రణరంగం మూవీ రివ్యూ

Published On: August 15, 2019   |   Posted By:
రణరంగం మూవీ రివ్యూ
 
స్క్రిప్టే గండం (`రణరంగం` రివ్యూ)
 
Rating: 1.5/5

తెలుగులో గ్యాంగ్ స్టర్ చిత్రాలు తక్కువే. మహా అయితే హీరో ఓ రౌడీ అని చూపెట్టడం తప్ప అంతకు మించి ముందుకు వెల్లే దాఖలాలు తక్కువ. అప్పుడెప్పుడో వచ్చిన సత్య, గాయం, పవన్ కళ్యాణ్ పంజా, ప్రభాస్ బిల్లా, మహేష్ బిజినెస్ మ్యాన్ ఇలా ఒకటి ఆరా  తప్ప మనకు చెప్పుకోదగినన్ని లేవు. మరీ ముఖ్యంగా మన ఇక్కడ పరిస్దితుల్లో తయారైన గ్యాంగ్ స్టర్ కథలు అయితే అసలు లేనేలేవని చెప్పాలి. అది గమనించారో ఏమో కానీ ఎన్టీఆర్ రెండో సారి ముఖ్యమంత్రి అయినప్పుడు జరిగిన మధ్యనిషేధం టైమ్ లో ఎదిగిన ఓ గ్యాంగస్టర్ కథని ఒడిసి పట్టుకుని సుధీర్ వర్మ మన ముందుకు వచ్చాడు. అందుకు శర్వానంద్ తోడు వచ్చాడు. సక్సెస్ లో లేని వీళ్లిద్దరు ఈ గ్యాంగస్టర్ ఫ్లిక్ తో  సక్సెస్ కొడదామని థీమాగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు రిలీజైన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథేంటి…గ్యాంగస్టర్ గా శర్వానంద్ ఏ మేరకు అలరించారు వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

 
స్టోరీ లైన్

 
1995 లో వైజాగ్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునే కుర్రాడు దేవా (శర్వానంద్).  గీత (కల్యాణి ప్రియదర్శన్)తో ప్రేమలో ఉన్న అతనికి డబ్బు సంపాదించి ఎదగటానికి మధ్యపాన నిషేధం రూపంలో ఓ అవకాసం వస్తుంది. ప్రక్క రాష్ట్రం నుంచి మధ్యం అక్రమంగా తెచ్చి అమ్ముతున్న అతను తెలియకుండానే ఎమ్మెల్యే సింహాచలం  (మురళీ శర్మ)కు పోటీగా ఎదుగుతాడు. శత్రువుగా మారతాడు. అక్కడ నుంచి ఎమ్మల్యే గ్రూప్ కు, దేవా గ్రూప్ కు మధ్య విధేధాలు మొదలవుతాయి. అవి పతాక స్దాయికి చేరుకుని చివరకు తన మకాం…స్పెయిన్ కి మార్చేస్తాడు దేవా.  అక్కడ తన కూతురుతో కాలక్షేపం చేస్తున్న అతనికి ఓ రోజు 12 వేల మంది ఉన్న ఊరుని ఖాళీ చేయించమంటూ ఇండియా నుంచి ఓ మినిస్టర్ (బ్రహ్మాజీ) అడుగుతాడు.

 భారీగా డబ్బు ఆఫర్ చేస్తారు. దానికి దేవా ఇష్టపడడు. వాళ్లు ఖాళీ చేస్తే అక్కడ ఎయిర్ పోర్ట్ కట్టే అవకాసం ఉంటుంది. ఈ డీల్ కు దేవా ఒప్పుకోకపోవటంతో అతను స్పెయిన్ లో ఉన్నా అతన్ని చంపటానికి కుట్రలు జరుగుతాయి. దాడులు మొదలవుతాయి. ఆ దాడులను దేవా ఎలా తిప్పి కొట్టాడు. అసలు వైజాగ్ వదిలి స్పెయిన్ వెళ్లటానికి కారణం ఏమిటి..తన గర్ల్ ప్రెండ్ తో దేవా కు పెళ్లైందా..మద్యలో కాజల్ పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా ఓపిగ్గా చూడాల్సిందే.  
 
 
ఎలా ఉంది…

కాపీ కొట్టకపోతే సినిమా చేయలేనట్లుగా ఓ కాపీ కొటేషన్ తో ప్రారంభించిన ఈ దర్శకుడు అసలు ఆ స్క్రీన్ ప్లే ప్రెజెంజ్, పాస్ట్ అని రెండు ముక్కలు చేయకుండా ఉంటే బాగుండేది. అలాగే ప్రొబిషన్ పీరియడ్ లో లిక్కర్ స్మగ్మింగ్ మీద పూర్తిగా వెళ్లినా బాగుండేది. కేవలం అది నేపధ్యంగా మాత్రమే తీసుకుని ఆ సినిమా నుంచి ఓ సీన్, మరో సినిమా నుంచి ఓ షాట్ అన్నట్లుగా  పేర్చుకుంటూ పోయాడు కానీ..అవన్ని కలిసి ఓ కథని చెప్తున్నాయా లేదా అనేది పట్టించుకోలేదు. అప్పటికీ ఫస్టాఫ్ కొద్దో గొప్పో ఎంగేజింగ్ గా తీసినా, సెకండాఫ్ కు వచ్చేసరికి మరీ నీరసపడిపోయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ నీట్ గా తీసిన దర్శకుడు ఆ తర్వాతే దారి తప్పాడు. ఎంత బోర్ కొట్టిస్తాడంటే ..ఎప్పుడు సినిమా పూర్తవుతుందా అని ఎదురుచూస్తాము.

నో కాంప్లిక్ట్

ఏ కథకైనా కాంప్లిక్టే ప్రాణం. అది లేని కథను భరించటం కష్టం. అదే రణరంగాన్ని ముంచేసింది. దానికి తోడు హీరోకు ఎదురు నిలిచే నెగిటివ్ ఫోర్స్ స్ట్రాగ్ గా లేదు. ఎమ్మల్యే సింహాచలం పాత్ర..దేవా పాత్ర ముందు తేలిపోతుంది. దాంతో ఆ రెండు పాత్ర మధ్యా సంఘర్షణ పుట్టదు. పోని లవ్ స్టోరీలో అయినా కాంప్లిక్ట్ ఉంటుందా అంటే అదీ ఉండదు. అన్ని హీరోకు అనుకూలంగా జరిగిపోతూంటాయి. గ్యాంగస్టర్ సినిమాలా ఉండదు.ఏదో గంగిరెద్దులు ఆడించుకునే వాడి కథ చెప్తున్నట్లు అనిపిస్తుంది. 

టెక్నికల్ గా 

ప్రశాంత్ పిళ్లై ఇచ్చిన  రెండు పాటలు బావున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలాసీన్స్ లేవటానికి సాయిం చేసింది. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్.  నిర్మాతలు ఖర్చు కూడా బాగా పెట్టారు. ఇక నటీనటుల పరంగా చూస్తే.. సినిమా అంతా శర్వానంద్ చుట్టూనే తిరుగుతుంది. అతను రెండు గెటప్స్ లో కనిపించాడు. కానీ నడివయస్సు పాత్ర మాత్రం సెట్ కాలేదు. ఇక హీరోయిన్స్ లో కల్యాణి ప్రియదర్శిని రెట్రో లుక్ తో చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది.   కాజల్ అగర్వాల్ పాత్ర విషయానికి చెప్పుకోవటానికి ఏమీ లేని అసలు కొంచెం కూడా ప్రాముఖ్యత లేని పాత్ర. 

చూడచ్చా
 
ఫ్రాంక్ గా చెప్పాలంటే చివరి దాకా భరించటం కష్టమే..

తెర వెనక..ముందు

నిర్మాణం: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
న‌టీన‌టులు: శ‌ర్వానంద్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, ముర‌ళీ శ‌ర్మ‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాజా, అజ‌య్‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ త‌దిత‌రులు
ర‌చ‌న – స్క్రీన్‌ప్లే : సుధీర్ వ‌ర్మ
సంగీతం: ప్ర‌శాంత్ పిళ్లై
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ద‌ర్శక‌త్వం: సుధీర్ వ‌ర్మ‌
నిర్మాత‌: సూర్యదేవ‌ర నాగ‌వంశీ
విడుద‌ల‌: ఆగ‌స్ట్ 15, 2019
నిడివి: 138 నిమిషాలు