Reading Time: 3 mins

లక్ష్య మూవీ ట్రైల‌ర్‌ విడుద‌ల‌

 

విక్ట‌రి వెంక‌టేష్ విడుద‌ల చేసిన నాగ‌శౌర్య `లక్ష్య` ట్రైల‌ర్‌

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లక్ష్య చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది.  తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విక్ట‌రి వెంక‌టేష్ విడుద‌ల‌చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో…

డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. ‘ఆర్చరీ మీద మొదటి సినిమా. క్రికెట్ అంటే ఓ మతం. ఓ దేవుడు అని అంతా అనుకుంటారు. ఎన్నో ప్రాచీన విద్యలు మరుగున పడుతున్నాయి. బుద్దిజం మన వద్దే పుట్టింది. కానీ వేరే దేశాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉందనేది కూడా తెలియడం లేదు. మనం దేవుళ్లుగా కొలిచేవారి చేతిలో, వీరులుగా చెప్పుకునే వారి చేతిలో విల్లును చూస్తాం. ఇది అంత గొప్పది. అన్నింటిని ఆటలు అంటాం. కానీ ఆర్చరీని మాత్రం విలు విద్య అని అంటాం. నేను కథను రాసుకున్నప్పుడు.. నన్ను నమ్మి నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ అవకాశం ఇచ్చారు. నేను రాసుకున్నది నలభై శాతం అయితే.. వంద శాతాన్ని చేసింది నాగ శౌర్య. ఆయన లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. నిర్మాణ పరంగా నిర్మాతలు సహకరిస్తే.. కథను, పార్థు అనే  పాత్రను నాగ శౌర్య నెక్స్ట్ లెవెల్‌కు నాగ శౌర్య తీసుకెళ్లారు. విలుకాడికి సిక్స్ ప్యాక్ అవసరమా? అని అంతా అన్నారు. కానీ విల్లు ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందో అలా బాడీ కూడా ఉండాలి. మూడు రోజులు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. కనీసం ఆయన ఉమ్ము కూడా మింగలేదు. 8 ప్యాక్ కోసం మూడు రోజులు అలానే ఉండిపోయారు. రితిక అనే పాత్రలో కేతిక శర్మ కనిపిస్తారు. పార్దుకు వెన్నుదన్నుగా ఉండే పాత్రలో అద్భుతంగా నటించారు. నువ్ తప్పు చేసి గెలిచావ్.. వాడు నిన్ను తప్పించి గెలవాలని అనుకున్నాడు అనే సీన్‌లో అద్భుతంగా  నటించారు. జగపతి బాబు, సచిన్ ఖేద్కర్ ఇలా అందరూ బాగా నటించారు. సినిమాను ఇంత బాగా వచ్చేలా చేసిన కాళ భైరవకు థ్యాంక్స్. చిత్రానికి పని చేసిన అందరికీ థ్యాంక్స్. ఇది రెండున్నరేళ్ల కష్టం. ఇక్కడి వరకు తీసుకొచ్చిన నాగ శౌర్యకు థ్యాంక్స్’ అని అన్నారు..

కేతిక శర్మ మాట్లాడుతూ.. ‘ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సంతోష్ గారికి థ్యాంక్స్. కొన్ని సీన్లు చూశాను. నాగ శౌర్య అద్భుతంగా నటించారు. నాలుగు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. సంతోష్ గారు తన మనసులోంచి ఈ కథను అందంగా రాశారు. జగపతి బాబు గారితో  స్క్రీన్ షేర్ చేసుకోవడం గర్వంగా ఉంది’ అని అన్నారు.

కాళ భైరవ మాట్లాడుతూ..  ‘ఈ రోజు ఇక్కడ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. టీజర్‌కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో.. ట్రైలర్‌కు అలాంటి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. గత రెండేళ్లుగా ఈ సినిమా మీద పని చేస్తున్నాం. నా కెరీర్‌లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇంత తక్కువ సమయంలోనే స్పోర్ట్స్ బేస్డ్ సినిమా రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ ఇంత త్వరగా ఆ అవకాశం వచ్చింది’ అని అన్నారు.

నిర్మాత రామ్ మోహన్ మాట్లాడుతూ.. ‘స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు వచ్చి చాలా రోజులైంది. ఒకప్పుడు కబడ్డి, రగ్బీ వచ్చాయి. చాలా రోజుల తరువాత ఇలా మళ్లీ క్రీడా నేపథ్యంలో సినిమా వస్తుండటంతో అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ సినిమా కోసం నాగ శౌర్య చాలా కష్టపడ్డారు. ఎనిమిది పలకల దేహంలో కనిపించడం మామూలు విషయం కాదు. మేం ముందే రావాలని అనుకున్నాం. కానీ మాకు మంచి తేదీ దొరికింది. డిసెంబర్ 10న రాబోతోంది. ముందు  ఈ సినిమాను మ్యూజిక్ చేయకముందు చూశాను. మ్యూజిక్ చేసిన తరువాత చూశాక అద్భుతంగా అనిపించింది. ఈ చిత్రం కచ్చితంగా టార్గెట్‌ను రీచ్ అవుతుంది’ అని అన్నారు.

నాగ శౌర్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం రెండున్నరేళ్లుగా కష్టపడ్డాం. మొదటగా సంతోష్ వచ్చి మూడు గంటలు కథ వినిపించారు. అప్పటికి ఇంటర్వెల్ అయింది. ఇక మిగతా కథ రేపు వింటాను అని అన్నాను. ఆయన ప్రతీ ఒక్క పాయింట్‌ను ఎంతో క్లియర్‌గా వివరించారు. బాణం ఎలా పట్టుకోవాలి.. ఎలా వదలాలి అని చెప్పారు. అప్పుడే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. సెండాఫ్ విని ఓకే చేసేద్దామని అనుకున్నాను. మా నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లతో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చేద్దాం సర్ అంటూ చిన్నపిల్లాడిలా అడిగేవాడిని. ఏమైనా కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించండి. కాళ భైరవ నా స్నేహితుడు. ఐదారేళ్ల నుంచి పని చేయాలని అనుకున్నాం. ఇప్పుడు ఇలా కుదిరింది. ఆర్ఆర్ మాత్రం అదరగొట్టేశాడు. కేతిక శర్మ రొమాంటిక్ సినిమాలో నటించింది. ఆ అమ్మాయిని చూస్తే ఎవ్వరికైనా సరే రొమాన్స్ చేయాలనిపిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే ఇంత అభిమానాన్ని చాలా తక్కువ మంది సంపాదించుకుంటారు. దాన్ని కాపాడుకో కేతిక. సినిమాటోగ్రఫర్ రామ్ రెడ్డి గారు చాలా బాగా చూపించారు. మాటల రచయిత మణి గారు చాలా బాగా రాశారు. ఈ చిత్రంలో జగపతి బాబు గారు, సచిన్ ఖేద్కర్ గారు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. నేను మోయలేని సమయంలో ఆ ఇద్దరూ వచ్చి నిలబెడతారు. ముగ్గురి వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. కథను చెప్పి స్పూర్తినింపిన డైరెక్టర్ సంతోష్ గారు ఒకరు. జగపతి బాబు గారిని డామినేట్ చేయాలనే కోరిక ఉండటం, సచిన్ ఖేద్కర్ వంటి వారి వంటి నటులు నా ముందు ఉండటంతో నాలోని నటుడిని బయటకు తీసుకురావాలనే కోరిక పుట్టింది. స్పోర్ట్స్ సినిమా అంటే చివరకు హీరో గెలవాలి. ప్రేమ కథలు అంటే అమ్మాయి అబ్బాయి చివరకు కలవాలి. ప్రతీ సినిమాలోనూ  అలానే ఉంటుంది. ఈ చిత్రంలో కూడా అలానే ఉంటుంది. కానీ చివరకు హీరో ఎలా గెలిచాడన్నది ఆసక్తి కరంగా ఉంటుంది. ఒకేసారి సినిమా సినిమాకు లుక్ మార్చడం చాలా కష్టంగా అనిపించింది. కోహ్లీ గారికి కూడా సిక్స్  ప్యాక్ ఉంటుంది. క్రికెట్‌కు సిక్స్ ప్యాక్ అవసరం లేదు. మన మైండ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందని చెప్పడానికి ఫిట్ నెస్ ఉపయోగపడుతుంది. ఈ కథ నన్ను 8 ప్యాక్స్ కోరింది. నేను చేశాను. ఒక వేళ కారెక్టర్ డిమాండ్ చేస్తే పది పలకల దేహాన్ని కూడా చేస్తాను’ అని అన్నారు.