సాగర్ చంద్ర విలేకర్ల సమావేశం
‘భీమ్లానాయక్’ నన్ను మరో మెట్టు ఎక్కించింది – సాగర్ చంద్ర
పవన్‌కల్యాణ్, రానా కాంబినేషన్లో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు– స్క్రీన్ ప్లే అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
సినిమా సాధించిన సక్సెస్ గురించి దర్శకుడు సాగర్ చంద్ర సోమవారం విలేకర్లతో మాట్లాడారు.
ఆ విషయాలు ఆయన మాటల్లోనే…
‘భీమ్లా నాయక్’ ప్రాజెక్ట్ గురించి..?
ఫస్ట్‌లాక్ డౌన్ సమయంలో నిర్మాత వంశీ గారు ఫోన్ చేసి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం గురించి మాట్లాడి, ఆ సినిమా చూసి అభిప్రాయం చెప్పమన్నారు. కొద్దిరోజులకు మళ్లీ ఫోన్ చేసి ఈ సినిమా చేద్దామనుకుంటున్నాం. నీకు ఇంట్రెస్ట్ ఉందా అనడిగారు. నేను వెంటనే ఓకే అన్నా. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారితో జర్నీ మొదలైంది. ‘ఎలా చేద్దాం. తెలుగు ప్రేక్షకులకు కోసం ఎలాంటి మార్పులు చేద్దాం’ అన్న మాటలు మొదలయ్యాయి. ఆ తర్వాత పవన్‌కల్యాణ్, రానా గారు రావడంతో మరింత ఎగ్జైటింగ్‌గా ముందుకెళ్లాం. ప్రాజెక్ట్‌లో పవన్‌కల్యాణ్‌గారి పేరు వినిపించగానే అదొక గొప్ప అనుభూతి. ఆయన్ను డైరెక్ట్ చేయాలంటే ఇన్నేళ్ల కష్టం.. క్యాలిబర్, ప్లానింగ్, క్రియేటివిటీ… ఇంత ఉంటే ఇది జరుగుతుంది అనుకోవడానికి లేదు. అలా కుదరాలి.. ఆ పని జరగాలి అంతే. అవన్నీ ప్లాన్ చేసుకుంటే జరిగేవి కాదు.
ఎలాంటి మార్పులు చేశారు?
త్రివిక్రమ్‌గారితో చర్చల్లో కూర్చుని మొదట చర్చించింది కోషి పాత్రను భీమ్లాకు ఎలా మార్చాలి… అన్న దగ్గర మొదలైంది. అసలు ఇది రీమేక్ అని మరిచిపోయాం. మెయిన్ కథ, కమర్షియల్ అంశాలు, పవన్–రానా పాత్రల బ్యాలెన్స్ చేయడం వంటి అంశాల మీద ఎక్కువ దృష్టిపెట్టాం. దీని రీమేక్ హక్కులు మరొకరు తీసుకోవాలి అన్నట్లు పని చేయాలి అని త్రివిక్రమ్ గారు ముందే చెప్పారు. ఆయన అన్న మాటను ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం అనుకుంటున్నా. రీమేక్‌లా కాకుండా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ లాంటి సినిమాను తెరకెక్కించాం అనుకుంటున్నాం. అలాగే ఒరిజినల్ ఉన్న కొన్ని సన్నివేశాలను పవన్‌కల్యాణ్‌పై తీయలేదని చాలామంది అడుగుతున్నారు. అక్కడున్న అన్ని సన్నివేశాలు పెట్టాలంటే మన స్టోరీ టెల్లింగ్‌కు తేడా వస్తుంది. అందుకే తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో ఏ సీన్ పండుతుందో చెక్ చేసుకుని తీశాం.
స్టార్‌హీరోను డైరెక్ట్ చేయడం ఇదే మొదటిసారి.ఇది మీకు సులభమా? కష్టమా?
అది మన మైండ్ సెట్ మీద ఆధారపడుతుంది. త్రివిక్రమ్‌గారు రైటింగ్‌లో అయినా, డైరెక్షన్లో అయినా సీనియర్ పర్సనాలిటీ. ఆయన సజెషన్స్ ఏ టెక్నీషియన్‌కైనా అవసరమే! ఇద్దరు స్టార్స్‌తో కలిసి పనిచేయడం అనేది యుద్ధంలాగే ఉంటుంది. దానిని మనం ఎంతగా ఓన్ చేసుకున్నాం. అవుట్‌పుట్ బాగా రావడానికి ఏం చేశాం అన్నది ముఖ్యం. ఆయన సహకారం లేకపోతే చిత్రం ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు. నాయక్, డ్యాని రెండూ బలమైన పాత్రలు కాబట్టే తెరపై నువ్వా నే అన్నట్లు ఆ పాత్రలు కనిపించాయి. ‘భీమ్లానాయక్’ చేయడం వల్ల వచ్చిన పేరు, గుర్తింపుతో నేను చాలా ఆనందంగా ఉన్నా.
సినిమా ప్రారంభానికి ముందు ఆ తర్వాత పవన్‌కల్యాణ్ ఏం చెప్పారు.
‘వకీల్‌సాబ్’ సినిమా సెట్లో కల్యాణ్‌గారిని వన్ టు వన్ కలిశా. అప్పుడు కోర్టు రూమ్ సీన్ చేస్తున్నారు. సినిమా గురించి మాట్లాడుతుండగా ‘బాగా తీయ్.. బాధ్యతగా పని చేయ్’ అని చెప్పారు. అంతేఎనర్జీతో మేం పని చేశాం. ఆ తర్వాత జర్నీ అంతా అందిరికీ తెలిసిందే!
మూడు సినిమాల దర్శకుడిగా మీలో వచ్చిన మార్పు?
‘అయ్యారే’ సమయంలో సినిమా తీయాలనే తపన తప్ప ఇంకేం తెలీదు. ప్రొడక్షన్ ఎలా చేయాలి… ఎలా ముందుకెళ్లాలి అన్న సంగతి తెలీదు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’తో పరిచయాలు.. పెరిగాయి, కొంత అవగాహన వచ్చింది. ఒక అడుగు ముందుకెళ్లేలా చేసింది. ఇక ‘భీమ్లానాయక్’ నన్ను మరో మెట్టు ఎక్కించింది. ఈ మూడు సినిమాల వల్ల నాకు మంచే జరిగింది.
ఇంత భారీ విజయం తర్వాత ఇండస్ట్రీ, అభిమానుల నుంచి ప్రశంసలు అందుతుంటాయి. ఎలా అనిపిస్తుంది.
ఒక సినిమా సక్సెస్ అయితే ‘తెలిసినవాళ్లు.. తెలియనివాళ్లు ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు’ అని సినిమా టీమ్ చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది. వీళ్ల నంబర్ జనాలకు ఎలా తెలుసని నవ్వుకునేవాడిని. ఇప్పుడు దానికో లాజిక్ ఉందని అర్థమైంది. తాజాగా ఆ అనుభవం నాకు ఎదురైంది. చాలామంది ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారు. సినిమా చూసి సుకుమార్, హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి, క్రిష్ వంటి దర్శకులు ఫోన్ చేసి కమర్షియల్ హిట్ కొట్టావ్ అన్నారు. అదొక గొప్ప జ్ఞాపకం.
ఈ సక్సెస్ వెనుక చినబాబు గారు పాత్ర ఎంత ఉంది?
చినబాబుగారు, వంశీ నా వ్యక్తిగత జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తులుగా మారారు. సినిమా తీసే విషయంలో ఆయన ఇచ్చే సపోర్ట్ మరచిపోలేం. కష్టం తెలియకుండా చూసుకుంటారు. కరోనా వల్ల షూటింగ్ లేట్ అయ్యి ఇబ్బంది పడ్డాం. కానీ మిగత ఏ విషయంలోనూ మేం ఇబ్బంది పడలేదు. ఇబ్బందులు ఏమీ మా దగ్గరకు రాకుండా చినబాబుగారు చూసుకున్నారు. త్వరలో హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
స్టార్‌తో సినిమా అంటే బలమైన కథ కావాలంటారు? మలయాళంలో ఈగో అనే అంశంతో సినిమా తీసి హిట్ అందుకున్నారు కదా?
అది ప్రాంతాలను బట్టి ఉంటుంది. మన ప్రేక్షకుల అభిరుచి మేరకు మన కథలుంటాయి. పైగా మన సినిమాల స్పాన్ పెద్దది. దానికి తగ్గట్లే కథలు ఉంటాయి. మార్పులు చేర్పులు హంగులు జోడిస్తారు. గ్లామర్ లుక్ ఉంటుంది.
దర్శకులకు కొత్త కథ చెప్పాలనే ఆలోచన ఉంటుంది. ఈ సినిమాతో అలాంటి అవకాశం వచ్చుంటే బావుండేది అనిపించిందా?
ఇంకా చాలా కెరీర్ ఉందండీ. చాలా అవకాశాలు అందుకోవాలి. ఈసారి డెఫినెట్‌గా స్ట్రెయిట్ సినిమా చేస్తా. ‘భీమ్లానాయక్’ సినిమా కంటే ముందు వరుణ్‌తేజ్‌తో 14రీల్స్ ప్లస్ బ్యానర్లో ఓ సినిమా ప్రకటించారు. అనుకున్న బడ్జెట్ దాటడంతో అది పక్కకు వెళ్లింది. తర్వాత ఆ కథతో చేస్తానా ఇంకోటి చేస్తానా అన్నది చూడాలి.