పుడూ ఇమేజ్ గురించి ఆలోచించ‌లేదు. నేను సినిమాలు అలాగే చేస్తూ వ‌చ్చాను. క‌థ న‌చ్చితే సినిమా చేశాను. అయితే రిపీట్ క‌థ, క్యారెక్ట‌ర్‌ లేకుండా ఉండేలా చూసుకున్నాను. ప్రేక్ష‌కులకు ఏదైనా కొత్త‌గా చూపించాలనుకుంటాను. ఉదాహ‌ర‌ణ‌కు `118` సినిమా త‌ర్వాత నాకు చాలా మంది థ్రిల్ల‌ర్ క‌థ‌లు చెప్పారు. అయితే అందులో నేనేదో కాస్త చిన్న‌పాటి తేడాతో చేయ‌గ‌ల‌ను కానీ.. కొత్త‌గా ఏం చేస్తాను. లుక్ ప‌రంగా మార్పు ఉంటుందేమో అనుకున్నాను. అదే క్యారెక్ట‌ర్, క‌థ కొత్త‌గా ఉంటుంద‌నుకోండి.. మ‌నం కూడా కొత్త‌గా ఆలోచిస్తాం. శ‌త‌మానం భ‌వ‌తి చిత్రం త‌ర్వాత నా భార్య వెళ్లి ఆ సినిమా చూశారు.  ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ చూశాను. మీరెందుకు అలాంటి సినిమాలు చేయ‌రు, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే ఎందుకు చేస్తారు? అని అడిగారు. అలాంటి క‌థ వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా చేస్తాను అని త‌న‌కు అప్పుడు చెప్పాను. అది ఇప్పుడు కుదిరింది. 
 
 
చాలా త‌ర్వగా చేసిన‌ట్లున్నారుగా?
 
– `118` త‌ర్వాత చాలా క‌థ‌లు విన్నాను. రీమేక్ క‌థ‌లు కూడా చూశాను. ఓ రోజు కృష్ణ‌ప్ర‌సాద్‌గారు వ‌చ్చి `ఓ గుజ‌రాతీ సినిమా ఉంది మీరు చూడండి` అన్నారు. స‌రేన‌ని చూశాను. సినిమాలో మేజ‌ర్ పాయింట్ బాగా న‌చ్చింది. కానీ ఇత‌ర ఎలిమెంట్స్ నాకు పెద్ద‌గా క‌నెక్ట్ కాలేదు. అప్పుడు ఆయ‌న `మీరు క‌థ వినండి స‌తీశ్ మార్పులు చేర్పులు చేశాడు` అన్నారు. స‌రేన‌ని విన్నాను. విన‌గానే ప్ర‌ధాన అంశాన్ని స‌తీశ్ ఎంత బాగా మార్చాడో  అనిపించింది. న‌చ్చ‌డంతో ఓకే అనిపించింది. 
 
 
ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా?
 
– మెసేజ్‌లంటే ఏదో లెక్చ‌ర్ ఇచ్చిన‌ట్లు ఉండ‌దు. ఎంత మంచివాడ‌వురా అంటే ఓ క్యారెక్ట‌ర్ చేసే జర్నీ. త‌న‌కు కావాల్సిన రిలేష‌న్స్ తీసుకుంటూ, ఎదుటివాడికి కావాల్సిన ఎమోష‌న్స్ ఇచ్చే పాత్ర‌లో న‌టించాను. 
 
 
మీ నిజ జీవితానికి  ఈ సినిమా ఎంత మేర‌కు క‌నెక్ట్ అయ్యింది?
 
– మేం అంద‌రం ఉమ్మ‌డి కుటుంబం నుండి వ‌చ్చాం. చిన్న‌ప్పుడు ఇంటికి పెద్ద‌మ్మ‌, పెద్ద‌నాన్న‌, ఇత‌ర రిలేటివ్స్ వ‌చ్చిన‌ప్పుడు చాలా బావుండేది. వాళ్లు వెళ్లేట‌ప్పుడు బాధ‌గా అనిపించేది. ఇప్పుడు మా ఇంట్లో తొమ్మిది మంది ఉంటున్నాం. అంద‌రితో పొద్దునే క‌లిసి మాట్లాడ‌టం నాకు ఇష్టం. అలాంటి ఎపిసోడ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అవ‌న్నీ నాకు బాగా న‌చ్చాయి. 
 
 
ఇలాంటి పాత్ర‌ను చేయ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించిందా?
 
– ఇలాంటి పాత్ర చేయ‌డం చాలా సుల‌భ‌మ‌ని నేను చెప్ప‌ను. నేను మా ఇంట్లో ఎలా ఉంటాను అంతే సింపుల్‌గా ఈ క్యారెక్ట‌ర్ కూడా ఉంటుంది. కోపంతో క‌న‌ప‌డ‌కుండా, న‌వ్వుతూ క‌న‌ప‌డాల‌ని డైరెక్ట‌ర్ స‌తీశ్‌గారు అన్నారు. నా రియ‌ల్ లైఫ్‌కి ద‌గ్గ‌ర‌గా ఉన్న క్యారెక్ట‌ర్‌. 
 
 
మీ త‌మ్ముడు తార‌క్ ఇలాంటి సినిమా చేయ‌మ‌ని ఎప్పుడైనా స‌ల‌హా ఇచ్చారా?
 
– సాధార‌ణంగా మేం ఏ సినిమాలు చేస్తున్నామో వాటి గురించి చిన్న‌పాటి డిస్క‌ష‌న్ ఉంటుంది. అలాంటి డిస్క‌ష‌న్‌లో నేను ఈ క‌థ గురించి చెప్ప‌గానే త‌ను హ్యాపీగా ఫీల‌య్యాడు. 
 
 
ఈ జర్నీ ఎలా అనిపించింది?
 
– సినిమాను దాదాపు 70 రోజుల పాటు షూట్ చేశాం. ఆ ప్ర‌యాణంలో టీమ్‌తో మంచి అనుబంధం ఏర్ప‌డింది. అప్పుడే షూటింగ్ అయిపోయిందా? అనిపించింది. మున్నార్ ప్రాంతాల్లో సిగ్న‌ల్స్ కూడా లేక‌పోవ‌డంతో సెట్స్‌లో అంద‌రూ స‌ర‌దాగా గ‌డిపేవాళ్లం. 
 
 
సంక్రాంతికి సినిమాలు ఎక్కువ‌గా విడుద‌ల‌వుతున్నాయిగా.. మీ సినిమా రిలీజ్ కావ‌డం?
 
– సంక్రాంతి రైతుల పండ‌గే కాదు.. మా సినిమా వాళ్ల‌కు కూడా పండ‌గే. ఫ్యామిలీ అంతా క‌లిసి సినిమా చూస్తుంది. ప్ర‌తిసారి సంక్రాంతి నాలుగు సినిమాలు వ‌స్త‌న్నాయి. మేమేదో వ‌చ్చేశామ‌ని కాదు.. పెద్ద బ‌డ్జెట్ సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు మీడియం బ‌డ్జెట్ సినిమాలు కూడా విడుద‌ల‌వుతుంటాయి. ఈ సీజ‌న్‌ను దాటితే ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ థియేట‌ర్‌కు వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాలి. దానికి స‌మయం ప‌డుతుంది కాబ‌ట్టే సంక్రాంతికి రావాల‌ని అనుకున్నాం. మా బ‌డ్జెట్‌లో మాకు వ‌ర్కవుట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. 
 
 
స‌తీశ్ వేగేశ్నతో జ‌ర్నీ ఎలా అనిపించింది?
 
– పూరిగారు, అనిల్ రావిపూడితో వ‌ర్క్ చేసేట‌ప్పుడు ఎంత కంఫ‌ర్ట్ ఇచ్చారో స‌తీశ్‌గారు కూడా అంతే కంఫ‌ర్ట్ ఇచ్చి ప‌నిచేయించుకున్నారు. ఎప్పుడైనా టెన్ష‌న్ ఉన్నా.. రిలాక్స్ చేసేలా జోక్స్ చెప్పేవాడు. 
 
 
మెహ‌రీన్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌?
 
– మెహ‌రీన్ సూప‌ర్బ్ రోల్‌లో న‌టించింది. త‌న పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. 
 
 
నిర్మాత‌ల గురించి?
 
– మ్యూజిక్ రంగంలో అగ్ర‌గామిగా ఉన్న ఆదిత్య సంస్థ నిర్మాణంలోకి వ‌చ్చిన త‌ర్వాత చేసిన తొలి చిత్ర‌మిది. ఏరోజూ ఖ‌ర్చు గురించి ఆలోచించ‌లేదు. 
 
 
పాట‌లకు మంచి రెస్పాన్స్ వ‌చ్చాయిగా?
 
– నిన్ను కోరి సినిమా చూసిన త‌ర్వాత గోపీసుంద‌ర్‌గారి మ్యూజిక్‌లో సినిమా చేయాల‌నుక‌న్నాను. ఈ సినిమాతో తీరింది. అద్భుత‌మైన సంగీతం కుదిరింది. పాట‌లు వినేట‌ప్పుడు కూల్‌గా ఉన్నాయి. వాటిని తెర‌పై చూస్తున్న‌ప్పుడు ఇంకా బావుంటుంది. ఈ సినిమాలో ఏమో ఏమో ఏ గుండెల్లో .. సాంగ్ అయితే సినిమా అస‌లు క‌థేంటి అనే దాన్ని వివ‌రించేలా ఉంటుంది. ప్ర‌తి పాట క‌థ‌లో భాగంగా ర‌న్ అవుతుంది. 
 
 
సొంత బ్యాన‌ర్‌లో సినిమా ఎప్పుడు ఉంటుంది?
 
–  ఉంటుందండి.. వివ‌రాలు చెబుతాను.