నాగార్జున అక్కినేని మీడియా సమావేశం
బంగార్రాజు సినిమాలో నాగ చైతన్యను చూసి సర్ ప్రైజ్ అవుతారు : నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా అక్కినేని నాగార్జున మీడియాతో ముచ్చటించారు.
చిన్న బంగార్రాజుతో ఈ సంక్రాంతికి వస్తున్నాం. సోగ్గాడేలో యూత్ బంగార్రాజుని మిస్ అయ్యాం. నాగచైతన్య ఎంట్రీతో యూత్‌ఫుల్ ఎనర్జీ ఎంట్రీ కూడా వచ్చినట్టు అయింది.
సోగ్గాడే చాలా బాగా ఆడింది. అందరూ సినిమాను అంగీకరించారు. అది మకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆ సినిమా నచ్చిన వాళ్లు బంగార్రాజును చూడాలని అనుకుంటారు. అయితే ఆ సినిమా కంటే బాగుండాలి. అన్నింటి కంటే ఎక్కువగా నాగ చైతన్య రావడంతో మరింత బాధ్యత పెరిగింది. సంక్రాంతికి పండుగలాంటి సినిమా ఇస్తున్నామని ప్రేక్షకులకు మాటిచ్చాం. అది ఇంకా పెద్ద బాధ్యత.
మన తెలుగు సినిమాల్లో బ్లడ్ రిలేషన్ సినిమాలు ఎక్కువగా వర్కవుట్ అవుతుంటాయి. నేను, నాన్నగారితో చేసిన సినిమాలు వర్కవుట్ అయ్యాయి. అది కమర్షియల్ ఫార్మూలా. ఆ ఫార్మాట్లోనే సినిమా చేద్దామని కళ్యాణ్ కృష్ణ అన్నాడు. కథ తీసుకురా చేద్దామని అన్నాను. అక్కడే లేట్ అయింది. ఆ తరువాత కరోనా వచ్చింది.
పంచెకట్టు ధరించినప్పుడల్లా నాన్న గారు గుర్తుకు వచ్చేవారు. మనం సినిమాను వేరే ఆర్టిస్ట్‌లను పెట్టి తీస్తే వర్కవుట్ అయ్యేది కాదు. నాన్న గారు లేకపోయినా, నేను లేకపోయినా, చై లేకపోయినా వర్కవుట్ అవ్వకపోయేది. హిందీలో చాలా మంది ఈ సినిమాను తీద్దామని అనుకున్నారు. కానీ మా కాంబినేషన్ వల్లే సినిమా వర్కవుట్ అయిందని తెలుసుకున్నారు. విక్రమ్ కూడా ట్రై చేశాడు. కానీ వర్కవుట్ అవ్వలేదు. బంగార్రాజు కూడా అంతే.
సీక్వెల్ ఉంటుందని సోగ్గాడు తీయలేదు. ఇప్పుడు ఈ బంగార్రాజు తీశాం. బంగార్రాజు సినిమాను ఆడనివ్వండి. ఓ వారం తరువాత అన్నీ నిర్ణయిద్దాం.
ఇష్క్ సినిమాను చూసి మ్యూజిక్ నచ్చి మనం సినిమాకు ఓకే చేశాం. మాకు అనూప్ ఎంతో స్పెషల్. టైం ఇస్తాడు. టైం తీసుకుంటాడు. అన్నపూర్ణలో ఫ్యామిలీలా ఉంటాడు. ఇది బాగా లేదంటే ఫీల్ అవ్వడు. కళ్యాణ్‌కి అతనికి బాగా సెట్ అయింది. నేను చెప్పకముందే అనూప్ పేరుని కళ్యాణ్ చెప్పాడు. సోగ్గాడే కంటే మంచి మ్యూజిక్‌ను ఇచ్చాడు. మనం సినిమా మ్యూజిక్ నచ్చి అప్పుడు కూడా మ్యూజికల్ నైట్ చేశాం.
నా బాడీ లాంగ్వేజ్ కోసం సోగ్గాడే సినిమాను చూడమని చైకి సలహా ఇచ్చాను. సీనియర్ బంగార్రాజు ఆత్మ లోపలకి ఎంట్రీ అయ్యాక బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్ మారుతుంది. దాని కోసం చై డైలాగ్స్ అన్నీ కూడా నేను రికార్డ్ చేసి ఇచ్చేవాడిని. వాటిని చూసుకుంటూ చై ఫాలో అయ్యాడు. అయితే నాకంటే ఆ యాస మీద కళ్యాణ్‌కు ఎక్కువ పట్టుంది. అంతా ఆయనే చూసుకున్నాడు.
ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అల్లరి అల్లుడు వంటి సినిమాలతో ఊరి వాతావరణంలో సినిమాలు బాగా నచ్చాయి. మొత్తం ఓపెన్ అయి నటించొచ్చు. ఆ పాత్రల్లో ఓ పొగరబోతుదనం ఉంటుంది. ఆ భాష నాకు చాలా ఇష్టం.
రమ్యకృష్ణది నాది గోల్డెన్ కాంబినేషన్. మాకు ఒకరి గురించి ఇంకొకరికి తెలుసు. మా కెమీస్ట్రీ బాగుంటుంది. రమ్యతో పని చేయడం ఎంతో సరదాగా ఉంటుంది. సెట్లో అంతా నవ్వుతూనే ఉంటాం.
ఆగస్ట్ 25న ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాం. ఆ రోజు యూనిట్ అందరికీ చెప్పాను. సంక్రాంతికి మనం సినిమాను విడుదల చేయాలి. లేదంటే వచ్చే సంక్రాంతికి రావాల్సి ఉంటుంది. కావాలంటే సినిమాను ఇప్పుడు ఆపేద్దామని అన్నాను. మేం అంతా ఉన్నాం చేద్దామని యూనిట్ అంతా కూడా కష్టపడింది.
కళ్యాణ్ కృష్ణ రైటింగ్ అద్బుతంగా ఉంటుంది. ఆయన రాసిన పాట కూడా ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది. ఆయనతో పని చేయడం నాకు ఇష్టం. ఏదైనా బాగా లేదంటే మళ్లీ రాసుకొస్తాడు. సోగ్గాడే తరువాత ఈ కారెక్టర్ల మీద మంచి పట్టు వచ్చింది. బంగార్రాజు సినిమా అంటే ఆయనకు చాలా ఇష్టం. అతనితో పని చేయడం ఎంతో కంఫర్ట్‌గా ఉంటుంది.
దాన్ని పాటలు పాడటం అనకండి. అదేదో పద్యాలు చదివినట్టు ఉంటుంది. (నవ్వులు). అనూప్, కళ్యాణ్ ఇద్దరూ ముందే కుట్ర చేశారు. లైన్ పాడేందుకు పిలిచారు. తరువాత పాట కూడా పాడమన్నారు. అందరికీ వినిపిస్తే పర్లేదు బాగానే ఉందని అన్నారు.
ఈ సంక్రాంతికి పట్టుపట్టి వచ్చాం. ఈ చిత్రం బాగా ఆడుతుందని, మంచి నంబర్స్ వస్తాయని నమ్మకంగా ఉంది.
బంగార్రాజు సినిమాలో నాగ చైతన్యను చూసి సర్ ప్రైజ్ అవుతారు. లవ్ స్టోరీ, మజిలీ చిత్రాలు చేశాడు. ఇప్పుడు ఇందులో ఉన్నది నాగ చైతన్యనేనా? అని ఆశ్చర్యపోతారు. ఈ సినిమా విషయంలో ముందు నుంచి కూడా చై అనుమానంగానే ఉన్నాడు. నన్ను నమ్ము అని చెప్పాను. ఇప్పుడు అదొక బాధ్యతగా మారింది. చైతూ రూరల్ బ్యాక్ డ్రాప్లో చేసిన మొదటి సినిమా ఇదే.
బంగార్రాజు కారెక్టర్లో సరసం ఉంటుంది. సరసమంటేనే బంగార్రాజుకు ఇష్టం. తాత పోలికలు కొడుక్కంటే ఎక్కువగా మనవడికి వస్తాయంటారు. ఆ పాయింట్ పట్టుకునే బంగార్రాజుని చేశాం.
నాన్న గారు రొమాంటికా? నేను రొమాంటికా? అని అంటే.. ఎవరి కాలంలో వాళ్లు రొమాంటిక్ (నవ్వులు)
మన్మథుడు అనే సినిమా అంత క్లాసిక్ హిట్ అవ్వడం వల్ల ఆ పేరు వచ్చింది. మన్మథుడు సినిమాలో అతనికి ఆడవాళ్లంటేనే ఇష్టం ఉండదు. ఇంట్లో ఆడ చెట్టును కూడా పెట్టుకోడు. అఖిల్, నాగ చైతన్యలో నెక్ట్స్ మన్మథుడు ఎవరంటే నేనేం చెప్పలేను. (నవ్వులు)
ఏప్రిల్ ఏడు, ఎనిమిది తేదీల్లో రేట్ల తగ్గింపు జీవో వచ్చింది. ఇదీ పరిస్థితి అని నాకు అర్థమైంది. ఇది హిట్ అయితే ఇంత వస్తుంది. అని లెక్కలు వేసుకున్నాం. ఈ రేట్లకు బంగార్రాజు సినిమా వర్కవుట్ అవుతుంది. ఎప్పుడో స్టార్ట్ చేసిన సినిమాకు వర్కవుట్ కాదు. మొన్న చెప్పింది కూడా అదే. బంగార్రాజు సినిమాకు సమస్య లేదు. రేట్లు పెరిగితే మాకు బోనస్. లేకపోతే మేం సేఫ్. ఒక వేళ ఆడకపోతే ఏ సినిమా కూడా సేఫ్ కాదు. రేట్లు పెరిగితే మాకు కూడా మంచిదే. డబ్బులు వస్తాయి. రేట్ల కోసం సినిమాలను విడుదల చేయకుండా కూర్చుంటే ఎలా. ఇప్పటికే రెండేళ్లున్నాం. నాకు బిగ్ బాస్ ఉంది కాబట్టి మధ్యలో పని దొరికింది.
సంక్రాంతి పండుగ అంటే అందరూ ఊర్లకు వెళ్తారు. హైద్రాబాద్ రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. పండుగ అంటే అందరూ వెళ్తారు. అది ప్రభుత్వం రియలైజ్ అయింది.
కరోనా ఎంత ఫాస్ట్‌గా విస్తరిస్తుందో అంతే ఫాస్ట్‌గా తగ్గుతోందని అంటున్నారు. డాక్టర్లు కూడా బయటకు వచ్చి అదే చెబుతున్నారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ వర్క్ అంతా అన్నపూర్ణలోనే జరిగింది. కాబట్టి మా వాళ్లు నేర్చుకున్నారు. ఆ సినిమాలకు చేసినంత వీఎఫ్ఎక్స్ మాకు అవసరం పడలేదు కానీ బాగా చేశారు.
ఒక్క మనిసి కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదు. కర్ఫ్యూ వాయిదా వేయడమేనది ఏపీ ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం. పండుగ కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కూడా ఆంక్షలు ఇంకా పెట్టలేదు. మహారాష్ట్రలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడటంతో ఆంక్షలు సడలించారు. ఇలాంటివి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి.
ఆత్మకు ఎక్కువ శక్తి ఉంటుందని అంటారు కదా? నాగచైతన్యలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ చేంజ్ కనిపిస్తుంది. కథను బాగా అర్థం చేసుకుని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ కంపోజ్ చేశారు. కథలో భాగంగా వచ్చిన ఫైట్స్లానే ఉంటాయి.
భారతీయ ప్రజలందరికీ ఆత్మలుంటాయనే నమ్మకాలుంటాయి. ఉన్నాయో లేవో నాకు తెలియదు. కానీ ఎవరైనా కథలు చెబుతుంటే వినేవాడిని. రాత్రి నిద్ర పట్టేది కాదు. ఈ కథ చెప్పినప్పుడు కూడా నాకు అదే నచ్చింది. అది వర్కవుట్ అయింది.
ఇంట్లో ఏమైనా బాగా లేదని అనుకుంటే.. నాన్నగారు చూసుకుంటారులే అని అందరం ఫ్రీగా ఉంటాం. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అదే అనుకుంటారు. ఎందుకంత ఆలోచిస్తున్నారు.. నాన్న గారు చూసుకుంటారులే అని మా పెద్దన్నయ్య అంటుంటారు.
ఇందులో రాము పాత్ర ఉంటుంది. అమెరికాలో ఉంటుంది. కొడుకుతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు.
నేను సినిమా అంతా ఉంటాను. కానీ తెరపై కనిపించేది మాత్రం నాగ చైతన్య. ఆత్మలా లోపలకి వెళ్లినప్పుడు నన్ను చూపించలేరు కదా?. అందుకే ఎక్కువగా చైతూనే కనిపిస్తాడు.
ఇద్దరికి కలిపి ఏడుగురు హీరోయిన్లు (నవ్వులు). స్వర్గంలో నాకు ముగ్గురుంటారు.
ప్రొడక్షన్ పరంగా ఈ సినిమా సక్సెస్ క్రెడిట్‌ను నేను తీసుకుంటాను. యాక్టింగ్ పరంగా నాగ చైతన్యకు వస్తుంది. నాగ చైతన్య ట్రాన్స్ఫర్మేషన్ అందరూ చూస్తారు. అద్భుతంగా నటించాడు. లవ్ స్టోరీలో మొన్నే చూశారు కదా? మాస్ కమర్షియల్ సినిమాను నాగ చైతన్య ఇంత బాగా చేయగలడా? అని అందరూ అనుకుంటారు.
కృతి శెట్టి చక్కగా తెలుగు నేర్చుకుంది. తెలుగులో మాట్లాడుతుంది. ఆమెలో నాకు నచ్చింది అదే విషయం. సెట్లో తెలుగులోనే మాట్లాడుతుంది. హిందీ, ఇంగ్లీష్, తులు అన్ని భాషలు వచ్చినా కూడా తెలుగులోనే మాట్లాడుంది. ఎప్పుడు ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. సెట్‌కి టైంకి వస్తుంది. సర్పంచ్ నాగలక్ష్మీ పాత్రలా ఉండదు. బయట ఆమె క్లాస్‌గా ఉంటుంది. కృతి శెట్టి ఈ సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది.
సీఎం జగన్‌తో మీటింగ్ గురించి చిరంజీవి గారు చెప్పారు. ఫోన్లో మాట్లాడాం. ఎవరేం చేసినా సినిమా ఇండస్ట్రీ గురించే కదా. వెళ్లండి అని చెప్పాను. సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండటం వల్ల నేను వెళ్లలేకపోయాను. వారం క్రితమే అపాయింట్మెంట్ తీసుకున్నాను అని చిరంజీవి గారు చెప్పారు.