Reading Time: 5 mins
సంతోషం సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019
 
అంగరంగ వైభవంగా సంతోషం సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019 వేడుక
శ్రియకు శ్రీదేవి స్మారక పురస్కారం.. బెస్ట్‌ యాక్టర్‌గా కార్తికేయ.. 
 
సంతోషం సినీ వారపత్రిక 17వ వార్షికోత్సవం, సంతోషం సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019 ప్రదానోత్సవం చిత్రసీమ అతిరథ మహారథుల సమక్షంలో, వేలాది మంది ప్రేక్షకుల మధ్య అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం నిర్విరామంగా 6 గంటకు పైగా సాగిన ఈ వేడుకలో తారల ప్రసంగాలు, డాన్స్‌ పర్ఫార్మెన్స్‌లు, సరదా స్కిట్‌లు హైలైట్‌గా నిలిచాయి. అలనాటి తార జమున, ప్రభ, రోజారమణి, నటి`దర్శకురాలు జీవిత, నటులు రాజేంద్రప్రసాద్‌, రాజశేఖర్‌, బాబూమోహన్‌, సునీల్‌, వెన్నెల కిశోర్‌, ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీరాజ్‌, కార్తికేయ, రాంకీ, విష్వక్‌సేన్‌, నేటి తారలు శ్రియ, శివానీ, శివాత్మిక, నటాషా దోషి, అవికా గోర్‌, దీప్తి సునయన, ప్రముఖ నిర్మాతలు డి. సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌, అంబికా కృష్ణ, దిల్‌ రాజు, తమిళ హీరో జయం రవి, కన్నడ నటుడు, ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌, తమిళ వెటరన్‌ యాక్ట్రెస్‌ కుట్టి పద్మిని, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సంగీత దర్శకుడు తమన్‌, గాయకుడు అనురాగ్‌ కులకర్ణి తదితరులు ఈ వేడుకకు అమితమైన ఆకర్షణ తీసుకొచ్చారు.
 
ప్రముఖ ఫిల్మ్‌ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి సీనియర్‌ హాస్యనటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్‌ చేతుల మీదుగా ఫిల్మ్‌ జర్నలిజంలో లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. పదిహేడు సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ వేడుకను ఒంటిచేత్తో నిర్వహించడం సురేష్‌ కొండేటికే సాధ్యమని బాబూ మోహన్‌ ప్రశంసించారు.
 
‘మహానటి’లో నటనకు గాను ఉత్తమ సపోర్టింగ్‌ ఆర్టిస్టు అవార్డును జమున చేతుల మీదుగా అందుకున్న డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావుగారు నా సినిమాలు చూసి ఆనందించేవారని చెప్పారు. అందుకు అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవార్డు రావడానికి కారకులు ఆ పాత్రను సృష్టించిన రచయితలు, దర్శకులు. వాళ్లిచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపర్చుకున్నాను. నేను మీరు ఫీలయినంతకాలం పనిచేస్తూనే వుంటాను. అల్లు అరవింద్‌ వంటి సీనియర్‌ నిర్మాతలు మంచి సినిమాలు తీసి అవకాశాలు ఇవ్వడం వల్ల ఇలాంటి అవార్డులు దక్కుతాయి. ఏ కళాకారుకారుడికైనా ఈ అవార్డులు ఉత్సాహాన్నిస్తాయి’’ అన్నారు.
 
‘మహానటి’ చిత్రంలో చిన్నప్పటి సావిత్రిగా నటించిన సాయి తేజస్వినికి జమున బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్టు అవార్డు అందజేశారు. సాయి తేజస్విని మాట్లాడుతూ.. ‘‘వెరీ హ్యాపీ.. నాకీ అవార్డు ఇచ్చిన సురేష్‌ అంకుల్‌కు థ్యాంక్స్‌. ‘మహానటి’ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ గారికీ, ప్రొడ్యూసర్‌ స్వప్నా దత్‌ గారికీ థ్యాంక్స్‌’’ అన్నారు.
 
65 సంవత్సరా సినీ జీవితం పూర్తయిన సందర్భంగా విఖ్యాత నటి జమున నిర్మాతలు అల్లు అరవింద్‌, డి. సురేశ్‌ బాబు చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘జమునగారు నటించిన తొలి సినిమా ‘పుట్టిల్లు’లో మా నాన్నగారు (అల్లు రామలింగయ్య) కూడా నటించారు. మద్రాస్‌లో మేముండే వీధిలోనే ఆమె కూడా ఉండేవారు. ఇప్పుడు ఆమెకు నేను అవార్డు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. 
సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘మా నాన్నగారు సోలోగా నిర్మించిన మొదటి సినిమా ‘రాముడు భీముడు’లో జమున గారు హీరోయిన్‌గా నటించారు. నా చిన్నతనంలో మేము, ఆమె ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్లం. నా చేతుల మీదుగా ఆమెకు అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు.
 
జమున మాట్లాడుతూ ‘‘అరవింద్‌, సురేశ్‌బాబు నా బిడ్డల్లాంటి వాళ్లు.. సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నిర్మాతలుగా ఉండడం ఆనందదాయకం. సురేష్‌ కొండేటి ఈ అవార్డును అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు.
 
ఆమె సన్మాన కార్యమ్రంలో పాల్గొన్న రోజారమణి మాట్లాడుతూ ‘‘ఇక్కడ రెండు సంఘటను గుర్తుకు వస్తున్నాయి. జమున అమ్మకు కొడుకులా నేను నటిస్తే, కూతురుగా కుట్టి పద్మిని నటించింది. ఇద్దరూ ఒకే స్టేజీమీద వుండడం చాలా ఆనందాన్ని కల్గించింది. జమునగారు పెద్ద నటి అయినా స్వంత బిడ్డగా ప్రేమిస్తారు. సన్మానంలో మేం కూడా వుండడం సంతోషం’’ అన్నారు. 
 
జమున చేతుల మీదుగా సీనియర్‌ నటి, నర్తకి ప్రభ లెజెండరీ యాక్ట్రెస్‌ అవార్డు అందుకున్నారు. ఆమె మాట్లాడుతూ ‘‘ఎవరికైనా సగం బలం సంతోషమే.. ఇన్నేళ్లుగా ఈ వేడుక నిర్వహిస్తూ మన సురేష్‌ ఎన్ని పాట్లు పడుతున్నాడో! అందరితో కలిసిమెసి ఉంటూ ఇలాంటి పెద్ద కార్యక్రమం చేస్తున్నాడంటే సినీ పెద్దలందరి సహకారమే కారణం. తన సంతోషాన్ని మాలాంటి ఆర్టిస్టుతో పంచుకుంటున్న సురేష్‌కు ధన్యవాదాలు. ఆర్టిస్టుకు ఇలాంటి ఎంకరేజ్‌మెంట్‌ ఉంటే చాలా ఉత్సాహంగా పని చేస్తాం. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.
 
అల్లు రామలింగయ్య అవార్డును అల్లు అరవింద్‌ చేతుల మీదుగా అందుకున్న వెన్నెల కిశోర్‌ మాట్లాడుతూ ‘‘మామూలుగా ఒక అవార్డు తీసుకెళ్లినప్పుడు.. నా పేరు చూసి హ్యాపీగా ఫీలయ్వేవాడిని. కానీ ఈ అవార్డుపై అల్లు రామలింగయ్యగారి పేరు చూసి ఇంట్లో గర్వంగా ఫీలవుతారు. ఈ అవార్డును నా రచయితలకు, దర్శకులకు అంకితమిస్తున్నా. నేను ఈ జన్మకు హీరోగా చేయను. హీరో ఫ్రెండ్‌గా చాలు. హీరో అవ్వాలంటే దానికి అర్హత కావాలి. ఆ క్వాలిఫికేషన్‌ లేదు. బాడీ ఔటాఫ్‌.. ఫుడ్‌ త్యాగం చేయలేను’’ అని నవ్వించారు.
 
డి. రామానాయుడు స్మారక అవార్డును సురేశ్‌బాబు చేతుల మీదుగా అందుకున్న దిల్‌ రాజు ‘‘ఒక జర్నలిస్ట్‌గా మొదలై.. ఇంతమందికి అవార్డు ఇచ్చే స్థాయికి ఎదిగిన సురేష్‌కు అభినందనలు. ఇది మామూలు ఫీలింగ్‌ కాదు.. ‘శతమానంభవతి’కి జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యానో.. ఈ అవార్డుకు కూడా అలా ఫీలవుతున్నా. రామానాయుడుగారి సినిమాలు నాకు గ్రేట్‌ ఇన్‌స్పిరేషన్‌. ఆయన అవార్డు సురేశ్‌ బాబుగారి చేతుల మీదుగా తీసుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు.
 
‘అరవింద సమేత’లో నటనకు గాను నిర్మాత అంబికా కృష్ణ చేతుల మీదుగా ఉత్తమ హాస్యనటునిగా పురస్కారం అందుకున్న సునీల్‌ మాట్లాడుతూ.. ‘‘సంతోషం సురేష్‌కి థాంక్స్‌. ఈ అవార్డు వచ్చినందుకు నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌కు, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌కు, ఎన్టీయార్‌కు ధన్యవాదాలు. ఈ అవార్డును వేణుమాధవ్‌ గారికి అంకితమిస్తున్నా’’ అని చెప్పారు.
 
‘ఆర్‌ఎక్స్‌ 100’లో నటనకు గాను బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అవార్డు అందుకున్న రాంకీ మాట్లాడుతూ ‘‘ఒక చక్కని పాత్రతో తెలుగులో ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిత్రసీమకు చెందిన ఇంతమంది గొప్పవాళ్ల సమక్షంలో ‘సంతోషం’ అవార్డును అందుకోవడం ఎప్పటికీ మరచిపోలేను’’ అన్నారు.
 
అంబికా కృష్ణ చేతుల మీదుగా ఆత్మీయ పురస్కారం అందుకున్న ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీ రాజ్‌ మాట్లాడుతూ.. అవార్డు వేడుక ఒక సంవత్సరం చేయాలంటేనే చాలా కష్టం, అలాంటిది 17 సంవత్సరాలు చేశారంటే.. కష్టానికి ప్రతిరూపం ఎవరంటే సురేష్‌. ఆయన కష్టానికి ఇష్టుడు. అందరూ ప్రేమించే వ్యక్తి. అందుకే మెగాస్టార్‌ ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడు. నేను సురేష్‌ కోసమే ఇక్కడకు వచ్చాను. ఆయన మరో వందేళ్లు అలాగే సంతోషంగా ఉండాలి’’ అన్నారు.
 
‘రంగస్థం’ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడి అవార్డును సుకుమార్‌ బదులు ఆయన సతీమణి తబిత అందుకున్నారు. నిర్మాతలు సురేశ్‌బాబు, దిల్‌ రాజు ఈ అవార్డును అందజేశారు. 
 
శ్రియ చేతుల మీదుగా బెస్ట్‌ డెబ్యూ హీరో అవార్డు అందుకున్న ‘ఫలక్‌నుమా దాస్‌’ హీరో విష్వక్‌సేన్‌ మాట్లాడుతూ.. ‘‘10 ఏళ్ల క్రితం నా ఫ్యామిలీతో సంతోషం అవార్డుకు వచ్చా. హాల్‌ నిండిపోయిందని పంపించేశారు. ఇప్పుడు అదే ఈవెంట్‌లో అవార్డు తీసుకోవడం చాలా గర్వంగా ఉంది. నాకు అవార్డు ఇచ్చినందుకు శ్రియకు థ్యాంక్స్‌. మా డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌కు ఈ అవార్డు అంకితమిస్తున్నా’’ అన్నారు.
 
‘ఆర్‌ ఎక్స్‌ 100’ మూవీలో నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డును శ్రియ, జయం రవి చేతుల మీదుగా హీరో కార్తికేయ అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఇది నా ఫస్ట్‌ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు. ఒక అవార్డు ఫంక్షన్‌కు రావడం ఇదే తొలిసారి. నేను తెలుగులో జయం రవిగారిలా ఉండాని అనుకుంటున్నా. ఈ అవార్డు తీసుకునేంత అర్హత ఉందో లేదో నాకు తెలీదు. ఈ అవార్డును శ్రియ, జయం రవిగారి చేతుల మీదుగా తీసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. నాకు మంచి బ్రేక్‌ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని చెప్పారు.
 
డాక్టర్‌ రాజశేఖర్‌, జయం రవి చేతుల మీదుగా శ్రీదేవి స్మారక అవార్డును శ్రియ అందుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. శ్రీదేవి మేడం పాటలు ఎప్పుడూ వింటూ ఉంటా. ఆమె అందరికీ ఇన్సిపిరేషన్‌. మా అమ్మ ముందు ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా స్పెషల్‌ అవార్డు. మరిన్ని మంచి సినిమాలతో మిమ్మల్ని అలరించడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు.
 
రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ‘‘శ్రీదేవి గారి పేరిట ఒక అవార్డు.. మా చేతుల మీదుగా ఇవ్వడం ఆనందంగా ఉంది. శ్రీదేవి గారు ఎంతమంచి యాక్టరో శ్రియ కూడా అంతమంచి యాక్టర్‌. శ్రియలో శ్రీదేవి గారి పోలికలు ఉంటాయి. అలాగే మా పెద్దమ్మాయిలో కూడా శ్రీదేవి గారి పోలికలు ఉంటాయి. సురేష్‌ గారు 17 ఏళ్లుగా ఈ వేడుకలు చేస్తున్నారు. నన్ను ఎన్నోసార్లు పిలిచారు. నేను సంతోషం అవార్డ్స్‌ ఈవెంట్‌కు రావడం ఇదే తొలిసారి. సంతోషం సురేష్‌ గారికి కంగ్రాట్స్‌’’ అన్నారు.
 
జీవిత మాట్లాడుతూ.. ‘‘శ్రీదేవి గారి గురించి మాట్లాడ్డానికి మాటలు చాలవు. ఆమె అతిలోక సుందరి. ఆమెకు రీప్లేస్‌ మెంట్‌ లేదు. ఈ అవార్డు శ్రియకు ఇవ్వడం 100 శాతం కరెక్ట్‌’’ అన్నారు.
 
‘అరవింద సమేత’లో నటనకు గాను బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవార్డును రాజశేఖర్‌, కార్తికేయ, జీవిత చేతుల మీదుగా తమన్‌ అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘అరవింద సమేత నాకు చాలా స్పెషల్‌.. ఇది నా 100 సినిమా. ఈ అవార్డును తారక్‌, త్రివిక్రమ్‌లకు అంకితం ఇస్తున్నా. సీతారామ శాస్త్రి గారి వంటి లెజెండరీ రైటర్‌ మనకు ఉండడం మన అదృష్టం. నేను ఆయనను పెదనాన్న అని పిసుస్తుంటా. ఈ వేడుకను ఎంత కష్టమైనా ఎంత ఇష్టంగా సురేశ్‌ చేస్తుంటారో నాకు తెలుసు’’ అని చెప్పారు.
 
తమిళంలో ‘అడంగమరు’ చిత్రంలో నటనకు గాను బెస్ట్‌ యాక్టర్‌గా సురేష్‌ బాబు, దిల్‌ రాజు చేతుల మీదుగా అవార్డు అందుకున్న జయం రవి మాట్లాడుతూ ‘‘ఈ అవార్డు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. లెజెండ్స్‌ ముందు ఈ అవార్డు తీసుకుంటున్నా. సురేష్‌ గారికి చాలా థ్యాంక్స్‌. ‘అడంగమరు’ నాకు చాలా బాగా నచ్చిన సినిమా. ఎడిటర్‌ మోహన్‌గారు మానాన్న గారు. చాలా హిట్‌ సినిమాలకు పని చేశారు. నేను ఈ ఇండస్ట్రీలో సిన్సియర్‌గా ఉంటున్నానంటే.. ఆ గుణం ఆయన నుంచే వచ్చిందే’’ అన్నారు.
 
తమిళంలో మోస్ట్‌ వెర్సటైల్‌ లెజండరీ యాక్ట్రెస్‌ అవార్డును జమున చేతుల మీదుగా అందుకున్న కుట్టి పద్మిని మాట్లాడుతూ ‘‘చెన్నైలో వున్న నన్ను పిలిచి అవార్డు ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీ అంటే మాకు చిరంజీవిగారే. మా పిల్లలకు మహేష్‌, ప్రభాస్‌ అంటే పిచ్చి. చిన్నప్పుడు మహేష్‌ వాళ్లుండే వీధిలోనే మేం వుండేవాళ్ళం’’ అని గుర్తు చేసుకున్నారు.
 
‘పందెంకోడి 2’, ‘సర్కార్‌’ చిత్రాల్లో నటనకు గాను బెస్ట్‌ విలన్‌ (తమిళం)గా అవార్డు అందుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘పందెంకోడి 2 దర్శకుడు లింగుస్వామి, ‘సర్కార్‌’ దర్శకుడు మురుగదాస్‌కు ధన్యవాదాలు.. మీ ప్రేమకు థాంక్స్‌. తెలుగులో మరిన్ని సినిమాలతో రావాలని ట్రై చేస్తున్నా’’ అన్నారు.
 
ఇంకా అవార్డులు అందుకున్నవారిలో తెలుగులో ‘రంగలస్థలం’లో ‘రంగమ్మా.. మంగమ్మా’ పాటకుగాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్‌ రక్షిత్‌, కన్నడంలో ఉత్తమ నటుడిగా ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌, బెస్ట్‌ యాక్ట్రెస్‌గా మాళవిక, బెస్ట్‌ డైరెక్టర్‌గా సంతోష్‌, తమిళంలో బెస్ట్‌ కమెడియన్‌గా సతీశ్‌ తదితరులు ఉన్నారు. అలాగే తెలుగులో ‘మహానటి’గా అద్భుతంగా అభినయించిన కీర్తి సురేశ్‌కు ఉత్తమ నటిగా, అదే చిత్రంలో ‘మూగమనసులు..’ పాటను గొప్పగా రాసిన సిరివెన్నె సీతారామశాస్త్రికి ఉత్తమ గేయరచయిత పురస్కారాలు ప్రకటించారు.
 
ఉదయభాను, సమీర్‌, తనీష్‌, తేజస్విని మదివాడ యాంకర్లుగా వ్యవహరించిన ఈ వేడుకలో కామెడీ హీరో సంపూర్ణేష్‌బాబు, హీరోయిన్లు నభా నటేష్‌, అవికా గోర్‌, నటాషా దోషి, తేజస్విని, దీప్తి సునయన చేసిన డాన్స్‌ పర్ఫార్మెన్సులు, సింగర్స్‌ రఘురామ్‌, శ్రుతి, గాయత్రి ఆలపించిన పాటలు, ఉప్పల్‌ బాలు పర్ఫార్మెన్స్‌ ఆహూతుల్ని అమితంగా అలరించాయి.