కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర ఆడియో విడుదల

Published On: February 24, 2022   |   Posted By:

కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర ఆడియో విడుదల

కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర ఆడియోను విడుదల చేసిన హ్యుమాన్ రైట్స్ చైర్మన్ జె.సి.చంద్రయ్య, బి.సి.కార్పొరేషన్ చైర్మన్ వకులా భరణం కృష్ణ మెహన్.

త్రేతాయుగంలో జనక పురంలోని మిథిలా నగరంలో శ్రీహరి భక్తుడైన శ్రీ ధర్మ వ్యాధుడు వేటగాళ్లు వేటాడి తెచ్చిన మాంసాన్ని విక్రయించి గుడ్డి తల్లిదండ్రులను పోషిస్తూ, వారిని శివపార్వతులుగా పూజిస్తూ,ప్రజలకు ధర్మములు, సూక్ష్మ ధర్మములు తెలిపి వారికి భక్తి మార్గం చూపేవారు.  తపస్సు గావించి శక్తి సంపాదించిన కౌశికుడు ఎంతో గర్వం కలిగిన వాడు.తను ధర్మవ్యాధుడు గురించి తెలుసుకొని మిథిలానగరము నకు వచ్చి చూడగా ధర్మవ్యాధుడు అంగడిలో మాంసము విక్రయిస్తుండగా చూసి అసహ్యించుకుంటాడు.అది ధర్మవ్యాధుడు గమనించి కౌశికుడు దగ్గరకు వచ్చి మునివర్యా వందనములు. కులవృత్తి చేయడంలో తప్పులేదు అని చెప్పి ధర్మములు, సూక్ష్మ ధర్మములు తెలుపుతూ తల్లిదండ్రులు సేవలో శివపార్వతులు దర్శనం ఉందని ఆ కౌశికుడికి కనువిప్పు కలిగేలా చేస్తాడు.అలా వారికి తల్లిదండ్రులు గొప్పతనాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి కథే  కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర .

భోగి కార్ శ్యామల జమ్ము రాజా సమర్పణలో శ్రీ దుర్గా భవాని క్రియేషన్స్ పతాకంపై ఉల్కందే కార్ మురళీధర్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు కీ.శే.. యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు అన్ని పాటలు పాడడం విశేషం.జి.జే రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ భాస్కర్, అనుషా,అశోక్ కుమార్, ఆనంద్ భారతి,వి.మురళీధర్ లు నటిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ,రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.

ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన హ్యుమాన్ రైట్స్ చైర్మన్ జె.సి. చంద్రయ్య, బి.సి.కార్పొరే షన్   చైర్మన్ వకులా భరణం కృష్ణ మెహన్, దైవజ్ఞ శర్మ లు కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర ఆడియోను విడుదల చేయగా నిర్మాతలు సాయి వెంకట్, రాం సత్య నారాయణ,నవ్యాంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు యస్.వి.యన్.రావ్,వెంకటేశ్వర రాజు, నటికర్ రవి, బి.సి. కార్పొరేషన్ మెంబెర్  ఉపేంద్ర, శాంతా కుమారి, బి.నరసింగ్ రావ్, నేతికర్ శ్రీనివాస్, అనుషా, నటుడు  శ్రీనివాస్, రాజేష్ ,భాగ్యలక్ష్మి తదితరులు ఈ చిత్రంలోని పాటలను విడుదల చేశారు.

అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో

బి.సి.కార్పొరేషన్ చైర్మన్ వకులా భరణం కృష్ణ మెహన్ మాట్లాడుతూ.. ఈ దేశంలో ఎందరో మహానుభావులు అందించిన సనాతన భారతీయ సంస్కృతిని, సమాజానికి మళ్లీ.. ఒక సారి అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన మురళీధర్ రావు గారికీ ధన్యవాదాలు. మన ధర్మంలో, మన సంస్కృతంలో, ఒక అజరామరమైన ఆధ్యాత్మిక పరిమళం దాగి ఉన్నది. సనాతనంగా ఈ ప్రపంచానికి గొప్ప ధర్మాన్ని ప్రబోధించినటువంటి దేశం మన భారతదేశం. శాస్త్రాల్లో అది వైద్య శాస్త్రం, సామాన్య శాస్త్రం, తర్కశాస్రం, తత్వ శాస్త్రం ఏదైనా కావచ్చు.కానీ ప్రపంచానికి నాయకత్వం వహించినటు వంటిది మన భారతదేశమని ఈనాటికీ గర్వంగా చెప్పుకోవచ్చు.అటువంటి ఈదేశంలో ఎందరో మహా నుభావులు,ఏ యుగానికి ఆ యుగంలో ధర్మం ఎప్పుడు చెడుతుందో,అధర్మం ఎప్పుడ రాజ్య మేలుతుందో  అప్పుడు నేను పుడతాను ఆ ధర్మాన్ని  రక్షిస్తాను అని చెప్పినటువంటి దేవుడు ఏదో ఒక రూపంలో మానవ రూపంలో సమాజంలో ఉద్భవించి సనాతన ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాడు.ధర్మ వ్యాధుల వారు వృత్తిరీత్యా మాంసాన్ని విక్రయించటం వంటి వృత్తి కావచ్చు కానీ.. శ్రీ మన్నారాయణ నామాన్ని నిరంతరం ఒక ఘోషగా జపిస్తూ వినిపిస్తూ సమాజాన్ని సత్ప్రవర్తన వైపు నడిపించడానికి ఆనాడు వారు చేసిన కృషి ఉదాత్తమైనది ఉన్నతమైనది. మనం ఈనాటికి కూడా జ్ఞాపకం ఉంచుకునే టటువంటి ఒక శక్తిని కలిగినటు వంటిది. ఇవాల్టి సినిమాలు, సంగీతం, పాక్చాత్య పోకడలు,ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాం. కానీ.. ధర్మో రక్షిత రక్షితః అన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకొని ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుంది అనేటటువంటి దృక్పదంతో  దర్శకులు జి.జే.రాజా గారు ఇవాళ కర్మయోగి అయినటు వంటి శ్రీ ధర్మ వ్యాధుల వారి జీవిత చరిత్రను మన ముందుకు తీసుకు రావడం చాలా సంతోషంగా ఉంది.. ఇది ఆచరించాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. మహాభారతం, మహాభాగవతం, భగవద్గీత, రామాయణం ఆ ఇతిహాసాల గురించి ఆ గొప్పతనం గురించి రాముడు గురించి అనేకమైనటువంటి రీతిల్లో సాధు పుంగవులు మనల్ని సన్మార్గం వైపు నడిపిస్తూనే వున్నారు. కానీ ఇలాంటి రోజుల్లో కూడా ఇలాంటి చిత్రాలు తీస్తున్నప్పుడు సమాజంలో ధర్మ వ్యాధుల వారి యొక్క గొప్పతనం, ఆచరించి నటువంటి ధర్మం, ఆచరించి నటువంటి నీతి,ఇవాళ్టి సమాజంలో ఎక్కడికి పోయింది, ఏం జరుగుతుంది ఎక్కడచూసినా వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులను ఆదరించే టటువంటి పరిస్థితి కోల్పోతున్నాయి. ఒక ఇంట్లోనే ఉంటూ తల్లిదండ్రులు,బిడ్డలు వేరువేరుగా వండుకొని తింటున్నారు. వారి ఆరోగ్యం గానీ, ఆనారోగ్యం గురించి గానీ పట్టించు కోనటువంటి విపరీత మైనటువంటి వికృతమైనటువంటివి సమాజంలో పోకడలు కొనసాగు తున్నాయి.ఆ నాడే ధర్మ వ్యాధుల వారు తల్లిదండ్రులకు సేవ చేయడంలోనే ఒక మానవ సేవ దాగి ఉందని ప్రబోధించి నటువంటి గొప్ప మానవతా మూర్తి ధర్మ వ్యాధుల వారని చెప్పుకోవడం మనందరికీ గర్వకారణం.ప్రతిభ, ధర్మం, ఋజువర్తన ఎక్కడ ఉంటే సమాజం దాన్నే ఆచరిస్తుంది. ఇవాళ తల్లిదండ్రులకు జరుగుతున్నటువంటి అవమానాలు తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్నటువంటి ఓ దుర్మార్గపు పోకడలనుండి  ఏ విధమైన బాధ్యతలను మనం గుర్తెరగాలి ఆనాడే ధర్మ వ్యాధుల వారు మనకు అంత గొప్ప ప్రబోధాన్ని  మనకు అందిస్తే.. ఇవాళ మనం ఏం చేస్తున్నాం. సాధుపుంగవులు ప్రవచనాలు చెబుతూఉంటే ఆహా స్వామి వారు ఎంత గొప్పగా చెప్పారు రాముడు గురించి, కృష్ణుని గురించి  భగవద్గీతలోని శ్లోకాలను  అర్ధ తాత్పర్యాలను ఎంత బాగా అర్థం అయ్యేలా చెప్పాడని సంతోషపడి ఇంటికి పోయిన తర్వాత తల్లిదండ్రులను మాత్రం నిర్లక్ష్యం చేసే పోకడలే కొనసాగుతున్నాయి. మనం చిన్నప్పుడు ఎంత మారాం చేసినా..ఎంత ఇబ్బంది పెట్టినా.. బుజాలమీద ఎక్కించుకొని చందమామ రావే  జాబిల్లి రావే. అనే పాటలు వినిపించినటువంటి తల్లిదండ్రులు ఈరోజు మనకు ఇబ్బంది కలిగిస్తున్నారా. ఈ విపరీతమైనటువంటి పోకడలు సమాజంలో పోవాల్సిన అవసరం లేదా. వర్కింగ్ ఉమెన్స్, వర్కింగ్ మెన్స్ హాస్టల్లో ఉంటే వేరు గాని వృద్ధాశ్రమాల సంఖ్య పెరుగుతున్న దేమిటి ఇవాళ. మనల్ని కష్టపడి చదివించి రెక్కల్ని బొక్కలు చేసుకొని జీవితమంతా త్యాగం చేసి విదేశాలకు పంపించి ఉన్నతమైనటువంటి ప్రమాణమైన జీవితాన్ని కల్పించిన తల్లిదండ్రులు ఇవాళ మనకు ఎవగింపుగా కనిపిస్తున్నారా. ఈ చిత్రం ద్వారా నైనా ఈ సమాజంలో ఒక బలీయ మైనటువంటి మార్పు రావాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా మనవి చేసుకుంటున్నాను. సనాతన ధర్మ కళ్యాణం కోసం పని చేస్తున్న పెద్దలు, నా మిత్రులు ఎంతో మంది ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది.అందరూ కూడా చిత్రాన్ని చూసి ఆనంద పడడమే కాదు చిత్రం యొక్క నీతిని గమనించి ఇప్పటికైనా మన తల్లిదండ్రులను గౌరవిద్దాం..మన తల్లిదండ్రులను మనము గౌరవిస్తే.. ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు అనేటటువంటి నీతితో మనం బయటికి వెళదామని మీ అందర్నీ కోరుకుంటూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు

హ్యుమాన్ రైట్స్ చైర్మన్ జె.సి.చంద్రయ్య మాట్లాడుతూ.. వెనుకబడిన కులాల చరిత్రే  “కర్మయోగి శ్రీ ధర్మవ్యాధుడు చరిత్ర”.మానవ రంగాలలో ఆర్థిక రంగం ఎంతో ముఖ్యం. సమాజములో ఎన్నో విధమైన కథలు ఉన్నాయి.అలాంటి కథలను సెలెక్ట్ చేసుకొని ఆర్థికంగా ముందుకు వెళ్లచ్చు. కానీ మానవ సమాజం గురించి మనలోని అజ్ఞాన్ని తెలియజేసే “కర్మయోగి శ్రీ ధర్మవ్యాధుడు చరిత్ర” కథను సెలెక్ట్ చేసుకొని చేస్తున్న దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.. మనిషి జీవితం సాంస్కృతిక, సామాజిక ,ఆర్థిక, రాజకీయ అంశాల మీద ఆధారపడి ఉంది దానికి ప్రధాన కారకులు మానవులందరూ ఒకే జాతికి చెందినటువంటి వారు. అదే మానవ జాతి.మానవ జాతికి కావలసింది మానవతా విలువలతో కూడుకున్నటువంటి పరిజ్ఞానం. అందుకు భిన్నంగా ఏ జ్ఞానం అయినా ఏ అంశం చేత ఒక మనిషిని చిన్నచూపుగా చూస్తారో అది అజ్ఞానం కింద చూప బడుతుంది గాని జ్ఞానం కింద కాదు.అది గ్రహించాల్సిన అవసరం ఉంది. మానవ సమాజం ఈనాడు గుర్తించాల్సింది ఏంటంటే మానవులందరూ ఒకే జాతికి సంబంధించిన వారు అనే సత్యాన్ని గ్రహించే  రోజులు ముందుకు వస్తున్నాయి. దానికి నిదర్శనం ఈ మధ్యలో జరిగినటువంటి విషయం 1000 సంవత్సరాల క్రితం జన్మించిన రామానుజుల ప్రతిమను మనం ప్రతిష్టించడంతో ఆయన పేరు గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగిపోతుంది. తను సమానత్వం అనే భావాన్ని నెలకొల్పిన గొప్ప సమతమూర్తి. ప్రస్తుతం  ప్రపంచం సమానత్వం వైపు ముందుకు వెళుతుంది. సమానత్వం యొక్క ప్రత్యేకతను తెలుసుకునే విషయం ఆసన్నమయింది.

భారతదేశంలో సినిమా దశ 1890 నుంచి 1920 వరకు సైలెంట్ మూవీస్ వచ్చాయి 1930 నుంచి 940 వరకు టాకీస్ మాట్లాడేటటు వంటి సినిమాలు వచ్చాయి,1940 నుంచి 60 వరకు గోల్డెన్ ఏజ్ అప్పుడు కళాకారుల్లో పరిపూర్ణమైన స్వభావం వచ్చి తెలుగుజాతికి ఒక చక్కటి బంగారంతో సమానమైన సినిమాలు తీశారు.తరువాత వచ్చినటువంటి సినిమాలలో అనేక మైనటువంటి అభియోగాలు వచ్చాయి చలన చిత్రాలు చూడడం ద్వారా పిల్లలు చెడిపోతున్నారు అనే భావన కూడా వచ్చింది. ఆ భావన ఇంకా కంటిన్యూ అవుతుంది ఇలాంటి పరిస్థితులలో అనేక మార్పులు వస్తున్నాయి. తల్లి తండ్రులు మంచి పిల్లను ఆశిస్తున్నారు, ఉద్యోగ అధిపతులు మంచి ఉద్యోగస్తులను ఆశిస్తున్నారు, రాజకీయరంగంలో ఉన్నటువంటి వారు మంచి నాయకులను ఆశిస్తున్నారు. ఇలా మంచి అనే పదం ఎందుకు వస్తుంది అంటే  చెడు అనేది ఉనికిలో ఉంది కాబట్టి. ఇలాంటి పరిస్థితులలో చరిత్రాత్మకమైనటువంటి ఆధ్యాత్మికమైన ఈ “ధర్మ వ్యాధుల చరిత్ర” ను ఉన్న తెలుగువారికి అందించడం అభినందనీయం.ఒక సినిమా ద్వారానే గాక పుస్తకాల ద్వారా కూడా తీసుకొని చదవాల్సిన అవసరం ఉన్నది.ఇలాంటి చక్కటి సేవా మూర్తిని, ప్రేమమూర్తి చరిత్రను ప్రపంచానికి తెలియజేయడం చాలా అభినందనీయం అని అన్నారు.

ఆధ్యాత్మిక వేత్త దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ..సనాతన ధర్మాన్ని సనాతన వ్యాప్తిని విశేషంగా అవిస్కరించి భారతీయులు పేదవారు కానీ స్వచ్ఛమైనటువంటి వారు.అలాంటి భారతీయ వాంగ్మయం ప్రవహించాలని ధర్మ వ్యాధుల వంటి మహానుభావులు పుట్టాలని భగవంతున్ని కోరుకొంటున్నాను. ఈశ్వరుడు పరవభూత స్వరూపుడనే టటువంటి మంచి నానుడితో ఈ సినిమా తీసిన దర్శక నిర్మాతలకు అభినందనిస్తూ ఈ సినిమా గొప్ప విజయం సాదించాలని అన్నారు.

చిత్ర నిర్మాత ఉల్కందే కార్ మురళీధర్ మాట్లాడుతూ..మా ఆడియో విడుదల చేయడానికి ఇంతమంది పెద్దల రావడం చాలా సంతోషంగా ఉంది.దర్శకుడు జి.జే. రాజా 10 సంవత్సరాల క్రితం రాసుకున్న ఈ కథను ఎంతో మందికి వినిపించడం జరిగింది. ఈ కథను విన్న రామానాయుడు గారు తీస్తానని ముందుకు వచ్చాడు. అంతలో తను పరమపదించాడు. ఇలా ఎంతోమందిని అడిగిన తర్వాత నాకీ కథ చెప్పడం జరిగింది. నేను చిన్నప్పటి నుండి సీనియర్ నటులు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావులు తీసిన భక్తి సినిమాలు చూసి పెరిగిన నాకు దైవభక్తి ని విపరీతంగా నమ్ముతున్న నాకు దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా చేయడానికి మాకు మూడు సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం ఒక సినిమాను రెండు నెలల్లో పూర్తి చేస్తారు కానీ మేము సమాజానికి సనాతన భారతీయ సంస్కృతిని  మళ్లీ ఒక సారి అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చినందున ప్రతి దాన్ని క్లుప్తంగా పరిశీలిస్తూ అప్పటి కాలానికి తగినటువంటి ప్రాంతాలను,పాత కాలం మందిరాలను, ఆలయాలను సెలెక్ట్ చేసుకుంటూ ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి తీయడం జరిగింది. మా సినిమాలో నటీనటులు, టెక్నీషియన్లు అందరూ చాలా కష్టపడ్డారు. సాయి గారు, కావూరి శ్రీనివాసరావు గార్లు మాకెంతో సపోర్ట్ గా నిలిచారు. నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు ఈ సినిమాలో అశోక్ కుమార్ నటన హైలెట్ గా నిలుస్తుంది. తన వల్లే ఈ సినిమా ఇంత బ్రహ్మాండంగా వచ్చింది.మేము మా చిత్ర  ప్రమోషన్ గురించి మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పోస్టర్స్ ను విడుదల చేయగా  మాకు అన్ని ప్రాంతాల్లో కూడా అద్భుతమైన ఆదరణ లభించిడమే కాక  ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆశీర్వదించారు. ఈరోజు మేము ఇంతమంది పెద్దల సమక్షంలో మా చిత్ర ఆడియోను విడుదల చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.మా చిత్రాన్ని చూసిన పతి ఒక్కరూ వందమందికి చెప్పి మా చిత్రాన్ని గొప్ప విజయవంతం సాధించేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.మా బ్యానర్ ను కూడా దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఇపుడు ఆయన ఆధ్వర్యంలో జరుపుకుంటున్న ఈ సినిమా కూడా  గొప్ప విజయం సాధించాలని కోరుతున్నానని అన్నారు

చిత్ర దర్శకుడు జి.జే రాజా మాట్లాడుతూ.. ధర్మవ్యాధుడు యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలని సినిమా తీయడం జరిగింది. ధర్మములు సూక్ష్మ ధర్మములు ప్రతి ఒక్కరికి తెలియజేయడమే కాక  తన సొంత పిల్లలకు కూడా ధర్మం చెప్పేవాడు. ఉదాహరణకు తన సొంత కూతురికి కల్యాణం జరిపించి పంపిన తరువాత కొద్దీ రోజులకు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మీ తండ్రి మాంసం అమ్ముకునే వాడని అవమానంగా మాట్లాడుతున్నారు. తండ్రిని గౌరవించని వారి ఇంట్లో ఒక్క రోజు వుండలేనని  తన తల్లిదండ్రులకు చెప్పగా అప్పుడు ఆ ధర్మ వ్యాధులవారు కూతురుతో ఏ రోజైతే కళ్యాణం చేసి ఇక నుండి మా కూతురు మీ కూతురు అని అప్పజెప్పినపుడే మేము చనిపోయాము.నీవు అక్కడికెళ్ళి ఒక మంచి భార్యగా, తల్లి గా పేరు సంపాదించినపుడే నీకు విలువ పెరుగుతుంది. నువ్వు తల్లి,దండ్రులు దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను ఎంత కాలం చూస్తారు.ఒంటరిగా ఉన్న మహిళకు ఈ సమాజంలో  విలువ ఇవ్వకపోగా అసహ్యించు కుంటుంది. వృత్తులు పుట్టిన తర్వాతనే కులాలూ పుట్టాయి కానీ కులాల ముందు పుట్టలేదు. వ్యక్తులు ఏ ఏ వృత్తులు చేస్తూ ఉంటారో దాన్నిబట్టే కులాలు ఎర్పడ్డాయి. ఏ వృత్తి చేసినా  తప్పు లేదు కానీ శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణాన్ని మాత్రం మరవకూడదు.అని చెప్పి తన కూతురిని అత్తగారింటికి పంపించిన మహానుభావుడు ధర్మవ్యాధుడు. అలాంటి వారి చరిత్రను సినిమాగా తీసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు.కాబట్టి మా చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.

సంగీత దర్శకుడు లక్ష్మణ సాయి మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంతమంది పెద్దలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మనమంతా మానవ కులం అని చెప్పే ఇలాంటి మంచి కథకు సంగీతం అందించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తాను. ఇలాటి అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.ఈ సినిమా కోసం వారు ఎంతో కష్టపడ్డారు.వారి కష్టానికి ప్రతిఫలం దక్కేలా మీరందరూ ఈ చిత్రాన్ని చూసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

సీనియర్ నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయడం ఒక యజ్ఞం.అలాంటిది ఇలాంటి సినిమా తీయడం మహా యజ్ఞం.నేను నా జీవితంలో నెగెటివ్ క్యారెక్టర్స్ చేసింది చాలా తక్కువ. ఇందులో నేను అలాంటి మంచి క్యారెక్టర్ చేశాను.మాములు సినిములకే డబ్బులు రానటువంటి తరుణంలో కూడా ఎంతో ధైర్యం తో తీసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

హీరో విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఎన్నో సినిమాలు చేశాను.అయితే సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఇలాంటి  మంచి ఆధ్యాత్మికమైన సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

హీరోయిన్ అనూష మాట్లాడుతూ. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథను  సినిమాగా తీయడానికి ఎవరూ ధైర్యం చేయరు. కానీ మా నిర్మాతలు ఎంతో ధైర్యంగా ఈ సినిమాను చేయడానికి ముందుకు వచ్చారు. ఇలాంటి మైథలాజికల్ సినిమాలో నేను నటించినందుకు చాలా సంతోషంగా ఉంది.దర్శక, నిర్మాతలు మమ్మల్ని ఆదరించి, ప్రోత్సహించడం వలన మేము బాగా నటించగలిగాము. మాకు ఇలాంటి మంచి సినిమాల్లో చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

పాటల రచయిత కావూరి శ్రీనివాసు మాట్లాడుతూ.. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక చిత్రానికి పాటలు రాయడమే కాక నేను రాసిన పాటలను లెజెండరీ సంగీత దర్శకులు కీ.శే..యస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారు పాడడం నేను జీవితంలో మరవలేను.ఇలాంటి మంచి అవకాశం కల్పించిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.

నెతికర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇందులో నేను మహా మంత్రిగా చేయడం. జరిగింది.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి గొప్ప సినిమా చేయాలనే ఆలోచన వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.

నిర్మాతలు రాం సత్య నారాయణ, సాయి వెంకట్ లు మాట్లాడుతూ… సాహిత్య విలువలున్న పాటలు కనుమరుగై పోతున్నతున్న తరుణంలో ఇలాంటి మంచి పాటలు రావడం చాలా సంతోషంగా ఉంది.ఇందులోని పాటల చాలా బాగున్నాయి. నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు.ఇలాంటి సినిమా తీయడానికి దర్శక, నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ఇందులో పని చేసిన వారందరికీ ధన్యవాదాలు.

బి.సి. కార్పొరేషన్ మెంబెర్  ఉపేంద్ర మాట్లాడుతూ..ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక అన్నమయ్య,భక్త రామదాసు, పాండురంగ మహత్యం సినిమాలను చూసిన అనుభూతి కలుగుతుంది.చదువు తో అవసరం లేదు.. ఒక పని ద్వారా గౌరవం వస్తుంది. అని చాటి చెప్పింటువంటి “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర” ను ప్రపంచానికి తెలియజేయడానికి ఎంతో కష్టపడి సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తున్న సినిమా యూనిట్ అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో  వెంకటేశ్వర రాజు,నీతికర్ రవి, , శాంతా కుమారి, బి.నరసింగ్ రావ్,,నటుడు శ్రీనివాస్, రాజేష్ ,భాగ్యలక్ష్మి తదితరులు ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటీనటులు
విజయ్ భాస్కర్, అనుషా,అశోక్ కుమార్, ఆనంద్ భారతి, వి.మురళీధర్ ,కావూరి శ్రీనివాసు, ప్రభావతి, అనూష రెడ్డి, రమ్య, లావణ్య, శ్యామ్ సుందర్, సాయి రాజా గోగి కార్, లక్ష్మణ, జయ, మాస్టర్ ఆయుష్ మాన్, మాస్టర్ మణి కిరణ, మాస్టర్ మణి తేజ, బేబీ శ్రీ విద్య తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : భోగి కార్ శ్యామల జమ్ము రాజా
సౌజన్య రియల్ ఎస్టేట్ యూనిట్
బ్యానర్ : శ్రీ దుర్గాభవాని క్రియేషన్స్
సినిమా : కర్మయోగి శ్రీ ధర్మవ్యాధుడు చరిత్ర
నిర్మాత : ఉల్కందే కార్ మురళీధర్
సహాయ నిర్మాత : గోదా వెంకట కృష్ణారావు
కథ రూపకల్పన స్క్రీన్ ప్లే  దర్శకత్వం :  జి జే రాజా
గాయకులు : యస్.పి బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణ సాయి,సుధీర్,లక్మి వినాయక
కెమెరా : పి.దీవరాజ్
సంగీతం : లక్ష్మణ సాయి,లక్ష్మీ వినాయక్,సంజీవ్ కుమార్ మోగేటి