యాత్ర 2 మూవీ ట్రైలర్ విడుదల
నేను విన్నాను.. నేనున్నాను… ఎమోషనల్ జర్నీగా యాత్ర 2… ఆకట్టుకుంటోన్న ట్రైలర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టనష్టాలను తెలుసుకుని వాటిని తీర్చటానికి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా యాత్ర. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం యాత్ర 2. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితులు, వై.ఎస్.జగన్ పేదల కోసం చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర 2 చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం యాత్ర 2 ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
పుట్టుకతో చెవుడు ఉందన్న దాని వల్ల మాటలు కూడా రావు. ఏదో మెషిన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పారన్నా, మాకు అంత స్థోమత లేదు అంటూ ఓ పేద మహిళ వై.ఎస్.ఆర్ దగ్గర తన సమస్యను చెప్పుకుంటుంది. అయితే ఆయన సెక్రటరీ ఓ వ్యక్తి మీదనే అంత ఖర్చు పెడితే రాష్ట్ర బడ్జెట్ ప్రకారం కష్టమని చెబుతారు. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా నాకు అర్థమైంది. కానీ మనం చేయలేమనే మాట ఈ పాపకి అర్థమయ్యేలా చెప్పు అనే ఎమోషనల్ సీన్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత వై.ఎస్.ఆర్ మరణం.. తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో జగన్ ఓదార్పు యాత్ర, దాని వల్ల ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను చూపెడుతూ చివరల్లో ఓ కళ్లు కనపడని వ్యక్తి వై.ఎస్.జగన్ పాత్రధారి జీవాతో మాట్లాడుతూ నువ్వు మా వై.ఎస్.ఆర్ కొడుకువన్నా..మాకు నాయకుడిగా నిలబడు అని చెప్పటం.. నేను విన్నాను.. ఉన్నాను అంటూ జీవా చెప్పే మరో ఎమోషనల్ డైలాగ్‌తో ట్రైలర్ పూర్తవుతుంది.
20009 నుంచి 2019 మధ్య కాలంలో వై.ఎస్.జగన్ ఎదుర్కొన్న రాజకీయ, మానసిక సంఘర్షణలను యాత్ర 2లో చక్కగా ఆవిష్కరించారని, ఎమోషన్స్ పీక్స్‌లో హృదయాలను కదిలించేలా ఉండబోతున్నాయని ట్రైలర్‌తో అర్థమవుతుంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం యాత్ర 2 చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్, మది సినిమాటోగ్రఫీ సన్నివేశాలను మరో రేంజ్లో ఎలివేట్ చేస్తున్నాయి.