మసూద మూవీ రివ్యూ 

Published On: November 18, 2022   |   Posted By:

మసూద మూవీ రివ్యూ 

హారర్ ఫిల్మ్ ‘మసూద’ రివ్యూ  
Emotional Engagement Emoji
👍👍

హారర్ సినిమా చూడాలంటే ఓటిటిలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. చక్కగా ఇంట్లో కూర్చుని , చెవిలో ఇయిర్ ఫోన్ పెట్టుకుని కూల్ గా చూడచ్చు. ఈ ఆలోచన సక్సెస్ కాగానే థియేటర్ లో హారర్ సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోవడం మొదలైంది. కానీ ఇలాంటి సమయంలో ..ఓ రకంగా హారర్ కు గడ్డు రోజుల్లో థియోటర్ లోకి  పూర్తి హారర్ సినిమాగా వచ్చింది ‘మసూద’. అలాగని ఈ సినిమాలో స్టార్స్ ఎవరూ లేదు. మాజీ హీరోయిన్ ఓ రకంగా జనాలు మర్చిపోయిన సంగీత..ఇప్పుడిప్పుడే జనాల్లోకి వెళ్తున్న తిరువీర్ ప్రధాన పాత్రలు. డైరక్టర్ కేవలం కంటెంట్ నే నమ్ముకుని తెరకెక్కించారని చెప్పారు. ఆయన మాటల్లో ఎంతవరకూ నిజం ఉంది..అసలు ఈ చిత్రం కథేంటి..కొత్త దెయ్యమా..పాత దెయ్యమా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

సైన్స్ టీచర్ గా పనిచేస్తున్న  నీలమ్ (సంగీత) తన కూతురు నాజియాతో కలసి భర్తకు దూరంగా బ్రతుకుతోంది. అదే   అపార్ట్మెంట్ లో ఉండే గోపి కృష్ణ ( తిరువీర్‌) కాస్త ఈ కుటుంబానికి సాయింగా ఉంటాడు. హఠాత్తుగా ఓ రోజు నాజియా..దెయ్యం పట్టినట్లు బిహేవ్ చేస్తుంది. తర్వాత నిజంగానే దెయ్యం పట్టిందని అర్దమవుతుంది. అప్పుడు ఆ దెయ్యాన్ని వదిలించటానికి రిజ్వాన్ బాబా(శుభలేఖ సుధాకర్ )ని ఆశ్రయిస్తారు. అక్కడ నుంచి ఆయన రీసెర్చ్ లాంటి కొంత వర్క్ చేసి.. నాజియాని అవహిచింది పదేళ్ళ క్రితం నీలమ్ ఇంటి పక్కనే దారుణ‌ హత్యకు గురైన `మసూద` అని చెబుతాడు. ఇప్పుడు అసలు మసూద ఎవరు ? ఆమెను ఎందుకు హత్య చేశారు ?ఆమె నాజియాలోకి ఎందుకు ,ఎలా వచ్చింది ? మాసూద ఆత్మ ఎలా తొలిగించారు అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఈ సినిమా టైటిల్ అయిన  ‘మసూద’ అనేది ఉర్దూ పదం. దాని అర్దం అదృష్టం లేదా సంపద. కానీ ఇందులో  ‘మసూద’  అనే పేరుని దెయ్యానికి పెట్టారు. రెగ్యులర్ గా మన ఇండియన్ సినిమాల్లో కనిపించే దెయ్యాలు..హిందూ మత నేపధ్యంలో సాగుతాయి. కానీ ఇందులో దెయ్యం ముస్లిం కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం..ముస్లిం దెయ్యం అవ్వటం, ముస్లిం బాబాలు  దాన్ని వదిలించే ప్రయత్నం చేయటం కొత్త విషయం.

ఇలాంటి  హారర్ సినిమా లక్ష్యం ఏంటంటే…భయపెట్టడం.. చూడటానికి వచ్చిన ప్రేక్షకులకుadrenaline rush ఇవ్వగలగటం.ఆ విషయంలో ఈ సినిమా దాదాపు సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఈ తరహా కథలో కొత్తగా చెప్పేదేమీ ఉండదు. ఒక ప్రేతాత్మ  కాస్త బలహీనంగా ఉన్న వారిని ఆవహించి…వారి శరీరంతో తన పనులు చేసుకోవటం, తన కోరికలు తీర్చుకోవటం ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ ప్రేతాత్మని వదిలించడానికి దాంతో ఇబ్బందిపడేవాళ్లు రంగంలోకి దిగుతారు. ఇదే పాయింట్ ని ఎంత కొత్తగా చెప్పామన్నదగ్గరే ఈ తరహా సినిమాల సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

అలాగే  హారర్ సినిమాలు  సక్సెస్ అవటానికి కొత్త బ్యాగ్డ్రాప్,అదీ భయపెట్టేది అయితే కలిసొస్తుంది . మసూద ఈ విషయంలో మనస్లీ నేపధ్యంలో తీసుకోవటం ‘కొత్త’గా అనిపించింది. కాకపోతే డైరక్టర్ కాస్త ముందుకు వెళ్లి సినిమాలో విపరీతమైన హింస, రక్తపాతం సృష్టించి,భీబత్సం చేసారు. అది ఫ్యామిలీలని దూరం పెడుతుంది. అంటే కేవలం హారర్ అభిమానులు మాత్రమే దీన్ని ఆదరించాలని టార్గెట్ ఫిక్స్ చేసారన్నమాట.

సింపులా కథ ఉన్నా..దీనికి ట్రీట్మెంట్ తో పండించటం అనేది పెద్ద సవాల్. కొత్త డైరక్టర్ ఈ కథపై బాగానే కసరత్తు చేసారు. భయపెట్టారు. అయితే కొత్తగా అనిపించేలా చెయ్యలేకపోయారు. ముందే చెప్పుకున్నట్లు ఈ తరహా సినిమాల్లో ఎక్కువ యాక్షన్..తక్కువ డైలాగులు ఉండాలి. క్యారక్టర్స్ ఏది భయపడుతున్నారో దాన్ని చూపాలి తప్ప చెప్పకూడదు. అలాగే సినిమాలో సర్పైజ్ లు ఉండాలి. నేరేషన్ థ్రిల్లింగ్ గా సస్పెన్స్ గా నడపాలి. ఈ విషయంలో ఈ సినిమా ఫెయిలైంది. కొత్తగా చెప్పుకోదగ్గ ట్విస్ట్ లు ఏమీ లేవు. ప్లెయిన్ నేరేషన్ తో నడుస్తుంది. సీన్ వైజ్ సస్పెన్స్ ఉంది కానీ కథలో లేదు. ఊహించని విజువల్స్, హఠాత్తుగా కొత్త శబ్దాలు వంటివి ఇలాంటి సినిమాలకు ఆయువు పట్టు. ఆ విషయంలో ఈ డైరక్టర్ బాగానే వర్క్ చేసారు.  అలాగే ఇలాంటి కథల్లో వచ్చే విలన్ లేదా నెగిటివ్ ఫోర్స్ కంట్రోలుకు అందకూడదు. అలాంటి సీన్స్ క్రియేట్ చేయాలి. ఆ విషయంలో చాలా వరకు ఈ సినిమా సక్సెస్ అయ్యింది.

టెక్నికల్ గా చూస్తే….
టెక్నీషియన్స్ దాదాపు అందరూ అద్బుతమైన అవుట్ ఫుట్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమాటోగ్రపార్, సౌండ్ డిజైనర్, మ్యూజిక్ డైరక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ప్రశాంత్ విహారి సౌండ్ డిజైనింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు బాగా కుదిరాయి.సీన్స్ కన్నా ఇవే హారర్ మూడ్ ని ఎక్కువ శాతం ఎలివేట్ చేసాయి. కెమెరా వర్క్ బాగుంది. భయపెట్టే  మంచి విజువల్స్ ని రాబట్టుకున్నారు . ఎడిటింగ్ సెకండాఫ్ లో ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది.డైరక్టర్ ఇలాంటి కథలో కొత్త ట్విస్ట్ లు పెట్టుకుని ఉంటే..ఇంకా బాగుండేది అనిపించింది.  ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

నటీనటుల్లో…స్టార్స్ లేకపోయినా సినిమాకు కథ,ప్రెజెంటేషనే స్టార్ అనిపించటంతో ఆ లోటు కనిపించలేదు. ఓ మధ్య తరగతి తల్లిలా హుందాగా నటి సంగీత నటించింది. తిరువీర్ తన పాత్రని బాగా డిజైన్ చేసుకుని, బిహేవ్ చేసాడు.నటించలేదు అనిపించింది.  శుభలేఖ సుధాకర్‌, సత్యం రాజేష్‌, సత్య ప్రకాశ్‌, అఖిలా రామ్‌ వీరంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

చూడచ్చా

హార‌ర్ జోన‌ర్‌ని ఇష్ట‌ప‌డేవాళ్లు ఓసారి ఇటు ఓ లుక్కు వేయొచ్చు.

నటీనటులు : సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు
ఛాయాగ్రహణం : నగేష్ బనెల్
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి
నిర్మాత : రాహుల్ యాదవ్ నక్కా
రచన, దర్శకత్వం : సాయికిరణ్
రన్ టైమ్ : 2h 40m
విడుదల తేదీ: నవంబర్ 18, 2022