భైరవ గీత సినిమా రివ్యూ
చూసిన వారి తలరాత (‘భైరవ గీత’ రివ్యూ)
రేటింగ్ : 1.5
అనగనగా ఓ ప్రాంతాన్ని పైసాచికంగా పాలించే పెద్దాయన. ఆయన దగ్గర నమ్మకంగా పనిచేసే ఓ రాంబంటు. ఆ బంటుపై పనిలేని అమ్మాయిగారు అంటే పెద్దాయన కూతురు మనస్సు పడుతుంది. అంతే ఆ తర్వాత ఏమౌతుంది. మొత్తం ఆయన సైన్యం అంతా వచ్చి బంటుని విశ్వాసఘాతుకుడా అంటూ చీల్చి చెండాడే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు బంటు హీరో కాబట్టి ..తను బలవ్వకుండా తన ప్రేమకు ఆ పెద్దాయనని బలేస్తాడు. ఇది ఎన్నో భాషల్లో ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న సినిమా కథ. ఈ కథ ఎందుకనో ఈ మధ్యకాలంతో సినిమా తెరను వదిలేసింది. కానీ రామ్ గోపాల్ వర్మ ఆ మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసి మనకు అందించాలనుకున్నాడు అదే భైరవ గీత. ఆ పాత మాధుర్యం మనకు అందించాలన్న వర్మ ఆలోచన గొప్పగే కానీ దాన్ని అందిపుచ్చుకుని ఆనందించే ప్రేక్షకుడు ఈ రోజుల్లో ఉన్నాడా..రివ్యూ లో చూద్దాం.
కథేంటిరాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పెద సుబ్బా రెడ్డిగారు(బాల్రాజ్ వాడి) కు అనేక మంది అనుచరులు. ఆయన వాళ్లలో ఒకడు భైరవ(ధనంజయ). ఓ రోజు రెడ్డిగారి అమ్మాయి గీత(ఐరా మోర్) సిటీ నుంచి చదువు పూర్తి చేసుకుని వస్తుంది. పెళ్లి వయస్సు వచ్చిన ఆమెకు తన సాటి కేశవ రెడ్డి(భాస్కర్ మన్యం) కొడుకు కట్టారెడ్డి(విజయ్)కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు సుబ్బారెడ్డి. కట్టారెడ్డి తనను ఎదిరించిన వాళ్లను చంపటంలో వీళ్లందిరికంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివినవాడే. దాంతో గీత అలాంటివాడిని నేను పెళ్లి చేసుకోను అంటుంది. కానీ సుబ్బారెడ్డి ఒప్పుకోడు. ఈ లోగా సుబ్బారెడ్డి శతృవులు..గీత మీద ఎటాక్ చేస్తారు. అక్కడే ఉన్న భైరవ ..తన భాధ్యతలో భాగంగా ఆమెను రక్షించేస్తాడు. దాంతో అమాంతం ఆమె ప్రేమలో పడిపోతుంది. తన కాళ్ల దగ్గర పడుండే తక్కువ కులపోడు భైరవ తన అల్లుడు అవుతాడనే విషయం తట్టుకోలేకపోతాడు సుబ్బారెడ్డి. దాంతో భైరవని లేపేయమని పురమాయిస్తాడు. ఆ విషయం తెలిసిన భైరవ, గీత పారిపోతారు. వేట మొదలవుతుంది. భైరవ తప్పించుకుపోయాడని అతని ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని చంపేస్తారు. అప్పుడు అసలు ఈ బానిస వ్యవస్థే కదా మనుష్యుల మధ్య అంతరాలు సృష్టించిందని గ్రహించిన భైరవ తిరగబడతాడు..తిరుగుబాటు జెండా ఎగరేస్తాడు. ఈ క్రమంలో అనేక అవాంతరాలు, అనర్దాలు జరుగుతాయి. ఫైనల్ గా భైవర గెలిచాడా..తన ప్రేమను గెలిపించుకున్నాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎన్టీఆర్ నే కష్టం అన్నారు
సినిమా కథ అతి పురాతనమైనది కావటం,ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవటం ఈ సినిమా ప్రధాన మైనస్ లుగా చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఫ్యాక్షనిజం చూపెడితే జనం చూడటానికి ఇష్ట పడటం లేదు. ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ నటించిన అరవింద సమేత వంటి చిత్రాలే ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ అనగానే విమర్శలు వచ్చాయనే విషయం మర్చిపోకూడదు. ఆ రోజులు వెళ్లిపోయాయి. భగవత్ గీత గుర్తు చేసుకోవాల్సిందే
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే కొత్త దర్శకులకు భగవత్ గీత. అయితే ఆయన ఆ స్టేజ్ దాటిపోయి చాలా కాలం అయ్యిపోయింది. వరసగా వర్మ సినిమాలు వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. కానీ భైరవ గీత ట్రైలర్స్, పోస్టర్స్ తో కాస్తంత క్యూరియాసిటీ కలగచేసింది. దాంతో ఎంతో ఎక్సపెక్ట్ చేసి థియోటర్ కు వెళ్లినవారికి కురక్షేత్రం మధ్యలో నిలబడిన ఫీల్ వచ్చిన ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత మనం నిమిత్త మాత్రులం అని భగవత్ గీత వాక్యాలు గుర్తు చేసుకోవాల్సి వచ్చింది.
హైలెట్స్…మైనస్ లు
సినిమాలో హైలెట్స్ లో మొదటగా చేప్పుకోవాల్సింది కెమెరా వర్క్. ప్రతీ విజువల్ నీ ఎంతో చక్కగా చెక్కినట్లు డిజైన్ చేసారు. అయితే సినిమా సీన్స్ లో డెప్త్,ఎమోషన్ లేకపోవటం ఆ వర్క్ కు విలువలేకుండాపోయింది. ఇక ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేస్తే సెకండాఫ్ లో బోర్ తగ్గేది.
ఇక హీరోగా ధనుంజయ…తన పరిధి మేరకు బాగా నటించాడు. ప్రీ క్లైమాక్స్ లో సినిమాని అలా లేపిపట్టుకున్నాడు. అతను ఆ మాత్రం కూడా చెయ్యకపోతే సినిమాని చూడటం కష్టంగా మారేది. అలాగే సినిమా లో హింస ఎక్కువగా ఉంటే యూత్ ఎగబడి చూసేస్తారు. మాస్ జనం మూగేస్తారు అనే విషయం కన్నడ వరకూ నిజం అయ్యిండవచ్చు కానీ తెలుగుకు మాత్రం అది అబద్దమే అని మారిన తెలుగు సినిమా చెప్తోంది.
హీరోయిన్ గా చేసిన ఇర్రామోర్..ఇంకా మోర్ అనేటంత నటన లేదు కానీ..చాలా ఈజ్ తో సీన్స్ ని పండించింది. హీరోయిన్ తండ్రిగా చేసిన బాల్రాజ్ వాడి కూడా చాలా బాగా చేసారు.
చివరగా
వర్మ అభిమానులు సైతం ఈ సినిమాని చూడాలంటే అతి హింసను తట్టుకోగలగాలి. ఓ పదిహేను క్రితం తీసిన సినిమాని ఇప్పుడు రీమేక్ చేసారని ఫీల్ అవ్వాలి.
ఎవరెవరు..
తారాగణం : ధనుంజయ, ఇర్రా మోర్, బాల రాజ్వాడీ, విజయ్ రామ్ తదితరులు.సంగీతం : రవి శంకర్. దర్శకత్వం : సిద్ధార్థ్ తాతోలు. నిర్మాత : రామ్ గోపాల్ వర్మ