పలాస 1978 మూవీ రివ్యూ

Published On: March 6, 2020   |   Posted By:

పలాస 1978 మూవీ రివ్యూ

దళిత జన ఘోష:”పలాస 1978″ మూవీ రివ్యూ !!!
 
Rating:2.5/5

కులాలు, మతాల నేపధ్యంలో సినిమాలు చేయటం ఓ పెద్ద సాహసం. అయితే రీసెంట్ గా తమిళంలో వచ్చిన అసురన్…అలాంటి అపోహలు పెట్టుకోవద్దని అభయమిస్తూ పెద్ద హిట్ కొట్టింది. ఇప్పుడు తెలుగులోనూ కొంచెం అటూ ఇటూలో అలాంటి సబ్జెక్టునే అందిస్తూ ఈ సినిమా వచ్చింది. ఆనాటి పలాస ప్రాంత ప్రజల్లో రగులుతున్న అల్లకల్లోలానికీ, జన జీవన ఘర్షణలకీ, పోరాటాలకీ, ఉద్యమాలకీ, పాలక వర్గపు దగుల్బాజీతనానికి స్పందించే చైతన్యంతో నింపానంటూ నమ్మబలికింది. జీవన తాత్త్విక గరిమతో సమస్యను వ్యూహాత్మకంగా ఉద్యమ యుక్తితో ఎత్తిచూపే చేవ ఈ సినిమాకు ఉందా…కేవలం కాసులు కోసం కళను కులం దారిలో నడిపారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

1978లో ప‌లాస‌లో జీడిపప్పు వ్యాపారం చేసే ఇద్దరు అన్నదమ్ములు. వాళ్లు పెద్ద షావుకారు (జెన్నీ), చిన్న షావుకారు (ర‌ఘు కుంచె).వీళ్లిద్దరిదే అక్కడ పెద్ద‌రికం. త‌మ కులం అంటే గ‌ర్వంగా ఫీల‌య్యే వీళ్లు…తమ విలేజ్ లో ఉన్న మిగ‌తా కులాల వారిని చిన్న చూపు చూస్తూ…అధికారం చెలాయిస్తూంటారు. అయితే ఇందులో చిన్న షావుకారు వాటా తక్కువ. అంతా అన్న పెద్దాయనదే రాజ్యం. దాంతో అన్నను ఎలాగైనా ప్రక్కకు నెట్టి,తను ఆధిపత్య జెండా ఎగరేయాలనుకుంటాడు. అందుకు లోకల్ గా జానపద పాటలు పాడే మోహ‌న్‌రావు (ర‌క్షిత్‌), రంగారావు (తిరువీర్‌) సాయం తీసుకుంటారు.  తన అన్న‌ని అధికార పీఠం నుంచి త‌ప్పించి త‌నే ప‌లాస‌లో పెత్త‌నాన్ని చెలాయిస్తూ, ఆడింది ఆటగా,పాడింది పాటగా బ్రతుకుతూంటాడు. ఈ క్ర‌మంలో ప‌లాస‌లో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటారు. ఓ టైమ్ లో ..అతని అధికారానికి  మోహ‌న్‌రావు, రంగారావు  అడ్డుత‌గిలే పరిస్దితిలు వస్తాయి? ఆ పరిస్దితులు ఏమిటి? చివరకు ఏం జరిగింది అన్న‌ది తెర‌పైన చూఆల్పిందే.

పలాస స్క్రీన్ ప్లే ప్రయాణం

ఈ సినిమాని స్లో నేరేషన్ లోనే చెప్పాలని దర్శకుడు ఫిక్సైనట్లున్నాడు. సీన్స్ మెల్లిగా కదులుతూ ఉంటాయి. అయితే ఫస్టాఫ్ లో ఆ పెళ్లి నడక వల్ల ప్లాబ్లం ఏమీ అనిపించలేదు. కానీ సెంకండాఫ్ లోనే అది స్పష్టంగా కనపడింది. ఎందుకంటే అక్కడకు వచ్చేసరికి కథ ఆగింది. లాగుతున్న ఫీలింగ్ వచ్చింది. అలాగే తర్వాత ఏం జరగబోతోందో తెలిసిపోయే స్క్రీన్ ప్లే రాసుకోవటం ఇబ్బంది పెట్టింది. ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి మరీ రొటీన్ గా ఇలా చెయ్యకపోతే తెలుగు సినిమా చూడరు అన్నట్లు తీసుకుంటూ వెళ్లారు. ఇక ఈ సినిమాని దర్శకుడు చాలా  గా తెరకెక్కించాడు. తమిళ సినిమాలే ఇలా ఉంటూంటాయి. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా సైతం ఆ దారిలో ప్రయాణం పెట్టుకుంది. అయితే ఇలా రాగా అనిపించటంతో తమిళ డబ్బింగ్ చిత్రం చూస్తున్నట్లు కూడా ఓ టైమ్ లో అనిపించింది. ఇక దర్శకుడుకు ఇలా నేచురల్ గా కథ చెప్పటం తో పాటు కమర్షియల్ అప్పీల్ మీద బాగా నమ్మకం ఉన్నట్లుంది. చాలా చోట్ల ఇరికినా, ఇరక్కపోయనా కమర్షియల్ సోకులు పోయాడు.  అదే ఈ సినిమా బలహీనత.

దర్శకత్వం, మిగతా విభాగాలు

కుల వివక్ష…పై సినిమా చెయ్యాలంటే సాధారంగా ఎవరూ ధైర్యం చెయ్యరు. ఎందుకంటే ఏ మాత్రం తేడా కొట్టినా సినిమా ఫెయిల్యూర్ అవటమే కాక అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే దర్శకుడు కరుణకుమార్ చాలా బాలెన్స్ గా ఈ సినిమాని వివాదాలకు అతీతంగా తీసుకుంటూ వచ్చారు. కాకపోతే అందుకోసం కమర్షియల్ అంశాలను తీసుకెళ్లి కథలో కలపటమే సమస్యగా మారింది.  అలాగే ఈ సినిమాకు అతను తీసుకున్న మరో నిర్ణయం..ఎక్కడా ఉపన్యాసాలు పెట్టకపోవటం. ఇక ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే… ఉన్న క్యారక్టర్స్ లోంచి, సన్నివేశాలలోంచే ఫన్ పుట్టించాడు తప్పించి ప్రత్యేకమైన ట్రాక్ వేసుకోలేదు.

టెక్నికల్ గా ఇలాంటి సినిమాలకు ప్రాణమైన బ్యాక్ గ్రౌండ్ ఇవ్వటంలో రఘు కుంచె ..సక్సెస్ కాలేదనే చెప్పాలి. పాటలు సోసోగా ఉన్నాయి.చూసేవారిని 1978 ప్రాంతంలోకి తీసుకెళ్లడానికి సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌ విభాగం పడ్డ కష్టం కనపడుతుంది.  ఎడిటింగ్‌ మాత్రం మరింత మెరుగ్గా ఉండాలి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు తగ్గట్టు నీటుగా ఉన్నాయి.  

నటీనటుల్లో…
మెయిన్ విలన్ రఘు కుంచె పాత్ర చాలా సార్లు మనకు రావు రమేష్ ను గుర్తు చేస్తుంది. అయినా రఘు కుంచె బాగా చేసాడనే చెప్పాలి. ఇక సినిమాలో ప్రధాన పాత్రలైన రంగారావు, మోహన్‌ రావుల్లో కనపడ్డ తిరువీర్‌, రక్షిత్‌లు న్యాయం చేశారు.  హీరోయిన్ నక్షత్రకు చెప్పుకోదగ్గ సీన్స్ లేవు. అయినా తను కనబడినప్పుడల్లా స్క్రీన్ ని గ్రాబ్ చేసింది.

చూడచ్చా…
 వాస్తవికతను ప్రతిబింబించే చిత్రాలు చూడటం ఇష్టమైతే ఈ వీకెండ్ మంచి కాలక్షేపం

ఎవరెవరు..

నటీనటులు : రక్షిత్, నక్షత్ర, రఘుకుంచె, తిరువూర్, లక్ష్మణ్ మీసాలా తదితరులు
దర్శకత్వం : కరుణ కుమార్
నిర్మాత : ధయాన్ అట్లూరి
బ్యానర్ : సుధాస్ మీడియా
మ్యూజిక్ : రఘుకుంచె
సినిమాటోగ్రఫి : అరుల్ విన్సెంట్
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర్రావు
రిలీజ్ డేట్ : 2020-03-06