బంగారు బుల్లోడు మూవీ రివ్యూ
‘బంగారు బుల్లోడు’ మూవీ రివ్యూ
Rating:2/5
గ్రామీణ బ్యాక్ లో గోల్డ్ సెక్షన్ లో పనిచేసే భవాని ప్రసాద్ (నరేష్) వయస్సు వచ్చినా పెళ్లి కాలేదు. అతనికే కాదు అతని అన్నలిద్దరు (సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను)కి పెళ్లి కాలేదు. అందుకు కారణం అమ్మవారి అనుగ్రహం లేకపోవటమే అని తాత (తణికెళ్ల భరణి) ఓ ప్లాష్ బ్యాక్ చెప్తాడు. అప్పట్లో తను ఆ ఊరికి కంసాలిగా వెలుగుతున్న రోజుల్లో అమ్మవారి విగ్రహానికి మెరుగు పెట్టడానికి తీసుకుంటాడు. అయితే తప్పని పరిస్దితుల్లో డబ్బు అత్యవసరమై తన దగ్గర ఉన్న అమ్మవారి నగలను అమ్మేస్తాడు. ఆ విషయం బయిటపడకుండా ఉండేందుకు గిల్ట్ నగలు పెడతాడు. గత పాతికేళ్లుగా అమ్మవారికి,తనకు తప్ప వేరే వారికి ఈ విషయం లీక్ కానివ్వడు. అయితే తన మనవడుకి ఈ విషయం తొలి సారి చెప్పి ఎలాగైనా సరే అమ్మవారికి నిజం నగలు చేయించాలని తన పాపాన్ని కడిగేసుకోవాలని చెప్తాడు. తాత మీద ప్రేమతో ఆ బాధ్యత ప్రసాద్ తీసుకుంటాడు. తాతయ్య కోసం అమ్మవారికి బంగారు నగలు చేయించడం కోసం ఓ ప్లాన్ వేస్తాడు. అదేంటి? ఆ ప్లాన్ అమలు చేసే ప్రాసెస్ లో ఎలాంటి తిప్పలు ఎదుర్కోవాల్సివచ్చింది? ఎలా ఆ సమస్య నుంచి ఆ కుటుంబం బయిటపడ్డారు అన్నదే మిగిలిన కథ.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్..
నరేష్ సినిమా అంటే కామెడీ ని ఎక్సపెక్ట్ చేస్తాం. అయితే ఆ కామెడీకు కాస్తంత కథ కూడా తోడు అయితే వర్కవుట్ అవుతుందని అతని గత హిట్స్ ప్రూవ్ చేసాయి. అయితే అతను ఆ విషయం మర్చిపోయి చాలా కాలంగా భాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతూ వస్తున్నాడు. కానీ ఈ సారి కాస్త విషయం ఉన్న కథనే ఎంచుకున్నాడు. స్టోరీ లైన్ గా ఇది మంచి ఫన్ రాగల క్రైమ్ కామెడీనే. అయితే స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోకపోవటంతో చీదేసింది. ప్రారంభంలో వచ్చే సీన్స్ లో కథ పరుగెట్టడంతో కుర్చీలో కూర్చోబెట్టగలిగాడు గానీ, అతుక్కుపోయేలా చేయలేకపోయాడు దర్శకుడు. ఇలాంటి కథల నుంచి ఆశించే వినోదం, థ్రిల్.. అంతంత మాత్రంగానే పండాయి. అయితే ప్రీ ఇంటర్వెల్ ముందు నగలు మాయం అవ్వడం, టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడం వరకూ డైరక్టర్ సక్సెస్ అయ్యాడు.దాంతో సెకండాఫ్ లో కథ ఇన్వెస్టిగేషన్ మూడ్ లోకి వెళ్తుందేమో ఆశ కలిగింది. అల్లరి నరేష్ లీడ్ తీసుకుని..ఆ నగలు దొంగని పట్టుకునే కార్యక్రమం పెట్టుకుంటాడేమో అనుకుంటాం. కానీ డైరక్టర్ కమ్ రైటర్ గిరి ఆ అవకాసం ఇవ్వడు. తనే కథలోకి దూరి,హీరోని ప్యాసివ్ క్యారక్టర్ చేసి, కథని ప్రక్కదారి పట్టించాడు. దాంతో సినిమా షెడ్డుకెళ్లిన ఫీలింగ్ కలిగింది.
ఇక సినిమాలో నవ్వించటానికి ఏమీ లేవా అంటే ప్రారంభంలో వచ్చే వెన్నెల కిషోర్ ఎపిసోడ్ కాస్త నవ్విస్తుంది. అంతకు మించి ఏమీ కనపడదు. నరేష్ నవ్వించటం మర్చిపోయాడేమో అని పెద్ద డౌట్ వచ్చేస్తుంది. How to Steal a Million(1966) గుర్తు చేసే ఈ సినిమా ఆ సినిమాని కాపీ కొట్టినా బాగుండేదనిపించటం లో వింతలేదు.
టెక్నికల్ గా…
కథే కాదు డైరక్షన్ కూడా అవుట్ డేటెడ్ గా అనిపించింది. ఈ కాలం డైరక్టర్స్ లో ఉండే స్టైల్ కానీ, ట్రెండీ లుక్ కానీ సినిమాలో ఎక్కడా కనపడదు. మిగతా డిపార్టమెంట్స్ కూడా అంతంత మాత్రమే. కెమెరా వర్క్ గొప్పగా ఉండదు. పాటలు నీరసంగా ఉంటాయి. ఎంతో బిల్డప్ ఇచ్చిన ‘స్వాతిలో ముత్యమంత..’ పాట రీమిక్స్ సైతం ఫెయిలైంది. ఎడిటర్ కూడా ఈ సినిమాకు అన్యాయం చేసారు. నిర్మాణ విలువలు సైతం నాశిరకంగా ఉన్నాయి.
ఇక నరేష్ లో ఆ పాత సినిమాల్లో ఉన్న కామెడీ టైమింగ్ మిస్సైంది. పోసాని బాగా చేసారు. హీరోయిన్ పూజ జావేరి మాత్రం అసలు గ్లామరే లేదు. పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, రాజేష్, పృథ్వి లాంటి తదితరులు ఉన్నా పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. సెకండాఫ్ లో గెటప్ శీను తో లేడీ గెటప్ వేయించి ఓ జబర్దస్త్ ట్రాక్ చేయించినా ఫలితం లేదు.
చూడచ్చా?
టీవిలోనో లేక ఓటీటిలోనో వచ్చేవరకూ వెయిట్ చేయటం బెస్ట్. నచ్చని సీన్స్ స్కిప్ చేసుకుంటూ చూడచ్చు.
తెర ముందు వెనుక…
సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: అల్లరి నరేష్,, పూజా ఝవేరి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, వెన్నెల కిషోర్, రాజేష్, పృథ్వీ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
రచన, దర్శకత్వం: గిరి పలిక
రన్ టైమ్: 2 గంటల 9 నిముషాలు.
విడుదల తేదీ: 23-01-2021