దృశ్యం 2 మూవీ రివ్యూ

Published On: November 25, 2021   |   Posted By:

దృశ్యం 2 మూవీ రివ్యూ

Image

వెంకటేష్  ‘దృశ్యం 2’ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)   

👍

సినీప్రియుల్లో థ్రిల్లర్‌ చిత్రాలకున్న క్రేజ్‌ ఎప్పుడూ స్పెషలే. కొన్నేళ్లుగా చిన్న సినిమాలకే ఈ జానర్‌ పరిమితమైంది. మఖ్యంగా ఓటీటిలు వచ్చాక ఇది ఓటీటి జానర్ గా మారిపోయింది. అలాగే థ్రిల్లర్‌ కథలకు ఎంతటి ఆదరణ ఉన్నా.. వీటితో స్టార్ సినిమాలు చేయడం చాలా అరుదు.  ఇప్పుడీ పద్ధతిలో మార్పొచ్చింది. స్టార్ హీరోలూ తమ చిత్రాల్లో థ్రిల్‌ ఉండాలని కోరుకుంటున్నారు. కథకు కొత్త హంగులు అద్దడంలోనూ.. దాన్ని తెరపై ఇంట్రస్టింగ్ గా వడ్డించడంలోనూ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌కి చోటిస్తున్నారు. తమదైన శైలి మాస్‌ మసాల అంశాలు జోడించి మరీ.. సినీప్రియులకు విభిన్న రకాలైన థ్రిల్లర్లు రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వచ్చిందే దృశ్యం. ఇప్పుడు దృశ్యం 2. మొదట మళయాళంలో వచ్చి సూపర్ హిట్టైన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ రిలీజైంది. మరి తెలుగు ప్రేక్షకులు కూడా అదే స్దాయిలో ఈ సినిమాని ఆదరిస్తారా..ఈ సీక్వెల్ కథేంటి. సీక్వెల్స్ మనకు వర్కవుట్ కావు అనే సెంటిమెంట్ ని ఈ సినిమా బ్రేక్ చేస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

 స్టోరీ లైన్

దృశ్యం.. సినిమాలో తన కుటుంబం జోలికి వచ్చిన వరుణ్‏ను కూతురు హత్య చేయడం.. ఆ  డెడ్ బాడీని ఎవరూ ఉహించని విధంగా పోలీస్ స్టేషన్లోనే పాతిపెడతాడు రాంబాబు (వెంకటేష్). ఇక ఆ తర్వాత రాంబాబు తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అలాగే తనకున్న సినిమా పిచ్చితో  తన భార్య పేరన సొంతంగా జ్యోతి థియేటర్ ఓపెన్ చేస్తాడు. సినిమా కూడా ప్రొడ్యూస్ చేద్దామనుకుంటాడు.  ఇక పోలీసులు ఎక్కడ కనిపించినా రాంబాబు భార్య జ్యోతి(మీనా), పిల్లలు (కృతిక, ఏస్తర్‌ అనిల్‌,) భయంతో వణికిపోతుంటారు. పెద్ద కుమార్తె తీవ్ర మానసిక ఒత్తిడితో భయపడిపోతుంటుంది. మరో ప్రక్క ఆ కేసును మాత్రం పోలీసులు వదిలి పెట్టరు. రాంబాబుకి తెలియకుండా ఆ కేసును ఇంకా దర్యాప్తు చేస్తుంటారు. చిన్న ఆధారం అయినా దొరక్క పోదా అని తవ్వుతూనే ఉంటారు. అలా ఎంక్వైరీ చేస్తుండగా.. కొన్ని ఆధారాలు పోలీసులకు చిక్కడం నుంచి కథ ఆసక్తికగా మారుతుంది. పోలీస్ లు రాంబాబు చుట్టూ ఓ పద్మవ్యూహంలాంటి ప్లాన్ వేసి ఇరికించే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని కీలక సాక్ష్యాలు దొరుకుతాయి.ఇది తెలుసుకున్న రాంబాబు  పోలీసులని ఎలా డీల్ చేశారు.  ఆ సాక్ష్యాలెంటీ.. మళ్లీ వాటి వలన రాంబాబు కుటుంబానికి ఎదురైన సమస్యలు, చివరికి ఏమైంది అనేది కథ.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్…

ఈ సినిమాకు ప్రాణం స్క్రీన్ ప్లే. సీక్వెల్స్ చాలా వరకూ సక్సెస్ కావనే విషయం డైరక్టర్ దృష్టిలో పెట్టుకుని చాలా టైటిల్ గా ట్రీట్మంట్ చేసుకుని తెరకెక్కించారు. ముఖ్యంగా రాంబాబుని పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి ప్లాన్స్ చేశారనేవి ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటాయి.  సినిమాలో కలిగే ట్విస్టులతోపాటు.. రాంబాబు  పాత్ర పట్ల ఒక ఆరాధన భావం కలిగేలా సినిమా ముగిస్తుంది.   సాధారణంగా ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌, స‌స్పెన్స్ సినిమాల‌కు ఓ స‌మ‌స్య ఉంది.  చిక్కుముడులు ఈజీగా వేసేయగలుగుతారు. వాటిని విప్ప‌డం ద‌గ్గ‌రే చాలామంది త‌డ‌బ‌డతారు. అందుకే క‌థ‌లుగా చాలా ఇంట్రస్ట్ గా అనిపించే కొన్ని సినిమాలు.. తెర‌పైకొచ్చేస‌రికి బోల్తా ప‌డుతుంటాయి. కానీ ఈ సినిమా అలాంటి సమస్యలను ఈజీగా దాటేసింది. వాస్తవానికి ఇది ఓ గ‌మ్మ‌త్తైన  క‌థ. తెలివైన స్క్రీన్ ప్లేకి నిద‌ర్శ‌నం.  అస‌లు హీరో క్యారెక్ట‌రైజేష‌న్ లోనే ఓ ట్విస్ట్ ఉంది. హీరో పాతదంతా మర్చిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తునన్నారు అనుకునే సినిమా చూడ‌డం మొద‌లెడ‌తారు ప్రేక్ష‌కులు. స‌డ‌న్ గా అతను తన వెనక జరిగేవన్నీ ఊహించి ప్లాన్ చేస్తున్నారని తెలిసి థ్రిల్ అవుతారు. ఇక అక్కడి నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. అలాగే పోలీస్ వేసిన ట్రాప్, ఆ ప‌రిణామాల‌తో క‌థ వేడెక్కుతుంది. అస‌లు వరుణ్ శవాన్ని ఎక్కడ దాచాడు,  అనే విష‌యాన్ని తెలుసుకోవ‌డం కోసం  పోలీస్ ఆఫీస‌ర్ చేసే ప్ర‌య‌త్నాలు.. మ‌రింత ఉత్కంఠ‌త‌ని పెంచుతాయి. ఇక సెకండాఫ్ మ‌రింత జోరుగా సాగుతుంది. క్లైమాక్స్ వ‌ర‌కూ ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌దు. క్లైమాక్స్‌లోనూ ఓ ట్విస్ట్ వ‌స్తుంది. ఇంతకు మించి ఓ థ్రిల్లర్ సినిమాకు కావాల్సింది ఏముంది.


టెక్నికల్ గా


 సతీష్ కురుప్ నాచురల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మంచి ఎస్సెట్. విజువ‌ల్ గా గ్రాండ్ గా ఉంది‌. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం ప్ర‌తిబింబిస్తూ కళ్ళకు ఇంపుగా విజువల్స్ ఉన్నాయి. ఉన్న ఒక్క పాటా ఓకే. నేప‌థ్య సంగీతం మాత్రం చాలా బాగుంది.   బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్ సీన్ కు తగ్గట్టుగా ఎలివేట్ చేస్తూ అవుట్ స్టాండింగ్ గా వచ్చాయని చెప్పాలి. డైలాగులు స‌హ‌జంగా అనిపిస్తాయి. చాలా వరకూ దర్శకుడు స‌హ‌జ‌త్వానికే పెద్ద పీట వేశాడు. ఎమోష‌న్ సీన్స్ లో  మాట‌లు బాగున్నాయి. క‌థ‌కుడిగా జీతూ జోసఫ్ ఫస్ట్  క్లాస్ లో పాస్ అయిపోయాడు.  దర్శకుడుగా జీతూ జోసెఫ్ విషయానికి వస్తే తన బ్రిలియెంట్ టేకింగ్ అండ్ డైరెక్షన్ కోసం ఎంత చెప్పినా తక్కువే..


 నటీనటుల విషయానికి వస్తే…

ఎంత సీరియ‌స్ ఎమోష‌న్ అయినా.. ముందు కామెడీ చేసి, ఆ త‌ర‌వాత ఎమోష‌న్లో దించేయ‌డం వెంకటేష్ స్టైల్‌. వెంకటేష్  నుంచి ఆశించేది వినోదం. అయితే ఆ వినోదం ఈ సినిమాలో మిస్ అవుతుంది. కానీ అది మనకు ఎక్కడా అనిపించదు. చాలా బ‌రువైన పాత్ర‌ని అవ‌లీల‌గా పోషించేశాడు. ఇలాంటి తండ్రి ఉంటే బాగుండును అనిపించేసాడు. కొన్ని చోట్ల అండ‌ర్ ప్లే చేసారు. అలాగే ఈ పాత్ర ఇంతే డిగ్నిఫైడ్ గా చేయాలి అనుకుని చేసాడని అర్దమవుతుంది.  మిగతా ఆర్టిస్ట్ లు  త‌మ ప‌రిధి మేర చేసుకుంటూ వెళ్లిపోయారు.  
 
 బాగున్నవి
అక్కడక్కడా మంచి థ్రిల్స్
ఊహకు అందని క్లైమాక్స్
సెకండాఫ్ స్క్రీన్ ప్లే
 
బాగోలేనివి
మక్కికి మక్కీ ఒరిజనల్ ని దింపేయటం
మొదటి అరగంట
స్క్రీన్ ప్లే కన్వీనియంట్ గా రాసుకోవటం..

చూడచ్చా
మళయాళి వెర్షన్ చూడకపోతే మంచి థ్రిల్లర్ గా ..ఇంటిపట్టునే ఉండి చూస్కోవ‌డానికి ఏ మాత్రం ఢోకా లేదు.

ఎవరెవరు..

బ్యానర్‌: సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఆశీర్వాద్‌ సినిమాస్‌;
నటీనటులు: వెంకటేశ్‌, మీనా, కృతిక, ఏస్తర్‌ అనిల్‌, సంపత్‌ రాజ్‌, నదియా, నరేశ్‌, పూర్ణ, తనికెళ్ల భరణి, సత్యం రాజేశ్‌, షఫీ తదితరులు;
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌;
 సినిమాటోగ్రఫీ: సతీష్‌ కురుప్;
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేశ్‌;
 నిర్మాత: డి.సురేశ్‌బాబు, ఆంటోనీ పెరంబవూర్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి;
 రచన, దర్శకత్వం: జీతూ జోసెఫ్‌;
రన్ టైమ్: 2hr 34 Mins.
 విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌
విడుదల తేదీ:  25,నవంబర్ 2021