రెడ్ మూవీ రివ్యూ
స్క్రీన్ ప్లే డెడ్: రామ్ ‘రెడ్’ రివ్యూ
Rating:2/5
తమిళంలో వచ్చిన ‘తడమ్’ సినిమా స్క్రీన్ ప్లే పరంగా అద్బుతాలు క్రియేట్ చేసింది.అందులో హీరోగా చేసిన అరుణ్ విజయ్ కు అంత క్రేజ్ లేకపోయినా సినిమాలో ఉన్న విషయానికి కనెక్ట్ అయ్యి జనం సూపర్ స్టార్ సినిమా స్దాయిలో ఆదరించారు. అలాంటి సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని రామ్ కు అనిపించింది. రామ్ కు ఉన్న లవర్ బోయ్ ఇమేజ్ కు అది సరిపడదు. కానీ ఇస్మార్ట్ శంకర్ లో మాస్ కు దగ్గరయ్యాం కదా,అదీ క్రైమ్ పాయింటే కదా,ఇదీ క్రైమ్ థ్రిల్లరే. ఆల్రెడీ ప్రూవెడ్ పాయింట్ అని లెక్కలేసుకున్నారో ఏమో కానీ పట్టాలెక్కించారు. ఫైనల్ గా మన ముందు పెట్టారు. తమిళంలో ఆల్రెడీ చూసిన వాళ్లు తెలుగులో ఎలా ఉంటుందో అని ఉత్సాహడ్డారు. అలాగే రామ్ వంటి హీరో చేస్తున్న రీమేక్ అంటే విషయం ఉండే ఉంటుంది అని మరికొంతమంది ఆలోచనలో పడ్డారు. వీరంతా పండగరోజు థియోటర్ ముందు నిలబడ్డారు. వారికి నచ్చే ఎలిమెంట్స్ రెడ్ లో ఉన్నాయా తమిళంకు తెలుగుకు ఏ మార్పులు చేసారు.అసలు కథేంటి వంటి విషయాలతో రివ్యూ చేద్దాం రండి.
స్టోరీ లైన్
ఒకే పోలికలతో ఉన్న కవలలైన ఆదిత్య (రామ్),సిద్ధార్థ్ (రామ్) వ్యక్తిత్వాలలో మాత్రం విభిన్నమైన వ్య్తక్తులు. సిద్దార్ద ఇంజినీరు గా సెటిల్ అయితే, ఆదిత్య దొంగగా లైఫ్ లీడ్ చేస్తూంటాడు. అందిన మేరకు అప్పులు చేసే ఆదిత్య ఓ సారి పేకాటలో డబ్బులు పోగొట్టుకుంటాడు. డబ్బులు కోసం నానా రకాల స్కెచ్ లు వేస్తూంటాడు. ఈ లోగా ఆకాష్ అనే కుర్రాడు హత్య జరుగుతుంది. అంతేకాదు అతని లాకర్ లో ఉన్న పదకొండు లక్షలు కూడా మాయమవుతుంది. దాంతో ఆదిత్య మీద అనుమానం వస్తుంది. ఈలోగా అదే పోలికలతో సిద్దార్ద ఓ సెల్ఫీతో ఈ హత్య చేసినట్లు గా ప్రూవ్ అయ్యి అరెస్ట్ అవుతాడు. అతను హత్య చేసాడనటానికి లవ్ ఎఫైర్ విషయంలో ఓ రీజన్ ఉంటుంది. వీళ్లిద్దరిలో ఎవరు హత్య చేసారు అనేది మిలియన్ డాలర్ క్వచ్చిన్ గా మారుతుంది. పోలీస్ లు ఇన్విస్టిగేషన్ లో ఏం తేలుతుంది. ఇద్దరిలో ఎవరు హత్య చేసారు..ఎందుకు చేసారు. అసలేం జరిగింది అనేది మిగతా కథ.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్
ఆల్రెడీ తమిళంలో ప్రూవైన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. స్క్రీన్ ప్లే అద్బుతంగా చేసారని శభాష్ అనిపించుకున్న సినిమా ఇది. ఈ సినిమాని తెలుగులో చేస్తున్నారనగానే ఏం మార్పులు చేస్తారు..చెడగొడతారా అనే సందేహాలు చాలా మందికి వచ్చాయి. ఎందుకంటే రామ్ వంటి ఇమేజ్ ఉన్న హీరో చేస్తున్నప్పుడు మార్పులు పేరుతో కొన్ని ఛేంజెస్ వచ్చి చేరుతాయి. అయితే దర్శకుడు కిషోర్ తిరుమల పూర్తిగా మార్చటానికి ధైర్యం చేయలేదు. అలాగని వదిలేయనూ లేదు. కొన్ని అక్కడక్కడా స్క్రిప్టు మార్పులు చేసాడు. కీ ఎలిమెంట్స్ అలాగే ఉంచేసాడు. అలాంటప్పుడు తమిళంలోగా హిట్ అవుతుంది కదా అంటే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే యాజటీజ్ ప్రెజెంట్ చేసినా ప్రెజంటేషన్ లో తేడా కొట్టేసింది. దర్శకుడకి ఈ జానర్ కొత్త అవటం వల్ల కావచ్చు. డైలాగులు చాలా బాగా రాసుకున్న ఈ దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డాడు. దానికి తోడు రామ్ ని కొత్తగా చూపించలేకపోయారు. ఇస్మార్ట్ శంకర్ ని కంటిన్యూ చేసారు ఓ పాత్రలో. మరో పాత్రలో రెగ్యులర్ రామ్ కనపడ్డాడు. రామ్ లాంటి కమర్షియల్ హీరో చుట్టూ ఇలాంటి కథ నడిచేటప్పుడు మన దృష్టి మొత్తం హీరో పైనే ఉంటుంది. అయితే ఇది కథ ప్రధానంగా ఉన్న సినిమా. ఈ రెండింటికి సింక్ అవ్వలేదు. రామ్ ఈ సినిమాకు వంద శాతం రాంగ్ చాయిస్. అతను అద్బుతంగా చేయచ్చు గాక. కాని ఈ సినిమాని అతని ఇమేజ్ దెబ్బ కొట్టిందనే చెప్పాలి. దానికి తోడు డైరక్టర్ ఈ సినిమా చాలా స్లో నేరేషన్ లో నడిపారు. అలాగే సెకండాఫ్ లో ప్రొసీడింగ్స్ కు ఎక్కువ స్కోప్ ఇచ్చారు. ఓ కమర్షియల్ హీరో సినిమాకు ఈ రెండు పెద్ద అడ్డంకే అనే విషయం మర్చిపోయారు.
టెక్నికల్ గా..
పెద్ద హీరో సినిమాకు కావాల్సిన కమర్షియల్ హంగులు తెప్పించగల టెక్నికల్ కసరత్తు బాగా జరిగింది. కెమెరా వర్క్ బాగుంది. మణిశర్మ రీరికార్డింగ్, పాటలు బాగున్నాయి. ఐటం సాంగ్ కిక్ రప్పించింది. ఎడిటింగ్ కొంత విసిగించింది. దర్శకుడు తిరుమల కిశోర్ ఒరిజనల్ లోని ఆత్మ ఇందులోకి తీసుకొచ్చే క్రమంలో ప్రక్కదారులు పట్టారు. మాస్ అంశాలు జోడించి మొత్తానికి దెబ్బ కొట్టారు. ఎప్పటిలాగే డైలాగులు బాగా రాసారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బ్యానర్ కు తగ్గ స్దాయిలో ఘనంగా ఉన్నాయి.
నటీనటుల్లో రామ్ ఎప్పటిలాగే బాగా చేసారు. కాకపోతే కొత్తగా చేయటానికి ఏమీ లేదు. హీరోయిన్ మాళవిక శర్మకు సినిమాలో చెప్పుకోదగ్గ సీన్స్ లేవు. కథలో మెయిన్ పాయింట్ ఆమే అయినా ఆమెపై కథ లేదు. సినిమాకు ఉన్న సీరియస్ నెస్ ని చెడకొట్టిన వాళ్లలో నివేదా పేతురాజ్ ఒకరు. మిగతా ఆర్టిస్ట్ లు ఎప్పటిలాగే లాక్కుంటూ పోయారు.
చూడచ్చా…
తమిళ వెర్షన్ చూడటం బెస్ట్…కాస్త కష్టమైనా
ఎవరెవరు… ::
సంస్థ: శ్రీ స్రవంతి మూవీస్,
నటీనటులు: రామ్, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నాజర్ తదితరులు
సంగీతం: మణిశర్మ,
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి,
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: పీటర్ హెయిన్స్,
ఎడిటింగ్: జునైద్,
సమర్పణ: కృష్ణ పోతినేని,
నిర్మాత: ‘స్రవంతి’ రవికిశోర్,
రన్ టైమ్: 2గం|| 26ని||
దర్శకత్వం: కిశోర్ తిరుమల.
విడుదల తేదీ: 14-01-2021