కార్తికేయ 2 మూవీ రివ్యూ

Published On: August 13, 2022   |   Posted By:

కార్తికేయ 2 మూవీ రివ్యూ

 

Karthikeya_2_Movi.jpg

నిఖిల్  ‘కార్తికేయ 2’ రివ్యూ
Emotional Engagement Emoji (EEE)
👍
నిఖిల్ గత కొన్నేళ్లుగా కథలో సెలక్షన్స్ లో మార్పు చేసుకుని విభిన్నమైన కాన్సెప్టు లతో ముందుకు వెళ్తున్నారు. రెగ్యులర్ హీరోయిజం కన్నా కంటెంట్ బలంగా ఉన్న కథలకే ఓటేస్తున్నాడు. దాంతో మెల్లిగా  నిలదొక్కుకుంటూ తన కంటూ కొంతమంది ఆడియన్స్ ని తయారు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో వచ్చిన  మరో చిత్రం  ‘కార్తికేయ 2’. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది.  తన సూపర్ హిట్ సీక్వెల్ గా వచ్చిన  ఈ చిత్రం ఎలా ఉంది… అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.స్టోరీ లైన్

డాక్టర్ కార్తికేయ (నిఖిల్) కాస్త డిఫరెంట్. సైన్స్ ని దాటి వెళ్లడానికి ఇష్టపడడు. మూఢ నమ్మకాలపై యుద్దం ప్రకటిస్తూంటాడు. అలాంటి డాక్టర్ …శ్రీకృష్ణుడు నగరమైన ద్వారక వెళ్లాల్సి వస్తుంది. అందుకు కారణం తన తల్లి మొక్కుబడి. ఆమె తన కొడుకు కోసం మొక్కుకుంటే ఆమెపై ప్రేమతో ద్వారకకు బయిలుదేరతాడు. అయితే అక్కడ అతని నమ్మకాలకు, ఆలోచనలకు ఎదురు దెబ్బ తలుగుతుంది. మరో స్పిరిట్యువల్ ప్రపంచం ఉందని ఉనికిలోకి వస్తుంది. అక్కడికి వెళ్ళగానే ఓ ఆర్కియాలజిస్ట్ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. తనకు సంభధం లేదని హత్య కేసులో జైలుకు వెళ్ళిన అతన్ని ముగ్థ‌ (అనుపమ పరమేశ్వరన్)  బయిటకు తీసుకువస్తుంది. ఆమె ఎవరు అంటే ఆ చనిపోయిన ఆర్కియాలజిస్ట్ కుమార్తె. ఆమె కార్తికేయకు…ఓ విషయం చెప్తుంది. అది శ్రీకృష్ణుడు కంకణం గురించి. ఇప్పటికే ఆ కంకణం కోసం ఓ బ్యాచ్ తిరుగుతుంటుంది.  వాళ్లు కార్తికేయకు అడ్డం వస్తారు. మరో ప్రక్క అక్కడ ఉన్న అభీరా తెగ కూడా కార్తికేయను ఎటాక్ చేస్తుంది. అసలు ఆ కంకణం దేని గురించి…. కార్తికేయ దాన్ని సాధించాడా…చివరకు ఏం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్ …..

ఇదో స్పిరిట్యువల్ థ్రిల్లర్. ఈ కథ పూర్తిగా  నిధి అన్వేషణ, చరిత్ర, ఇతిహాసాల నేపథ్యంలో జరుగుతుంది. ఇలాంటి కథలతో  గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. అయితే వాటికీ  `కార్తికేయ 2` కు తేడా ఏమిటంటే..నేరేషన్. శ్రీకృష్ణుడు కాలికి ధరించిన కంకణం అనే పాయింట్ ని తీసుకుని దాన్ని హీరో చేజిక్కించుకోవాలనుకోవటం… కొందరు అడ్డుపడటం, హీరో క్లూస్ తో దాన్ని అంది పుచ్చుకునే ప్రయత్నం చేయటం ఇదంతా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అయితే హీరో లక్ష్యానికి అడ్డుపడే పాత్రలే బలంగా లేకపోవడంతో కొంత ప్రెడిక్టబులిటీ అనిపిస్తుంది. కాకపోతే సీన్స్ కొత్తగా ఉండటంతో  ప్రేక్షకుడికి ఎక్సయిట్ మెంట్ గా అనిపిస్తాయి.  అలాగే హీరో పాత్రను విభిన్నంగా ప్రెజెంట్ చేయటం కలిసొచ్చింది. ప్రతీ దాంట్లో సైన్స్, లాజిక్ ని వెదికే డాక్టర్ గా నిఖిల్ పాత్ర ఇంట్రడక్షన్ బాగుంది.  దానికి తోడు పాత సీన్స్ ని సినిమాలోకి రానివ్వలేదు.  స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా ఉండటం మరో ప్లస్ అయ్యింది. కథ,కథనంలో తర్వాత ఏం జరుగుతుందనే డ్రామా బాగా పండింది.  ఫస్టాఫ్ లో  కథ మొత్తం ద్వారక చుట్టూ తిరగటం, కృష్ణుడు భక్తులైన అభిరా తెగ వారు చేసే ఎటాక్ లతో  నడిచిపోయింది. ఇంట్రవెల్ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. సెకండాఫ్ లో  సీన్స్ స్లో అనిపించినా , క్లైమాక్స్ సినిమాని నిలబెట్టింది.  ఇలాంటి నేరేషన్ లతో మనకు సినిమాలు తక్కువ వస్తున్నాయి. ఇది కొత్త తరహా కథగా అనిపిస్తుంది. అది ఖచ్చితంగా న్యూ జనరేషన్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. అయితే ఈ సినిమాలో ఒకే పెద్ద మైనస్ ఏమిటి అంటే ఆ కృష్ణుడు కంకణం దొరక్కపోతే వచ్చే నష్టమేమిటి అనేది చెప్పలేకపోవడం.

టెక్నికల్ గా…

ఈ సినిమా సాంకేతికంగా మంచి స్టాండర్డ్స్ లో  వుంది. అలాగే కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ   మిస్టరీ థ్రిల్లర్ జానర్‌ కు తగ్గట్టు నడిచింది.  చాలా మామూలు సీన్స్ కు అదిరిపోయే  ఎలివేషన్ ఇచ్చింది.కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ  నీట్  గా వుంది. ఫ్రెష్ లొకేషన్స్ ఉండటం ప్లస్.  దర్శకుడు స్క్రీన్ ప్లే  చాలా గ్రిప్పింగ్ రాసుకున్నాడు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడిని ఎక్కడా బోర్ కొట్టకుండా ఎక్సయిట్ చేయడంతో సక్సెస్ అయ్యాడు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. డైలాగులు సోసోగా ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ స్పెషల్ గా కనిపిస్తుంది.  నిర్మాతలు కూడా బాగా ఖర్చు పెట్టారు.

నటీనటుల్లో …నిఖిల్ పూర్తిగా ఇది నా సినిమా అని నేనే ఆ పాత్ర అన్నట్లు చేసారు. డీసెంట్ గా చేసిన అతని నటన సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అనుపమ పరమేశ్వరన్ ఈ సీక్వెల్ సినిమాకు మరో కలర్స్ స్వాతి.  రొటీన్ లవ్ ట్రాక్ లు లేకపోవడం మరో ప్లస్. శ్రీనివాస రెడ్డి కామెడీ బాగుంది. ఆదిత్య మీనన్  విలనీని స్టైలిష్ గా తీర్చిదిద్దారు. అనుపమ్ ఖేర్  క్యామియో రోల్ అయినా.. మంచి ఎఫెక్ట్ ను తీసుకొచ్చింది.

ప్లస్ లు :
ప్రెష్ గా అనిపించే నేపథ్యం
థ్రిల్లర్ స్క్రీన్ ప్లే డిజైన్ చేయడం
ఆర్ట్ వర్క్

మైనస్ లు :
మరీ సినిమాటిక్ లిబర్టీ పరిధి దాటిపోవడం
హడావిడిగా ముగిసిన కథ

చూడచ్చా

ఖచ్చితంగా చూడదగ్గ సినిమా . కొత్త కథలు కావాలి అనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.

నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్రవీణ్‌, ఆదిత్యా మేన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌, తదితరులు;
సంగీతం: కాలభైరవ;
ఛాయాగ్రహ‌ణం: కార్తీక్ ఘట్టమనేని;
క‌ళ‌: సాహి సురేష్;
నిర్మాణ సంస్థ‌: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌;
నిర్మాత‌లు: టి.జి.విశ్వ ప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌;
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం: చందు మెుండేటి;
Run Time‌:2 hr 25 Minutes
విడుద‌ల తేదీ‌: 13-08-2022