గాడ్ ఫాధర్ మూవీ రివ్యూ

Published On: October 5, 2022   |   Posted By:
గాడ్ ఫాధర్ మూవీ రివ్యూ

చిరంజీవి  ‘గాడ్ ఫాధర్’-  రివ్యూ!

Emotional Engagement Emoji (EEE)

👍

గాఢ్ ఫాదర్ …ప్రపంచమంతా మెచ్చుకున్న ఓ సూపర్ హిట్ చిత్రం టైటిల్. లూసీఫర్ …మళయాళ మెగాస్టార్ మోహన్ లాల్ సూపరి హిట్ చిత్రం రీమేక్ ..ఈ రెంటితో ఓ తమిళ డైరక్టర్ ని తీసుకొచ్చి తెలుగులో సినిమా చేయించారు చిరంజీవి. ఆచార్యతో అట్టడుకు వెళ్లిపోయింది అన్న ఇమేజ్ ఈ దెబ్బతో వచ్చేస్తుందని ఫ్యాన్స్ బాగా నమ్మారు. ఈ సినిమాపై చిరంజీవి, డైరక్టర్ మోహన్ రాజా బాగా నమ్మకం వ్యక్తం చేసారు. వాళ్ల నమ్మకాలు నిజం అయ్యాయా…సినిమా ఆ స్దాయలో వర్కవుట్ అయ్యిందా..జనాలకు నచ్చే సినిమాయేనా ,కేవలం ఫ్యాన్స్ కోసమేనా రివ్యూలో చూద్దాం.

Story line:

రాష్ట్రంలో ముఖ్యమంత్రి మరణం…ఆ తర్వాత ఏర్పడే రాజకీయ అనిశ్చితితో సినిమా ప్రారంభం అవుతుంది. జన జాగృతి పార్టీ అధ్యక్ష్యుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి పీకెఆర్ (సర్వదమన్ బెనర్జీ ) ఆకస్మికంగా చనిపోవటంతో… పొలిటికల్ వార్ కు దారి తీస్తుంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం కుత్తుకలు కోసే అసలు ఆట మొదలవుతుంది. ఈ యుద్దాన్ని వెనక ఉండి నడిపిస్తోంది..సీఎం కుర్చీమీద కన్నేసింది మరెవరో కాదు…తేనె పూసిన కత్తి లాంటి  పేకీఆర్ అల్లుడు  జైదేవ్ (సత్యదేవ్ ). పార్టీలో ఉన్న మరి కొంతమంది దుర్మార్గులను పోగేసి వెనక రాజకీయం చేస్తూంటాడు. ఆ విషయం అతని భార్య సత్యప్రియ (నయనతార)కు కూడా తెలియదు. ఇలాంటి పరిస్దితుల్లో ..తనదైన శైలిలో కథలోకి ఎంట్రీ ఇస్తాడు… బ్రహ్మ(చిరంజీవి).

ఇన్నాళ్లూ జన జీవితానికి దూరంగా అనాధశ్రమం నడుపుతున్న బ్రహ్మ సీన్ లోకి వస్తాడు. జైదేవ్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూంటాడు.  మరో ప్రక్క సత్యప్రియకు…బ్రహ్మకు పడదు. దాంతో ఆమె బహిరంగంగానే  ద్వేషిస్తూంటుంది. ఎవరు బ్రహ్మకు సహకరించరు. అయినా జైదేవ్ కుట్రలను అడ్డుకుంటున్న అతనికి వ్యక్తగతంగా ,సామాజికంగా సమస్యలు వస్తాయి. అప్పుడు సీన్ లోకి వస్తాడు… మాసూమ్ భాయ్ (సల్మాన్ ఖాన్) . అతని సాయింతో బ్రహ్మ ఏం చేసాడు..జైదేవ్ కు ఎలా చెక్ చెప్పాడు..బ్రహ్మకు ఆ ముఖ్యమంత్రి కుటుంబానికి ఉన్న రిలేషన్ ఏమిటి…సత్యప్రియకు,బ్రహ్మకు మధ్య ఉన్న విభేధాలకు గల కారణమేంటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ :

‘ప్రస్తుత పొలిటికల్ వ్యవస్థపై కానీ.. నాయకులపై సెటైర్లు వేయాలనే ఉద్దేశం లేదు కథ ఆధారంగానే డైలాగులు ఉంటాయి. ’ అని చిరంజీవి ముందే అన్నారు. వాస్తవానికి మళయాళంలో ఇదో పొలిటికల్ సైటర్ సినిమా. దీన్ని తెలుగులో అచ్చ తెలుగు కమర్షియల్ సినిమా చేసేసారు.  మళయాళంలో ఉన్నది ఉన్నట్లు తీసారా..లేక మార్పులు ఏమన్నా చేసారా..అంటే చాలా చాలా మార్పులు చేసారనే చెప్పాలి. కేవలం స్టోరీ లైన్ తీసుకుని సీన్స్ మార్చుకుంటూ, క్యారక్టర్స్ లో కొన్ని తెలుగుకి అనవసరం అనిపించినవి తీసేసి,కొత్తవి కలిపేసి స్క్రిప్టు రెడీ చేసి పట్టాలు ఎక్కించారు. ఇది ఓ రకంగా స్క్రిప్టు తో చేసిన ప్రయోగం  అని చెప్పాలి. మళయాళంలో లూసీఫర్ పెద్ద హిట్ కావచ్చు కానీ దాని తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇక్కడ ఓ రోజు కూడా ఆడలేదు. సురేష్ ప్రొడక్షన్ వాళ్లు రిలీజ్ చేసినా… ఆ సినిమా మనవాళ్లకు ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదో గమనించి, ఆ మార్పాలు చేసి చిరంజీవి సక్సెస్ అయ్యారు.  కాబట్టి  గాడ్ ఫాదర్ అనే సినిమా లూసిఫర్ కి రీమేక్  గానీ,  లూసిఫర్ సినిమా ఏ ప్రమాదం లేకుండా ఒరిజినల్ గానే మిగిలింది. చిరంజీవి ఖాతాలో కమర్షియల్ హిట్ పడ్డట్టే.

అయితే ఇక్కడో మాట  లూసీఫర్ ఒరిజనల్ ని  చూసిన వారికి ఈ సినిమా కాస్త కఠినంగానే అనిపిస్తుంది. లూసీఫర్ అంటే…హిబ్రూ పురాణంలో ఓ పాత్ర.  దేవుడి కుడి భుజంగా వెలిగిన దేవదూత లూసిఫర్ ని సాతానుగా ముద్రవేసి స్వర్గం నుంచి బహిష్కరిస్తే ఏం జరిగిందనే హిబ్రూ పురాణ గాథ. ఆ పాత్రను , వర్తమాన పరిస్థితులకి అన్వయించి,కేరళ రాజకీయాలను సుతిమెత్తటి సెటైర్స్ తో స్పృశిస్తూ డిజైన్ చేసారు. అయితే తెలుగు రీమేక్ కు వచ్చేసరికి అసలు ఆ కాన్సెప్టే లేదు. రాజకీయాలపై సెటైర్స్ వేయాలనే ఆలోచన లేదు. ఏదో ఒకటి అరా ఉన్నా..అవేమీ పెద్దగా పట్టించుకునేవేమీ కాదు.

అవాకశం ఉన్నా..మనకెందుకు రిస్క్ అనుకుని ఆ సెటైర్స్ జోలికిపోలేదు. కేవలం చిరంజీవిని ఈ పాత్రలో మాస్ ఎలిమెంట్స్ చూపిస్తే ఎలా ఉంటాడు..ఫ్యాన్స్ కు ఎలా నచ్చుతాడు అనే విషయాలపైనే దృష్టి పెట్టి దర్శకుడు ముందుకు తీసుకెళ్లాడు. ఓ రకంగా జనాలకు కూడా అదే నచ్చుతుంది. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం సినిమాలో సెట్ కాలేదు. చిరంజీవి కన్నా పెద్ద వయస్సులాగ కనపడుతున్నాడు. చివరి ఇరవై నిముషాలు కూడా సోసోగా ఉంది. క్లైమాక్స్ బాగా రొటీన్ గా ఎక్సెపెక్టెడ్ గా ఉంది. అయినా చిరంజీవి కనపడుతూంటాడు కాబట్టి నడిచిపోతుంది అనిపిస్తుంది.

టెక్నికల్ గా చూస్తే….
తమన్ ఈ సినిమాకు ప్లస్ ,మైనస్. చిరంజీవి సినిమా కు తొలి సారి చేస్తూ చాలా లౌడ్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. కెమెరా వర్క్ బాగుంది. ఆర్ట్ డిపార్మెంట్ వర్క్ చాలా చోట్ల హైలెట్ అయ్యింది. రిచ్ విజువల్స్…ప్రొడక్షన్ వాల్యూస్ ఏ స్దాయిలో ఉన్నాయో చెప్తున్నాయి. డైలాగులు బాగున్నాయి.

ఇక నటుడుగా చిరంజీవి కు ఇలాంటి కథలు, పాత్రలు కేక్ వాక్ టైప్. సత్యదేవ్ మాత్రం ఫెరఫెక్ట్ ఆప్షన్. విలన్ గా అదరకొట్టాడు. తేనె పూసిన కత్తి అంటే వీడేరా అనిపిస్తాడు. నయనతార పాత్ర ఎవరు చేసినా ఓకే అనిపిస్తుంది. పెద్ద తేడా అనిపించదు. సల్మాన్ ఖాన్ ని హిందీ మార్కెట్ కోసం పెట్టుకున్నారు. అందులో తిరుగేలేదు. పెద్ద ఆలోచించేది లేదు.

చూడచ్చా :

చిరు  అభిమానులకు బాగా నచ్చుతుంది. లూసీఫర్ చూసిన వాళ్లకు కాస్తంత ఇబ్బందిగానే ఉంటుంది.

నటీనటులు : చిరంజీవి, నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్, సముద్రఖని, అనసూయ, ‘బిగ్ బాస్’ దివి, బ్రహ్మాజీ త‌దిత‌రులు
మాటలు : లక్ష్మీ భూపాల్
ఛాయాగ్రహణం : నీరవ్ షా
సంగీతం: ఎస్. తమన్
సమర్పణ : శ్రీమతి సురేఖ కొణిదెల
నిర్మాతలు : ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : మోహన్ రాజా
Run Time:2hr 32 Mins
విడుదల తేదీ: అక్టోబర్ 5, 2022