Reading Time: 2 mins

విన‌రో భాగ్యము విష్ణు క‌థ మూవీ ‌రివ్యూ

Emotional Engagement Emoji 

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలలో పెద్ద ఆసక్తి కలిగించిన చిత్రం కిర‌ణ్ అబ్బవ‌రం విన‌రో భాగ్యము విష్ణుక‌థ‌. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా రూపొందటం, టీజర్, ట్రైలర్, నైబర్ నెంబర్ కాన్సెప్టు ఆసక్తి కలిగించడం తో ఓ లుక్కేద్దామా అని జనం ఫిక్స్ అయ్యారు. అయితే ఆ ఆసక్తి సినిమాలో కొనసాగించగలిగారా ఎక్సపెక్టేషన్స్ తగిన స్దాయిలో సినిమాలో ఉందా ? ఈ విష్ణుకథ ఏంటి ? వంటి వివరాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్:

తిరుపతి కుర్రాడు విష్ణు(కిర‌ణ్ అబ్బవ‌రం) సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి కాస్త సాయిపడవోయ్ టైపు కుర్రాడు. మరో ప్రక్క ద‌ర్శన (క‌శ్మీరా) ఎప్పుడెప్పుడు పాపులర్ అవుదామా అనే ఆలోచనలో, ప్రయత్నాల్లో ఉన్న ఓ యూట్యూబ‌ర్‌. ఆమె ఓ కొత్త కాన్సెప్ట్ కనుక్కుంటుంది. అది నంబ‌ర్ నైబ‌ర్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్టు ద్వారా తన ప్రక్క నెంబర్స్ అయిన విష్ణు, మార్కేండేయ శ‌ర్మ (ముర‌ళీ శ‌ర్మ)ల‌ని కలుస్తుంది. దాంతో వారి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఈ క్ర‌మంలోనే విష్ణు, శ‌ర్మ ఇద్ద‌రూ ద‌ర్శ‌న‌ను ప్రేమలో పడతారు. అలాగే యూట్యూబ్ లో పాపులర్ కావాలంటే ఏదైనా సెన్సేషన్ కంటెంట్ కావాలని సలహా ఇస్తాడు శర్మ. దాంతో దర్శన, శర్మ కలసి సాంగ్ కవర్ లు చేస్తారు. ఈ క్రమంలో దర్శన ఛానల్ పాపులర్ అవుతుంది. ఈ లోగా ద‌ర్శనకి మరో క్రేజీ ఐడియా వస్తుంది. శ‌ర్మతో క‌లిసి లైవ్ మ‌ర్డర్ అనే ప్రాంక్ వీడియోని ప్లాన్ చేస్తుంది ద‌ర్శన. అయితే ప్రాంక్ కాస్త నిజమైపోతుంది. శ‌ర్మ నిజంగానే ద‌ర్శ‌న పేల్చిన తూటాకు బ‌ల‌వుతాడు. దీంతో ఆ హ‌త్య కేసులో ద‌ర్శ‌న జైలు పాల‌వుతుంది. మ‌రి ఈ కేసు నుంచి త‌న ప్రేయ‌సిని బ‌య‌ట ప‌డేయ‌టం కోసం విష్ణు ఏం చేశాడు? ఈ కేసులో విష్ణుకి తెలిసే సంచలనమైన నిజం తెలుసుతుంది. ఏమిటా నిజం ? ప్రాంక్ వికటించడానికి కారణం ఏమిటి ? అసలు శర్మ చంపాల్సిన అవసరం ఎవరికి వుంది ? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి ? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

కిర‌ణ్ అబ్బవ‌రం సినిమాలు ప్రతీ సారీ ఏదో కొత్త ట్విస్ట్ లేదా విషయం చెప్పాలనుకుని దాని తప్పుతూండటం ఆనవాయితీగా మారింది. ఈ సారి అదే జరిగింది. నంబర్ నైబర్ కాన్సెప్టు అనేది వినటానికి కొత్త గా ఉంది. దానికి లవ్, కామెడీ, క్రైమా, యాక్షన్ ఇలా అన్ని కలపాలనుకుని బోల్తా పడ్డారు. అక్కడితో ఆగకుండా చివర్లో దేశభక్తి ఎలిమెంట్ ని కూడా యాడ్ చేసేసారు. ఓ చిన్న సినిమాకు ఇన్ని అవసరమా అని ఆలోచించలేదు. తన దగ్గర ఉన్న స్టఫ్ అంతా ఒకే కథలో చెప్పేయాలని డైరక్టర్ ఆవేశపడ్డాడని అర్దమవుతుంది. అలాగే సినిమాలో వచ్చే ట్విస్ట్ షాకింగ్ గా ఉండాలి అనుకున్నారు కానీ అది కథకు కలిసొస్తుందా లేక కామెడీగా తేలిపోతుందా అనేది కూడా చూసుకోలేదు. అయినా ఇలాంటి కథలో దేశభక్తి డైలాగులు దంచాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా అర్దం కాదు. అవేమీ లేకుండా ఉన్న కాన్సెప్టు చుట్టూనే కథను తిప్పితే ఖచ్చితంగా ఇంతకన్నా బెస్ట్ ఫిల్మ్ మనం చూసేవాళ్లం.

టెక్నికల్ గా

కెమెరా వర్క్, మ్యూజిక్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బ్యానర్ కు తగిన రీతిలో ఉన్నాయి. డైలాగులు కొన్ని చోట్ల బాగా పేలాయి. స్క్రిప్టు లో ట్విస్ట్ లు వదిలేస్తే చాలా వరకూ బాగానే ఎంగేజ్ చేసారు. కొత్త డైరక్టర్ అయినా ఎక్కడా తడబడకుండా మంచి అవుట్ ఫుట్ తీసుకున్నాడు.

నటీనటుల్లో

కిరణ్ అబ్బవరం – మన ప్రక్కింటి కుర్రాడిలా నటించటమే అతని ఏకైక ప్లస్. అయితే అక్కర్లేని చోట్ల ఫైట్స్ విసిగిస్తాయి. హీరోయిన్ కాశ్మీర బాగుంది అంతకు మించి ఆమె గురించి మాట్లాడుకునేది లేదు మురళి శర్మ పెద్ద పాత్రే మంచి ఈజ్ తో లాగేసాడు.

హైలెట్స్

ఎంగేజింగ్ కాన్సెప్టు
కామెడీ సీక్వెన్స్ లు కొత్తగా ఉండటం
సాంగ్స్

మైనస్ లు 

సెకండాఫ్ డ్రాగ్ అవటం
ఎక్కడా హై మూమెంట్స్ లేకపోవటం

చూడచ్చా

మరీ తీసిపడేసేది కాదు అలాగని పరుగెత్తుకెళ్లి చూసేది కాదు ఓటిటికు బెటర్ అనిపిస్తుంది.

న‌టీన‌టులు :

కిర‌ణ్ అబ్బ‌వ‌రం, క‌శ్మీరా, శుభ‌లేఖ సుధాక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, కేజీఎఫ్ ల‌క్కీ, ప‌మ్మి సాయి, దేవి ప్ర‌సాద్‌, ఎల్బీ శ్రీరామ్‌, శ‌ర‌త్ లోహితస్వ‌, ఆమ‌ని, ప్ర‌వీణ్.

సాంకేతికవర్గం :

సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్‌;
ఛాయాగ్ర‌హ‌ణం: డేనియ‌ల్ విశ్వాస్‌;
ద‌ర్శ‌క‌త్వం: ముర‌ళీ కిషోర్ అబ్బూరు;
నిర్మాత‌: బ‌న్నీ వాస్‌;
స‌మ‌ర్ప‌ణ‌: అల్లు అర‌వింద్‌;
రన్ టైమ్ : 138 మినిట్స్
విడుద‌ల తేదీ:18-02-2023