బడవ రాస్కెల్ ప్రీరిలీజ్ వేడుక
జావేద్ అక్తర్ మాటను ధనుంజయ్ బడవ రాస్కెల్‌తో నిజం చేశాడు – రామ్‌గోపాల్ వర్మ
భైరవగీత, మనుచరిత్ర, పుష్ప వంటి సినిమాల్లో నటించిన కన్నడ నటుడు ధనుంజయ్ తాజాగా తెలుగులో `బడవ రాస్కెల్`తో హీరోగా పరిచయం అవుతున్నాడు. అమృత అయ్యంగార్ నాయిక.
కన్నడలో విడుదలైన ఈ సినిమా యాభైరోజులుపైగా ఆడుతోంది. తెలుగులో ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈనెల 18న విడుదల చేస్తున్నారు. సావిత్రమ్మ అడవిస్వామి నిర్మించిన ఈ సినిమాకు గీతా శివరాజ్‌కుమార్ సమర్పకులు. శంకర్ గురు దర్శకత్వం వహించారు. వాసుకీ వైభవ్ సంగీతం సమకూర్చారు.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం రాత్రి దస్‌పల్లా హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా రామ్‌గోపాల్ వర్మ హాజరయ్యారు. ఇంకా దర్శకుడు వీరశంకర్, రాజ్ కందుకూరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ, యాంకర్ అన్నట్లు నేను తోపు, రౌడీ, గూండా కాదు. నేను రాస్కెల్‌ను కూడా. ఈ సినిమా టైటిల్ బడవ రాస్కెల్ అంటే ఏమిటని ధనుంజయ్‌ను అడిగాను. కన్నడలో పూర్ అని అర్థమని చెప్పాడు. ధనుంజయ్ తగరు సినిమా చూశాను. ఆ సినిమా సక్సెస్‌కు తను కూడా ఓ పిల్లర్. కానీ స్టార్ ఇమేజ్ వున్న చిత్రంలో ఎవరు ఎంత బాగా చేసినా క్రెడిట్ హీరోకే దక్కుతుంది. ఆ తర్వాత నేను భైరవగీత ధనుంజయ్‌తో చేశాను. నాతో ఓ మాట జావేద్ అక్తర్ చెబుతుండేవారు. మన విలువను అవతలివాడు గుర్తించడు. మనమే గుర్తించుకోవాలని అని అది ధనుంజయ్ నిజం చేశాడు. అదే అతనికి డబుల్ సక్సెస్. ధనుంజయ్ తగరు నుంచి పుష్ప వరకు తన పాత్రలలో వేరియేషన్ చూపించాడు. అమృత ఫెంటాస్టిక్‌గా వుంది. ట్రైలర్ బాగుంది. తారగారు పవర్‌ఫుల్ వాయిస్. మంచి నటి. ఆమెను తదుపరి సినిమాలో యాక్ట్ చేయిస్తాను అని తెలిపారు.
హీరో ధనుంజయ్ మాట్లాడుతూ, మా స్నేహితులంతా కలిసి చేసిన సినిమా ఇది. శంకర్ మంచి కథ చెప్పాడు. అది వినగానే బాగా కనెక్ట్ అయ్యాను. ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ వున్నాయి. అందరూ ఆస్తిమీద పెట్టుబడి పెడతారు. నేను టాలెంట్, నా డ్రీమ్‌పైనే పెట్టాను. కన్నడలో ప్రేక్షకులు నన్ను హీరోగా అంగీకరించారు. ఆ పవర్‌తో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. తెలుగులోకూడా మిడిల్‌క్లాస్ కథ అయిన బడవరాస్కెల్ నచ్చుతుంది. నన్ను తెలుగులో బైరవగీతతో వర్మగారు పరిచయం చేశారు. అందులో రాయలసీమ యాస రచయిత వంశీ వల్లే చెప్పగలిగాను. పుష్ప సినిమాలోనూ నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. నన్ను అన్ని భాషలవారికి తెలిసేలా చేసింది. అటువంటి సినిమా ఇచ్చిన సుకుమార్, అల్లు అర్జున్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాను ఓటీటీకంటే ముందు థియేటర్‌లో విడుదల చేద్దామని స్నేహితుడు రమణ ముందుకు తీసుకువచ్చాడు. ఇక నుంచి తెలుగులోకూడా నేను సినిమాలు చేస్తాను అని తెలిపారు.
నటుడు నాగభూషణ్ మాట్లాడుతూ, ఆహాలో హనీమూన్ అనే సినిమా చేశాను. బడవ రాస్కెల్ నా రెండో సినిమా. కన్నడలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని తెలిపారు.
రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత రిజ్వాన్ మాట్లాడుతూ, రామ్‌గోపాల్ వర్మను అందరూ ఇష్టపడతారు. ఆయన ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. వర్మ హీరోగా చేస్తే నేను నిర్మిస్తా. ధనుంజయ్ భైరవ గీత నుంచి తెలుసు. మంచి నటుడు. అలాగే దర్శకుడు గురుకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నా. తెలుగులో మా రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా విడుదల చేస్తున్నాం అని చెప్పారు.
నటి తార మాట్లాడుతూ, అన్ని భాషలు కలిపితేనే భారతదేశ చిత్ర రంగం అవుతుంది. ఇప్పుడు తెలుగు చిత్రరంగం గొప్పగా అనిపిస్తుంది. బాహుబలి, కెజి.ఎఫ్. రాబోయే ఆర్.ఆర్.ఆర్. పాన్ ఇండియా దాటి వరల్డ్‌కు వెళ్ళాయి. తెలుగు సినిమాలు కర్నాటకలో కూడా పెద్ద, చిన్న తేడాలేకుండా ఆడుతున్నాయి. రాస్కెల్ అనేది తిట్టు. అలా పెట్టిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఇక రామ్‌గోపాల్ వర్మ తను పెట్టే ఫ్రేమ్‌లు అద్భుతంగా వుంటాయి. వంశీ చక్కటి పాటలు రాశాడు. దర్శకుడు వీరశంకర్, రాజ్ కందుకూరి వంటివారు రావడం ఆనందంగా వుంది అని చెప్పారు.
కథానాయిక అమృత అయ్యంగార్ మాట్లాడుతూ, దర్శకుడు శంకర్ గురు, ధనుంజయ్ కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. కన్నడలో నాకు బిగ్ హిట్ ఇచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మిడిల్ క్లాస్ ఎమోషన్స్ అన్ని వున్నాయి. దీనికి అందరూ కనెక్ట్ అవుతారు. తెలుగులో ఈ సినిమాతో నేను పరిచయం కావడం ఆనందంగా వుంది అని తెలిపారు.
కెమెరా ఉమెన్ ప్రీత జయరామన్ మాట్లాడుతూ, దర్శకుడు శంకర్ సహజమైన కథను ఎంచుకున్నారు. యూనివర్సల్ మెసేజ్ ఇందులో వుంది అని తెలిపారు.