Reading Time: < 1 min

షూటింగ్ జ‌రుపుకుంటున్న మొద‌టి చిత్రం క్ర‌ష్‌

లాక్‌డౌన్ త‌ర్వాత షూటింగ్ జ‌రుపుకుంటున్న మొద‌టి చిత్రం ర‌విబాబు ‘క్ర‌ష్‌’

నూత‌న తారాగ‌ణంతో ర‌విబాబు రూపొందిస్తోన్న చిత్రం ‘క్ర‌ష్‌’. ఆద్యంతం ఆస‌క్తిక‌ర క‌థ‌నంతో సాగే ఈ చిత్రానికి సంబంధించి ఆరు రోజుల షూటింగ్ మాత్ర‌మే మిగిలుంది. క‌రోనా మ‌హ‌మ్మారిని నిరోధించ‌డంలో భాగంగా లాక్‌డౌన్ విధించ‌డంతో మూడు నెల‌ల క్రితం షూటింగ్‌లు ఆగిపోయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం లాక్‌డౌన్ ఎత్తివేయ‌డంతో టాలీవుడ్‌లో షూటింగ్‌లు చేసుకోవ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం కొన్ని నియ‌మ నిబంధ‌న‌ల‌తో ప‌ర్మిష‌న్ ఇచ్చింది. దీంతో డైరెక్ట‌ర్ ర‌విబాబు త‌న సినిమా ‘క్ర‌ష్’ షూటింగ్‌ను పున‌రుద్ధ‌రించారు. లాక్‌డౌన్ అనంత‌రం టాలీవుడ్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న మొద‌టి సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. నాలుగు రోజుల నుంచి రామానాయుడు స్టూడియోస్‌లో హీరో హీరోయిన్ల‌పై ర‌విబాబు కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ప్ర‌భుత్వ విధి విధానాల‌ను పాటిస్తూ, అవ‌స‌ర‌మైన టెక్నీషియ‌న్స్‌తోనే ఈ షూటింగ్ నిర్వ‌హిస్తున్నామ‌ని ర‌విబాబు తెలిపారు. మంగ‌ళ‌వారంతో టాకీ స‌న్నివేశాలు పూర్త‌వుతాయ‌ని ఆయ‌న అన్నారు.

“అంద‌రూ అన్ని ప‌నులూ, అన్ని వ్యాపారాలూ చేసుకుంటున్నారు. మ‌న‌ సినిమావాళ్ల‌కు సినిమాలు త‌ప్ప ఇంకేం తెలియ‌దు. మ‌నం మాత్రం మ‌న ప‌ని ఎందుకు చేసుకోకూడ‌దు? ప‌్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌లు, సూచ‌న‌ల‌కు అనుగుణంగా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ షూటింగ్‌లు చేసుకుందాం. అవ‌స‌ర‌మైన మేర‌కు మేం న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు క‌లిపి ‘క్ర‌ష్’ సినిమా కోసం 26 మందిమి ప‌ని చేస్తున్నాం. సినిమా ఇండ‌స్ట్రీలో 12 వేల‌కు మంది పైగా ప‌నిచేస్తున్నారు. షూటింగ్‌లు జ‌రిగితేనే అంద‌రికీ ప‌నీ, త‌ద్వారా ఉపాధీ ల‌భిస్తుంది” అని ర‌విబాబు చెప్పారు.