Reading Time: 2 mins
యువ‌హీరో కృష్ణంరాజు కెరీర్ ముచ్చ‌ట
 
నాన్న‌గారికి తెలియ‌కుండానే స‌త్యానంద్ వ‌ద్ద న‌ట‌శిక్ష‌ణ తీసుకున్నా-హాస్య‌టుడు గౌతంరాజు కుమారుడు, హీరో కృష్ణంరాజు
 
నాకు మెగాస్టార్ అంటే చిన్నప్పటి నుంచి భక్తి. ఆయన స్ఫూర్తితోనే నేను నటనలోకి వచ్చా. ఇంజనీరింగ్ అర్హ‌త‌తో జాబ్ చేసాక కొన్నాళ్ల‌కు న‌ట‌శిక్ష‌ణ పొంది ఆఫర్ అందుకున్నా“ అని తెలిపారు హాస్య నటుడు గౌతం రాజు కుమారుడు కృష్ణంరాజు. సెప్టెంబర్ 24న తన పుట్టినరోజు సందర్భంగా ఈ యువ‌హీరో కెరీర్ ముచ్చ‌ట ఇదీ..
 
తొలి ప్ర‌య‌త్నం ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. నటుడిగా ఎంతో నేర్చుకున్నాను. ఏం చేయకూడదో, ఏం చేయాలో అనే విషయాలపై అవగాహన వచ్చింది. దర్శకుడు శ్రీనాథ్ పులకురం నాన్నగారిని క‌లిసి క‌థ వినిపించారు. తనికెళ్ల భరణి గారికి కూడా చెప్పారు. ఆయన చాలా బాగుందనడంతో  నాన్నగారు, ఆయన స్నేహితులు ముందుకొచ్చి ఆ సినిమా చేశారు. 
 
నాకు మాస్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవిగారిని చూసే పెరిగాను. ఆయన నుంచి ఎప్పుడూ ఎక్కువగా ఇన్స్‌పైర్ అయ్యేది ఫైట్స్, డ్యాన్స్ విషయంలోనే. నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌కు కానీ, జిమ్నాస్టిక్స్‌కు కానీ ఈ కథ సూట్ అవుతుందనిపించి చేశాను. “అయితే ఈ మూవీని నా అభిమాన హీరో చిరంజీవి ఇంకా చూడ‌లేదు. అక్కడిదాకా ఇంకా రీచ్ అవలేదని బాధ పడుతున్నా. ఏదో ఒక రోజు నేను ఆయన ఆశీస్సులు అందుకోవాలి. ఆయన చేతుల మీదుగా ఏదో ఒక చిన్న అవార్డు అయినా తీసుకోవాలనే కోరిక. అది నా బిగ్గెస్ట్ డ్రీమ్. అందుకోసం ఎంతైనా కష్టపడతా“ అని అన్నారు. సినిమాలు వ‌దిలేస్తే నాన్న‌గారి సేవాకార్య‌క్ర‌మాల్లో నేను సాయ‌ప‌డుతుంటాను. సాటివారికి అన్నం పెట్టాల‌ని ఆప‌ద‌లో ఆదుకోవాల‌నుకునే నాన్న‌గారు నాకు స్ఫూర్తి. రాళ్లపల్లి గారి నుంచి నాన్నగారికి ఆ అలవాటు వచ్చింది. తనికెళ్ల భరణి గారు, బ్రహ్మానందం గారు, ‘మా’ అధ్యక్షులు నరేష్ గారు.. వీరంతా ఒక టీమ్‌గా చాలామందికి సాయం చేస్తుంటారు. నేను ఎన్నోసార్లు చూశా అని తెలిపారు. 
 
నాన్న‌గారికి తెలియ‌కుండానే స‌త్యానంద్ వ‌ద్ద న‌ట‌శిక్ష‌ణ తీసుకున్నా. ఆ త‌ర్వాత ఆడిష‌న్స్ లో సెల‌క్ట‌య్యాను అలాగే ద‌ర్శ‌కుల్లో సుకుమార్ గారు అంటే చాలా ఇష్టం. తర్వాత కృష్ణవంశీ , పూరీ జగన్నాథ్, రాజమౌళి.. హ‌రీష్ శంక‌ర్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు.