నాంది మూవీ రివ్యూ
సెకండ్ ఇన్నింగ్స్ కు ..‘నాంది’ రివ్యూ
Rating:2.75/5
కామెడీ సినిమా అంటే రాజేంద్రప్రసాద్ తర్వాత ప్లేస్ అల్లరి నరేష్ దే..అందులో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఇప్పుడు స్టార్స్ కూడా కామెడీలు చేయటం, తనేమో రొటీన్ స్టఫ్ తో స్పూఫ్ కామెడీనే నమ్ముకోవటంతో నరేష్ కామెడీ సినిమా అంటేనే జనం ప్రక్కన పెట్టేసే స్దితికి చేరుకున్నాడు. ఆ విషయం రీసెంట్ గా వచ్చిన బంగారు బుల్లోడు ప్రూవ్ చేసింది. ఈ క్రమంలో తనలోని నటుడుని వెలికి తీస్తూ సీరియస్ జోనర్ లోకి జంప్ చేసాడు ఈ జంప్ జిలాని. మరి జంప్ అతని కెరీర్ కు ప్లస్ అవుతుందా..ఇలాంటి సినిమాలకు నాంది వాచకం పలుకుతుందా…అసలు ఈ చిత్రం కథేంటి..ఇంత హైప్ కు తగ్గ సినిమాయేనా..నరేష్ ఇక ఈ తరహా సినిమాలు చేసుకోవచ్చా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
సాఫ్ట్ వేర్ ఎంప్లాయి బండి సూర్యప్రకాశ్ ( అల్లరి నరేశ్)కు జీవితం చాలా ఆనందంగా ఉంది. తల్లి,తండ్రి, ఇష్టపడ్డ అమ్మాయితో నిశ్చితార్దం..జీవితంలో ఏమీ లేవనిపిస్తుంది. కానీ ఎప్పుడూ అలాగే ఉంటే అది జీవితం ఎందుకు అవుతుంది. కలలో కూడా ఊహించనివిధంగా పౌరహక్కుల నేత రాజగోపాల్ (ఎమ్ వి ఎల్ నరసింహరావు) హత్యకేసులో అరెస్ట్ అవుతాడు. అతను చేయని మర్డర్ ని బనాయించి టార్చర్ పెడతాడు ఏసీపీ కిషోర్ (హరీష్ ఉత్తమన్). అలా కేవలం ఛార్జ్ షీట్ పైనే ఐదేళ్ల పాటు సూర్య జైల్లో మ్రగ్గిపోతాడు. అయితే ప్రతీ దానికి ఓ టైమ్ వస్తుంది. జూ.లాయిర్ ఆద్య (వరలక్ష్మీ శరత్ కుమార్) ఈ కేసును టేకప్ చేస్తుంది. ఎక్కడెక్కడి లా పాయింట్స్ ని లాగి, సాక్ష్యాలను సంపాదించి సూర్యని నిర్థోషిగా బయటకు తీసుకువస్తుంది. అలా జైలు నుంచి వచ్చిన సూర్య తన పర్శనల్ జీవితం పూర్తిగా కోల్పోయానని అర్దం చేసుకుంటాడు. అందుకు కారణమైన వాళ్లపై యుద్దం ప్రకటిస్తాడు. అసలు తనని కేసులో ఇరికించిందెవరు అనే విషయంపై ఆరా తీస్తాడు..ఆ క్రమంలో అనేక నిజాలు బయిటకు వస్తాయి.అవేమిటి..అసలు ఆద్య ఎవరు..ఆమె సూర్యం కేసుని టేకప్ చేయటానికి కారణం ఏమిటి..చివరకు సూర్యం పోరాటం ఎలా ముగిసింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రిప్టు ఎనాలసిస్…
చేయని మర్డర్ కేసులో జైల్లో ఇరుకున్న హీరో .. ఓ లాయర్ సహాయంతో ఎలా బయటపడ్డాడు అనేది పెద్ద స్టోరీ లైన్ ఏమీ కాదు. కానీ దాన్ని తెరపై గ్రిప్పింగ్ గా చెప్పటమే అసలైన ఫీట్. ఆ విషయంలో డైరక్టర్ చాలా వరకూ సక్సెస్ సాధించాడనే చెప్పాలి. అందుకు స్క్రిప్టు సహకరించింది. అయితే ఫస్టాఫ్ వరకూ మంచి స్పీడుగా పరుగెట్టిన ఈ సినిమా..సెకండాఫ్ లో డ్రాప్ అవటం మొదలవుతుంది. అందుకు కారణం సీరియస్ గా ఎక్కడా రిలీఫ్ ఇవ్వకుండా నడిచే కోర్ట్ డ్రామా ఓ కారణం అయితే..మనం ఎక్సపెక్ట్ చేసే రొటీన్ సీన్స్ మరింతగా కారణమయ్యాయి. నరేష్ కు ఈ తరహా సినిమా కొత్తగానీ తెరకు మాత్రం కాదు. గతంలో ఇదే దర్శకుడు గురువు అయిన హరీష్ శంకర్ కూడా తొలి చిత్రం షాక్ కు కూడా ఇలాంటి కథాంశమే ఎంచుకోవటం యాధృచ్చికం అనాలా లేక సెంటిమెంట్ అనాలా. ఇక స్క్రిప్టులో లీగల్ అంశాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. డైరక్టర్, రైటర్ కలిసి రీసెర్చ్ బాగా చేసారనిపించింది. అయితే అవి చూసే జనాల బుర్రల్లోకి ఏ మోతాదులో ఎక్కిస్తున్నామో కూడా చూసుకోవాలి. ఆ విషయంలో కాస్త అతి అనిపించిందనే చెప్పాలి. ఎంతలా అంటే ఓ టైమ్ లో ఈ సీన్స్ ఇంక అవ్వవా అని విసుగు వచ్చేటంత. అలాగే ఇలాంటి సీరియస్ కథకి అనవసరంగా కామెడీ జోడించి బోర్ కొట్టించలేదనేది ఓ రకంగా మెచ్చుకోదగ్గ అంశం. అయితే అల్లరి నరేష్ మీద కాకుండా వేరే వాళ్ల మీద అయినా కాస్తంత రిలీఫ్ ప్లాన్ చేయచ్చు. అదీ చెయ్యకపోవటంతో మరీ డార్క్ మూడ్ అనిపించింది. డార్క్ థ్రిల్లర్ కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీసినట్లున్నారు.
నరేష్ ఎలా చేసారు.
ఇక ఈ సినిమా కు కమర్షియల్ గా వర్కవుట్ అయినా కాకపోయినా నరేష్ కి ఇది కం బ్యాక్ మూవీ అనే చెప్పాలి. నరేష్ నటన సినిమాని నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్ళిందనటంలో సందేహం లేదు. ముఖ్యంగా జైల్లో నరేష్ నటనను చూస్తే మెచ్చుకోకుండా ఉండలేం.. ఇక హీరోయిన్ పాత్రకి అంతగా స్కోప్ లేదు. లాయర్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ దుమ్ము రేపింది. అల్లరి నరేష్ ఫాదర్ గా చేసిన దేవీ ప్రసాద్, ఫ్రెండ్ పాత్రలో ప్రవీణ్ లు కూడా ఎమోషనల్ గా మెప్పించారు. ఓపెనింగ్ సీన్ లో ప్రియదర్శి కాసిన్ని నవ్వులు తెప్పిస్తాడు. విలన్ పాత్రలో హరీష్ ఉత్తమన్ చాలా బాగా చేశాడు.
టెక్నికల్ గా..
డైరెక్టర్ విజయ్ కనకమెడల స్క్రీన్ ప్లే లో ఇంటెన్సిటీ తగ్గి ఉండచ్చు కానీ తన సినిమాకే ఇలాంటి కథను ఎంచుకుని, నడిపించిన విధానం మాత్రం మెచ్చుకోదగినదే. అలాగే ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ చాలా బలంగా ఉంది. అల్లరి నరేష్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ , చేయని తప్పుకు అల్లరినరేష్ జైలులో కుమిలిపోయే సీన్లు దర్శకుడు ఎంతో బాగా తెరకెక్కించాడు. మొదటి సినిమానే అయినా ఎక్సపీరియన్స్ ఉన్న దర్శకుడు ఆయనలో కనిపించాడు. అన్ని క్రాఫ్ట్ లను చక్కగా డీల్ చేసి, అదిరిపోయే అవుట్ పుట్ తీసుకున్నాడు. అలాగే కథకు తగ్గట్లుగా రియలిస్టి గ్ విజువల్స్ ఉండేలా చూసుకున్నారు. అద్బుతం అనలేం కానీ మంచి మ్యూజిక్ అందించాడు శ్రీ చరణ్ పాకాల. పాటలు సినిమాలో ఫరవాలేనిపిస్తాయి, అంతకు మించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని చూసే ఆడియన్స్ హృదయాలకి మరింత దగ్గర చేసింది. బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. చోట కే ప్రసాద్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ ఉన్నంత టైట్ గా, ఎంగేజ్ గా సెకండాఫ్ లో లేదు. అబ్బూరి రవి డైలాగ్స్ ఫెరఫెక్ట్గ్ ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ..అల్లరి నరేష్ సినిమాకు రెగ్యులర్ సినిమాలాగ లేవు..బాగా రిచ్ గా ఉన్నాయి.
చూడచ్చా
నరేష్ నుంచి ఏదో కామెడీ సినిమా చూద్దాం అనుకునే వారిని తీవ్రంగా నిరాశపరుస్తుంది. మిగతావాళ్లు ట్రై చేయచ్చు.
తెర ముందు..వెనక
సంస్థ: ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్;
నటీనటులు: అల్లరి నరేశ్, వరలక్ష్మి శరత్‌కుమార్, ప్రియదర్శి, హరీశ్ ఉత్తమన్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల;
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్;
సినిమాటోగ్రఫీ: సిధ్;
పాటలు: చైతన్య ప్రసాద్, శ్రీమణి;
కళ: బ‌్రహ్మ కడలి;
మాటలు: అబ్బూరి రవి,
కథ: తూమ్ వెంకట్,
నిర్మాత: సతీశ్ వేగేశ్న;
దర్శకత్వం: విజయ్ కనకమేడల;
రన్ టైమ్ : 2 గంటల 26 నిమిషాలు
విడుదల: 19-02-2021