లైవ్ లెజెండ్స్ కాన్సర్ట్
నవంబర్ 30న హైదరాబాద్ ఎల్బిస్టేడియంలో లైవ్ లెజెండ్స్ కాన్సర్ట్
సినీ గాయకుల ఆహ్వానం
కె.జె.ఏసుదాసు సంగీత దాసుడు. సుస్వారాల బాలుడు బాలసుబ్రమణ్యం. తీపి రాగాల కోయిల కె.ఎస్.చిత్ర సినీ వినీలాకాశంలో ఇప్పటికీ ఎప్పటికీ ఆ ముగ్గురు దేదీప్యమానంగా వెలిగే తారలు. ఆ తారలు మనకోసం దిగివచ్చే వేళయింది. ఈ ముగ్గురి అపురూప కలయికలో నవంబర్ 30న హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో ఎలెవన్ పాయింట్ టు మరియు బుక్ మై షో వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున సినీ సంగీత విభావరి నిర్వహించనున్నారు. టికెట్లు మరియు ఇతర వివరాల కొరకు బుక్ మై షోని సంప్రదించండి. అలేఖ్య హోమ్స్ సమర్పిస్తున్న ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం 5.30 నిముషాలకు మొదలు కానుంది.
ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ పార్క్ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
కె.జె.ఏసుదాసు మాట్లాడుతూ… నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నా సోదరుడు బాలసుబ్రమణ్యం, నా కూతురు లాంటి చిత్రతో కలిసి పాడడం చాలా సంతోషం. నా తండ్రిగారు చిన్నప్పటి నుండి ఎక్కువగా మాట్లాడకు పాడు అని చెప్పేవారు. ఏ భాషలోనైనా పాడటం నేర్చుకో మాట్లాడటం రాకపోయినా అని అన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ఆనందించగలరి కోరుకుంటున్నాను అన్నారు.
బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ… మేం ముగ్గురం కలిసి ప్రోగ్రాం చేస్తుంన్నాం. మొట్ట మొదటిసారిగా సింగపూర్‌లో చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. దీనికి కారణమైన లెవన్ టుపాయింట్, అలేఖ్య హోమ్స్ వారికి నా కృతజ్ఞతలు. ఇంత పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు దాని వెనక ఎంత కాల వ్యయం, ధన వ్యయం ఉంటుందో గమనించగలరు. ఈ కార్యక్రమాన్నిసపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా ముగ్గురు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. మా ముగ్గురు పాడిన పాటల సంఖ్య లక్షకి పైగా ఉంటాయి. ఒకొక్కరు 25, 30 వేలు పాటలు పాడాం. మూడుగంటల సేపు జరిగే ఈ కార్యక్రమంలో ఏ పాటలను సెలెక్ట్ చెయ్యాలి ఏమిటి అన్న గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఉంటుంది. మా మీద అభిమానంతో ప్రేమతో అది పాడతారు ఇది పాడతారు అనుకుంటారు. సాధ్యమైనంత వరకు అందరికి నచ్చే పాటలను ఎంపిక చేసుకుని దాన్ని మీ ముందు ఉంచుతాము. ఈ కార్యక్రమానికి వేరే వేరే రాష్ట్రాలనుంచి 20 మంది వాద్య బృందంకూడా వస్తున్నారు. ఇది అంత సుభమైన కార్యక్రమం కాదు దీని కోసం ఒక ఆరు నెలలు ప్రాక్టీస్ కావాలి. మాలో ఉన్న మంచి లక్షణం ఏమిటంటే ఇంకా మాకు భయం ఉండటం. భయముంటేనే కార్యక్రమం బాగా జరుగుతుంది. అందర్నీ ఆనందపరచడానికి మేము భయంతో భక్తితో శ్రద్ధతో కృషిచేస్తున్నాము. మీ అందరి అభిమానం, ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించాలి అన్నారు.
చిత్ర మాట్లాడుతూ… పెద్ద లెజెండ్స్ తో కలిసి పాడటం నా అదృష్టం. నాకు బాగా పాడాలని ఉంది. నాకు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.
అలేఖ్య హోమ్ శ్రీనాధ్ మాట్లాడుతూ… దిగ్గజాల ముందు మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. మా సంస్థ తరుపున ఏ కార్యక్రమం అయినా మీ ముందు ఉంటుంది. సంస్థ బ్రాండింగ్ కోసం మాత్రం కాదు. కోట్ల మందిని స్వరం తో అందరినీ అలరిస్తున్నారు. మీ స్వరం ఒక వరం. మహానుభావులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిన చరణ్‌కి కృతజ్ఞతలు.