నిర్మాత అనిల్ సుంకర ఇంటర్వ్యూ
చిరంజీవి గారితో జర్నీ మెమరబుల్. భోళా శంకర్ మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. బ్రదర్ సిస్టర్ ఎమోషన్ యూనివర్సల్ గా అందరికీ కనెక్ట్ అవుతుంది: నిర్మాత అనిల్ సుంకర
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పాటలు, ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత అనిల్ సుంకర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
చిరంజీవి గారితో సినిమా చేయడం అనేది ఎవరికైనా ఒక కల.. ఆ కల ఇంత త్వరగా నెరవేరుతుందని ఊహించారా ? భోళా శంకర్ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది ?
ఊహించలేదు. కానీ ఇప్పుడది నెరవేరుతోంది. నేను వచ్చేటప్పటికే చిరంజీవి గారు రాజకీయాల్లో వున్నారు. అలాంటప్పుడు సినిమా అనే ఆలోచన రాదు. సరిలేరు నీకెవ్వరు సినిమా వేడుక కోసం చిరంజీవి గారిని ఆహ్వానించడానికి వెళ్లాం. ఆయన్ని తొలిసారి కలిసింది అప్పుడే. సరదాగా మాట్లాడుతూ మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నానండీ ఫైనల్ గా కలిశాను అని అన్నాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు. కలవడం ఏంటండీ? సినిమా చేస్తున్నాం అన్నారు. నా దగ్గర వేదాళం కన్నడ రైట్స్ వున్నాయి. రమేష్ గారు సరిలేరు నీకెవ్వరు గుంటూరు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ సమయంలో రోజూ కలసి చిరంజీవి గారికి వేదాళం ఐతే ఎలా వుంటుందని మాట్లడేవాళ్ళం. అలా ఈ సినిమా జర్నీ మొదలైయింది.
చాలా మంది స్టార్స్ తో సినిమాలు చేశారు కదా.. చిరంజీవి గారితో చేయడం ఎలా అనిపించింది ?
చిరంజీవి గారి అనుభవం మా అందరికీ కలిసొస్తుంది. ఆయన చాలా చురుగ్గా వుంటారు. మనతో మాట్లాడుతూనే .. సడన్ గా షాట్ రెడీ అయ్యిందని వాళ్ళు రాకముందే తెలుసుకొని వెళ్ళిపోతారు. అటు వైపు ఎప్పుడు చూశారా ? అని ఆశ్చర్యపోవడం మనవంతౌతుంది. ఆయన సమయపాలన అద్భుతం.
వేదాళం రీమేక్ ఎఎం రత్నం గారు చేద్దామని అనుకున్నారు కదా.. ?
ఎఎం రత్నం గారు నాకు బాగా క్లోజ్. వేరే వాళ్లకి ఐతే ఇచ్చేవాళ్ళు కాదేమో. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో గొప్పగొప్ప సినిమాలు తీశారు. ఆయన్ని కలవడమే ఒక మంచి అనుభవం. మా మధ్య మంచి అనుబంధం వుంది. వేదాళం మొదట హిందీలో చేయాలని అనుకున్నాను. ఐతే ఇప్పుడు ఆయనే చేస్తున్నారు. కన్నడలో ఓ స్టార్ హీరోతో చేద్దామని సన్నాహాలు చేస్తుండగా ఈలోగా చిరంజీవి గారు డేట్స్ ఇవ్వడంతో కన్నడని పోస్ట్ పోన్ చేసి భోళా శంకర్ చేశాం.
చిరంజీవి గారి తో సినిమా చేస్తున్నపుడు యునిక్ సబ్జెక్ట్ కాకుండా రీమేక్ చేయడానికి కారణం ?
భోళా శంకర్ సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం. ఈ సబ్జెక్ట్ వలనే మాకు చిరంజీవి గారి డేట్స్ వచ్చాయి.
చిరంజీవి గారు ఈ సినిమా చేయడానికి మూలకారణం ?
మెహర్ రమేష్ గారు. ఆయనకి కూడా ఈ సబ్జెక్ట్ చాలా ఇష్టం. రెండేళ్ళ క్రితమే ఈ సబ్జెక్ట్ చిరంజీవి గారితో చెప్పారట. చిరంజీవి గారికి చాలా నచ్చింది.
వర్కింగ్ డేస్ తక్కువ అయినప్పటికీ .. ఈ సినిమా పూర్తి కావడానికి చాలా కాలం పట్టింది కదా ?
కోవిడ్ ఒక కారణం. అలాగే చిరంజీవి గారి వేరే సినిమాలు కూడా జరిగాయి కదా.
దర్శకుడు మెహర్ రమేష్ గారికి చాలా విరామం వచ్చింది కదా.. దాని ప్రభావం ఈ సినిమాపై ఉంటుందా ?
అలా ఏం వుండదండీ. పాత, కొత్త ఎఫెక్ట్ లు వుండవు. ప్రజంట్ సినిమా ఎలా వచ్చిందనేది ముఖ్యం. నాకూ సామజవరగమన కి ముందు సినిమా ఇవ్వగానే ఒక ఎఫెక్ట్ వుండేది. ప్రతి సినిమా డిఫరెంట్. దేనికదే ప్రత్యేకం.
మీ సినిమాలకు అనుకున్న బడ్జెట్ కంటే దాదాపు నలభై శాతం ఎక్కువౌతుంది కారణం ఏమిటి ?
నా ఒక్కరిదే కాదండీ..అన్ని సినిమాల బడ్జెట్ లు ఎక్కువౌతున్నాయి. పదేళ్ళ ముందుకి ఇప్పటికీ అన్నీ పెరిగాయి. పదేళ్ళ నాటి కారు పేమెంట్ల , బత్తాలకి ఇప్పటికి చాలా తేడాలు వచ్చాయి. నాకు సినిమాపై పూర్తి అవగాహన వుంటుంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. నేను తగ్గించడానికే ప్రయత్నిస్తా. కానీ మనం అనుకున్నంత తేలిక కాదు. చాలా రకాలు వుంటాయి. అప్పటికి ఇప్పటికీ రెవెన్యూ స్ట్రీమ్స్ కూడా పెరిగాయి. దానికి తగ్గట్లు ఖర్చులు వుంటాయి.
నిర్మాతల గురించి చిరంజీవి గారు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. సెట్ లో బడ్జెట్ కంట్రోల్ పై సలహాలు సూచనలు ఇచ్చేవారా ?
ఆయన కంట్రోల్ చేయమని చెబుతారు. ఎక్కువౌతుందని ఒక్క మాట చెబితే ఆయన చాలా బాగా ఇన్వాల్వ్ అయి ఎలా తగ్గించాలనేది చూస్తారు. బడ్జెట్ కంట్రోల్ విషయంలో ఆయనకి వున్న క్లారిటీ ఎవరికీ లేదు.
ఓపెనింగ్స్ విషయంలో ఎలా అనిపిస్తుంది ?
మేము అనుకున్న ఓపెనింగ్స్ వస్తాయి. భోళా శంకర్ మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అవుట్ పుట్ పై చిరంజీవి గారు, మేము చాలా హ్యాపీ గా వున్నాం. ఖచ్చితంగా వర్క్ అవుట్ అవుతుంది. ఆల్రెడీ వర్క్ అవుట్ అయిన ఫీలింగ్ వుంది. బ్రదర్ సిస్టర్ ఎమోషన్ యూనివర్సల్. అందరికీ కనెక్ట్ అవుతుంది.
కీర్తి సురేష్ గారిని సిస్టర్ పాత్రలో తీసుకోవడానికి కారణం?
సిస్టర్ పాత్రలో కీర్తి సురేష్ వుండాలని ముందే నిర్ణయించుకున్నాం. నేను ,మెహర్ రమేష్ చెన్నై లో కీర్తి సురేష్ గారి ఇంటికి వెళ్లి ఫైనలైజ్ చేసుకున్నాం. నా కెరీర్ లో ఒకరి దగ్గరికి వెళ్లి డేట్స్ తీసుకోవడం ఇదే తొలిసారి. ఎందుకంటే ఈ పాత్రకు ఆమె అంత ముఖ్యం. నేను సినిమా చూసిన తర్వాత.. చిరంజీవి గారు, కీర్తి సురేష్ గారి మధ్య బాండింగ్ జీవితంలో మర్చిపోలేనిదిగా నిలిచిపోయింది. కీర్తిని తప్పితే మరొకరిని ఆ పాత్రలో ఊహించలేను.
భోళా శంకర్ మ్యూజిక్ మహతి సాగర్ కి ఇవ్వడానికి కారణం ?
మహతి ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. పెద్ద స్టార్ సినిమా ఇస్తేనే నెక్స్ట్ లెవల్ కి వెళ్తారు. తమన్ కి కూడా పెద్ద సినిమా దూకుడు. కొత్తవాళ్ళు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఎదిగితే ఇండస్ట్రీ కి కూడా మంచి పరిణామం. మహతి చాలా మంచి పాటలు ఇచ్చాడు. రీరికార్డింగ్ కూడా అద్భుతంగా చేశాడు.
షూటింగ్ గ్యాప్ లో చిరంజీవి గారితో ఎలా గడిపేవారు ?
మహేష్ బాబు గారితో సినిమా షూట్ చేసేటప్పుడు నేను ప్రతిరోజు సెట్ లో వుంటాను. నాకు ,మహేష్ కి మధ్య ఆ బాండింగ్ వుంటుంది. మిగతా సినిమా షూటింగులకు నేను ఉండను. భోళా శంకర్ చేసేటప్పుడు ఒక హీరోగా చెబుతున్న. ప్రతిరోజు మీరు సెట్ లో వుండాలి. నిర్మాత సెట్ లో వుంటే చిరంజీవి గారు చాలా ఆనందపడతారు అని మహేష్ చెప్పారు. 120 వర్కింగ్ డేస్ లో దాదాపు 40 రోజులు చింజీవి గారితో వున్నాను. ఇది చాలా మెమరబుల్ జర్నీ. ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకున్నా. ఒక్క రోజు కూడా వృధా కాదు. చాలా ఎంజాయ్ చేశాను.
మొదటిసారి నిర్మాతల్లో మీ పేరు వేసుకున్నారు ?
14 రీల్స్ లో తీసే సినిమాలకి నా పేరు వుంటుంది. కానీ ఎ కె ఎంటర్ టైన్మెంట్స్ సినిమాల్లో నిర్మాతగా ఎప్పుడూ మా నాన్నగారి పేరు(రామబ్రహ్మం సుంకర) వుంటుంది. కానీ ఈ సినిమాలో నా పేరు వుండాలని రమేష్ గారు పట్టుపట్టారు. దీంతో నా పేరు కో ప్రొడ్యూసర్ గా వేశాం. (నవ్వుతూ)
14 రీల్స్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి ?
బెల్లంకొండ శ్రీనివాస్ గారి తో ఓ సినిమా చేస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
థాంక్స్