Reading Time: 3 mins

పెంగ్విన్‌ మూవీ రివ్యూ

కీర్తి సురేష్ ‘పెంగ్విన్‌’ రివ్యూ

Rating:2/5

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, మిస్సింగ్ డ్రామా సినిమాలు ఓ వర్గానికి ఎప్పుడూ ఇంట్రస్టే. అయితే అవి ఎంత ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరిస్తారనే విషయంపై విజయం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ మిస్టరీ సినిమాల్లో ..మొదట మిస్టరీ సెటప్ ని సెట్ చేయటం, ఆ తర్వాత  మిస్ లీడ్ చేయటం, ఎందుకు జ‌రిగింది? ఎలా జ‌రిగింది? ఎవ‌రు చేశారు? వంటి ప్రశ్నలతో కథలో మిస్టరీని పీక్స్ కి తీసుకెళ్లి..ఎవరూ ఊహించని విధంగా ఆ ముడి విప్పి ఆశ్చర్యపరుస్తూంటారు. అయితే చాలా సినిమాలు కేవలం ముడి వేయటం దగ్గరే ఆగిపోతున్నాయి. ముడి విప్పే దగ్గర చాతుర్యం చూపక కూలబడుతున్నాయి. `పెంగ్విన్` ప్రారంభం నుంచి కూడా కూడా దర్శకుడు కొన్ని ముడులు వేస్తూ ముందుకు తీసుకెళ్తారు. వాటిని ఎలా ప్రధాన పాత్ర ఛేదిస్తుందనే విషయం సినిమాని ముందుకు తీసుకెళ్తుంది. ఆమె అన్వేషణకు అర్దం `పెంగ్విన్`లో దొరికిందా? చివరదాకా ఆ సస్పెన్స్ ని నిలబెట్టగలిగారా, ఆ సస్పెన్స్ ఏమిటి.. వంటి విషయాలు రివ్యూలో చూద్దాం .

స్టోరీ లైన్  

ఏడో నెల గర్బవతి అయిన రిథ‌మ్ (కీర్తి సురేష్‌) తన భర్తతో కలిసి హిల్ స్టేషన్ లో హ్యాపీగా జీవితం లాగిస్తూంటుంది. అయితే ఆమె జీవితంలో ఒకటే లోటు. తన కొడుకు అజయ్ (మాస్ట‌ర్ అద్వైత్‌) కిడ్నాప్ అయ్యాడు. చాప్లిన్ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎత్తుకుపోయాడు. ఎంత వెతికినా కనపడటం లేదు. అందరూ చనిపోయాడంటున్నారు. కానీ ఆమెకు తిరిగి వస్తాడనే నమ్మకం ఉంది. దాంతో ఆమె ఆపకుండా తన కొడుకు కోసం అన్వేషణ జరుపుతూనే ఉంది. ఈ క్రమంలో తన లాగా చాలా మంది తల్లులు తమ పిల్లలను కోల్పోయారని తెలుసుకుంటుంది. ఈ లోగా అనుకోని విధంగా ఓ రోజు అజయ్ తిరిగి వస్తాడు. దాంతో అసలు అజయ్ ని ఎవరు ఎత్తుకెళ్లారు. ఎందుకు తిరిగి వదిలారు. చాప్లిన్ ముసుగులో ఉన్న సైకో ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అజయ్ నోరు విప్పడు. కానీ పిచ్చి పిచ్చి బొమ్మలేస్తూంటాడు. అజయ్ ద్వారా ఈ కేసుని ఛేధించాలని పోలీస్ లు సైతం ప్రయత్నిస్తారు. కానీ ఫలితం శూన్యం. మరో ప్రక్క అజయ్ ని ఆ ఛాప్లిన్ ముసుకు వేసుకున్న వ్యక్తి వెంబడిస్తూనే ఉంటాడు. ఆ ముసుగు వెనక ఎవరున్నారో రిధమ్ ఎలా తెలుసుకుంటుంది. అజయ్ ..మాటా మంతి లేకుండా అలా ఎలా తయారయ్యాడు. అసలు ఈ పిల్లలు మాయం వెనక ఉన్న మతలబు ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ, స్క్రీన్ ప్లే విశ్లేషణ

ఇలాంటి మిస్టరీతో కూడిన ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌ల‌లో ప్ర‌ధాన స‌మ‌స్య‌…సినిమాలో ప్రధాన పాత్రతో పాటు ప్రేక్షకుడు కూడా ఆ సైకో కిల్లర్ ఎవ‌ర‌న్న‌ది గెస్ చేయ‌డం మొద‌లెడ‌తాడు. ఈ క్రమంలో ఈ పజిల్ విప్పే ప్రాసెస్ లో వచ్చే ఆన్సర్ ..త‌న ఆలోచ‌న‌ల‌కు ద‌గ్గ‌ర‌గానైనా ఉండాలి, లేదా తన ఊహ‌ని దాటి మైండ్ బ్లోయింగ్ అనిపించే కొత్త ట్విస్టైనా ఇవ్వాలి. ఈ సినిమాలో ఆ రెండింటి చోటు లేదు. ప్రేక్షకుడే ఈ సినిమా కన్నా చాలా చోట్ల ఇంటిలిజెంట్ గా ఊహించగలగుతాడు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కు కారణం అయితే చాలా సిల్లీగా ఉండి..అప్పటిదాకా చూసిన సినిమా ఎక్సపీరియన్స్ మొత్తం పేక మేడలా కూల్చేస్తుంది. ఫస్టాఫ్ ..కాస్త స్లోగా నడిచినా సెటప్ సరిగ్గా ఉండటం,కథలోకి స్పీడుగా రావటంతో పెద్దగా ఇబ్బంది అనిపించదు.

కానీ ద్వితీయార్థంలో సినిమాని వీలైనంత లాగ్ చేసుకుంటూ వెళ్లాడు ద‌ర్శ‌కుడు.  బిడ్డ కోసం ఓ త‌ల్లిప‌డే ఆరాటం అనే పాయింట్ కు కిడ్నాప్ డ్రామా,సైకో వంటివి కలిపేసి కిచిడీ చేసేసాడు. ఎవరు ఆ కిడ్నాప్ చేసారు అని అనుమానితుల లిస్టు పెరుగుతున్న కొద్ది.. వాస్తవానికి ఆ కిడ్నాపర్   ఎవ‌రో తెలుసుకోవాల‌న్న ఉత్సాహం, ఉత్సుక‌త ఏర్ప‌డ‌ాలి. కానీ ఇక్కడ అది రివర్స్ లో జరుగుతుంది. ఎప్పుడు ఈ సినిమా పూర్తవుతుందా అనిపిస్తుంది. ఇదంతా స్క్రీన్ ప్లే సరిగ్గా చేసుకోకపోవటం పోవటం వల్ల వచ్చిన సమస్య. ఫైనల్ గా కొండ‌ని త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టిన ఫీలింగ్ క‌లుగుతుంది. విషయం తెలిసిపోయాక, సైకో ఎవరో తేలిపోయాక క‌థ‌ని లాగ్ చేయ‌డానికి, ఆఖ‌రి ట్విస్టుని ఇంకాసేపు దాచ‌డానికి వాడుకున్నాడంతే. అలాగే ఇదంతా  ఎందుకు చేయాల్సివ‌చ్చింది? అని ఆలోచిస్తే మాత్రం కార‌ణం అంత బ‌లంగా అనిపించ‌లేదు.

నటీనటులు, మిగతా టెక్నీషన్స్

మహానటితోనే కీర్తి సురేష్ మంచి నటి అని మనకు తెలిసుకాబట్టి పెద్దగా ఈ సినిమాలో ఆమె నటనకు ఆశ్ఛర్యపోనక్కర్లేదు. అయితే ఇలాంటి పాత్ర ఇంత చిన్న వయస్సులో కీర్తి సురేష్ ఒప్పుకోవటమే షాకింగ్. మిగతా ఆర్టిస్ట్ లు తమిళం బ్యాచ్. వాళ్లు ఎంత నటించినా మనకు అతిగానే కనిపిస్తుంది. దానికి మనమేం చెయ్యలేం. కథ విషయంలోనే దర్శకుడు తడబడ్డాడు. కాబట్టి ఎంత డైరక్షన్ టాలెంట్ చూపించినా ఫలితం లేదు. ఇది మరో రాక్షసుడు సినిమా అవ్వదు. నిర్మాణ విలువల విషయానికి వస్తే…తక్కువ బడ్జెట్ లో మంచి టెక్నీషియన్స్ తో లాగేసిన సినిమా ఇది. కెమెరా వర్క్ మాత్రం సూపర్బ్. ఎడిటర్ గారు కొద్దిగా మొహమాటపడకుండా ఉంటే చూసేవారి టైమ్, ఓపిక సేవ్ అయ్యేవి. పాటలు బాగోలేదు. రీరికార్డింగ్ మాత్రం బాగుంది. అయినా ఇలాంటి సినిమాకు ఇలాంటి రీరికార్డింగే ఇస్తారు.

చూడచ్చా

కెమెరా వర్క్ బాగుంది. ఎలాగూ అమేజాన్ ప్రైమ్ లో మెంబర్ షిప్ ఉంది అనుకుంటే ధైర్యం చేయటంలో తప్పు లేదు.

తెర ముందు..వెనక

నటీనటులు: కీర్తిసురేశ్‌, ఆదిదేవ్‌, లింగ, మాస్టర్‌ అద్వైత్‌, నిత్య, హరిణి తదితరులు
సంగీతం: సంతోష్‌ నారాయణ్‌
సినిమాటోగ్రఫీ: కార్తిక్‌ పళని
ఎడిటింగ్‌: అనిల్‌ క్రిష్‌
నిర్మాత: కార్తీక్‌ సుబ్బరాజ్‌, కార్తికేయన్‌ సంతానం, సుధాన్‌ సుందరమ్‌, జయరామ్‌
రచన, దర్శకత్వం: ఈశ్వర్‌ కార్తీక్‌
బ్యానర్‌: స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌, ప్యాషన్‌ స్టూడియోస్‌
విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌