Reading Time: 3 mins
మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే వేడుక‌లు
 
 
శిల్ప‌క‌ళా వేదిక‌లో ఘ‌నంగా మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే వేడుక‌లు
 
మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే ఈవెంట్ నేటి సాయంత్రం హైద‌రాబాద్ శిల్ప‌క‌ళా వేదిక‌లో వేలాది మెగా ఫ్యాన్స్ స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. జ‌న‌సేనాని.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొన‌గా.. అల్లు అర‌వింద్, సాయి ధ‌ర‌మ్ తేజ్, క‌ళ్యాణ్ దేవ్, డా.కె.వెంక‌టేశ్వ‌ర‌రావు,  మెగాస్టార్ చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు స్వామినాయుడు, రాపాక వ‌ర‌ప్ర‌సాద్, అమెరికా ఎన్నారై.. మెగా బ్ల‌డ్ డ్రైవ్ నిర్వాహ‌కుడు న‌ట‌రాజ్,సురేష్ కొండేటి, కాస‌ర్ల శ్యామ్, గాయ‌ని మంగ్లీ త‌దిత‌రులు పాల్గొన్నారు. 
 
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ-“నేను మీలో ఒక‌డిగా వ‌చ్చాను ఇక్క‌డికి. నాకు జీవితంలో స్ఫూర్తి ప్ర‌ధాత అన్న‌య్య చిరంజీవి గారికి మ‌న‌స్ఫూర్తిగా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ఇది చాలా ప్ర‌త్యేక‌మైన సంవ‌త్స‌రం. ప్ర‌త్యేక‌మైన సందర్భ‌మిది. అన్న‌య్య అభిమానిగా అన్న‌య్య‌ను ఎలా చూడాల‌ని ఉవ్విళ్లూరానో అలాంటి సినిమా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. దేశం కోసం మ‌న నేల కోసం ఎంతో త్యాగం చేసిన స‌మ‌ర‌యోధుడి జీవితాన్ని సినిమాగా తీయ‌డం.. విభిన్న‌మైన క‌ళాకారులు వేరే భాష‌ల నుంచి వ‌చ్చిన వారు ఇందులో న‌టించారు. నాకు ఇద్ద‌రు ఇష్ట‌మైన వ్య‌క్తులు ఉన్నారు. ఒక‌రు అన్న‌య్య అయితే.. ఇంకొక‌రు అమితాబ్ బ‌చ్చ‌న్. వీళ్లిద్ద‌రూ నాకు జీవితంలో బ‌ల‌మైన స్ఫూర్తిప్ర‌దాత‌లు. అన్న‌య్య‌ను చూడ‌టానికి వెళ్లిన‌ప్పుడు అమితాబ్ గారిని క‌లిసే అరుదైన అవ‌కాశం ఈ సినిమా షూటింగ్ లో ల‌భించింది. 
 
క‌ర్నూలు – రేనాడు (రాయ‌ల‌సీమ న‌దీప‌రీవాహ‌క ప్రాంతం) క‌థ‌తో తెర‌కెక్కిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి సినిమాకి గొంతు ఇవ్వ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాని యాథృచ్ఛికంగా తీయ‌లేదు. క‌ర్నూలు- నందికొట్కూరు కొణిదెల గ్రామం అని సినిమా చేసేప్పుడు తెలిసింది. ఇది తెచ్చుకుంది కాదు.. వెతుక్కుంటూ వ‌చ్చిన సినిమా ఇది. అన్న‌య్య‌ను టైటిల్ పాత్ర‌ధారిని చేసింది. ఎవ‌రినో నిర్మాత‌లుగా పెట్టుకోలేదు. కొణిదెల ఇంటి పేరు పెట్టుకున్న రామ్ చ‌ర‌ణ్ నిర్మాత అయ్యారు. ఒక త‌మ్ముడిగా నేను ఇలాంటి సినిమా చేయ‌లేక‌పోయాను. ఇలాంటి గొప్ప సినిమా తీసే స‌మ‌ర్థ‌త నాకు లేక‌పోయింది. నా త‌మ్ముడి లాంటి రామ్ చ‌ర‌ణ్ .. 150వ సినిమా చేశాడు. ఇలాంటి సినిమా చేస్తే చిరంజీవి గారే చేయాలి అనేంత‌గా సైరా చిత్రాన్ని ఇప్పుడు తీస్తున్నారు. ఇలాంటి చిత్రం రామ్ చ‌ర‌ణే చేయాలి. ఎన్ని కోట్లు అయినా .. డ‌బ్బు వ‌స్తుందా లేదా? అన్న‌ది చూడ‌కుండా బ‌ల‌మైన సినిమా తీయాల‌ని అనుకున్నాను. ద‌ర్శ‌కులు సురేంద‌ర్ రెడ్డిగారి క‌ల ఇది. ఆయన క‌ల‌ను సాకారం చేసుకున్నారు. ఆయ‌న గ‌తంలో చేసిన సినిమాల‌న్నీ నాకు న‌చ్చిన‌వి. అలాంటి వ్య‌క్తి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా మ‌నంద‌రి అభిమాన స్టార్ చిరంజీవి గారు న‌టించిన చ‌క్క‌ని చిత్ర‌మిది. మ‌న దేశ చ‌రిత్ర‌ను ఎవ‌రో రాస్తే దాని గురించి మాట్లాడ‌తాం. భార‌త‌దేశం మ‌ర్చిపోయినా మ‌న తెలుగు వాళ్లం మ‌ర్చిపోలేదు. మ‌న కొణిదెల వంశం మ‌ర్చిపోలేదు. దేశం కోసం ఎంతో మంది చ‌నిపోయారు. దేశం గుర్తించ‌ని ఉయ్యాల‌వాడ చ‌రిత్ర‌ను కొణిదెల సంస్థ గుర్తించింది. ఇది గ‌ర్వ‌కార‌ణం. కొణిదెల నామ‌ధేయాన్ని సార్థ‌కం చేసుకున్నారు. నేను ఇందులో న‌టించ‌లేక‌పోయాను. కానీ గొంతు వినిపించాను. `సైరా-న‌ర‌సింహారెడ్డి` అని అన‌గ‌లిగానంటే నా గుండె లోతుల్లోంచి అభిమాని గా వ‌చ్చినది. అన్నా నువ్వు కొట్ట‌గ‌ల‌వు. అన్నా నీకు బానిస‌లం.. మేం.. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.. ర‌చ‌యిత‌లు .. నా త‌ల్లి వంటి వ‌దిన గారికి చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రికీ .. ప్ర‌త్యేకంగా అమితాబ్ బ‌చ్చ‌న్ గారికి మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాను“ అని అన్నారు. 
 
ఈ వేదిక‌ను పూర్తిగా ఫ్యాన్స్ ఈవెంట్ గా ప్లాన్ చేయ‌డ‌మే గాక కేవ‌లం అభిమానుల‌తో కొన్ని కార్య‌క్ర‌మాల్ని రూపొందించ‌డం ఆస‌క్తి ని క‌లిగించింది. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్పెష‌ల్ ఈవెంట్ కోసం అభిమానులు భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చాయి. దీంతో వేదిక వ‌ద్ద చిన్న‌పాటి ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఈ వేదిక‌పై మెగా డిస్ట్రిబ్యూట‌ర్లు స‌హా ప‌లువురు ప్ర‌ముఖుల్ని స‌త్క‌రించారు. ఔట్ స్టాండింగ్ బ్ల‌డ్ డోన‌ర్స్ వేణుకుమార్, మ‌హ‌ర్షి, ఉజ్వ‌ల్, శంక‌ర్ రెడ్డి, సి.నాయుడు, అనీల్ కుమార్, సంప‌త్ కుమార్, న‌ల్లా సూర్య ప్ర‌కాష్ త‌దిత‌ర అభిమానుల‌కు ప్ర‌త్యేకించి మెగాస్టార్ ముఖ‌చిత్రంతో కూడుకున్న మొమెంటోల‌ను అందించారు. ర‌క్త‌దానం, నేత్ర‌దానం వంటి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న ప్ర‌ముఖులు ఈ వేదిక వ‌ద్ద‌కు అటెండ‌య్యారు.
 
వేదిక వ‌ద్ద ఉన్న వేలాది అభిమానుల కోసం ప్ర‌త్యేకించి డ్యాన్సులు, పాట‌ల కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశారు. శ్రీ‌కృష్ణ అండ్ గాయ‌నీగాయ‌కుల టీమ్ చిరు క్లాసిక్ మెడ్లీ పాట‌ల‌తో మైమ‌రిపించారు. జ‌బ‌ర్థ‌స్త్ టీమ్ స‌ర‌దా పార్టిసిపేష‌న్ ఆక‌ట్టుకుంది. ముఠా మేస్త్రి ల్యాండ్ మార్క్ స్టెప్పుల‌తో జ‌బ‌ర్థ‌స్త్ క‌మెడియ‌న్లు ఆక‌ట్టుకున్నారు. స‌త్య మాస్టార్ మెడ్లీ డ్యాన్స్ పెర్ఫామెన్స్ మైమ‌రిపించింది. ఇక ఈ వేదిక‌పై నిర్మాత కం ఎగ్జిబిట‌ర్ పంపిణీదారుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ చేతుల‌మీదుగా 10వ త‌ర‌గ‌తిలో మంచి మార్కులు పొందిన విద్యార్థుల‌ను స‌న్మానించారు. ఇకపోతే ఈ వేదిక ఆద్యంతం `సైరా` ఎల్ఈడీ డిస్ ప్లే హైలైట్ గా నిలిచింది.  మెగా నిర్మాత‌ అల్లు అర‌వింద్ మాట్లాడుతూ-“లాంగ్ లివ్ చిరంజీవి గారు.. జై సైరా న‌ర‌సింహారెడ్డి“ అని అన్నారు. 
 
ఆత్మ‌హ‌త్య‌లు క‌ల‌చివేశాయి!- ప‌వ‌న్ క‌ల్యాణ్
 
ఈ వేదిక‌పై ప‌వ‌న్ మాట్లాడుతూ -“జీవితంలో న‌న్ను అన్న‌య్య మూడు సార్లు దారి త‌ప్ప‌కుండా కాపాడారు. అందుకే ఆయ‌న్ని స్ఫూర్తి ప్ర‌దాత అంటాను. నేను ఇంట‌ర్ ఫెయిలైన‌ప్పుడు నాకు అలాంటి నిరాశ నిస్పృహ క‌లిగింది. అన్న‌య్య ద‌గ్గ‌ర ఉన్న‌ లైసెన్డ్ పిస్టోల్ తో కాల్చుకుందామ‌నుకున్నాను. నా డిప్రెష‌న్ చూసి ఇంట్లోవాళ్లు అన్న‌య్య ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లారు. నువ్వు ముందు బ‌త‌కాలిరా బాబూ.. ఇంట‌ర్ పెద్ద విష‌యం కాదు. నువ్వు జాగ్ర‌త్త‌గా ఉండు! అన‌డం స్ఫూర్తి నింపింది ఆరోజు. అందుకే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ఇంట‌ర్ విద్యార్థుల్ని .. ఆ బిడ్డ‌ల్ని చూసి బాధ క‌లిగింది. రాజ‌కీయ నాయ‌కుల్ని త‌ప్పు ప‌ట్టొచ్చు. కానీ.. ఇంట్లో పెద్ద‌లు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్లు ఉండి ఉంటే బావుండేది అనిపించింది“ అని ప‌వ‌న్ ఎమోష‌న‌ల్ గా వ్యాఖ్యానించారు. చిన్న‌ప్పుడు భార‌త‌దేశాన్ని ఎవ‌రైనా ఏదైనా అంటే కోపంతో ఊగిపోయేవాడిని. దేశం స‌మాజం అంటే నాకు గొప్ప ప్రేమ‌. అయితే నా కోపాన్ని త‌గ్గించింది అన్న‌య్య‌నే. కులం మ‌తం ను మించి మాన‌వ‌త్వం అనేది ఒక‌టి ఉంటుంద‌ని న‌న్ను ఎక్స్ ట్రీమిటీకి వెళ్ల‌కుండా ఆపేశారు అన్న‌య్య‌. 22 వ‌య‌సులో తిరుప‌తికి వెళ్లిపోయాను. నిర్మాత‌ తిరుప‌తి ప్ర‌సాద్ గారిని క‌లిసి 5-6 నెల‌లు యోగాశ్ర‌మంలో ఉండిపోయాను. నేను ఆ దారిలోనే ఉండాల‌నుకున్నా. కానీ భ‌గవంతుడు అయ్యి వెళ్లిపోతే నువ్వు స్వ‌ర్థ ప‌రుడివి. ఇంట్లో బాధ్య‌తలు ఉంటే నువ్విలా చేయ‌వు!! అని అన్న‌య్య‌ అన్నారు. త‌ను క‌ష్ట‌ప‌డి న‌న్ను నిల‌బెట్టాడు అన్న‌య్య. అందుకే ఆయ‌న స్ఫూర్తి ప్ర‌ధాత‌. ఈ మూడు సంఘ‌ట‌న‌ల్లో దెబ్బ‌లు తిన్నా న‌న్ను నిల‌బెట్టారు… అని తెలిపారు.