Reading Time: 2 mins

సీ యూ సూన్ మూవీ రివ్యూ

Rating: 3.5/5

ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లో ఉండచ్చు…కానీ సృజనాత్మకతను మాత్రం లాక్ డౌన్ లో పెట్టడం కష్టం. అవును…ఓ సినిమా..అదీ లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ…ఎక్కువ శాతం ఫోన్ కెమెరాలతో తీయటం..అందరి మెప్పూ పొందటం అంటే మామూలు విషయం కాదు. కమర్షియల్ సినిమాలకన్నా క్రియేటివ్ సినిమాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తున్న మళయాళీలు అందించిన మరో క్రైమ్ థ్రిల్లర్ ఈ సినిమా ఇది. అమేజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి…అసలెందుకు ప్రపంచం ఈ సినిమాని మెచ్చుకుంటోందో చూద్దాం.

కథేంటి…

దుబాయ్‌లో ఓ బ్యాంక్ పనిచేసే లో వ‌ర్క్ చేస్తూంటాడు జిమ్మి కురియన్ (రోషన్ మ్యాథ్యూ). ఆల్రెడీ బ్రేకప్ అయ్యి..అప్పుడప్పుడే డిప్రేషన్ నుంచి బయిటపడుతున్న జిమ్మికి డేటింగ్ యాప్ ద్వారా అను సెబాస్టియన్ (దర్శనా రాజేంద్రన్)‌ ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆ పరిచ‌యం అతి తక్కువ టైమ్ లోనే చాటింగ్ తో లవ్ గా మారుతుంది. అంతేకాదు ఆన్ లైన్ లో ఆమెకు లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆమె తల్లికి సైతం ఆన్ లైన్ లో పరిచయం చేస్తాడు. త్వరలో ఇరు వైపుల వాళ్లు కలుద్దాం అని ఆమె చెప్తుంది.

అయితే ఈ లోగా ..అను నుంచి ఓ వీడియో మెసేజ్ వస్తుంది. తాను ఇబ్బందులు ఎదుర్కుంటున్నాన‌ని, తాను ఉంటున్న చోట తీవ్ర క‌ష్టాలు ప‌డుతున్నాన‌ని అంటూ సహాయం కోరుతుంది. దెబ్బలతో రక్తంతో ఉన్న అను సెబాస్టియన్‌ను ఆమె ఉంటోన్న ఏరియా నుంచి తన ఫ్లాట్‌కు తీసుకొస్తాడు జిమ్మి . ఓ డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేయిస్తారు. ఈ లోగా ఆమె మిస్సవుతుంది. జిమ్మిని పోలీస్ లు అదుపులోకి తీసుకుంటారు. చట్టవ్యతిరేకంగా డేటింగ్ చేసినందుకు దుబాయ్ పోలీసులు జిమ్మిని ప్రశ్నిస్తారు. అసలు ఏం జరుగుతోందో అర్దం కాక.. తన బంధువు, సైబర్ సెక్యూరిటీ ట్రాకర్ ..కెవిన్ థామస్ (ఫాహద్ ఫాజిల్)కు చెప్పి సాయం కోర‌తాడు జిమ్మీ.

ఈ క్రమంలో అనేక చీకట నిజాలు బయిటకు వస్తాయి. ఎన్నో కేసులు డీల్ చేసిన థామస్ కే షాక్ లా అనిపిస్తుంది. ఇంతకీ ఏమిటా నిజాలు..అసలు అను సెబాస్టియన్‌ ఎవరు? ఆమెని పోలీసులు ఎందుకు ట్రాక్ చేస్తున్నారు? అను వల్ల ఇరుక్కున్న జిమ్మికి ఎలా బయటపడ్డారు. జిమ్మికి సమస్యను కెవిన్ ఎలా ప‌రిష్క‌రించాడు వంటి అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది…

సీసీ టీవి ఫుటేజ్ లు, ఫోన్ మెసేజ్ లు, వాట్సప్, ఫేస్ బుక్, డేటింగ్ యాప్ డేటా, జూమ్ యాప్ ఇలా అన్ని టెక్నికల్ విజువల్స్ తో ఆయా స్క్రీన్స్ తో ..తెరపై కథ నడపటం అంటే కత్తి మీద సామే. గతంలో 2014 లో వచ్చిన Unfriended కానీ 2018లో వచ్చిన Searching ఇదే పద్దతిని ఫాలో అయ్యాయి. అయితే మన దేశంలో మాత్రం ఇలాంటి సినిమా రావటం ఇదే మొదటి సారి అని చెప్పచ్చు. అంతేకాదు దర్శకుడు తన మార్క్ ని ప్రతీ ఫ్రేమ్ లో చూపుతూ వెళ్లారు. ఎక్కడా బిగి సడలకుండా ప్రేమ్ లు పేర్చుకుంటూ వెళ్లటం జరిగింది. ప్రారంభంలో జిమ్మి, అనుల మధ్య జరిగే డేటింగ్ యాప్..కాన్వర్షేషన్స్ విసుగు తెప్పిస్తాయనటంలో సందేహం లేదు. అయితే అలా చేయటం వలన మనకు మిగతా సినిమా అంతా రెగ్యులర్ నేరేషన్ కు భిన్నంగా తీసినా చూడగలుగుతాం.

అనేక మంది కేరళ అమ్మాయిలు…ఏజెంట్లను నమ్మి…గల్ఫ్ జాబ్ లకు వెళ్తున్నారు.అక్కడ రకరకాలు మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యభిచార వృత్తిలోకి దింపబడుతున్నారు. కొద్దివారాల క్రితం వచ్చిన ఖుదా హఫీజ్ కూడా దాదాపు ఇలాంటి నేపధ్యంలోనే వచ్చింది. అయితే మెలోడ్రామా, యాక్షన్ తో సినిమా సాగింది. అయితే ఈ సినిమా మాత్రం ఆ దారి ఎత్తుకోలేదు. చాలా రియలిస్టిక్ గా జరిగినట్లు గా తీసారు.

ముఖ్యంగా ప్లాట్ ని మెల్లిమెల్లిగా రివీల్ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఎక్కడా మనకు ఈ సినిమా నేపధ్యం ఇదీ అని అనుమానం రానివ్వడు. తర్వాత ఏం జరుగుతుంది అనే ఆలోచన మనలో కలిగేలా చేసారు.

టెక్నికల్ గా …

ఈ సినిమా కు గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసిందనే చెప్పాలి. సబిన్ ఉలికాందీ వర్చువల్ సినిమాటోగ్రఫి, మహేష్ నారాయణ్ సినిమాటోగ్రఫి అద్బుతంగా కుదిరాయి. ఐఫోన్‌లో షూట్ చేసిన ఈ చిత్రం యొక్క నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి.

చూడచ్చా…

తప్పకుండా చూడాల్సిన థ్రిల్లర్

ఎవరెవరు..

నటీనటులు: ఫాహద్ ఫాజిల్, రోషన్ మ్యాథ్యూ, దర్శన రాజేంద్రన్ తదితరులు.
సంగీతం: గోపి సుందర్
వర్చువల్ సినిమాటోగ్రఫి: సబిన్ ఉలికాందీ
రన్ టైమ్: 1 గంట, 38 నిముషాలు.
రచన, దర్శకత్శం: మహేష్ నారాయణ్
నిర్మాతలు: ఫాహద్ పాజిల్, నజ్రియా నాజిం
రిలీజ్ డేట్: 01-09-2020
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో