Reading Time: 2 mins
రేలంగి స్వగతం.. ఆయన సంతకంతో
 
* మహానటుడు రేలంగి జన్మదినం సందర్భంగా (13 ఆగస్టు 1910 – 27 నవంబరు 1975)..*
 
 
*నా డైరీలోని బహిరంగ రహస్యాలు…..*
 
● రావులపాడు అనే గ్రామంలో పుట్టానుట. అక్కడే పుట్టాను అని నాకు తెలీదు… పెద్దలు చెప్పారు. పెద్దలు అబద్ధం ఆడరు. అయినా సరే, “ట”
అన్నాను.
 
● పదో ఏట నాటకంలో వేషాలు వేశాను. నాటకం బృహన్నల. అందులో మనం బృహన్నల! ఇంతకంటే అప్పుడు ఇంకా అందంగా వుండేవాణ్ణి – మీకేం తెలును!
 
● చదువు మీద ఉత్సాహం కలగలేదు. నాలుగో ఫారంలో “చదువు” నన్ను విడిచి పెట్టి పారిపోయింది!
 
● పది హేనూ ఏళ్ళపాటు అలా అనేక నాటకాల్లో వేషాలు వేసి, వేసి, వేశాక – సినిమా ఛాన్సు తగిలింది. 1935 లో, హార్మోనిస్టు దూని శాస్త్రి గారూ వాళ్ళంతా కలకత్తా బయల్దేరుతున్నారు. నన్ను రమ్మవలేదు. కాని నేనే వాళ్ళ వెంటబడి కలకత్తా వెళ్ళాను. వెళ్ళాను గదా అని నా చేత కొన్ని వేషాలు వేయించుకున్నారు. ఆ చిత్రం ‘కృష్ణతులాభారం. నిజానికి సినిమా నాకు దొరకలేదు. ఆ విధంగా నేనే దొరికిపించుచుకున్నాను !
 
● అప్పుడు మనం రౌడీ. ఏదేదా చిన్న పేచీ వస్తే ఎదటివాడిని కొట్టి వాణ్ణి.. ఏదో మాట వస్తే అసిస్టెంటు డైరెక్టర్ని కొట్టాను. దాంతో “చెడ్డ రేలంగి” అన్న బిరుదు ఇచ్చారు. బిరుదు పొందడం అదే మొదటిసారి.
 
● కొంతకాలం సి పుల్లయ్యగారి దగ్గర చేరాను. పది హేనేళ్ళు ఆయనతో వాసం చేశాను. ఆ శ్రీరామచంద్రుడు పద్నాలుగేళ్ళ వనవాసం చేశాడు. నేను అతనికంటే గొప్పవాణ్ణి కాబోలు – పది హేమ సంవత్సరాలు పట్నవాసం చేశాను. అనేక మంది తారలను, నా చేతిమీదిగా బుక్ చేశాను ! హె……
 
● 1947 లో ‘గొల్లభామ’ విడుదలయింది. అప్పటికి నాకు హాస్యనటుడిగా కాస్త పేరొచ్చింది. కాని అన్ని సంవత్సరాలు పరిశ్రమలో నిలబడి వున్నా – తర్వాత నిలబడలేక పోయాను. నిలబడ్డం కష్టమైంది. ఇంటి వెళ్ళి, కూచుందామా అనుకున్నాను. కాని.. పట్టుదల….. ఆగాను.
 
● తర్వాత కొంత కాలానికి “వింధ్యరాణి’లో మంచి పాత్ర లభించింది. జి. వరలక్ష్మి, నేను హాస్య జంటగా పాల్గొన్నాం. ఆ చిత్రంలో నేను బాగా చేశానని పేరొచ్చింది. ‘కీలుగుర్రం’ లో మరో మంచి వేషం దొరికింది.
 
● గుణసుందరి కథ, పాతాళ భైరవి తో రేలంగి, రేలంగి”గా, రేలంగిలా నిలబడ్డాను. తర్వాత చాలా చిత్రాల్లో నటించాను.
 
● తారల జాబితాలో చేరాను. చాలా చిత్రాల్లో ముఖ్య హాస్య పాత్రలు ధరించాను. అభిమానుల ఆదరాభిమానాలు పుష్కలంగా లభించసాగాయి.
 
● అనేక చోట్ల సన్మానాలు జరిగాయి. ఆంధ్ర నాటక కళాపరిషత్తు హైదరాబాదులో (1955) నాకు మనమైన సన్మానం జరిగింది.
 
● మద్రామలో నాకు ఘనమైన సన్మానం జరిగింది. ఆంధ్రా ఫిల్ము ఆర్నలిస్టులు నన్ను ఏనుగు మీద కూచో పెట్టి పూరేగించారు. ఏనుగెక్కటం చాలా చాలా గొప్పట. (మావటి ఎప్పుడూ ఎక్కుతూనే వుంటాడుగదా అంటే, చొప్పదంటు ప్రశ్నలు వెయ్యొద్దన్నారు).
 
● విజయా గార్డెన్స్‌లో సాటి, తోటి నటీనటులందరూ కలిసి నన్ను సన్మానించారు. నటీనటులందరూ కలిసి, ఇంకో నటుని సన్మానించడం అన్నది – అదే మొదటిసారి. ఆ ఘనత నాకు దక్కింది. ఆ తర్వాత అలాంటిది మళ్ళీ జరగలేదు.
 
● శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీకి పాతిక వేలు విరాళం ఇచ్చాను. సెనేట్ సభ్యుడినయ్యాను.
 
● ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమివారు ఫెలోషిప్ ఇచ్చి గౌరవించారు.
 
● బండారులంక, రాజమండ్రి, కొవ్వూరు మొదలైన పూళ్ళలో నాకు కనకాభిషేకాలు జరిగాయి (బంగారం కంట్రోలు వున్నా)
 
● నర్తనశాల చిత్రంతో డెలిగేట్గా జకార్తా వెళ్ళాను. అందులో వేసిన ఉత్తర కుమార్డు దక్షిణం మీదగా తూర్పు దిశకు వెళ్ళాడు.
 
● ఎన్నో పరిషత్తులూ, సంస్థలు సన్మానిస్తూనే వున్నాయి. వీటన్నిటికి కారణం ఎవరు?… ఎవరు ?.. మీరు.. మీరే..
 
 
చిత్తగించవలెను
మీ
రేలంగి వెంకట్రామయ్య