Reading Time: 2 mins

‘మ‌హ‌ర్షి’ సినిమా రివ్యూ

మ…హా …రి..షి (‘మ‌హ‌ర్షి’ రివ్యూ)

Rating:-3/5 

మారుతున్న తెలుగు సినిమా ఎమోషనల్ డ్రామాలతో ఆడియన్ ని ఆకట్టుకోవాలని చూస్తోంది. అందుకోసం సోషల్ ఇష్యూలు, పాత్రల సంఘర్షణ ప్రధానాంశాలుగా పెట్టుకుని కథలు వండుతోంది. అందుకు తగినట్లే హీరోలు సైతం తమ హీరోయిజాలకు కాస్తంత విరామం ఇచ్చి పాత్రల్లో ఒదిగిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కీలకమైన సమయంలో వచ్చిన చిత్రం మహర్షి. రైతులు సమస్యలు ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు సగటు ప్రేక్షకుడుని ఆకట్టుకుంటుంది.  మహేష్ బాబు తన 25 వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన ఈ సినిమాలో కథ అందుకు తగినట్లు ఉందా. హీరో నుంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారిన అల్లరి నరేష్ పాత్ర ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.  

కథ 

తన చిన్నప్పుడు చూసిన కొన్ని ఆర్దిక ఇబ్బదులతో డబ్బు సంపాదనే జీవితాశయం గా పెట్టుకుంటాడు  రిషి (మహేష్ బాబు). అందుకోసం నిరంతరం కృషి చేస్తూ అమెరికాలో ఆరిజన్ అనే కంపెనీకు సీఈఓ స్దాయికి ఎదుగుతాడు. అయితే ఓ రోజు తన కోసం తన కెరీర్ ని త్యాగం చేసినవాడు,  కాలేజీ మేట్, క్లోజ్ ఫ్రెండ్ రవి(అల్లరి నరేష్) ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుస్తోంది.  చలించిపోయిన రిషి ఇండియాకు వచ్చేసి రవిని వెతుక్కుంటూ అతని గ్రామానికి వస్తాడు. అక్కడ  ఓ పెద్ద కార్పోరేట్ సంస్ద యజమాని వివేక్ మిట్టల్ (జగపతిబాబు)వల్ల రవి గ్రామానికి జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకుంటాడు. 

ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రవికు సపోర్ట్ గా నిలుస్తాడు. అయితే ఎక్కడో అమెరికా నుంచి వచ్చి లోకల్ సమస్యలకు పోరాడతానంటే ఆ కార్పోరేట్ సంస్ద  ఒప్పుకుంటుందా… రిషిని, రవిని ఇద్దరినీ సీన్ లోంచి తప్పించాలనుకుంటుంది. అక్కడ నుంచి రిషికు, వివేక్ మిట్టల్ కు మధ్య పోరు ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో  ఎవరు ఏ ఎత్తులు వేసారు. అసలు ఆ ఊరుకు ఆ కార్పోరేట్ సంస్ద వలన వచ్చిన సమస్య ఏమిటి..ఈ గొడవలకు రైతులకు సంభందం ఏమిటి…చివరకు రిషి ఎలా అక్కడ  సమస్యలను పరిష్కరించి తన స్నేహితుడి రుణం తీర్చుకున్నాడు అనేది తెరపై చూడాల్సిన కథనం.  

ఎలా ఉందంటే.. 

మొదట నుంచీ ఈ సినిమా.. రిషి అనే వ్యక్తిలో మార్పు వచ్చి ఎలా మహర్షి లా మారాడన్నది కథగా ప్రచారం జరిగింది. అయితే సినిమాలో ఆ విషయానికి పెద్దగా  ప్రయారిటీ ఇవ్వలేదు. ఓ కార్పోరేట్ విలన్ ని పెట్టి కథనాన్ని సోషల్ ఇష్యూ నుంచి కమర్షియల్ సైడ్ కు లాక్కొచ్చారు. అలాగే ఈ సినిమా కథ ఇది అని మనకు ఫస్టాఫ్ లో క్లూ దొరకదు. ఫస్టాఫ్ మొత్తం వేరే కథ అన్నట్లు గా కాలేజీ ఎపిసోడ్స్ నడిపి, సెకండాఫ్ లో మెల్లిగా కాంప్లిక్ట్ పాయింట్ రైజ్ చేసి కథలోకి వచ్చారు. దాంతో ఫస్టాఫ్ లో కథ ఏమీ చూసినట్లు అనిపించదు.  సెకండాఫ్ విషయానికి వస్తే టూ మెనీ ప్లాట్స్ అంటే వేర్వేరు సబ్ ప్లాట్స్ కథలో చొప్పించారు.  గ్యాస్ పైప్ లైన్స్, రైతులు సమస్యలు , స్నేహితుడుకు సాయం, లవ్ ట్రాక్ ఇలా ఒకేసారి నాలుగు ట్రాక్ లు నడుస్తూంటాయి. ఒకదానికొకటి ఇంటర్ లింక్ ఉన్నా..ఒకే థ్రెడ్ గా కనపడకపోవటంతో వేటికవే విడిగా కనపడటం ఇబ్బంది పెడుతుంది. దానికి తోడు విలన్ స్ట్రాంగ్ గా లేకపోవటంతో హీరో ప్యాసివ్ గా కనిపిస్తాడు. ఇలా స్క్రీన్ ప్లే  చాలా చోట్ల సాగుతున్నట్లు, బోర్ కొడుతున్న ఫీలింగ్ వస్తుంది.  

మహేష్, నరేష్

ఈ సినిమాలో  మహేష్ తన ఫెరఫెర్మాన్స్ లో పీక్స్ కు వెళితే..అల్లరి నరేష్ తనలోని నటుడుని పూర్తిగా ఆవిష్కరించారు. పూజ హెడ్గే కు పెద్దగా సీన్స్ లేవు..సీన్ లేదు. ప్రకాష్ రాజ్, జయసుధ, జగపతిబాబు,పోసాని  వంటి సీజనల్ ఆర్టిస్ట్ లు  ఎప్పటిలాగే చేసుకుంటూ వెళ్లిపోయారు. 

సాంకేతికంగా

కెమెరా వర్క్, రీ రికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలట్ గా ఉన్న ఈ సినిమా కథ,స్క్రీన్ ప్లే విషయంలో పూర్ అనే చెప్పాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పెద్దగా మెరుపులు లేకపోయినా టెక్నాలిజీని వాడుకుంటూ చేసిన షాట్స్ బాగున్నాయి. పాటలు దేవిశ్రీ ప్రసాద్ స్దాయిలో లేవు. ఈ సినిమాలో ఏకైక కంప్లైంట్ అంత లెంగ్త్ వదిలేసి సినిమాని చాలా చోట్ల నీరసంగా మార్చేసిన ఎడిటర్ పైనే. అయితే దర్శకుడే దగ్గరుండి ఎడిటింగ్ చేయించుకుంటారు కాబట్టి వాళ్లని అనలేం.  

చూడచ్చా

మహేష్ అభిమానులకు బాగా నచ్చే ఈ సినిమా ..మిగతా వాళ్లకు జస్ట్ ఓకే అనిపిస్తుంది.  

తెర వెనక..ముందు

నటీనటులు: మహేశ్‌బాబు, అల్లరి నరేష్‌, జగపతిబాబు, పూజ హెగ్డే, ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, రావు రమేశ్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: కె.యు. మోహనన్‌
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌
కథ: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌
నిర్మాత: దిల్‌ రాజు, సి. అశ్వినీదత్‌, ప్రసాద్‌ వి. పొట్లూరి 
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
విడుదల తేదీ: 09-05-2019