Reading Time: 2 mins

శ్రీదేవి సోడా సెంటర్ మూవీ రివ్యూ


Rating:2.5/5

పలాస తో పేరు తెచ్చుకున్న డైరక్టర్, హిట్ కోసం కలవరిస్తున్న సుధీర్ బాబు కాంబినేషన్ లో కసితో వచ్చిన సినిమా అనేలా ప్రోమోలు వదిలారు. నిజమే కాబోలు అనుకుని జనం థియోటర్స్ కు కరోనాని లెక్క చేయకుండా వెళ్తున్నారు. నిజంగానే సినిమాలో అంత సీన్ ఉందా..అసలు ఈ సినిమాలో కథేంటి..ఈ సోడా సెంటర్ ..ఎన్ని సెంటర్లలో గట్టెక్కుతుంది..డైరక్టర్ ఈ సినిమాలో చర్చించిన కొత్త పాయింట్ ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 
కథ
అమలాపురం కుర్రాడు సూరిబాబు (సుధీర్ బాబు) ఒక లైటింగ్ సెట్ చేస్తూంటాడు. అదే ఊళ్లో శ్రీదేవి (ఆనంది)ఫ్యామిలీది ఒక సోడా సెంటర్. ఊళ్లో పండగలప్పుడు, జాతరలప్పుడు శ్రీదేవికు లైటింగ్ కొడుతూంటాడు సూరిబాబు. అయితే అది ఆమె తండ్రి (నరేష్) కి నచ్చదు. తన కూతురిని తన కులానికి చెందిన వాడితో పెళ్లి చెయ్యాలనుకుంటాడు. కానీ  సూరిబాబు వేరే కులం. ఆమె వెనకాల పడగపడగా ఆమె సూరిబాబుకు పడుతుంది. అయితే అదే శ్రీదేవి అంటే అదే ఊళ్లో ఉండే కాశి (పావెల్ నవగీతన్) అనే మోతుబరి కు మోజు. అతని ప్లస్ పాయింట్ తను శ్రీదేవి కులానికి చెందినవాడు కావటమే.ఈ కులాల రచ్చ లోంచి శ్రీదేవి బయిటకు వచ్చి సూరిబాబు ని పెళ్లి చేసుకుంటుందా ? ఆమె ప్రేమ కథ చివరకు ఏమౌతుంది? కాశి కాన్సెప్టు ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ …

 కులం, పరువు హత్యలు నేపధ్యంలో రోజు వారీ ఎన్నో వార్తలు చూస్తూంటాం. అయితే వాటిని తెరకెక్కించాలనుకున్నప్పుడు అది డాక్యుమెంటరీలాగ కాకుండా వార్తలాగ అనిపించకుండా సినిమా టెక్ ఎెక్సపీరియన్స్ ఇవ్వగలగాలి. అలాగని మరీ కమర్షయలైజ్ చేస్తే సోల్ పర్పస్ పోతుంది. అదే ఈ సినిమా కు జరిగింది. యాజటీజ్ గా కథను చెప్తే ఎక్కడ బోర్ వచ్చేస్తుందో అని సుధీర్ బాబు వంటి కమర్షియల్ చట్రంలో ఉన్న హీరోని తీసుకొచ్చి కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పిస్తూ సినిమా చేసారు. అయితే దాన్నే పూర్తిగా కొనసాగించలేకపోయారు. సినిమా క్లైమాక్స్ లో ట్విస్ట్ తప్పించి ఏదీ ఇంట్రస్టింగ్ గా లేదు. వినటానికి లైటింగ్ ,సోడాలు అనేవి బాగున్నా..వాటిపై ప్లే చెయ్యలేదు. టైటిల్ చూసి ఏదో మాస్ పాయింట్ అనుకుని వెళ్తే అది కులాల గొడవల దగ్గర ఆగటం  మింగుడు పడని స్దితికి వచ్చింది.అదేదో సినిమాని మొదట నుంచి ఫలానా రకం అని ప్రిపేర్ చేసినా వాటిని ఇష్టపడే ప్రేక్షకులు వచ్చేసారు. వారికి నచ్చే అవకాసం ఉండేది. ఇది రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.

మొదట సీన్ నుంచి ప్రతీ సీన్ ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గట్టే సాగుతుంది. అంతేకాదు గతంలో చూసిన కొన్ని సినిమాలు, వాటిల్లోని స‌ీన్స్ గుర్తుకు వ‌స్తూ ఉంటాయి. ఇంటర్వెల్ స‌మ‌యంలో వచ్చే మలుపు,క్లైమాక్స్ తీసేస్తే  సినిమాలో ఏమీ లేదు. క్లైమాక్స్ చూసాక..ఈ పాయింట్ ని నమ్ముకునా ఇంత సినిమా చేసింది అనిపిస్తుంది.షార్ట్ ఫిల్మ్ కు సరపడ పాయింట్ అని చెప్పాలనిపిస్తుంది. అలాగే ప్రతీ క్లైమాక్స్ ట్విస్ట్ ఉన్న సినిమా ఉప్పెన కాదు అని కూడా అర్దమవుతుంది.సైరాట్, ధడక్, ఉప్పెన, రంగస్థలం వంటి సినిమాలు చూసిన వారికి ఈ కథలో పెద్ద కిక్ ఇచ్చే ఎలిమెంట్ ఏదీ కనపడదు. ఏదైమైనా ‘ప‌లాస’ స్థాయి ఇంపాక్ట్ ఈ సినిమాలో ఇవ్వలేకపోయారు.  
 
నచ్చినవి
క్లైమాక్స్,ఇంట్రవెల్
సుధీర్ బాబు నటన
సీనియర్ నరేష్ యాక్టింగ్

 నచ్చనవి
రొటీన్ కథ
బోర్ గా సాగే ఫస్టాఫ్
దాదాపు 40 నిమిషాలు పాటు క్లైమాక్స్  సాగటం

డైరక్షన్, మిగతా క్రాఫ్ట్ ల పనితనం

తమిళంలో పా రంజిత్,వెట్రిమారన్ తరహాలో ఇక్కడ క‌రుణ కుమార్ ఓ జాతి జీవితాలను,కష్టాలని,కన్నీళ్లని తెరకెక్కించాలని తాప‌త్ర‌య‌ప‌డుతున్నాడు. అయితే అదే కంటిన్యూ చేస్తే రొటీన్ అయ్యిపోతోంది. తమిళంలో ఆదరించినట్లుగా ఇక్కడ ఏ మేరకు ఆ తరహా సినిమాలును ఆదరిస్తారో చూడాలి. ఆ విషయం ప్రక్కన పెడితే కంటెంట్ కన్నా డైలాగులు బాగున్నాయి. ప్రొడక్షన్ పెద్దది కాబట్టి వాల్యూస్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ మినహా అందరూ మంచి అవుట్ ఫుట్ ఇచ్చారనే చెప్పాలి.శ్యాంద‌త్ కెమెరా విజువల్స్ ని పట్టుకోవటం విజృంభించింది. ముఖ్యంగా ప‌డ‌వ పోటీల్లో విజువ‌ల్స్ అదిరిపోయాయి. మ‌ణిశ‌ర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రధాన బలం. పాటలు ఓకే అనిపిస్తాయి.
 
నటీనటుల్లో  లైటింగ్ సూరిబాబు పాత్రలో సుధీర్‌బాబు ఫెరఫెక్ట్ అనిపించాడు.  గోదావ‌రి యాస‌ని పలుకుతూ పాత్రకు ప్రాణం పోసాడు.ఇక శ్రీదేవిగా ఆనంది అందం,అభినయంతో మెప్పిస్తుంది. న‌రేశ్‌ హీరోయిన్ తండ్రిగా గుర్తుండిపోతాడు.
 
 తెర ముందు….వెనక
 నిర్మాణ సంస్థ: 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌
 నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది, ప‌వెల్ న‌వ‌గీత‌న్‌‌, న‌రేశ్‌, ర‌ఘుబాబు, అజ‌య్‌, స‌త్యం రాజేశ్‌, హర్షవర్ధన్‌, స‌ప్తగిరి, క‌ళ్యాణి రాజు, రొహిణి, స్నేహ గుప్త, త‌దిత‌రులు;
సంగీతం: మణిశర్మ
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్;
సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌ సైనుద్దీన్‌
క‌థ: నాగేంద్ర కాషా;  
 స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కరుణ కుమార్‌
నిర్మాతలు: విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి
రన్ టైమ్: 2గం|| 34ని||
విడుదల తేదీ: 27 ఆగస్టు 2021