వజ్రం కాదు రాయి (‘వజ్రకవచధర గోవింద` మూవీ రివ్యూ)
Rating: 1.5/5
అనగనగా ఓ గోవింద్ (సప్తగిరి). అతను వృత్తికి దొంగైనా మనస్సు మాత్రం మానవత్వం పరిమళించే మహోన్నతమైనది. దాంతో అతనికి తన ఊళ్లో కనపడే కాన్సర్ పేషెంట్స్ ని చూడగానే గుండె నీరైపోతుంది. వాళ్ల కోసం ఏదో ఒకటి చేసి వాళ్లని సేవ్ చేయాలనిపిస్తుంది. కానీ ఏం చేయాలి. కాన్సర్ వైద్యం అంటే చిన్న విషయం కాదు. ఓ పది కోట్లు కావాలి. అప్పటికి ఆ విషయంలో వాళ్ల ఎమ్మల్యే లక్ష్మిప్రసన్న (అర్జన శాస్త్రి) హ్యాండ్ ఇస్తుంది. దాంతో ఎలా ఆ డబ్బుని సంపాదించాలి అని మధన పడిపోతున్న సమయంలో ఓ నిధి గురించిన మ్యాటర్ గోవింద్ కు తెలుస్తుంది. అది ఓ వజ్రం రూపంలో ఉంటుంది.
ఆ వజ్రం ఓ నూట యాభై కోట్లు వరకూ ఉంటుంది. అసలే దొంగ..ఆపై జనాల సంరక్షణే జీవితాశయం అంటూ ముందుకు వెళ్తున్న గోవింద్ ఊరుకుంటాడా…ఆ వజ్రాన్ని లేపేయటానికి ఓ స్కెచ్ వేస్తాడు. అంతా బాగానే జరిగి వజ్రం చేతికివచ్చిన సమయంలో ఓ ఊహించని ట్విస్ట్ పడుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి , గోవింద్ ..ఆ వజ్రం అమ్మి కాన్సర్ పేషెంట్స్ ని కాపాడి ఎలా ‘వజ్రకవచధర గోవింద` అనిపించుకున్నాడు…ఈ సినిమాలో విలన్ బంగారప్ప, హీరోయిన్ త్రిపుర పాత్రలేమిటి అనే విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే సినిమాకు వెళ్లచ్చు.
పాత కథ, పాత ట్రీట్మెంట్
ఓ మంచి దొంగ…అతనికి రాబిన్ హుడ్ టైప్ ఆలోచనలు అనేవి మన ఇండియన్ తెరకు కొత్తేమీ కాదు. అయితే సప్తగిరికు ఈ పాయింట్ కొత్త. అలాగే ఈ మధ్యకాలంలో ఇలాంటి కథలతో సినిమాలు చేయటం లేదు కాబట్టి నిర్మాత,దర్శకులకు కొత్తే. అయితే జనాలకు మాత్రం ఈ సినిమాను పాతగానే ఫీలయ్యారు. అందుకు కారణం దర్శకుడు ఈ పాత పాయింట్ కు తగ్గట్లుగా పాత తరహా ట్రీట్మెంట్ నే చేయటం.
సప్తగిరి సినిమా అంటే కామెడీ చూడటానికి వెళ్తారు అని మర్చిపోవటం. అతని మెప్పుకోసం మాస్ హీరోలా ప్రెజెంట్ చేయటం సినిమా చూస్తున్న మనకి సహన పరీక్ష పెడతాయి. దానికి తోడు ఫస్టాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ కంటే సెంటిమెంట్ సీన్సే కే పెద్ద పీట వేసాడు దర్శకుడు. ఊరి కథ..కాన్సర్ బాధితుల సమస్యలు..ఎమ్మెల్యే చేసిన మోసం ఇవన్నీ బోర్ కొట్టిస్తాయి. పోనీ కామెడీ ఏమన్నా కొత్తగా ఉందా అంటే అందులోనూ కొత్తదనమేమి ఉండదు. పరమ రొటీన్ కామెడీ సన్నివేశాలే రిపీట్ అవుతూంటాయి. సినిమాలో ఏకైక నవ్వొచ్చే ఎలిమెంట్… హీరో వజ్రాన్ని ఎక్కడ పెట్టాడో మర్చిపోవడం అన్నది ..అయితే దానిమీద అల్లుకున్న సీన్స్ లో విషయం లేదు.
టెక్నికల్ గా…
ఈ సినిమా ఏ స్టాండర్డ్స్ లో ఉందనేందుకు ఒకే ఒక ఉదాహరణ చెప్పచ్చు. సినిమా మొత్తానికి కీలకంగా నిలిచే వజ్రం…ఓ రాయికు రంగేసినట్లు ఉంటుంది. ఎక్కడా ఆ మెరుపులు కనపడవు. రెండు వందల కోట్ల విలువ చేసే వజ్రం అని చెప్పబడే అది ఇరవై రూపాయల విలువ కూడా చెయ్యదనిపిస్తుంది. అంత నిర్లక్ష్యంగా ఉన్నారు.
చూడచ్చా…
సప్తగిరి ఫ్యాన్ అయితే తప్పకుండా వెళ్లి తీరాలి
తెర వెనక …ముందు
నటీనటులు : సప్తగిరి, వైభవి జోషి, శ్రీనివాస్ రెడ్డి, అర్చన, వేణు తదితరులు
సంగీతం : బుల్గానియన్
నిర్మాత : నరేంద్ర, జీవిఎన్ రెడ్డి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : అరుణ్ పవర్
బ్యానర్: శివ శివమ్ ఫిల్మ్స్
విడుదల తేదీ: 14-06-2019