‘మజిలీ’ సినిమా రివ్యూ
భావోద్వేగాల…`మజిలీ` (రివ్యూ)
రేటింగ్ : 3/5
భావోద్వేగాలను బేస్ చేసుకుని కథ చెప్పటం అనేది ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా మర్చిపోయింది. ఎంతసేపు కాసేపు నవ్వించి , నాలుగు యాక్షన్ సీన్స్ చూపించి అలరిద్దామనే ప్రయత్నాలు చేస్తోంది. జనం కూడా దానికి అలవాటు పడ్డారని చెప్పలేం కానీ, వచ్చిన వాటిల్లో బెస్ట్ చూసుకుని దానికి జై కొడుతున్నారు. ఇటువంటి పరిస్దితుల్లో సినిమా అంటే ఓ ఎమోషన్ అని భావిస్తూ సినిమా తీస్తే…ఆడుతుందా…ఆ..ఇదీ చిత్తూరు నాగయ్యగారి కాలం నాటి సినిమా అని పెదవి విరిచేస్తారా… నిజ జీవిత భార్యా భర్తలైన సమంత, నాగచైతన్యలను తెరపై అలాగే కనిపిస్తే ఆదరిస్తారా…ఈ చిత్రం కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం
కథేంటి…
పూర్ణ(నాగచైతన్య)కు క్రికెట్ అంటే ప్రాణం. పెద్ద క్రికెటర్ అవ్వాలని జీవితాశయం. అందుకు పూర్ణ కృషి చేస్తూంటే అతని జీవితంలోకి అన్షు(దివ్యాంశ) ఉప్పెనలా వస్తుంది. ప్రేమలో ముంచెత్తుతుంది. అయితే ఆమె తండ్రి నావెల్ ఆఫీసర్ (అతుల్ కులకర్ణి)కి ఇలాంటివి నచ్చవు. వేరే వాళ్లతో ముహూర్తం నిర్ణయిస్తాడు.మరో ప్రక్క కెరీర్ లో ముందుకు వెళ్లకుండా భూషణ్ (సుబ్బరాజు)అనే కార్పోరేటర్ అడ్డుపడతాడు. ఇటు ప్రేమ, అటు కెరీర్ రెండు విషయాల్లోనూ పోరాడాల్సిన పరిస్దితి. అయితే ఈ లోగా అన్షు మాయమైపోతుంది. ఆ తర్వాత చాలా కాలానికి తండ్రి మాటతో …పూర్ణ తన ఎదురింటి అమ్మాయి శ్రావణి (సమంత)ని పెళ్లి చేసుకుంటాడు.
పెళ్లైతే జరుగినా అతను మనసంతా అన్షుని ఉంటుంది. మరో ప్రక్క కెరీర్ కూడా లేకపోవటంతో తాగుడుకు బానిస అవుతాడు. ఈ క్రమంలో తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్న శ్రావణిని కూడా దూరం పెడతాడు. కానీ కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు కదా…వాళ్ల జీవితంలోకి మీరా అనే పాప ఎంటరవుతుంది. ఆ పాప వచ్చాక…పూర్ణ, శ్రావణిలు ఒకరికొకరు దగ్గర అవటం మొదలెడతారు. ఇంతకీ ఈ మీరా ఎవరు? అన్షు హఠాత్తుగా మిస్ అవటం వెనక జరిగిన కథేంటి…చివరకు పూర్ణ కెరీర్ లో సెటిల్ అవుతాడా..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ చట్రంలో కాకుండా ఫ్రెష్ గా ప్రక్కకు వచ్చి చూస్తే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే ప్రేమంటే ఇవ్వటమే అని దర్శకుడు చెప్పిన విధానం నచ్చుతుంది. అక్కడక్కడా స్లో అనిపించినా సమంత తన ఫెరఫార్మెన్స్ తో లాగేస్తుంది. ఫన్ కోసం ప్రత్యేకమైన స్లాట్,ఆర్టిస్ట్ లను తీసుకోకుండా సినిమాలో ఓ భాగంగా నడపటంలో దర్శకుడు పరిణితి కనిపిస్తుంది. నిన్ను కోరి వంటి హిట్ ని కూడా మరిపించే చిత్రం ఇది. యాక్షన్ పార్ట్ ని డీల్ చేయటం చాలా మంది చేయగలుగుతారు . కానీ ఎమోషన్స్ ని సరిగ్గా ప్రెజెంట్ చేయకపోతే బోర్ కొట్టి విసిగిస్తాయి. కానీ ఆ విషయంలో డైరక్టర్ వందకి వంద శాతం మార్కులు పొందుతాడు. కాకపోతే సెకండాఫ్ లో మీరా పాత్ర వచ్చాక కాస్త డ్రామా, ప్రీ క్లైమాక్సో లో మెలోడ్రామా ఎక్కువైందనిపిస్తుంది. అయితే మిగతాదంతా బాగున్నప్పుడు ఇది పెద్ద ఇబ్బంది గా అనిపించదు.
చైతూనా..సమంతనా
ప్రతీ సారి సమంతకే మార్కులు ఎక్కువ పడుతూంటాయి. కానీ ఈ సారి చైతూ కూడా తన భార్యతో సమానంగా పోటీ పడ్డారు. ఎక్కడా అతి లేకుండా సెటిల్ట్ గా ఫెరఫామ్ చేసాడు. కుర్రతనం, పరిణితి చెందిన తనం రెండూ వేర్వేరు కాలాల్లో చూపగలగటం గొప్ప విషయమే. అంటే నటనకు అవకాసం ఉన్న కథలు కూడా చైతుకు ఇక పట్టుకెళ్లచ్చు అనే ధైర్యాన్ని ఈ సినిమా ఇస్తుంది.
సాంకేతికంగా …
ఈ సినిమాలో డైలాగులు బాగా కుదిరాయ్.. స్క్రిప్టు లో మలుపులు చూసుకున్నారే కానీ అందుకోసం సినిమాటెక్ మార్పులు చేస్తున్నాం అని గమనించలేదు. సినిమాటోగ్రఫి టాప్ గా ఉంది. వైజాగ్ అందాలను అలవోకగా తెరపై పరిచింది. పాటలు పెద్ద గొప్పగా లేవు కానీ సినిమా లో సింక్ అయ్యాయి. రీరికార్డింగ్ తమన్ చేత చేయించటం ఎంత ప్లస్సో అర్దమవుతుంది. నిర్మాణ విలువలు కు వంక పెట్టేదేమీ లేదు.
చూడచ్చా
ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీస్ చూడచ్చు. ఆ సినిమాలో మనని మనం చూసుకోవచ్చు.
ఆఖరి మాట
నిజ జీవిత భార్యే…పూనుకుని చైత కెరీర్ ని నిలబెట్టిందనిపిస్తుంది.
తెర వెనక..ముందు
నటీనటులు: నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, రావు రమేశ్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి తదితరులు
కళ: సాహి సురేశ్
పోరాటాలు: వెంకట్
కూర్పు: ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం: విష్ణు శర్మ
సంగీతం: గోపీసుందర్
నేపథ్య సంగీతం: తమన్
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
రచన-దర్శకత్వం: శివ నిర్వాణ.
సంస్థ: షైన్ స్క్రీన్స్
విడుదల తేదీ: 5 ఏప్రిల్ 2019