Reading Time: 3 mins

ఫలక్‌నుమాదాస్.. బెస్ట్ యాక్టర్ అవార్డు డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు: నాని

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `ఫ‌ల‌క్‌నుమా దాస్‌`. వాజ్ఞ్మ‌యి క్రియేష‌న్స్ క‌రాటే రాజు స‌మ‌ర్ప‌ణ‌లో విశ్వ‌క్ సేన్ సినిమాస్‌, టెర్ర‌నోవా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మీడియా 9 మ‌నోజ్‌కుమార్ కో ప్రొడ్యూస‌ర్‌. సెన్సార్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాలను  పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న విడుద‌ల అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్రయూనిట్ హైదరాబాద్‌లో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నేచురల్‌స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

ఈ సంద‌ర్భంగా నాని మాట్లాడుతూ.. ‘‘ఈ ఈవెంట్‌కు రావడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం. రెండోది.. నేను 10 ఏళ్ల యాక్టింగ్ తర్వాత కొత్త కథలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ‘వాల్‌పోస్టర్’ అనే ప్రొడక్షన్ సంస్థను స్థాపించాను. దాంట్లో నెక్ట్స్ ప్రొడక్షన్‌లో విశ్వక్ సేన్ చేయబోతున్నాడు. ఇక మూడోది.. అసలైనది.. నిన్నే ఫలక్‌నుమాదాస్ సినిమా నాకు చూపించారు. నేను సినిమా చూసి మాట్లాడుతున్నా. నాకు తెలిసి ఇప్పటి దాకా జరిగిన ఏ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కూడా చీఫ్ గెస్ట్ సినిమా చూసి వచ్చుండరు. నేను చూసొచ్చి మాట్లాడుతున్నా. సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించిన ఫీలింగ్ అయ్యో.. సత్యం థియేటర్ పడగొట్టకుండా ఉండాల్సింది అనిపించింది. ఈ సినిమా అమీర్‌పేట సత్యం థియేటర్‌లో చూసుంటే మంచి మజా వచ్చుండేది. పర్లేదు.. శ్రీరాములు అని పక్కన ఇంకో థియేటర్ ఉంది. అందులో చూద్దురుగానీ. 

సినిమా మొదలైన తర్వాత పది నిమిషాల వరకు ఇది ఏం సినిమా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. తర్వాత మీరు మూడ్‌లో వెళ్తారు. ఆ మూడ్‌లోకి వెళ్లాక సింగిల్ స్క్రీనా, క్యూబా, మల్టీఫ్లెక్సా అనే ఫరక్ ఉండదు. అంతా సింగిల్ స్క్రీనే అనిపిస్తుంది. ఒక ప్రివ్యూ థియేటర్‌లో అంతగా ఎంజాయ్ చేశాం. సో.. ఫలక్‌నుమాదాస్ రేపు మనందరికీ అమీర్‌పేట్, సనత్‌నగర్, బల్కంపేట్, సాటర్‌డే నైట్ సోనీదాబా అన్ని మెమరీస్‌ను గుర్తు చేస్తుంది. డెఫినెట్‌గా అందరూ కనెక్ట్ అవుతారు. సినిమా చూశాక పర్టికులర్‌గా అమీర్‌పేట్ కుర్రాలకు నేను చెప్పేదేంటో అర్థమవుతుంది. ఈ సినిమాలో చిన్న పిల్లలు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ఉత్తేజ్ గారు కూడా చాలాబాగా చేశారు. ప్రతిఒక్కరూ చాలాచాలా బాగా చేశారు. అన్నింటినీ మించిన పెర్ఫార్మెన్స్ .. ఈ సంవత్సరం బెస్ట్ యాక్టర్ అవార్డు డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు.. అది తరుణ్ భాస్కర్‌కి. నిజంగా.. తరుణ్ డైరెక్షన్ మానేయొచ్చు. యాక్టర్‌గా కంటిన్యూ చేస్తే డైరెక్టర్ కంటే 3 రెట్లు ఎక్కువ సంపాదించొచ్చు. సంవత్సరంలో ఒక్కరోజు కూడా బిజీగా ఉండవు. నా గ్యారెంటీ.

ఈ టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. ఎలాంటి లొకేషన్స్‌లో షూట్ చేశారో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అది ఎంత కష్టమో. ఇలాంటి ఒక క్వాలిటీ ప్రొడక్ట్‌ను బయటకు తీసుకొచ్చారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కొత్తగా వస్తున్న టెక్నీషిన్స్‌ను గానీ, యాక్టర్స్‌ను గానీ చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. మన తెలుగు సినిమా కూడా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లబోతోందని అనిపిస్తోంది. ఈ నెల 31న విడుదల అవుతున్న ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్.’’ అన్నారు.

హీరో, డైరెక్టర్ విశ్వక్ మాట్లాడుతూ.. ‘‘బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా సినిమాల్లోకి రావచ్చనే ధైర్యం వచ్చిందంటే అది నాని అన్న వల్లే. నేను ఫస్ట్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు అందరూ భయపెట్టారు. నాకు అందరూ చెప్పక ముందు తెలిసిన రియాలిటీ ఏమిటంటే.. సినిమా బాగాలేకపోతే వీడికి బలిసి డైరెక్షన్ చేసిండు. నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు.. అలా జరిగితే బ్యాక్ సర్దుకుని వెళ్లిపోవాలనుకున్నా. కానీ, అలాంటి సందర్భం బై మిస్టేక్ కూడా రాదని తెలిసే ఈ సినిమా తీశా. టీజర్‌కే బ్యాక్ ప్యాక్ చేసుకునే అవకాశం లేకుండా చేశారు. యూత్ బాగా ఆదరించారు. నా భాష డైరెక్టర్ భాషలా ఉండదు. అయినా నన్ను భరించి, అర్థం చేసుకుని వివేక్ సాగర్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. థియేటర్‌లో గూస్‌బంబ్స్ గ్యారెంటీ. సగం నా విజువల్ అయితే.. సగం ఆయన ఇచ్చిన మ్యూజిక్ వల్లే. ఇక తరుణ్ గురించి చెప్తే.. ఆ పాత్ర కోసం 2 నెలలు అడిగించుకున్నాడు. థ్యాంక్యూ తరుణ్.. రోల్‌ను చంపేశావ్. మా నాన్నకు కూడా నెరేషన్ ఇచ్చా. ఆయనకు నమ్మకం వచ్చి ఎంకరేజ్ చేశారు. అమ్మకు, అక్కకు కూడా థ్యాంక్స్. 31వ తేదీ థియేటర్‌‌లో కలుద్దాం.’’ అన్నారు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘నన్ను యాక్టర్‌ను చేసినందుకు విశ్వక్‌కు థ్యాంక్స్. నేను వద్దన్నా వినకుండా నన్ను బలవంతంగా లాక్కొచ్చి మరీ యాక్టర్‌ను చేశాడు. విశ్వక్ వల్ల నేను మానసికంగా, శారీరకంగా చాలా మార్చుకున్నా. విజయ్‌దేవరకొండకు, విశ్వక్‌కు మధ్య సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. సెట్‌ మీద అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌కు వస్తున్నాం. యాస, భాషను దాటి సినిమా వెళ్లాలి. సినిమాను ప్రేమిస్తాం.. ప్రేమిస్తూనే ఉంటాం.’’ అన్నారు.

సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వక్‌కు థ్యాంక్స్. మంచి లిరిక్స్ రాసిన గీత రచయితలకు ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నానికి థ్యాంక్స్.’’ అన్నారు.

నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ..‘‘ఇంతవరకు హైదరాబాద్‌లోని ఎవరూ చూడని 118 లొకేషన్స్‌లో ఈ సినిమా షూట్ చేశాం. విశ్వక్ సేన్ ఈ సినిమా కోసం ఒకటిన్నర సంవత్సరం నుంచి కష్టపడుతున్నాడు. అతనే డైలాగ్స్ రాసుకుని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలోని పంచ్ డైలాగ్‌లు అన్నీ నేచురల్‌గా ఉంటాయి. ఇది సినిమాటిక్‌గా ఉండదు.. సహజంగా ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో చూపించాం. ఈ సినిమాను హైదరాబాద్‌ వాళ్లే కాకుండా ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, రాయలసీమతో పాటు అన్ని ప్రాంతాల ప్రేక్షక దేవుళ్లు మా సినిమాను ఆదరించి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా.’’ అన్నారు.