Reading Time: 3 mins

లక్ష్మీస్ బయోపిక్ … (‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’రివ్యూ)

రేటింగ్  : 2.5/5  

ఎన్టీఆర్ చరమాంకంలోని  లక్ష్మీ పార్వతి అధ్యాయం ఓ తరానికి అంతటికీ, అందరికీ తెలిసిందే. అయితే అది తెలుసుకోవటం వల్ల కానీ, దాన్ని తలుచుకోవటం వలన కానీ ఎవరికీ పెద్దగా కలిసొచ్చేది లేదు కాబట్టి మెల్లిగా మరుగునపడిపోతోంది. మరి ఈ జనరేషన్ కి ఆ విలువైన విషయాలు అందించాలనో, రాజకీయంగా చంద్రబాబుపై కక్ష సాధించాలనుకునేవాళ్లకు సాయపడాలుకున్నారో  కానీ వర్మ తవ్వకాలు మొదలెట్టి, తెలిసిన విషయాన్నే విజువలైజ్ చేసి మన ముందు పెట్టారు. మరి ఈ విషయాలు ఎంతవరకూ జన సామాన్యంలోకి వెళ్తాయి, సినిమా చూసేందుకు సరపడ ఇంట్రస్టింగ్ కంటెంట్ ఉందా? లేక ఏదో హైప్ క్రియేట్ చేసి ఓపినింగ్స్ తెచ్చుకోవాలనే తాపత్రయమా? ఆ విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి…

తెలుగుదేశం పార్టీ ఓడిపోయి… ఎన్టీఆర్‌ (విజయ్ కుమార్‌) నిరాశగా ఉన్న సమయంలో సినిమా ప్రారంభం అవుతుంది. అప్పుడు మీ జీవిత చరిత్ర రాస్తానంటూ  లక్ష్మీ (యజ్ఞ శెట్టి) ఆయన జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. మొదట ఆమె చదువు, సంస్కారం నచ్చి తన దగ్గరకి రానిచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఆమె చేసే సపచర్యలతో తన హృదయంలో చోటిస్తారు. ఈ విషయంలో ఇంట్లో వాళ్లు ఎంత వ్యతిరేకించినా, తన పై ఎన్ని దుష్ప్రచారాలు జరిగినా లెక్క చేయరు. అంతేకాదు మేజర్ చంద్రకాంత్ విజయోత్సవ సభలో ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రకటించేస్తారు. 

అది సాధారణంగానే ఎన్టీఆర్ కుటుంబంలో కలతలు రేపుతుంది. అక్కడ నుంచి చంద్రబాబు తన ప్లే మొదలెడతారు. దాన్ని అవకాశంగా తీసుకుని… తను అధికారంలోకి రావాలనుకుంటారు. ఎన్టీఆర్ వెనక కుట్రలు చేసి, ఫ్యామిలీ మెంబర్స్ ని తన వైపుకు తిప్పుకుని వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకునేదాకా వెళ్తాడు. అందుకు రావ్ అనే పత్రికాధిపతి సహకరిస్తాడు. అంతేకాదు వైస్రాయ్ వద్ద తన అనుకున్న వాళ్ల చేతే చెప్పు దెబ్బలు తినేలే చేసి… మానసికంగా క్రుంగిపోయేలా చేసి మరణించేలా చేస్తాడు. 

లక్ష్యం నెరవేరిందా

ఈ కథ దాదాపు అందరికీ తెలిసిందే. అయితే దీన్ని రామ్ గోపాల్ వర్మ ఎంత ఆసక్తికరంగా మలిచారన్నదే ఈ సినిమాని నిలబెట్టే అంశం అవుతుంది. అయితే ఇక్కడ పూర్తిగా ఏకపక్షంగా కథ చెప్పబడింది. లక్ష్మీ పార్వతి కళ్ల నుంచి ఈ సినిమా చూడాలి. అమాయకురాలు, మంచితనం మూర్తిభవించిన లక్ష్మీ పార్వతి అనే ఆమె ఎన్టీఆర్ అనే పెద్ద మనిషి జీవితంలో ప్రవేశిస్తే…ఆ కుటుంబం ఆ పరిస్దితిని అర్దం చేసుకోకుండా యుద్దానికి దిగితే… అందుకు అల్లుడే సారధ్యం చేస్తే ఎలా ఉంటుంది..ఎంత దారుణమైన పరిస్దితి అని వర్మ చెప్పాలనుకున్నారు. అందుకు తగ్గ ఎమోషన్ సీన్స్ ని సైతం డిజైన్ చేసారు. సినిమా క్లైమాక్స్ కు వచ్చేసరికి అయ్యో ఎన్టీఆర్ అనిపిస్తుంది. చంద్రబాబుపై కోపం వస్తుంది. అక్కడదాకా వర్మ విజయం సాధించినట్లే. కాకపోతే ఇది కొత్త విషయం అయితే ఖచ్చితంగా చర్చకు వచ్చేది. కానీ అందరికీ తెలిసిన విషయం కావటంతో పెద్దగా జనం స్పందించేది ఏముంటుంది. ఇంకోటి… ఇప్పటికి ఇంకా ఎక్కడైనా ఎన్టీఆర్ అభిమానులు ఉంటే వాళ్లు సానుభూతి చూపిస్తారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్ వేస్తారు. అదే వర్మ లక్ష్యం అయితే కొంతవరకూ నెరవేరినట్లే.

ఎవరెలా చేసారంటే..

ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన ఎన్టీఆర్ గా కనిపించిన విజయ్ కుమార్ తెర మీద నటిస్తున్నాం అనే విషయం మర్చిపోయారు. ఆయన స్టేజ్ మీద చేసినట్లుగా చాలా ఓవర్ గా జీవించేస్తూ కనిపించారు. దర్శకుడు ఎందుకు  కంట్రోలు చేయలేదో మరి. లేక కంట్రోలు చేస్తేనే ఆ మాత్రం అవుట్ ఫుట్ వచ్చిందో. ఇక లక్ష్మీ పార్వతిగా యజ్ఞ శెట్టి మంచి కన్విక్షన్ తో చేసుకుంటూపోయింది. చంద్రబాబుగా శ్రీ తేజ చాలా భాగం ఆయన్ను అనుకరించినా ఇబ్బంది అనిపించలేదు.  మిగతా ఆర్టిస్ట్ లు ఉన్నామంటే ఉన్నాం.. చేసామంటే చేసాం అన్నట్లుగా చేసారు. 

టెక్నికల్ గా…

వర్మ సినిమాలు సాధారణంగా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉంటాయి. ముఖ్యంగా కెమెరా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విషయాల్లో ఆయన చాలా క్లారిటీతో ఉంటారు. అది ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. కాకపోతే ఎడిటింగ్ కాస్త స్పీడ్ చేసి ఉంటే డ్రాగ్ అయిన ఫీల్ వచ్చేది కాదు. మిగతా విభాగాలు సోసో గా ఉన్నాయి. నిర్మాణ విలువలు గొప్పగా లేవు. 

చూడచ్చా…

ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి వచ్చాక ఏం జరిగింది ? చంద్రబాబు వెన్నుపోటు ఎలా పొడిచాడు ? అని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలని చెప్పలేం. ఎందుకంటే ఇది కేవలం లక్ష్మీ పార్వతి వెర్షన్ మాత్రమే. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఎవరు మాత్రం చెప్తారు. ఎవరు నిజాయితీగా తెరకెక్కిస్తారు.  కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఓ సినిమా గా చూస్తే బాగానే ఉందనిపిస్తుంది. 

ఆఖరి మాట…

ఒకరిపై పగతోనో లేక ప్రేమతోనో సినిమా తీయటం కాకుండా సినిమాపై ప్రేమతో  సినిమా తీస్తే  ఖచ్చితంగా వేరే రకంగా ఉంటుంది. అలా చేయకపోవటంతో ఇది వన్ సైడ్ వార్ లా తయారైంది. సినిమాలో చంద్రబాబుని విలన్ గా చూపెట్టాలని మొదలెట్టిన ఈ సినిమా అలాగే ఉంది. మనకు కూడా చంద్రబాబు మీద కోపం ఉంటే బాగా నచ్చుతుంది. లక్ష్మీ పార్వతిమీద అబిమానం ఉంటే ఇంకా బాగా నచ్చుతుంది. అదే ప్రయోజనం వర్మ ఈ సినిమా ద్వారా ఆశిస్తే ఆయన సఫలీకృతం అయ్యినట్లే.

తెర ముందు…వెనక

నటీనటులు: పి.విజ‌య్ కుమార్, య‌జ్ఞ శెట్టి, శ్రీ తేజ్ త‌దిత‌రులు
బ్యానర్: క‌ంపెనీ ప్రొడ‌క్ష‌న్స్ – గ‌న్ షాట్ ఫిలింస్- జీవీ ఫిలింస్
నిర్మాత: రాకేశ్ రెడ్డి- దీప్తి
సంగీతం: క‌ళ్యాణి మాలిక్
దర్శకత్వం: రామ్ గోపాల్ వ‌ర్మ‌- అగ‌స్త్య మంజు
రిలీజ్ తేదీ: 29 మార్చి 2019