Reading Time: 2 mins

డబ్బింగ్ దెయ్యం నస  (లిసా 3డి రివ్యూ)

రేటింగ్  :  2/5

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంటే అది ఖచ్చితంగా హారర్ సినిమా అయ్యిండాలనే రూల్ మన సినిమావాళ్లు పెట్టుకున్నట్లున్నారు.  వరస పెట్టి హీరోయిన్స్ తో హారర్ సినిమాలు లాగించేస్తున్నారు. మంచి ప్రోమో కట్ చేసి, పోస్టర్స్ వదిలితే ఓపినింగ్స్ వస్తున్నాయి. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే కనెక్ట్ అయ్యిపోతారనే  నమ్మకం ఈ సినిమాలను ఓ ఉద్యమంగా చేయాలనే ఉత్సాహం నిర్మాతలకు ఇస్తోంది. అదిగో ఆ ఉద్యమంలోంచి వచ్చిన మరో హారర్ కిరణం లిసా. అయితే ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే 3డిలో దెయ్యాలు వచ్చి భయపెట్టడం. సర్లే ..భయపెట్టడంలో కూడా టెక్నాలిజీని అడాప్ట్ చేస్తున్నప్పుడు అది ఏ స్దాయిలో ఉండబోతుంది..నిజంగానే ఈ సినిమా నమ్మి వెళ్లినవాళ్లకు భయపెట్టిందా, స్టోరీ లైన్ ఏమిటి..బ్రహ్మానందం సినిమాకు ఏమన్నా ఉపయోగపడ్డారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

స్టోరీ లైన్ 

లీసా (అంజలి) కు అమెరికా వెళ్లి చదువు కుని అక్కడే సెటిల్ అవ్వాలని కోరిక.   తండ్రి చిన్నతనంలో చనిపోవడంతో తను కూడా వెళ్ళిపోతే తల్లి ఒంటరిది అయ్యిపోతుంది. అప్పట్లో  తల్లి ఆమె  పేరేంట్స్‌  ఇష్టానికి వ్యతిరేకంగా  పెళ్లి చేసుకోవడంతో వారికి దూరమైంది.పుట్టింటికి వెళ్లలేదు. అలాగని తనతో పాటు తీసుకెళ్లే పరిస్దితి లేదు.  ఈ క్రమంలో ఆమెకో ఆలోచన వస్తుంది. తన తల్లిది ఇంకా మిడిల్ ఏజే కాబట్టి మళ్లీ పెళ్లి చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. మళ్లీ పెళ్లికోసం తల్లిని ని వెంటపడి ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆమె ఒప్పుకోదు. ‌

 ఆమె పెళ్ళికి ఒప్పుకోవాలంటే అందుకు అమ్మమ్మ, తాతయ్య సాయం తీసుకోవాలని అనుకుంటుంది లీసా.  ఇరవై సంవత్సరాల తరువాత మొదటిసారిగా తన అమ్మమ్మ తాతయ్య దగ్గరికి బయిలుదేరుతుంది. వారి ఉంటున్న ఊరికి వెళ్లాక అక్కడ కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి. తనకు తాతయ్య, అమ్మమ్మ గా పరిచయమైన వాళ్ళు వాళ్లు కాదని తెలుస్తుంది. అక్కడ నుంచి లీసా కు రకరకాల చిత్రమైన సమస్యలు వెంటాడతాయి. ఇంతకీ అమ్మమ్మ,తాతయ్య ఏమయ్యారు. ..తల్లిని పెళ్లికు ఒప్పించగలిగిందా..ఇంతకీ లీసా కు ఆ ఊళ్లో ఉండగా తెలిసిన నిజాలు ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉంది..

రెగ్యులర్ హారర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కథ ప్రారంభం కావటంతో మొదట మనకు ఉత్సాహం వస్తుంది. ఏదో కొత్త విషయం చూడబోతున్నామనిపిస్తుంది. అయితే రాను రాను కథలో ట్విస్ట్ లు రివీల్ అవటం, అవీ మైండ్ బ్లోయింగ్ గా ఉండకపోవటంతో మరో సాదా సీదా హారర్ చిత్రమే అని అర్దమైపోతుంది. ఇక క్లైమాక్స్ లో సెంటిమెంట్ ని చొప్పించటం తో సినిమా జానర్ ఒక్కసారిగా మారిపోయినట్లైంది. అప్పటిదాకా హారర్ అని చూస్తున్నవాళ్లకు వేరే ఎక్సపీరియన్స్ వస్తుంది. 

అంజలి, బ్రహ్మానందం

వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో గీతాంజలి చిత్రం వచ్చి హిట్టైంది. అప్పుడు బ్రహ్మానందం సినిమాలో కేవలం కమిడియన్ గా కాకుండా ఓ కీ క్యారక్టర్ గా కథని ముందుకు నడిపిస్తాడు. కానీ ఇక్కడ బ్రహ్మానందంను వాడుకోలేదు. కేవలం పోస్టర్స్ లో బ్రహ్మీని చూపటానికి మాత్రమే ఉన్నట్లుంది. ఆయన పేల్చిన జోక్ లు అక్కడక్కడా పేలాయి. దానికి తోడు ఆయన ట్రాక్  కథకు అసలు లింక్ ఉండదు.  ఇక అంజలి అయితే ఫెరఫార్మెన్స్ చించి ఆరేసింది. ఆమె లో ఇంత నటి ఉన్నా ఎందుకనో మెయిన్ స్ట్రీమ్ లో నిలబడలేకపోయింది.  సినిమాలో మిగతా నటీనటులంతా మనకు కనెక్ట్ కాని తమిళ బ్యాచే.

కథే దెబ్బకొట్టింది

సీన్స్ వస్తూంటాయి..వెళ్తూంటాయి…కానీ సినిమా కథ మాత్రం కదలదు. కథలోకి వచ్చేసరికి సెకండాఫ్ సగం అయ్యిపోతుంది. అప్పటిదాకా కథలో ప్రధాన మలుపులోకి రాకపోవటం బోర్ కొట్టే ఎలిమెంట్. అక్కడక్కడా హారర్  సీన్స్ బాగా పేలాయి కానీ అప్పటిదాకా ఆ హారర్ సీన్స్ కు సరబడ బేస్మెంట్ రెడీ చేయటంలోనే దర్శకుడు సమయం మొత్తం సరిపోయింది. దాంతో సినిమా వాళ్ల భాషలో చెప్పాలంటే ల్యాగ్, ప్రక్షకుడుభాషలో చెప్పాలంటే బోర్ వచ్చేసాయి.

3డి ఎఫెక్ట్ లు, టెక్నికల్  గా

ఇక హారర్ చిత్రాన్ని 3డిలో చూడటం ఓ కొత్త ఎక్సపీరియన్స్. ఆ విషయంలో కొన్ని థ్రిల్స్ ని డైరక్టర్ మనకు అందిస్తాడు. అవి ఖచ్చితంగా హారర్ అభిమానులకు నచ్చుతాయి. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్స్  ..భయపెట్టాయి.

సినిమాటోగ్రఫి , రీరికార్డింగ్ అంశాలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. 3డీ ఎఫెక్ట్స్ బాగున్నాయి.   హారర్ ఎఫెక్ట్స్ మాత్రం బాగా డిజైన్ చేసారు .  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు  ప్లస్ అయింది. ఎడిటింగ్ విభాగం పనితీరు బాగుంది. 

చూడచ్చా

మరీ తీసిపారేసే సినిమా కాదు..అలాగని కంపల్సరీగా చూడాల్సిన  సినిమాను కాదు.

ఆఖరి మాట

తెలుగు దెయ్యాలతోనే వేగలేకపోతూంటే ప్రక్క రాష్ట్రం నుంచి తమిళ దెయ్యాలను దిగుమతి చేసుకుని వదిలితే మరీ కష్టం.

నటీనటులు: అంజలి, మకరంద్ దేశ్‌పాండే, బ్రహ్మానందం, యోగిబాబు, సామ్ జోన్స్, సురేఖా వాణి తదితరులు 

దర్శకత్వం: రాజు విశ్వనాథ్ 

నిర్మాత: సురేష్ కొండేటి 

మ్యూజిక్: సంతోష్ దయానిధి 

సినిమాటోగ్రఫి: పీజీ ముత్తయ్య 

ఎడిటింగ్: ఎస్ఎన్ ఫాజిల్

బ్యానర్: ఎస్‌కే ఎంటర్‌టైన్‌మెంట్