హీరోయిన్ ఐశ్వర్య మీనన్ ఇంటర్వ్యూ
భజే వాయు వేగం సినిమాలో ట్రెడిషనల్ అమ్మాయి ఇందు క్యారెక్టర్ లో ఆకట్టుకుంటా హీరోయిన్ ఐశ్వర్య మీనన్
స్పై సినిమాలో స్టైలిష్ యాక్షన్ తో ఆకట్టుకున్న హీరోయిన్ ఐశ్వర్య మీనన్…అందుకు పూర్తి కాంట్రాస్ట్ క్యారెక్టర్ లో భజే వాయు వేగంలో కనిపించనుంది. హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 31న భజే వాయు వేగం సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ తన ఇంటర్వ్యూలో తెలిపింది హీరోయిన్ ఐశ్వర్య మీనన్.
భజే వాయు వేగం సినిమాలో ఇందు అనే క్యారెక్టర్ చేశాను. ఆమె బ్యూటీషియన్. బ్యూటీషియన్ అంటే సహజంగానే అందంగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో పేరు వెంకట్. ఆయన పర్సెప్షన్ లోనే సినిమా అంతా వెళ్తుంది. కథలో నేను కీలకమైన పాత్రగా ఉంటాను. ఇది కమర్షియల్ సినిమా అయినా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అలా వచ్చి ఇలా వెళ్లినట్లు నా క్యారెక్టర్ ఉండదు. వెంకట్ కోసం ఈ అమ్మాయి ఏదైనా చేస్తుంది. అంతగా అతన్ని ఇష్టపడుతుంది. భజే వాయు వేగం ఒక రా కంటెంట్ మూవీ. యాక్షన్, ఎమోషన్ ఆకట్టుకుంటాయి. నాకు ఇలాంటి సబ్జెక్ట్స్ చేయడం ఇష్టం పైగా యూవీ లాంటి పెద్ద బ్యానర్ నిర్మించింది. సో ఆఫర్ వచ్చిన వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నా.
ఈ సినిమాలో ట్రెడిషనల్ క్యారెక్టర్ లో కనిపిస్తా. సినిమా చీరకట్టు లేదా ట్రెడిషనల్ దుస్తులు వేసుకుంటా. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం ఇష్టం ఎందుకంటే రియల్ లైఫ్ లో కూడా నాకు ట్రెడిషనల్ దుస్తులు ధరించేందుకు ఇష్టపడుతుంటా. స్పై సినిమా తర్వాత నాకు తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. ఎంపికగా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటా వచ్చా. తెలుగులోనే కాదు తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తున్నా. తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం. ఇక్కడే ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా. అయితే ఇతర పరిశ్రమల్లో ఎగ్జైటింగ్ ప్రాజెక్స్ట్ వచ్చినప్పుడు నో చెప్పలేం కదా. మలయాళంలో మమ్ముట్టి గారితో మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. అలాంటి లెజెండ్ తో కలిసి నటించే అవకాశం ప్రతిసారీ దక్కకపోవచ్చు.
స్పై సినిమాలో మోడరన్ డ్రెసెస్, స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ చేశా. భజే వాయు వేగం సినిమాలో నా పాత్ర స్పై సినిమాలోని క్యారెక్టర్ కు పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రతి సినిమాను ఇష్టపడే చేస్తాం. కానీ ఫలితం మన చేతుల్లో ఉండదు. నా సినిమాలన్నీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటా. కానీ ఆ ఫలితం ఇచ్చేది ప్రేక్షకులు. వాళ్లకు మూవీ నచ్చాలి. వాళ్లు ఆదరించాలి. అప్పుడే విజయం దక్కుతుంది. స్పై సినిమా విషయంలో నేను అనుకునేది ఇదే. ఆ సినిమా కోసం టీమ్ అంతా శ్రమించారు. కానీ రిజల్ట్ అనుకున్నట్లు రాలేదు.
భజే వాయు వేగం సినిమాలో యాక్షన్, ఎమోషన్ తో పాటు లవ్, రొమాన్స్ కూడా ఉంటుంది. అయితే లవ్ రొమాన్స్ పార్ట్ తక్కువగానే ఉంటుంది. డబ్బు నేపథ్యంగా కథ ఉంటుందా అనేది తెరపైనే చూడాలి. ఆ ట్విస్టులు రివీల్ చేస్తే డైరెక్టర్ ప్రశాంత్ ఊరుకోడు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ నేను డబ్బింగ్ చెప్పలేదు. మరో వాయిస్ బాగుంటుందని డైరెక్టర్ భావించాడు.
కార్తికేయతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఆయన ఆర్ఎక్స్ 100 సినిమా చూశాను. కార్తికేయతో సినిమా చేయాలని ఉండేది. అతను అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. నేను భరతనాట్యం డ్యాన్సర్ ను. మంచి డ్యాన్స్ నెంబర్స్ చేయాలనే కోరిక ఉంది. డ్యాన్స్ చేయడాన్ని ఇష్టపడతా. ఇప్పటిదాకా మంచి డాన్స్ నెంబర్ నాకు దక్కలేదు. పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. కమర్షియల్ సినిమా హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడమూ ముఖ్యమనే భావిస్తా.
యూవీ క్రియేషన్స్ ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించింది. ఇలాంటి పేరున్న సంస్థలో హీరోయిన్ గా సినిమా చేయడం గర్వంగా ఉంది. వంశీ, ప్రమోద్ గారు మా ప్రొడ్యూసర్స్. మంచి కంటెంట్ తో సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తున్నారు. యూవీ సంస్థ తమ సినిమాకు పనిచేసే అందరినీ బాగా చూసుకుంటారు. హంబుల్ గా ఉంటారు. నాకు ఈ సంస్థలో పనిచేసిన ఎక్సీపిరియన్స్ ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది.
నేను స్పై మూవీ తర్వాత భజే వాయు వేగం చేసినా ఫస్ట్ సైన్ చేసిన మూవీ మాత్రం భజే వాయు వేగం. సో నన్ను టాలీవుడ్ కు పరిచయం చేసింది దర్శకుడు ప్రశాంత్ రెడ్డి అనుకోవాలి. ఆయన ఇందు క్యారెక్టర్ కోసం నేనే బాగుంటాను అని తీసుకున్నారు. ఫోన్ లో ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా మంచి సినిమా అవుతుందని అనిపించింది. నేను తెలుగు సినిమాలకు బాగుంటాను అని ప్రశాంత్ గెస్ చేశాడు. ఆయన చాలా స్ట్రిక్ట్. సినిమా మీద క్లారిటీ ఉన్న డైరెక్టర్. ప్రశాంత్ ప్రతిభ థియేటర్ లో మీరంతా చూస్తారు. సెట్ అయ్యిందే పాటకు రధన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆ పాట బాగా పాపులర్ అయ్యింది.
తమిళనాడులో ఈరోడ్ అనే చిన్న టౌన్ మాది. మధ్య తరగతి కుటుంబం. మా బ్రదర్ డాక్టర్. నేను ఇంజినీరింగ్ చేశా. స్కూల్ లో చదువుకుంటున్న టైమ్ లోనే నేను బాగా పాపులర్. కమర్షియల్ యాడ్స్ లో నటించడం, స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడంతో బాగా పేరొచ్చింది. ఇంజినీరింగ్ పూర్తయ్యాక పూర్తిగా నటన మీద ఫోకస్ చేశాను. నేను పరిశ్రమలో తెచ్చుకున్న గుర్తింపునకు గర్వంగా ఉంది. ఇదంతా నాకు నేనుగా సొంతంగా తెచ్చుకున్న పేరు. ప్రేక్షకుల అభిమానం పొందడం అనేది ఏ ఆర్టిస్టుకైనా ముఖ్యం. ఆఫర్స్, సక్సెస్ తర్వాత ముందు ప్రేక్షకుల యాక్సెప్టెన్సీ ఉంటే ఇక్కడ కెరీర్ బాగుంటుంది. ఆ ఆదరణ పొందడం కోసం ప్రయత్నిస్తున్నా. తెలుగులో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నా. ఒక సినిమా సైన్ చేశా. త్వరలో ఆ మూవీ అనౌన్స్ చేయబోతోంది. మరో రెండు మూవీస్ కు డిస్కషన్స్ జరుగుతున్నాయి. తమిళంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్నా.