సీనియర్ నటుడు వి కె నరేష్ ఇంటర్వ్యూ
వినోదం, యదార్థం కలగలిసిన మార్టిన్ లూథర్ కింగ్ కొత్తగా ఉంటుంది: సీనియర్ నటులు వి.కె. నరేష్
వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు. కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో దర్శకుడిగా విశేషంగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన ముఖ్యపాత్ర పోషించడం విశేషం. వినోద ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
మార్టిన్ లూథర్ కింగ్ ట్రైలర్
మార్టిన్ లూథర్ కింగ్ ట్రైలర్ ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. కనీసం తన పేరేంటో కూడా తెలియని చెప్పులు కుట్టే వ్యక్తిగా సంపూర్ణేష్ బాబు పాత్రను పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. అతనికి మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరు పెట్టడం ఆసక్తికరంగా ఉంది. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ప్రత్యర్థులు నరేష్, వెంకటేష్ మహా ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. గెలుపుకోసం విశ్వప్రయత్నాలు చేస్తారు. అయితే గెలుపుని నిర్ణయించే ఒక్క ఓటు మార్టిన్ లూథర్ కింగ్(సంపూర్ణేష్ బాబు)ది కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. ఓటు విలువని తెలియని జేస్తూనే వినోదభరితంగా సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. వాడుకోవడం చేతకానప్పుడు స్వతంత్రం ఉంటే ఎంత లేకపోతే ఎంత? వంటి డైలాగ్ లు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ట్రైలర్ లో సంగీతం, కెమెరా పనితనం కూడా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ముందస్తు ప్రీమియర్ షోలను ప్రదర్శించగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు విలేకర్లతో ముచ్చటించిన సీనియర్ నటుడు వి.కె. నరేష్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
మార్టిన్ లూథర్ కింగ్ ఎలా ఉండబోతుంది? ఇందులో కింగ్ ఎవరు అవుతారు?
కింగ్ ఎవరు అవుతారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. వెంకటేష్ మహాతో నా ప్రయాణం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నుంచి మొదలైంది. ఇది యువ దర్శకుల యుగం. చాలా మంచి సినిమా చేశాం. మంచి సందేశంతో కూడిన వినోదభరితంగా సాగే సినిమా ఇది. వినోదం, సందేశం కలిసి రావడం చాలా అరుదు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్లు మొదలుపెట్టాం. సినిమా మీద ఎంతో నమ్మకం ఉంటేనే కానీ ఇలా ముందుగానే ప్రజలకు చూపించి సినిమాని విడుదల చేయం. నేను వరంగల్ లో చూశాను. మహిళలు, యువత అన్ని వర్గాల ప్రేక్షకులతో థియేటర్ నిండిపోయింది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు యువత కొత్త కొత్త సబ్జెక్టులతో వస్తున్నారు. వేసవిలో కొబ్బరినీళ్లు తాగాలి, చలి కాలంలో వేడి వేడి బజ్జీలు తింటాం, కాఫీ తాగుతాం. అలాగే ఇప్పుడు పొలిటికల్ సీజన్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడిగా ఉన్నాయి. ఇది ఎవరినీ ఉద్దేశించి తీసిన సినిమా కాదు. రాజకీయాల వల్ల ప్రస్తుతం సామాన్యులు ఎదుర్కొంటున్న యదార్థ పరిస్థితులను సినిమాగా తీయడం జరిగింది. సినిమా అందంగా, వినోదభరితంగా ఉంటుంది. సంపూర్ణేష్ కి ఇది సెకండ్ లైఫ్ అవుతుంది. నేను, మహా ముఖ్య పాత్రలు పోషించాం. దాదాపు 30 మంది నటీనటులు ఈ సినిమాతో పరిచయమవుతున్నారు.
మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే తరహా పాత్ర నేను పోషించాను. గ్రామ సర్పంచ్ వారసత్వం కోసం పరితపించే పాత్ర. నా వయసు కంటే దాదాపు 20 ఏళ్ళు తక్కువ వయసున్న పాత్రలో నటించాను. అలాగే మహా పాత్ర మరో వర్గం. అసలు రాజకీయం గ్రామాల్లోనే జరుగుతుంది. దాని ఆధారంగా చేసుకొని తీసిన సినిమా ఇది. నిజంగా ఒక వెనకపడిన గ్రామానికి వెళ్ళి సినిమాని చిత్రీకరించాం. ఈ సినిమాకి బలం వెంకటేష్ మహా స్క్రిప్ట్. దానిని దర్శకురాలు పూజ అద్భుతంగా తెరకెక్కించారు. నాకు, మహా, సంపూతో పాటు చాలామందికి ఈ సినిమా లైఫ్ అవుతుంది. ఒక మహిళా దర్శకురాలు(విజయనిర్మల) కొడుకుగా పూజ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉంది.
రాజకీయ అనుభవమున్న వ్యక్తిగా ఈ సినిమాకి మీరు ఏమైనా సూచనలు చేశారా?
ఒక స్టేజ్ డ్రామా కోసం చేసినట్టుగా ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ చేశాం. స్క్రిప్ట్ రీడింగ్ సమయంలో చిన్న చిన్న మార్పులు చేశాం. అది సహజంగా జరిగేది. ఇప్పుడు కొత్త తరం వస్తుంది. ప్రేక్షకులు కూడా సినిమా చూసే విధానం మారిపోయింది. ఫార్ములా సినిమాలను ప్రేక్షకులు ఆదరించడంలేదు. పూర్తి వినోదాత్మక చిత్రాలను లేదా యదార్ధానికి దగ్గరగా ఉన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే రెండూ ఉన్నాయి. నవ్వుతుంటారు, టెన్షన్ పడుతుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. అదే సమయంలో రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ప్రతి పాత్రకి కొత్తదనం ఉంటుంది. ఒకే గ్రామంలో రెండు ప్రాంతాలు, రెండు మాండలికాలు ఉంటాయి. అది కొత్తగా అనిపిస్తుంది. సామాన్యుడు కింగ్ అయినప్పుడే సమాజం బాగుపడుతుంది అనేది ఈ సినిమాలో చూపించారు. దీనిని వినోదభరితంగా చెప్పారు. అలాగే సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. సినిమాలో మార్టిన్ లూథర్ కింగ్ వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు ఒళ్ళు జలదరిస్తుంది. ఇది చాలా అరుదైన సినిమా. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. రచయిత, దర్శకులు, నిర్మాతలతో మొత్తం చిత్ర బృందం సమిష్టి కృషి వల్ల సినిమా ఇంత బాగా వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.
మాతృక సినిమా మండేలా చూశారా?
ఇది రీమేక్ కంటే కూడా స్ఫూర్తి పొంది తీసిన సినిమా. ఎందుకంటే మన తెలుగు రాజకీయాలు, మన నేటివిటీ తగ్గట్టుగా తీసిన సినిమా ఇది. దీనిని ఓ కొత్త సినిమాగా చూడొచ్చు. సరిగ్గా ఎన్నికల సీజన్ లో విడుదలవుతుంది. యువతని ఈ సినిమా బాగా మెప్పిస్తుంది అనుకుంటున్నాను. ప్రీమియర్స్ సమయంలో ప్రేక్షకులకు కిరీటాలు ఇచ్చి, మీకు మీరు కింగ్ అనిపించినప్పుడు కిరీటం పెట్టుకోమని చెప్పారు. ప్రేక్షకులు నిజంగానే సినిమాని ఆస్వాదిస్తూ కిరీటాలు పెట్టుకుంటున్నారు. అది కొత్తగా అనిపించింది.
రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తిగా ప్రస్తుత రాజకీయాల గురించి ఏం చెప్తారు?
సినిమాల్లో పీక్స్ లో ఉన్న టైంలో రాజకీయాల్లోకి వెళ్ళాను. 1998-2000 సమయంలో వెంటవెంటనే కూలిపోతున్న సంకీర్ణ ప్రభుత్వాలను చూసి వాజపేయి గారి లాంటివారు వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాను. ఆ సమయంలో చిన్న చిన్న గ్రామాల్లోకి కూడా వెళ్ళి నిస్వార్థంగా సేవ చేశాను. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అసలు లేదు. ప్రస్తుతం రాజకీయాల్లో ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారు. స్వార్ధ రాజకీయం పెరిగిపోతుంది. మార్టిన్ లూథర్ కింగ్ ని చూశాం, హిట్లర్ ని చూశాం. రాజకీయాల్లో మంచి చెడు అన్నీ ఉంటాయి. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్యం కలిగి ఉందని మాత్రం గర్వంగా చెప్పగలను. అయితే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్లల్లో డబ్బులు కావాలి. ఎన్నికల్లో గెలిచాక ఆ డబ్బుని మళ్ళీ ప్రజల నుంచే దోచుకుంటారు. వారి పార్టీ అధికారంలో లేకపోతే జైలుకి వెళ్తారు. ప్రస్తుతం ఇలా స్వార్థం, కక్షలతో రాజకీయాలు నిండిపోయాయి. సినిమా అనేది రాజకీయాలకు బాణం లాంటిది. సినిమా ద్వారా ఎంతో చెప్పొచ్చు. ఇక నుంచి నేను ఏదైనా మంచి చెప్పాలనుకుంటే సినిమా ద్వారానే చెప్పాలి అనుకుంటున్నాను. మార్టిన్ లూథర్ కింగ్ కూడా ప్రస్తుత రాజాకీయ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో నేను భాగం కావడం సంతోషంగా ఉంది.