Reading Time: 3 mins
 
 
నిర్మాత రామారెడ్డి ఇంట‌ర్వ్యూ
 
 
సినిమాలపై ప్యాషన్‌తో గ్రామీణ నేపథ్యం నుండి తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చిన నిర్మాతలు కొందరు ఉన్నారు. ఘనవిజయాలు అందుకున్నారు. ఈ బాటలో వస్తున్న నిర్మాత ’88’ రామారెడ్డి. యువ హీరో కార్తికేయ గుమ్మకొండతో ఆయన ‘రాజా విక్రమార్క’ సినిమా నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆయనకు తొలి చిత్రమిది. ఈ శుక్రవారం (ఆగస్టు 20న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ’88’ రామారెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఇవీ…
 
 
 
హ్యాపీ బర్త్‌డే రామారెడ్డిగారు!
 
థాంక్యూ అండీ. థాంక్యూ! తొలిసారి మీడియా మిత్రుల ముందుకు రావడం సంతోషంగా ఉంది.  
 
మీది ఏ ఊరు, నేపథ్యం ఏమిటి?
 
మాది తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు మండలంలో గల కొంకుదురు గ్రామం. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డిగారిది మా ఊరే. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. 
 
వ్యాపారాల నుంచి సినిమాల్లోకి ఎలా వచ్చారు?
 
వినోద్ రెడ్డిగారు అని ఓ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. ఆయనది మా ఊరు. సుమారు రెండొందల సినిమాల వరకూ డిస్ట్రిబ్యూషన్ చేశారు. కొన్ని సినిమాలు సొంతంగా విడుదల చేశారు. వినోద్ రెడ్డి నాకు ఫ్రెండ్. ఆయన ద్వారా సినిమాల్లోకి వచ్చాను. నిర్మాతగా ‘రాజా విక్రమార్క’ నా తొలి సినిమా.
 
‘రాజా విక్రమార్క’ ఎలా మొదలైంది?
 
సినిమా నిర్మించాలని అనుకుంటున్నప్పుడు… వినోద్ రెడ్డి దగ్గరకు ‘రాజా విక్రమార్క’ కథ వచ్చింది. ఆయనతో పరిచయం ఉండటంతో మాటల మధ్యలో ఈ కథ గురించి చెప్పారు. నాకు బాగా నచ్చింది. సినిమా చేయాలని ఉందని చెప్పాను. తర్వాత ఆదిరెడ్డిగారితో కలిసి సినిమా స్టార్ట్ చేశాం. అలా వినోద్ రెడ్డి దగ్గర నుండి మా దగ్గరకు సినిమా వచ్చింది. 
 
సినిమా ఎలా ఉండబోతోంది?
 
ఇది యాక్షన్ ఎంటర్టైనర్. హీరో కార్తికేయ ఎన్ఐఏ అధికారిగా కనిపిస్తారు. సినిమాలో వినోదం, ప్రేమ కూడా ఉంటాయి. ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్టైనర్ ప్యాకేజ్. ’90 ఎంఎల్’ చేస్తున్నప్పుడు హీరోగారితో పరిచయం ఏర్పడింది. ఆ సినిమా తర్వాత చేయాలని అనుకున్నాం. ‘చావు కబురు చల్లగా’ తర్వాత వస్తే… బావుంటుందని, ఆ సినిమా తర్వాత మా షూటింగ్ స్టార్ట్ చేశాం. సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దర్శకుడు శ్రీ సరిపల్లి కాంప్రమైజ్ కాకుండా తీశాడు. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువపెట్టి మరీ తీశాం. ‘ఆర్ఎక్స్ 100’కు మించి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. ఆ విషయంలో నో డౌట్.
 
కార్తికేయతో మీ అసోసియేషన్ గురించి….
 
చాలా చాలా మంచోడు. ‘ఇలాంటోళ్లు ఉంటారా?’ అనుకున్నాను. నా అంచనాలను మించిపోయారు. అతని గురించి మరో మాట అవసరం లేదు. అంత మంచోడు. నంబర్ వన్ మనిషి.
 
‘రాజా విక్రమార్క’ చిత్రీకరణ పూర్తయింది. ప్రొడక్షన్ లో మీరు నేర్చుకున్నది ఏమిటి?
 
ప్రతిరోజూ సెట్స్ కు వెళ్లాను. దగ్గరుండి నిర్మాణ పనులు చూసుకున్నాను. ఒక్క సినిమాతో పది సినిమాలు తీసిన అనుభవం వచ్చింది. కరోనా వల్ల కొంత ఆలస్యమైంది. ఆ బాధ ఉంది. అయితే, సినిమా బాగా వచ్చిందని మా టీమ్ అంతా సంతోషం ఉన్నాం. మామూలుగా అయితే కరోనా వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవుడి దయ వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా హ్యాపీగా పూర్తయింది. 
 
సినిమా విడుదల ఎప్పుడు?
 
కరోనా పరిస్థితులు నియంత్రణలోకి వస్తే… అక్టోబర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నాం.  
 
హీరోల్లో ఎవరంటే మీకు ఇష్టం?
 
మెగాస్టార్ చిరంజీవిగారు అంటే ఇష్టం. మా సినిమాకు చిరంజీవిగారి టైటిల్ పెట్టాలని అనుకున్నాం. కథ ప్రకారం కుదిరింది కూడా! మా సినిమా ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవిగారిని పిలవాలని అనుకుంటున్నాం. సినిమాలో చిరంజీవిగారి అభిమానులు ఓ సర్‌ప్రైజ్ ఉంది. అదేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అభిమానులు అందరూ ఈలలు వేస్తూ గోల గోల చేసేలా ఉంటుంది.  
 
అభిమానిగా చిరంజీవిగారి సినిమాలు చాలా చూసి ఉంటారు. మీకు మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్?
 
చూసినవి ఉన్నాయి. చూద్దామని వెళ్లి టికెట్ దొరక్క థియేటర్ ముందు పడిగాపులు కాసిన అనుభవం ఉంది. అది ఎప్పటికీ మర్చిపోలేను. ‘ఇంద్ర’ సినిమా చూడాలని మా ఊరు కొంకుదురు నుండి సైకిల్ వేసుకుని మండపేట వెళ్లాను. (నవ్వుతూ) సైకిల్ పార్క్ చేసి టికెట్ తీసుకుందామని వెళ్లాను. నా దగ్గరకు వచ్చేసరికి కౌంటర్ క్లోజ్ చేసేశారు. అభిమానుల మధ్య తోపులాటలో నా చెప్పు పోయింది. ఎలాగైనా సినిమా చూడాలని థియేటర్ దగ్గర వెయిట్ చేసి నెక్స్ట్ షో చూసి ఊరెళ్లా. ఆ రోజుల్లో అభిమానులు పడిన తిప్పలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? లేవండి! థియేటర్లల దగ్గర కోలాహలం, అభిమానుల సందడి… ఆ రోజులు మళ్లీ రావాలి.
 
నిర్మాతల్లో ఎవరంటే ఇష్టం?
 
మూవీ మొఘల్ డి. రామానాయుడుగారు నాకు ఆదర్శం. ఆయనలా సినిమాలు నిర్మించాలి. 
 
మీ పేరు ముందు ’88’ అని ఉంటుంది. ఇంటిపేరులా ’88’ పెట్టుకోవడం వెనుక కారణం ఏమిటి?
 
డబుల్ ఎయిట్ అని పెట్టుకోవడం వెనుక గల కారణాన్ని ఓ నాలుగు సినిమాల తర్వాత చెబుతా. కొత్త కథలతో మంచి సినిమాలు తీయాలనేది నా లక్ష్యం. వరుసగా సినిమాలు నిర్మిస్తూ ఉంటాను. నెక్స్ట్ నిర్మించబోయే సినిమా పనులు మొదలుపెట్టాం.  
 
‘రాజా విక్రమార్క’ తర్వాత ఎవరితో సినిమా చేస్తున్నారు? ఎటువంటి సినిమా చేస్తున్నారు?
 
‘రాజా విక్రమార్క’ తర్వాత పది కథలు విన్నాను. అందులో రెండు నచ్చాయి. బౌండ్ స్క్రిప్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. హీరోలకు కథలు వినిపించాం. రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఏది ముందు ప్రారంభం అవుతుందనేది అన్నీ కుదిరిన తర్వాత వెల్లడిస్తా. నాకు యాక్షన్ ఎంటర్టైనర్స్, కమర్షియల్ సినిమాలతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టం.