రావు గోపాలరావు వర్ధంతి

Published On: August 14, 2020   |   Posted By:
రావు గోపాలరావు వర్ధంతి 
 
కళా ప్రపూర్ణ రావు గోపాలరావు వర్ధంతి
 
సినీ నటుడు, రాజకీయ  రావు గోపాలరావు (జనవరి 14, 1937 – ఆగష్టు 13, 1994) తెలుగు సినిమా నటుడు, రాజ్యసభ సభ్యుడు (1986-1992).
 
ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు జనం హృదయాలల్ను మరోసారి కొల్లగొట్టుకున్నారు. గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులో వున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. రంగస్థల నటుడుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన ‘కీర్తిశేషులు’ నాటకంలోని పాత్రతో ప్రాముఖ్యత సంతరించుకున్న రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటెడ్‌ అమెచ్యూర్‌ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించారు.
 
నట జీవితము
 
రావు గోపాలరావు నాటకాలను చూసి ఎస్‌.వి.రంగారావు మెచ్చుకుంటూ గుత్తా రామినీడుకి పరిచయం చేస్తే ‘భక్తపోతన’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పెట్టుకున్నారు. ‘బంగారు సంకెళ్లు, మూగప్రేమ’ చిత్రాలకు సహాయ దర్శకుడుగా పనిచేసి, ‘జగత్‌ కిలాడీలు’ చిత్రంలో నటించి విలన్‌ అనిపించుకున్నారు. ఆ చిత్రానికి ఆయన కంఠస్వరం నచ్చక వేరొకరితో డబ్బింగ్‌ చెప్పించారు నిర్మాతలు. బాపు దర్శకత్వంలో రూపొందిన భక్తకన్నప్ప, గోరంత దీపం, మనవూరి పాండవులు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, జాకీ, బుల్లెట్‌, చిత్రాలు ఆ చిత్రాల్లోని డైలాగ్స్‌ గుర్తిండిపోతాయి. అలా గుర్తుండి పోయే డైలాగ్స్‌ని, నటనని మగధీరుడు, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు, ఖైదీ, కటకటాల రుద్రయ్య, జస్టిస్‌ చౌదరి, గోపాలరావుగారి అమ్మాయి, ఘరానా మొగుడు, దేవాలయం, చండశాసనుడు, బొబ్బిలిపులి, బొబ్బిలి బ్రహ్మన్న, అనుగ్రహం, అల్లరి ప్రియుడు, అభిలాష, యమగోల తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు. పార్లమెంటు సభ్యునిగా ఆరేళ్ళపాటు కొనసాగారు.
 
రావు గోపాలరావు అభినయానికి నాటకరంగంలో ఎన్నెన్నో ఒన్స్ మోర్ లు … వెండితెరపై సైతం ఆయన నటనావిన్యాసాలు ప్రేక్షకుల చేతులు నొప్పిపుట్టేలా చప్పట్లు కొట్టించాయి.
 
 
ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయప్రవేశం చేసి ఆకట్టుకోవడం ఆయన శైలి.  వాచకంతోనే ఆకట్టుకుంటూ వందలాది పాత్రలకు జీవం పోసి మెప్పించారు రావు గోపాలరావు. రావు గోపాలరావు అభినయానికి ముఖ్యంగా ఆయన వాచకానికి జనం జేజేలు పలికారు. అయితే అదే వాయిస్ ఆయనకు ఆరంభంలో శాపమయింది.  కొన్ని చిత్రాల్లో రావు గోపాలరావు గొంతు బాగుండదని ఇతరుల చేత డబ్బింగ్ చెప్పించిన సందర్భాలూ ఉన్నాయి.
 
బాపు-రమణ ఆయన వాచకంలోని విలక్షణాన్ని గ్రహించి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో రావు గోపాలరావును నటింప చేశారు.
 
రావు గోపాలరావు సాంఘికాల్లోనే కాదు పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ తనదైన బాణీ పలికించారు. తెరపై ఎన్నో ప్రతినాయక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన రావు గోపాలరావు నిజజీవితంలో ఎంతో సౌమ్యులు. రావు గోపాలరావు రాజ్యసభ సభ్యునిగానూ ఉన్నారు.
 
ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన రావు గోపాలరావు నటవారసునిగా రావు రమేశ్ ఈ తరం వారిని తనదైన నటనతో అలరిస్తున్నారు.
 
తెలుగు ప్రతినాయకుల్లో నటవిరాట్ గా జనం మదిలో నిలచిపోయారు రావు గోపాలరావు. ఆయన స్థానం వేరెవ్వరూ భర్తీ చేయలేనిది అనడం అతిశయోక్తి కాదు.