అత్తారింటికి దారేది…ఓ మాస్టర్ పీస్

Published On: October 11, 2021   |   Posted By:

అత్తారింటికి దారేది…ఓ మాస్టర్ పీస్



త్రివిక్రమ్ తోనే పవన్ కళ్యాణ్ పనిచేయటానికి ఆసక్తి ఎందుకు చూపిస్తున్నారు? తెలుగులో అంతకు మించిన రైటర్ గానీ, డైరక్టర్ గానీ లేరా అనే ప్రశ్నకు సమాధానం..వాళ్ల కాంబోలో వచ్చిన సినిమాలు చూస్తే అర్దమవుతుంది. అవును…త్రివిక్రమ్ రైటింగ్ మాయలో పడ్డవాళ్లు అంత తేలిగ్గా బయిటకు రాలేరు అనిపిస్తుంది. అందుకే స్టార్ హీరోలు రిపీట్ తో త్రివిక్రమ్ తో చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ సినిమా…ఇండస్ట్రీలో డైరక్టర్ అవుదామనుకున్న ప్రతీ అసెస్టెంట్ కల. డైరక్టర్ అవగానే అది మొక్కై,మానువుతుంది. ప్రతీ దేవుడుకి పవన్ తో సినిమా చేయించే అవకాసం ఇవ్వమని అడగాలనిపిస్తుంది.  ఇలాంటి వీళ్లిద్దరు కాంబినేషన్ అంటే ఏ స్దాయిలో మ్యాజిక్ జరుగుతుంది. అంటే అత్తారింటికి దారేది సినిమా ఉదాహరణగా నిలుస్తుంది. జల్సాని దాటేసిన మ్యాజిక్ అది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో 25 సంవత్సరపు మైలు రాయిని టచ్ చేస్తున్న ఈ సందర్బంగా ఈ సినిమాని ఓ సారి గుర్తు చేసుకుందాం.

ఒక్క క్షణం ఆలోచించండి… ఓ స్టార్ హీరో సినిమాకు అసలు ఎవరైనా ఇలాంటి టైటిల్  పెట్టగలరా, పెట్టారే అనుకోండి హీరో ఒప్పుకుంటాడా..కమిడియన్ హీరోగా పెట్టే సినిమాకు కూడా ఇలాంటి టైటిల్ అంటే పెదవి విరుస్తారు. కానీ అక్కడున్నది త్రివిక్రమ్. అటు ఉన్నది పవన్ …అలాంటి  టైటిల్ తో ముందుకు వెళ్తేనే కిక్కు.  సర్లేండి టైటిల్ ప్రక్కన పెడదాం. కథ ఏంటి…ఎప్పుడో ఫ్యామిలీనుంచి విడిపోయిన మేనత్తను తిరిగి తన కుటుంబంలోకి ఆహ్వానించటం, కలపటం. ఆ కుటుంబంతో తనూ మమేకమవటం. ఇక హీరో క్యారక్టరైజేషన్.. తలలు తెంపుకెళ్లే కెపాసిటీ ఉన్నా తల వొంచుకుని నిలబడటం. అవమానం జరిగినా అరిషడ్వర్గాలని జయించినవాడిలా అనుబంధం కోసం వెంపర్లాడటం. టైటిల్ లోనే కాదు ..కథలోనూ అచ్చ తెలుగుతనం.  మేనత్తతో మేనల్లుడుకు ఉండే మమకారం పొరలు. ఇవే చెప్తే ఎవరు చూస్తారు. అందుకే మధ్యలో రొమాన్స్..ఫైట్స్, బ్రహ్మానందంతో బ్రహ్మాండమైన కామెడీ. స్వామీ నదికి పోలేదా అనే డైలాగు మర్చిపోయేదెవరు. ఇక త్రివిక్రమ్ అంటే డైలాగులు అనే కాకుండా స్క్రీన్ ప్లేలో మాస్టర్ అనిపించుకుంటారు. ఒకే సంఘటనను ఒక్కో పొరలా విప్పుతూ,అవసరమైన మేరకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ కథను ముందుకు నడపటం ఓ పాఠమే. అలాగే కథకు సంభందం లేని బ్రహ్మానందం ఎపిసోడ్ ని ఎంతో నేర్పుగా కథలో భాగం అనిపించేలా నడిపించటం మామూలు విషయం కాదు. అహల్యా ఎపిసోడ్ ఎన్ని సార్లు చూసినా తనివితీరదు.
 
అప్పటిదాకా అత్తని అల్లుడు టీజ్ చేయటం,మరదళ్లతో రొమాన్స్ తో రఫ్పాడించటం తరహా ఫార్ములా సినిమాలు తెలుగు తెరపై రాజ్యం ఏలాయి. దాదాపు ఇప్పుడున్న పెద్ద హీరోలంతా ఆ ఫార్మెట్ ని అరగదీసి వదిలేసారు. ఆ ఫార్మెట్ లోకు వెళ్లకుండా అలాంటి కథను టచ్ చేయటం  ఈ చిత్రంలో కొత్తదనం. ముఖ్యంగా పవన్ వంటి యాక్షన్ ఇమేజ్ ఉన్న మాస్ హీరోని భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథలో కి తీసుకువచ్చి త్రివిక్రమ్ మ్యాజిక్ చేసారు. దాంతో పైరసీ అడ్డొచ్చినా తన ప్రతాపం చూపిస్తూ థియోటర్స్ లో ఆడియన్స్ చేత డాన్స్ చేయిచింది. పూర్తిగా ఫన్ నే నమ్ముకున్న ఈ సినిమా అక్కడక్కడా సెంటిమెంట్ బ్లాక్స్  ఉన్నా  మొత్తంమీద సరదాగా నడిచిపోయింది. సినిమా చూసొచ్చిన వాళ్లు తమ మేనత్తలను తలుచుకున్నారో లేదో కానీ మనస్సు నిండా భావోద్వేగాల అత్తరు పులుముకున్నారు. అందుకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బొమన్ ఇరాని, నదియా వంటి నటులు ఫెరఫార్మెన్స్ కలిసొచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా అనే పాట ఎంతోగానే ఫేమస్ అయింది

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు.
చూడప్పా సిద్ధప్పా, నేను సింహం లాంటోణ్ణి. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకొంటాను. అంతే తేడా. మిగతాదంతా సేం టు సేం వంటి డైలాగులు జనాల్లోకి ఎంతలా వెళ్లిపోయాయంటే సినిమా రిలీజ్ అయ్యి ఇన్నేళ్లు అయినా వాటిని వాడుతూనే ఉన్నారు.

2013 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన అత్తారింటికి దారేది సంచలన విజయం అందుకుంది.  ఈ సినిమాలో త్రివిక్రమ్ ట్రై చేసిన ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా వర్క్ అవుట్ అయ్యింది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే రైల్వే స్టేషన్ సీన్‌తో సినిమా చూస్తున్నవాళ్లందరికి కంటతడి పెట్టించేసారు. ఆ సీన్ ఇప్పటికి, ఎప్పటికి కూడా ఎవర్ గ్రీన్.  ఫుల్ రన్‌తో పాటు అన్ని హక్కులు కలుపుకుని 100 కోట్లపైగా నికర ఆదాయం తెచ్చిపెట్టిన ఈ సినిమా ఎప్పుడు చూసినా తాజాగానే ఉంటుంది. ఈ రోజు సరదాగా ట్రై చేయండి ఇంకోసారి.