నిను వీడని నీడను నేనే మూవీ రివ్యూ
హాలీవుడ్ పాయింట్ నే.. (‘నిను వీడని నీడను నేనే’ రివ్యూ)
Rating:2/5.
అది 2013… హైదరాబాద్ కూకట్ పల్లిలో నివసించే భార్యాభర్తలు రిషి (సందీప్ కిషన్), దియా (అన్యా సింగ్) లు ఓ వింత సమస్యను ఎదుర్కొంటారు. వాళ్లు ఒక రాత్రి కారులో ప్రయాణం చేస్తూ చేస్తున్న శృంగార చేష్టలు అదుపు తప్పి, కారుకూడా అదుపు తప్పుతుంది. దాంతో పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలోంచి బయటపడి ఆ దగ్గరలో ఉన్న స్మశానంలో ప్రవేశిస్తారు. అక్కడో శవం కాలుతూంటుంది. భయపడిన వాళ్లు ఎలాగో అక్కడ్నుంచి ఇంటికొచ్చేస్తే అసలు ట్విస్ట్ పడుతుంది. ఇంటికొచ్చి అద్దంలో చూసుకుంటే వేరే ముఖాలు కనబడతాయి. రిషి ముఖం కాకుండా అర్జున్ (వెన్నెల కిషోర్) మొహం, దియా అద్దంలో చూసుకుంటే మాధవి మొహం కన్పిస్తాయి. అంతేకాదు వాట్సాప్, ఫేస్ బుక్ లలో కూడా వాళ్ళ ఫోటోలు మారిపోతాయి. ఇదంతా చూసి వాళ్లు భయపడి, ఆ పై కంగారుపడ్డ పారాసైకాలజిస్టు (మురళీ శర్మ)ని కలుస్తారు. అలాగే ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీస్ ఇన్స్ పెక్టర్ (పోసాని) సైతం రంగంలోకి దిగుతాడు. ఆ క్రమంలో ఓ భయంకరమై నిజం బయిటపడుతుంది… రిషి – దియాలలో వున్నది అర్జున్, మాధవిలు కాదు. అర్జున్ – మాధవిల్లోనే రిషీ – దియాలున్నారని! ఇబ్బంది పెడుతున్నారని. ఇదెలా జరిగింది? ఈ మిస్టరీ ఏమిటనేదే మిగతా కథ.
హాలీవుడ్ కాపీనే ట్విస్ట్ ఇచ్చింది
వాస్తవానికి ఈ స్టోరీ లైన్ కొత్తదేమీ కాదు.. హాలీవుడ్ లో వచ్చిన మనోజ్ నైట్ శ్యామలన్ తీసిన ‘సిక్స్త్ సెన్స్’ (1999)అనే సూపర్ హిట్ చిత్రం నుంచి లేపి తయారు చేసుకున్నదే. అయితే అక్కడ నుంచి కేవలం మెయిన్ పాయింట్ ని లేపి, కథను తయారు చేయటం మెదలెట్టారు. కాకపోతే ఈ కాపీ వంటకం సరిగ్గా తయారు కాలేదు. అక్కడ క్లైమాక్స్ లో పెట్టుకున్న ట్విస్ట్ ని ఇక్కడ ఇంటర్వెల్ కే పెట్టడం తో సకెండాఫ్ సంగతి ఏం చేయాలో అర్దం కాని పరిస్దితికి చేరింది. అప్పటివరకూ ఫస్టాఫ్ ని జస్టిఫై చేయటం దర్శక,రచయితల వల్ల కాలేదు. దాంతో నావెల్టీగా ఉన్న ఈ కథ కాస్తా సెకండాఫ్ కు వచ్చేసరికి విసిగించటం మొదలెట్టింది. క్లైమాక్స్ కు అంతకు మించిన ట్విస్ట్ ఇవ్వాల్సి ఉన్నా వాళ్ల వల్ల కాలేదు.
అలాగే పోసాని కృష్ణమురళి పోలీస్ పవర్ గురించి చెప్పే ఎపిసోడ్ కు సినిమాకు సింక్ కాదు. అలాగే సినిమా మూడ్ ని కిల్ చేసే చాలా ఎలిమెంట్స్ సినిమాలో పెట్టుకున్నారు. త్రి గేమ్స్ ఎపిడోస్, ఓవర్ గా డ్రమటైజ్ చేసిన సాంగ్ క్లైమాక్స్ లో రావటం విరక్తి పుట్టిస్తాయి. ఇంతోటి కథకు 2013, 2035 అంటూ రెండు వేర్వేరు కాలాలు ఎందుకు పెట్టారో వాళ్లకే తెలియాలి. ఏ టైమ్ లో ఆ కథ జరిగినా, చెప్పినా పెద్దగా తేడా లేదు. రైటర్ ఎంత అజాగ్రత్తగా ఉంటాడంటే 2013లో జరిగే కథలోపోసాని 2016లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలో పాట పాడుతూంటాడు.
టెక్నికల్ గా ..
కథ ఎత్తుగడను సరిగ్గా రాసుకున్న దర్శకుడు అందుకు అవసరమైన మిస్టరీ నేపధ్యాన్ని మాత్రం కథకు కట్టబట్టలేకపోయారు. అలాగే ఇలాంటి కథలలో ఇమడని కామెడీని బలవంతంగా ఇరికించాడు. ఇక ఇలాంటి సినిమాకు ప్లస్ గా ఉండే నేపధ్య సంగీతాన్ని తమన్ అందించారు. పి కే వర్మ సినిమాటోగ్రపీ కూడా బాగుంది. మరీ ముఖ్యంగా డార్క్ లో ఇంటీరియర్ లొకేషన్ లో తెరకెక్కిన సీన్స్ బాగా రిచ్ గా వచ్చాయి. ప్రవీణ్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. పోసాని,మురళి శర్మల సీన్స్ కొన్ని లేపేస్తే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా లేవు కానీ ఫరవాలేదు.
చూడచ్చా
థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఓ లుక్కేయవచ్చు
తెర వెనుక..ముందు
నటీనటులు: సందీప్‌కిషన్, అన్యాసింగ్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి తదితరులు
సంగీతం: ఎస్.ఎస్. తమన్
ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
కళ: విదేష్
నిర్మాతలు: దయా పన్నెం సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్ రాజు