రుద్రుడు మూవీ రివ్యూ
లారెన్స్ ‘రుద్రుడు’ రివ్యూ
Emotional Engagement Emoji
లారెన్స్ సినిమాలు కొత్తగా ఎప్పుడూ ఉండవు అనేది కంప్లైంట్ అయితే లారెన్స్ సినిమాలు ఇలాగే ఉంటాయని ఫిక్సై చూస్తారు కాబట్టి ఇన్నాళ్లూ సమస్య రాలేదు. అయితే మారుతున్న జనరేషన్, ఓటీటి లు రాకతో లారెన్స్ లాంటి చాలా మందికి పెద్ద దెబ్బే తగిలింది. ఈ క్రమంలో చాలా గ్యాప్ తరువాత చేసిన సినిమా రుద్రుడు. గతంలో ఆయన నుంచి వచ్చిన హారర్ కామెడీ సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. ఈ సినిమా ప్రకటించగానే అదే జోనర్లో ఈ సినిమా ఉంటుందేమోనని చాలామంది అనుకున్నారు. కానీ ఇది యాక్షన్ సినిమా అనీ మదర్ సెంటిమెంట్ ఉంటుందని ప్రమోషన్స్ లో లారెన్స్ చెప్పడంతో కొద్దో గొప్పో ఆసక్తి పెరుగుతూ వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోను ఒకే రోజున ఈ సినిమా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథేంటి :
దేవరాజు (నాజర్) ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతూ దెబ్బ తిని , ఆ బాధతో చనిపోతాడు. ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో జాబ్ చేస్తున్న ఆయన కొడుకు రుద్ర (లారెన్స్) ఆ అప్పులు భారం తన పై వేసుకుని సంపాదనకు లండన్ వెళ్తాడు. ఆ క్రమంలో తన భార్య అనన్య (ప్రియా భవాని శంకర్ ) కు, తల్లి బాధ్యతను అప్పగిస్తాడు. అతను ఫారిన్ వెళ్లిన తరువాత ఇక్కడ ఇండియాలో అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. తల్లి,భార్య చంపబడతారు.ఎవరు వాళ్లను చంపారు? ఆ ప్రాంతంలో గ్యాంగ్ లీడర్ గా అందరినీ హడలెత్తించే భూమినాథన్ (శరత్ కుమార్) .ఎందుకు రుద్ర కోసం వెతుకుతూంటాడు? కారణం ఏమిటి? అనేదే కథ.
విశ్లేషణ :
స్టోరీ లైన్ గా కొద్దిగా కొత్తగా అనిపించే పాయింట్ ఇది. స్క్రీన్ ప్లే కూడా ప్రారంభంలో బాగానే ఉంటుంది. బిజినెస్ లో ఒక భాగస్వామి తన తండ్రిని మోసం చేస్తే, హీరో ఎలా అతని అంతు చూశాడనేదే కథ అని అనుకునేలా చేస్తారు. కానీ అది కాదు అసలు కథ అని ఓ కొత్త పాయింట్ కు కనెక్ట్ చేస్తారు ఆ పాయింట్ ను ముందుకు తీసుకుని వెళ్లిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎన్నారైల తల్లి,తండ్రులు చాలా మంది ఇక్కడ ఇండియాలో ఒంటిరిగా ఉంటున్నారు. వారిని చంపేసి లేదా భయపెట్టి ఇక్కడ వారి ఆస్దులును కొంతమంది సంఘ విద్రోహ శక్తులు రాయించుకుంటున్నాయి. ఆక్రమిస్తున్నాయి. ఈ పాయింట్ తీసుకుని కథ చేసారు. కానీ కేవలం ఈ పాయింట్ వరకే కొత్త గా ఉంటుంది. మిగతాదంతా పరమ రొటీన్ స్టోరీ లైనే. అయితే దాన్ని డీల్ చేసిన తీరు మాత్రం రొటీన్ గా ఉంటుంది. చివరికి ఇచ్చిన ఫినిషింగ్ టచ్ కూడా చాలా పాతగా అనిపిస్తుంది. ఆ కాలం అడియన్స్ కి సంతృప్తి కరంగా అనిపిస్తుంది. కానీ ఇప్పటి జనరేషన్ కు కష్టం అనిపిస్తుంది. ఎలిమెంట్స్ ఉంటాయి కానీ వాటిని క్రమ పద్దతిలో పాత గా చెప్పి అసహనం కలగిస్తారు.హీరో వైపు నుంచి ఈ కథ మొదలై ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ , మళ్లీ ప్రెజెంట్ లో కొంత కథ జరిగిన తరువాత మళ్లీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లడం జరుగుతూ ఉంటుంది. అక్కర్లేని చాలా సీన్స్ సాగతీస్తూ పోతూంటారు. అవి మాస్ సీన్స్ అనుకోమంటారు. అలా పాయంట్ కొత్తగా అనిపించినా లారెన్స్ మార్క్ రొటీన్ జాతరతో విసుగిస్తుంది.
టెక్నికల్ గా :
ఈ సినిమా మొదటే చెప్పుకున్నట్లు మాస్ ని టార్గెట్ చేయాలన్న ఆలోచనతో వరస ఫైట్స్ చేసుకుంటూ పోయారు. లారెన్స్ ఇంట్రడక్షన్ ఫైట్ జాతరలో రౌడీ మూక నుంచి తన కూతురును కాపాడుకునే ఫైట్ క్లైమాక్స్ లో భాగంగా వచ్చే ఫైట్ ఈ సినిమాకి హైలైట్. ఈ మూడు కూడా భారీ యాక్షన్ సీన్స్ కావడం విశేషం.
స్క్రిప్టు పరంగా సినిమాలో ట్విస్ట్ లు అన్నీ మాగ్జిమం సగటు సిని ప్రేక్షకుడు ఊహించేస్తాడు. కొత్తలేని ఈ కథకు కొత్తగా స్క్రీప్లే రాసేదేముంది అనుకున్నారేమో పూర్తిగా వదిలేసారు. లాజిక్ అనే మాటను ఈ సినిమాలో వెతక్కూడదని ఫిక్స్ అయ్యినట్లున్నారు. మిగతా విభాగాలు సోసోగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. రాజశేఖర్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ.
నటీనటుల్లో :
లారెన్స్ డాన్సుల అదరకొట్టారు. కొరియోగ్రఫీ డిఫరెంట్ గా అనిపిస్తుంది. హీరోయిన్ ప్రియాభవాని శంకర్ బాగుంది కానీ ఆమె అలంకార ప్రాయమే. తండ్రి పాత్ర లో నాజర్, తల్లిగా పూర్ణిమ ఆకట్టుకుంటాడు. శరత్ కుమార్ విలన్ చేశారు కానీ స్ట్రాంగ్ గా లేదు. మిగతానటులు అంతా పరిథి మేర కనిపించారు.
చూడచ్చా :
లారెన్స్ డాన్స్ లు కోసం, మాస్ సీన్స్ కోసం ఓ లుక్కేయవచ్చు
నటీనటులు :
రాఘవా లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు
సాంకేతికవర్గం :
ఛాయాగ్రహణం : ఆర్.డి. రాజశేఖర్
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
రచన, దర్శకత్వం, నిర్మాణం : కతిరేశన్!
రన్ టైమ్ : 149 మినిట్స్
తెలుగులో విడుదల : ఠాగూర్ మధు
విడుదల తేదీ: ఏప్రిల్ 14, 2022