జిన్నా మూవీ  రివ్యూ

Published On: October 21, 2022   |   Posted By:

జిన్నా మూవీ  రివ్యూ

మంచు విష్ణు  ‘జిన్నా’ రివ్యూ

Emotional Engagement Emoji

👍

అదేంటో మంచు విష్ణు ..ట్రోలింగ్ లో క్లిక్ అయ్యినట్లుగా సినిమాల్లో కావటం లేదు. ఎన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కావటం లేదు.దాంతో  తనకి బాగా అచ్చొచ్చిన కామెడీ యాక్షన్‌ కథాంశంతో ‘జిన్నా’గా బాక్సాఫీస్‌ ముందుకొచ్చారు. దీనికి మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే అందించడం.. పాయల్‌, సన్నీ లియోన్‌ వంటి అందాల మెరుపులు తోడవడం.. వీటన్నింటికీ తోడు ట్రైలర్స్  ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘జిన్నా’ అందుకున్నాడా? హిట్ కొట్టాడా చూద్దాం.

స్టోరీ లైన్

చిత్తూరు జిల్లాలోని రంగం పేటకు చెందిన కుర్రాడు గాలి నాగేశ్వరరావు . అతనో వెరైటీ టైప్. తనను ఎవరైనా అతన్ని పూర్తి పేరుతో పిలిస్తే అసలు సహించడు. షార్ట్‌కట్‌లో ‘జిన్నా’ అని పిలవమని చెబుతుంటాడు.  అతనికి  ఊరంతా అప్పులే. ఆ అప్పులతోటే ….ఉన్న  ఊళ్లో ఓ టెంట్‌ హౌస్‌ పెట్టుకుంటాడు. బ్యాడ్ ఏంటంటే…అతను ఏ పెళ్లి కాంట్రాక్ట్‌ తీసుకున్నా.. అది  ఫెయిల్ అవుతూంటుంది. దాంతో  అతని టెంట్‌ సామాన్లను శుభకార్యాలకు వాడకూడదని, చావులకే వాడాలని తీర్మానం చేస్తాడు ఊరి ప్రెసిడెంట్‌ తిప్పేస్వామి (రఘుబాబు).

ఆ టైమ్ లోనే ఊళ్లోకి ఎంట్రీ ఇస్తుంది రేణుక (సన్నీ లియోన్‌). ఆమెకి మాటలు రావు, చెవులు వినపడవు. ఆమె జిన్నాకు చైల్డ్ హుడ్ ఫ్రెండ్.  చిన్నప్పుడే అమెరికాకు వెళ్లిపోయి ఇప్పుడు వచ్చిందన్నమాట.   ఆమె.. వచ్చీ రాగానే జిన్నాపై తన ఇష్టాన్ని బయట పెడుతుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది.  వాస్తవానికి జిన్నాకు పచ్చళ్ల స్వాతి (పాయల్‌ రాజ్‌పుత్‌) అంటే ఇష్టం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ, రేణుకను చూశాక అతని ఆలోచన మారుతుంది. ఆమెని పెళ్లి పేరుతో బుట్టలోకి దింపి.. ఆమె డబ్బు కొట్టేసి, అప్పులు తీర్చుకొని, ఊరి సర్పంచ్‌ అవ్వాలని ప్లాన్ చేస్తాడు. అది ఫలించిందా…   స్వాతితో  జిన్నా ప్రేమ కథ ఏమైంది.. రేణుక మెడలో తాళి కట్టాడా?  అసలు ఈ కథ వెనక ఉన్న విషయం ఏమిటి  అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

ఎనాలసిస్ …

కథలో కీలకమైన  ట్విస్ట్‌ ఉంటుంది.  కానీ వర్కవుట్ కాలేదు. స్క్రీన్‌ప్లే బోరింగ్ గా రాసారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కథ చాలా స్లోగా సాగింది. ట్విస్ట్ రివీల్ అయిన క్షణం నుండే ప్రేక్షకులు ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం సినిమాకు మైనస్. సన్నీ లియోన్ పాత్రకు మరింత ఎడ్జ్ ఇచ్చేలా సినిమా ఫస్ట్ హాఫ్‌లో మరింత డెవలప్ చేసి ఉండవచ్చు.  ఫస్టాఫ్ అయితే మరీ 90ల నాటి సినిమా చూసినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ కి ముందు రేణుక పాత్ర ఇచ్చే ట్విస్ట్‌  సెకండఫ్ పై ఇంట్రస్ట్ కలిగేలా చేస్తుంది. అయితే ఆ తర్వాత వచ్చే సీన్స్ అన్నీ  రొటీన్‌ హారర్‌ థ్రిల్లర్లను గుర్తుచేసేలా ఉంటాయి. కానీ, ప్రీక్లైమాక్స్‌కు ముందు కథ మరో ఊహించని ట్విస్ట్ పడుతుంది.  రేణుక పాత్ర వెనకున్న మరో యాంగిల్ రివీల్ అవుతుంది. క్లైమాక్స్ సీన్స్ ఆసక్తిగా సాగినా ,సీక్వెల్ కోసం సినిమాని అర్దాంతరంగా ఆపేసినట్లు అనిపిస్తుంది.  ఫైనల్ గా ఈ సినిమాలో డైలాగు  ‘నమ్మకం లేని ప్రేమ, కర్రలు లేని టెంటు నిలబడవు.’ లో ఉన్నట్లు..  సరైన స్క్రిప్టు లేని సినిమా కూడా నిలబడదని  అర్దమవుతుంది.

టెక్నికల్ గా…
సినిమా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్ లోనే ఉంది. రీసెంట్ కళ్యాణ్ రామ్ హిట్ ‘బింబిసార’కి ఫైట్స్ కంపోజ్ చేసిన రామకృష్ణ ఈ సినిమాకి యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశారు. ఈ యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయి. చాలా తేలికైన పదాలతో సినిమాని ముందుకు తీసుకెళ్లారు. అనూప్ రూబెన్స్ పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. అయితే ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫీలో మ్యాజిక్ మిస్సయింది. దర్శకుడు సూర్య చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు.

ఫెరఫార్మెన్స్ ల విషయానికి వస్తే…

మంచు విష్ణుకు అలవాటైన పాత్ర ఇది.  దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి క్యారెక్టర్ల మీటర్ లోనే జిన్నా కూడా ఉంటుంది. సన్నీ లియోన్  పాత్ర బాలీవుడ్ సినిమాలు గుర్తు చేస్తుంది. పాయల్ రాజ్ పుత్ బాగా చేసింది. మిగతా పాత్రలో కనిపించిన వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

చూడచ్చా:

మరీ తీసిపారేసే సినిమా కాదు..ఓ సారి కామెడీ కోసం చూడచ్చు..థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎంజాయ్ చేయచ్చు

నటీనటులు: మంచు విష్ణు, సన్నీ లియోని, పాయల్‌ రాజ్‌పుత్‌, వెన్నెల కిషోర్‌, ఉమేశ్‌ కౌశిక్‌, సత్యం రాజేశ్‌, రఘుబాబు తదితరులు;
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు;
ఎడిటింగ్‌: చోటా కె.ప్రసాద్‌;
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌;
నిర్మాత: మోహన్‌బాబు;
రచన: కోన వెంకట్‌;
దర్శకత్వం: ఈషాన్‌ సూర్య;
విడుదల: 21-10-2022
Run Time: 2h 16 mins