మరక్కార్ మూవీ రివ్యూ
మోహన్ లాల్ ‘మరక్కార్-అరేబియా సముద్ర సింహం’ రివ్యూ
Emotional Engagement Emoji (EEE)
?
చరిత్ర తెరకెక్కటం ఎప్పుడూ ఇంట్రస్టింగ్ విషయమే. సాధారణంగా పాఠ్యపుస్తకాల నుండి చరిత్రను బోధిస్తారు. కొంతమంది మాత్రమే సినిమాలు, పెయింటింగ్స్, నవలలు మరియు ఇతర కళాకృతుల ద్వారా చరిత్రను బోధిస్తారు. ఎందుకంటే ముద్రిత సంకలనం కంటే వాటిలో తరచుగా ఎక్కువ నిజం ఉందనిపిస్తుంది. అద్బుతమైన సినిమాటోగ్రాఫర్లుతో కలిసి దర్శకులు తరచూ వాస్తవ సంఘటనల ఆధారంగా , దేశాలు, వ్యక్తుల ప్రస్దానాల గురించి సినిమాలను సృష్టిస్తారు .అటువంటి సినిమా చూడటం అంటే చరిత్రను ఒక వ్యక్తి యొక్క కోణం నుండి చూడటం. సినిమా యొక్క బహుముఖ ప్రజ్ఞ మనకు చరిత్రలోని అస్పష్టత ను దతొలిగించే ప్రయత్నం చేస్తుంది. ఈ చిత్రం విడుదలకు ముందే 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఈచిత్రం ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల అయ్యింది. ఇలాంటి సినిమా ఏ స్దాయిలో ఉంది, కథేంటి, మనవాళ్లకు నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
ఈ చిత్రం మహ్మద్ అలీ మరక్కర్ అలియాస్ కుంజాలి మరక్కర్ అనే అత్యంత వివాదాస్పద యోధుడు జీవన గమనం వివరిస్తుంది. 16 వ శతాబ్దంలో కొచ్చిన్‌పై పోర్చుగీసుల దాడికి వ్యతిరేకంగా సాగిన పోరాటానికి మరక్కార్లు వారి జీవితాల్నే అంకితం చేసారని చెప్తారు. పోర్చుగీసు సైన్యం …కుంజాలి కుటుంబం మొత్తాన్ని కళ్ల ముందే చంపేస్తారు. అప్పట్నుంచి కుంజలి మరక్కార్ పరారీలో ఉంటాడు. పగతో రగిలిపోతాడు. పోర్చుగీస్పై ప్రతీకారం తీర్చుకోవటం కోసం ఎదురుచూస్తూంటాడు. అదే సమయంలో కొచ్చిన్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోర్చుగీస్ సైన్యం ప్లాన్ చేస్తుంది. సముద్రంలో వాళ్లని అడ్డుకోవడం కోసం మరక్కార్ సరైన వ్యక్తని అప్పటి కొచ్చిన్ రాజు సమూతిరి (నెడుముడి వేణు) నమ్ముతాడు. అతన్ని తన సముద్ర సైన్యానికి లెఫ్టినెంట్‌గా నియమిస్తాడు. అన్నాళ్లూ దొంగగా ఉన్న కుంజాలి మరక్కార్ పోర్చుగీసు వారితో సముద్రంలో పోరాటం మొదలెడతాడు? అప్పుడు ఏమైంది..మరక్కర్ పగ తీర్చుకోగలిగాడా…పోరాటంలో అంతిమ గెలుపు ఎవరిది, ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర ఏమిటి వంటి విషయాలు మిగతా కథ.
ఎనాలసిస్..
స్వాతంత్రయానికి పూర్వం జరిగిన కథ ఇది. అప్పట్లో ప్రతీ ప్రాంతంలోనూ తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు ఉన్నారు. తెలుగు గడ్డకు వస్తే… సైరా నరసింహారెడ్డి లాగే అప్పటి మలయాళ గడ్డ మీద కుంజాలీ మరక్కార్ కూడా. కేరళలో ఆయన గురించి తెలిసినట్లు తెలుగులో ఎవరికీ తెలియదు. అందులోనూ చారిత్రిక పాత్రను యధాతథంగా తెరకెక్కించాల్సి వచ్చినప్పుడు కల్పన కొరవడటంతో కొంత డ్రామా తగ్గిపోతుంది. అదే ఈ సినిమాకి జరిగింది. కుంజాలి కథలో కొంత విషయం ఉన్నది అనేది నిజం. అయితే అది తెరపైకి ఎక్కాలంటే సరిపోలేదు. దాంతో దర్శకుడు కుంజాలీ కథపై ఎక్కువ దృష్టి పెట్ట కుండా మధ్యలో వచ్చివెళ్లే ఉప కథలపై ఫోకస్ చేశారు. దాని వల్ల సినిమాకు లెంగ్త్ పెరిగింది తప్ప సినిమాకు కథా పరంగా ఏ విధమైన ప్రయోజనం చేకూరలేదు. కుంజాలీ రాబిన్ హుడ్ అయ్యే ఎపిసోడ్, అలాగే ఉరితీసే సీన్స్ చాలావరకూ ‘సైరా’లోనూ చూసినట్టు ఉంటాయి. అలాగే భారీతనం ‘బాహుబలి’ చూసిన తర్వాత కామన్ అయ్యిపోయింది. అలాగని సినిమాలో ఆకట్టుకునే ఎలిమెంట్స్ లేవని కాదు. దర్శకుడు ప్రియదర్శన్ తన విజన్ తో భారీ కాన్వాస్ నే ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. అలాగే కథ లో రీసెర్చ్ అనేది కనపడదు. ఓ జానపద కథను చూస్తున్నట్లు అనిపిస్తుంది. 16 శతాబ్దం ఎక్కడా మనకు కనపడదు. ఆ టైమ్ లైన్ ఎక్కడా ఫాలోకాలేదు. సముద్ర నేపధ్యం ఉన్నా కథలో డెప్త్ లేక తేలిపోయింది. స్క్రీన్ ప్లే అసలు సెట్ కాలేదు. ఎంతసేపూ విజువల్ ఎఫెక్ట్ లు, ఫైట్స్, కాస్టూమ్స్ ఇవే హైలెట్ అవుతూంటాయి.
నటీనటులు…
మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషించినా ..ఆయన రెగ్యులర్ సినిమాల్లో కనిపించే ఆ జోష్ లేదు. ‘మన్యంపులి’లో కనిపించినంత హుషారు ఇందులో కనిపించదు. గంభీరంగా కనిపించే క్యారక్టరైజేషన్ ఆయనలోని నటుడుని తినేసింది. ఇక మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్, అతను ప్రియురాలి గా చేసిన ప్రియదర్శిని జోడీ ఆకట్టుకుంటుంది. సుహాసిని పాత్రను మొదట్లోనే చంపేసారు. అర్జున్, సునీల్ శెట్టి, అశోక్ సెల్వన్, మంజూ వారియర్ తదితరులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. కీర్తీ సురేష్ పాత్ర అలా పెద్ద ఇంప్రెసివ్ గా అనిపించదు.
టెక్నికల్ గా
దర్శకుడు ప్రియదర్శన్ స్లో నేరేషన్ చాలా ఇబ్బంది పెడుతుంది. స్క్రిప్టు కూడా పెద్దగా ట్విస్ట్ లు, టర్న్ లు లేకుండా సాగుతుంది. ఉన్న కొద్దిపాటి మలుపులు సగటు ప్రేక్షకుడు ఊహించేవచ్చు. అయితే టెక్నికల్ గా సినిమా నెక్ట్స్ లెవిల్ లో ఉంది. యుద్ధ నేపథ్యంలో వచ్చిన హాలీవుడ్ సినిమాల స్టాండర్డ్స్ లో తీసారు. ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్, కెమెరా వర్క్ అవుట్ స్టాండింగ్. కాస్ట్యూమ్స్ కు అవార్డు రావటం పెద్ద విషయం అనిపించదు. కొన్ని యాక్షన్ సీన్స్ డిజైన్ బావుంది. సముద్రంలో యుద్ధం, క్లైమాక్స్ లో వచ్చే యుద్ధం ఆకట్టుకుంటాయి. అయితే స్క్రిప్టు ఫెరఫెక్ట్ గా లేకపోతే ఏ డిపార్టమెంట్ ఎంత టాలెంట్ చూపించినా ప్రయోజనం ఉండదని ఈ సినిమా నిరూపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
బాగున్నవి
దర్శకత్వం
మోహన్ లాల్ నటన
బాగోలేనివి
ఎమోషన్ లేని ఎలివేషన్స్,బిల్డప్స్
సాగ తీతగా సాగిన స్క్రీన్ ప్లే
చూడచ్చా
చారిత్రిక నేపధ్యాలు కల సినిమాలు చూడటం ఆసక్తి ఉన్నవాళ్లకు ఆసక్తిగా అనిపిస్తుంది.
తెర వెనుక ముందు..
నటీనటులు: మోహన్‌లాల్, సుహాసిని, ప్రణవ్ మోహన్‌లాల్, కల్యాణి ప్రియదర్శన్, కీర్తిసురేష్, అర్జున్ సర్జా, సునీల్‌శెట్టి, మంజు వారియర్, నెడుముడి వేణు తదితరులు; స్క్రీన్‌ప్లే: ప్రియదర్శన్, అని శశి,
సంగీతం: రోనీ రాఫెల్;
నేపథ్య సంగీతం: రాహుల్ రాజ్, అంకిత్ సూరి, లైల్ ఎవ్‌నాస్ రోడర్;
ఛాయాగ్రహణం: తిరునావుక్కరసు;
కూర్పు: అయ్యప్పన్ నాయర్;
నిర్మాణం: ఆంటోనీ పెరంబవూర్;
దర్శకత్వం: ప్రియదర్శన్;
విడుదల: సురేష్ ప్రొడక్షన్స్;
రన్ టైమ్ :2h 55m
ఓటీటి:అమేజాన్ ప్రైమ్
విడుదల తేదీ: 17,డిసెంబర్ 2021